ఫేక్‌ వీడియోల వెనుక రాహుల్‌ హస్తం | Sakshi
Sakshi News home page

ఫేక్‌ వీడియోల వెనుక రాహుల్‌ హస్తం

Published Wed, May 1 2024 3:04 AM

Politics Stooped to New Low Under Rahul Gandhi: Amit Shah

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆగ్రహం   

రాజ్యాంగాన్ని మార్చే, రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన బీజేపీకి లేదని వెల్లడి 

ఫేక్‌ వీడియోల వెనుక కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ హస్తం ఉంది. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల్లో ఆ పార్టీ అధ్యక్షులు సైతం ఫేక్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో నిస్సిగ్గుగా షేర్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. ఉన్న కొద్దిపాటి ఓటుబ్యాంక్‌ను కాపాడుకోవడానికి తంటాలు పడుతోంది. – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా

గువాహటి: కాంగ్రెస్‌లో నిరాశ, అసంతృప్తి తీవ్రస్థాయికి చేరాయని, అందుకే ఆ పార్టీ ఫేక్‌ వీడియోలు సృష్టిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోల వెనుక కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ హస్తం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల్లో ఆ పార్టీ అధ్యక్షులు సైతం ఫేక్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో నిస్సిగ్గుగా షేర్‌ చేస్తున్నారని దుయ్యబట్టారు. 

సిద్ధాంతాలు, విలువలు, మేనిఫెస్టో ఆధారంగా ఎన్నికల్లో పోటీ పడాలి తప్ప ఫేక్‌ వీడియోలను నమ్ముకోవడం ఏమిటని కాంగ్రెస్‌ను నిలదీశారు. మంగళవారం అస్సాం రాజధాని గౌహతిలో అమిత్‌ షా మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆమేథీ, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసే ధైర్యం రాహుల్‌ గాం«దీకి, ప్రియాంక గాం«దీకి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, ఉన్న కొద్దిపాటి ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడానికి తంటాలు పడుతోందని చెప్పారు. 

ఈసారి కూడా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని అన్నారు. దేశమంతటా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. అన్ని మతాల పౌరులకు ఒకే పౌరచట్టం ఉండాలన్నారు. లౌకిక దేశంలో మతానికో చట్టం ఉండడం సరైంది కాదని, రాజ్యాంగ స్ఫూర్తికి అది విరుద్దమేనని అన్నారు. అధికారంలోకి వస్తే సివిల్‌ కాంట్రాక్టులు మైనార్టీలకు ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోందని ఆక్షేపించారు. తక్కువ బిడ్‌ దాఖలు చేసిన వారికి కాంట్రాక్టులు అప్పగిస్తారు తప్ప ఇలా మతం ఆధారంగా కాంట్రాక్టులు ఇస్తామనడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి కూడా మతపరమైన రిజర్వేషన్‌ ఉందా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.  

రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు   
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్‌ అసత్య ప్రచారం చేస్తోందని అమిత్‌ షా మండిపడ్డారు. కాంగ్రెస్‌ అబద్ధాలకు అంతు లేకుండా పోతోందని ధ్వజమెత్తారు. ఓటర్లను మైనారీ్టగా, మెజార్టీగా చూసే అలవాటు తమకు లేదని కాంగ్రెస్‌కు చురక అంటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని స్పష్టంచేశారు. బడుగు బలహీన వర్గాల హక్కుల రక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం, రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన బీజేపీకి ఎంతమాత్రం లేదని పునరుద్ఘాటించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement