
పదో రోజూ కొనసాగిన పాక్ కాల్పులు
మోదీతో ఎయిర్‌ఫోర్స్ చీఫ్ కీలక భేటీ
త్వరలో తగిన సమాధానం: రాజ్‌నాథ్
ప్రజలు కోరేదే జరుగుతుందన్న మంత్రి
‘ఆర్డినెన్స్’ సిబ్బంది సెలవులు రద్దు
కరాచీ తీరానికి తుర్కియే యుద్ధనౌక
త్వరలో వైమానిక ఘర్షణ: పాక్ మంత్రి
అవసరమైతే భారత్‌పైకి అణుబాంబు
రష్యాలో పాక్ దౌత్యవేత్త ప్రేలాపనలు
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: అవే ఉద్రిక్తతలు. అదే ఉత్కంఠ. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. దాయాది కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా పదో రోజూ కాల్పులకు తెగబడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం దాకా జమ్మూ కశ్మీర్‌లో కుప్వారా, పూంచ్, రాజౌరీ, మేంధార్, నౌషేరా, సుందర్బనీ, అఖూ్నర్ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలు, భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించారు.
నావికా దళాధిపతి చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠితో సమావేశమైన 24 గంటల్లోపే ఎయిర్ చీఫ్ మార్షల్‌తో మోదీ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రదాడులపై ప్రతీకారం విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, భారత వాయుసేనతో త్వరలో ఘర్షణ జరగవచ్చంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కొత్త పల్లవి అందుకున్నారు. తమ గగనతలంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన భారత రఫేల్ యుద్ధ విమానాలను అడ్డుకున్నట్టు చెప్పుకున్నారు. మరోవైపు మిత్ర దేశాల మద్దతు కూడగట్టేందుకు పాక్ ప్రయత్నిస్తోంది.
తుర్కియేకు చెందిన భారీ యుద్ధనౌక ఆదివారం కరాచీ తీరం చేరుకుంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై దాడికి తెగబడ్డ వారికి త్వరలో మర్చిపోలేని రీతిలో సమాధానం చెప్పి తీరతామని పునరుద్ఘాటించారు. ‘‘సైనికులను కాపాడటం నా బాధ్యత. ప్రధాని మోదీ పట్టుదల అందరికీ తెలుసు. ప్రజలు కోరుతున్నది ఆయన నాయకత్వంలో జరిగి తీరుతుంది’’ అని ప్రకటించారు.
దీర్ఘకాల సెలవులు రద్దు
ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సిబ్బందికి దీర్ఘకాల సెలవులు రద్దు చేస్తూ మ్యునీíÙయన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) ఆదేశాలు జారీ చేసింది. ఎంఐఎల్ పరిధిలో 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలున్నాయి. సైన్యానికి అవసరమైన ఆయుధాలు వాటిలో తయారవుతాయి. ఆయుధ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికే సెలవులు రద్దు చేసినట్లు ఎంఐఎల్ అధికారి ఒకరు చెప్పారు.
భద్రతా మండలికి పాక్
పహల్గాం దాడిని అడ్డు పెట్టుకొని భారత్ తమను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని పాక్ వాపోయింది. దీనిపై ఐరాస భద్రతా మండలిని ఆశ్రయిస్తామని పాక్ ప్రకటించింది. వీలైనంత త్వరగా భద్రతామండలి భేటీ జరిగేలా చూడాలని ఐరాసలోని తమ శాశ్వత ప్రతినిధి, రాయబారి అసీం ఇఫ్తికార్‌ను పాక్ విదేశాంగ శాఖ ఆదేశించింది. ‘‘సింధూ జల ఒప్పందం నిలిపివేత ప్రాంతీయ శాంతిభద్రతలకు దెబ్బ. భారత్ వైఖరిని అంతర్జాతీయ సమాజానికి వివరిస్తాం’’ అని చెప్పుకొచి్చంది. భద్రతా మండలిలో పాక్ తాత్కాలిక సభ్యదేశం.
నేడు పాక్ పార్లమెంట్ ప్రత్యేక భేటీ
భారత్‌తో ఉద్రిక్తతలపై చర్చించేందుకు పాక్ పార్లమెంట్ సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశం కానుంది. సింధూ ఒప్పందం నిలిపివేత వంటి అంశాలపైనా చర్చిస్తామని ఎంపీలు తెలిపారు.
మళ్లీ ‘అణు’ ప్రేలాపనలు
పాక్ మరోసారి అణు ప్రేలాపనలకు దిగింది. పాక్‌లోని కొన్ని భూభాగాలపై భారత్ త్వరలో దాడి చేయనున్నట్లు తమకు సమాచారముందని రష్యాలో ఆ దేశ రాయబారి మొహమ్మద్ ఖలీద్ జమాలీ చెప్పుకొచ్చారు. ‘‘దాడికి దిగితే భారత్‌కు గట్టిగా బదులిస్తాం. అణ్వాయుధాలు సహా సర్వశక్తులూ ప్రయోగిస్తాం’’ అని హెచ్చరించారు. యుద్ధం జరిగితే పాక్ కచ్చితంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తుందన్నారు. భారత్‌పై అణు బాంబులు ప్రయోగిస్తామని పాకిస్తాన్‌మంత్రి హనీఫ్ అబ్బాసీ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే.