sagar cements
-
సాగర్ సిమెంట్‌కు నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ తయారీలో ఉన్న సాగర్ సిమెంట్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.10 కోట్ల నికర నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.43 కోట్ల నష్టం నమోదైంది. ఎబిటా రూ.60 కోట్లు, ఎబిటా మార్జిన్ 10 శాతంగా ఉంది. టర్నోవర్ రూ.474 కోట్ల నుంచి రూ.587 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో సాగర్ సిమెంట్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో గురువారం 1.13 శాతం అధికమై రూ.250.55 వద్ద స్థిరపడింది. -
ఆంధ్రా సిమెంట్స్ వైజాగ్ స్థలం విక్రయం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రా సిమెంట్స్‌కు చెందిన విశాఖపట్నం యూనిట్లో కార్యకలాపాలను కొనసాగించరాదని సాగర్ సిమెంట్స్ బోర్డు నిర్ణయించింది. నగర పరిధిలోకి ఈ యూనిట్ రావడమే కంపెనీ నిర్ణయానికి కారణం. విశాఖ యూని ట్ 107 ఎకరాల్లో విస్తరించింది. ఆంధ్రా సిమెంట్స్ వైజాగ్ యూనిట్ స్థలాన్ని విక్రయించే ప్రయత్నాలను చేస్తామని సాగర్ సిమెంట్స్ జేఎండీ శ్రీకాంత్ రెడ్డి ఇన్వెస్టర్లతో జరిగిన కాన్ఫరెన్స్ కాల్లో వెల్లడించారు. రుణ భారంతో ఉన్న ఆంధ్రా సిమెంట్స్ తాజాగా సాగర్ సిమెంట్స్ పరం అయిన సంగతి తెలిసిందే. డీల్ విలువ రూ.922 కోట్లు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అమరావతి బెంచ్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. జేపీ గ్రూప్‌నకు చెందిన ఆంధ్రా సిమెంట్స్‌కు గుంటూరు జిల్లా దాచేపల్లిలో క్లింకర్, సిమెంట్ ప్లాంటు, విశాఖపట్నం వద్ద గ్రైండింగ్ యూనిట్ ఉంది. -
సాగర్ సిమెంట్స్ చేతికి ఆంధ్రా సిమెంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ భారంతో ఉన్న ఆంధ్రా సిమెంట్స్ ఇక సాగర్ సిమెంట్స్ పరం కానుంది. ఈ మేరకు విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచింది. జేపీ గ్రూప్ కంపెనీ అయిన ఆంధ్రా సిమెంట్స్ ప్రస్తుతం కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉంది. సాగర్ సిమెంట్స్ దాఖలు చేసిన పరిష్కార ప్రణాళికకు అనుకూలంగా ఆంధ్రా సిమెంట్స్‌కు చెందిన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ (సీవోసీ) మెజారిటీతో ఓటు వేసింది. సాగర్ సిమెంట్స్ ప్రణాళికను సీవోసీ ఆమోదించింది. పృథ్వీ అసెట్ రీకన్స్ట్రక్షన్, సెక్యూరిటైజేషన్ కంపెనీ లిమిటెడ్ పిటిషన్ ఆధారంగా ఆంధ్రా సిమెంట్స్‌పై దివాలా ప్రక్రియను ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ గతేడాది ఏప్రిల్‌లో ఆదేశించింది. ఆంధ్రా సిమెంట్స్‌కు దాచేపల్లి సమీపంలో, అలాగే విశాఖపట్నం వద్ద ఒక్కో ప్లాంటు ఉంది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
ఆ కంపెనీపై అజీమ్ ప్రేమ్‌జీ కన్ను.. వందల కోట్ల పెట్టుబడులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన పెట్టుబడి సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ అపార్చునిటీస్ ఫండ్.. హైదరాబాద్‌కు చెందిన సాగర్ సిమెంట్స్‌లో 10.10 శాతం వాటాను చేజిక్కించుకుంది. డీల్ విలువ రూ.350 కోట్లు. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రూ.2 ముఖ విలువ కలిగిన 1.32 కోట్ల షేర్లను ఒక్కొక్కటి రూ.265 చొప్పున ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు జారీ చేయాలన్న ప్రతిపాదనకు సాగర్ సిమెంట్స్ బోర్డ్ శుక్రవారం ఆమోదం తెలిపింది. డీల్ కారణంగా సాగర్ సిమెంట్స్‌లో ప్రమోటర్ల వాటా 50.28 నుంచి 45.2 శాతానికి వచ్చి చేరింది. వాటా విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని విస్తరణ, వ్యాపార కార్యకలాపాలకు వినియోగించనున్నట్టు సాగర్ సిమెంట్స్ వెల్లడించింది. కార్యకలాపాలు, వ్యవస్థలను బలోపేతం చేయడం, వాటాదారులకు విలువను పెంపొందించడానికి ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సలహాల కోసం ఎదురుచూస్తున్నామని సాగర్ సిమెంట్స్ జేఎండీ ఎస్.శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కంపెనీతో కలిసి వృద్ధి లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి, అత్యుత్తమ పాలన ప్రక్రియలతో దేశవ్యాప్త బ్రాండ్‌గా మారడానికి ఎదురుచూస్తున్నట్టు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ పార్ట్నర్ రాజేశ్ రామయ్య చెప్పారు. సాగర్ సిమెంట్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 82.5 లక్షల టన్నులు. -
సాగర్ సిమెంట్స్ లాభం జూమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ సాగర్ సిమెంట్స్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాలు మెరుగ్గా నమోదు చేసింది. నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 42.35 శాతం ఎగసి రూ.51.43 కోట్లు సాధించింది. టర్నోవర్ 50 శాతం అధికమై రూ.397 కోట్లకు చేరుకుంది. ఎబిటా 23 శాతం పెరిగి రూ.107 కోట్లు దక్కించుకుంది. ఈపీఎస్ 31.87 శాతం పెరిగి రూ.21.31గా ఉంది. మధ్యప్రదేశ్‌లో సద్గురు సిమెంట్స్ రూ.578 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ నిర్మాణం సెప్టెంబర్ నాటికి పూర్తి కానుంది. ఒడిశాలో జైపూర్ సిమెంట్స్ రూ.312 కోట్లతో నెలకొల్పుతున్న ప్లాంట్ రెండు నెలల్లో సిద్ధం అవుతోంది అని సంస్థ జేఎండీ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. సాగర్ సిమెంట్స్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం 1.72 శాతం తగ్గి రూ.1,339.75 వద్ద స్థిరపడింది. -
SBI Card: ఎస్బీఐ కార్డ్ లాభాలు రెట్టింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో క్రెడిట్ కార్డ్‌ల కంపెనీ ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ నికర లాభం రెట్టింపైంది. రూ. 175 కోట్లుగా నమోదైంది. 2019–20నాలుగో క్వార్టర్లో ఇది రూ. 84 కోట్లు. తాజా క్యూ4లో మొత్తం ఆదాయం రూ. 2,510 కోట్ల నుంచి రూ. రూ. 2,468 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ. 2,398 కోట్ల నుంచి రూ. 2,234కోట్లకు దిగివచ్చాయి. మరోవైపు పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం 21 శాతం క్షీణించి రూ. 1,245 కోట్ల నుంచి రూ. 985 కోట్లకు తగ్గింది. స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) రెట్టింపై 2.01 శాతం నుంచి 4.99 శాతానికి పెరగ్గా.. నికర ఎన్పీఏలు 0.67 శాతం నుంచి 1.15 శాతానికి చేరాయి. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భారీ ఆర్డర్ మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు (ఎంఈఐఎల్) చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపోజిట్ పాలిమర్ ఇన్సులేటర్ల సరఫరాకై రూ.30 కోట్ల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకుంది. వీటిలో ఓ అమెరికన్ కంపెనీ నుంచి రూ.15 కోట్లు, భారత్‌కు చెందిన పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ నుంచి రూ.15 కోట్ల ఆర్డర్ ఉంది. ప్రస్తుతం ఆర్డర్ బుక్ రూ.60 కోట్లుఉందని ఒలెక్ట్రా ఇన్సులేటర్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ మహేశ్ బాలయ్య తెలిపారు. మరో రూ.30 కోట్ల ఆర్డర్లు కొన్ని నెలల్లో చేజిక్కించుకోనున్నట్టు చెప్పారు. సాగర్ సిమెంట్స్‌లో ఎస్‌సీఆర్‌ఎల్ విలీనం అనుబంధ కంపెనీ సాగర్ సిమెంట్స్ (ఆర్) లిమిటెడ్‌ను (ఎస్‌సీఆర్‌ఎల్) మాతృ సంస్థలో విలీనం చేసే ప్రతిపాదనకు బోర్డు సమ్మతి తెలిపిందని సాగర్ సిమెంట్స్ సోమవారం ప్రకటించింది. ఎస్సీ ఆర్ఎల్కు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లా గుడిపాడు వద్ద సిమెంటు తయారీతోపాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది. ఎస్సీఆర్ఎల్గా పేరు మారినకర్ణాటకకు చెందిన బీఎంఎం సిమెంట్స్‌లో 100% వాటాలను 2015–16లో సాగర్ సిమెంట్స్ చేజిక్కించుకుంది. -
జేకే టైర్- సాగర్ సిమెంట్స్.. స్పీడ్
వరుస లాభాలకు ట్రేడర్లు బ్రేక్ వేయడంతో దేశీ స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 212 పాయింట్లు క్షీణించి 40,495ను తాకింది. నిఫ్టీ 60 పాయింట్లు నీరసించి 11,878 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయ త్రైమాసికంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించడంతో ఓవైపు జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్, మరోపక్క సాగర్ సిమెంట్స్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ నికర లాభం 38 శాతం క్షీణించి రూ. 105 కోట్లకు పరిమితమైంది. తక్కువ పన్ను వ్యయాల కారణంగా గతేడాది క్యూ2లో అధిక లాభాలు నమోదైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 6 శాతం పుంజుకుని రూ. 2,275 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) మరింత అధికంగా 20 శాతం ఎగసి రూ. 367 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో జేకే టైర్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 9 శాతం జంప్‌చేసి రూ. 66ను అధిగమించింది. ప్రస్తుతం 6 శాతం లాభంతో రూ. 64 వద్ద ట్రేడవుతోంది. సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో సాగర్ సిమెంట్స్ నికర లాభం 10 రెట్లు ఎగసి రూ. 50 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 23 శాతం పుంజుకుని రూ. 326 కోట్లను తాకింది. నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 16 శాతం నుంచి రెట్టింపై 32 శాతాన్ని తాకాయి. క్యూ2లో దాదాపు 21 శాతం మెరుగుపడిన ధరలు(రియలైజేషన్లు) పటిష్ట పనితీరుకు దోహదం చేసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సాగర్ సిమెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 9 శాతం దూసుకెళ్లి రూ. 750కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 6 శాతం ఎగసి రూ. 731 వద్ద ట్రేడవుతోంది. -
డాక్టర్ రెడ్డీస్- సాగర్ సిమెంట్స్.. దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాల కారణంగా ఫార్మా రంగ హైదరాబాద్ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కౌంటర్ వరుసగా రెండో రోజు దూకుడు చూపుతోంది. మరోపక్క ఇదే సమయంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో సాగర్ సిమెంట్స్ కౌంటర్‌కు సైతం డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కోవిడ్-19 నేపథ్యంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించడంతో వరుసగా రెండో రోజు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కౌంటర్ జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.2 శాతం జంప్‌చేసి రూ. 4481 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 4495 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. బుధవారం సైతం ఈ షేరు 6.3 శాతం దూసుకెళ్లిన విషయం విదితమే. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కంపెనీ నికర లాభం దాదాపు 13 శాతం క్షీణించి రూ. 579 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 15 శాతం పుంజుకుని రూ. 4417 కోట్లను అధిగమించింది. స్థూల మార్జిన్లు 4.3 శాతం పెరిగి 56 శాతానికి చేరాయి. సమస్యాత్మక వాతావరణంలోనూ సానుకూల పనితీరు చూపగలిగినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కోచైర్మన్ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. పలు విభాగాలలో పటిష్ట పనితీరు చూపినట్లు తెలియజేశారు. దేశీ ఫార్మా కంపెనీ వొకార్డ్ నుంచి సొంతం చేసుకున్న ఫార్మా బిజినెస్‌ను కంపెనీలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రసాద్ తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం కోవిడ్-19 చికిత్సకు వీలుగా రెండు లైసెన్సింగ్ ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. తద్వారా పలు మార్కెట్లలో కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల ఔషధాలను అందించనున్నట్లు వివరించారు. సాగర్ సిమెంట్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో దక్షిణాది సంస్థ సాగర్ సిమెంట్స్ నికర లాభం 22 శాతం బలపడి రూ. 36 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం 23 శాతం క్షీణించి రూ. 264 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 2.5 డివిడెండ్‌ను ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో సాగర్ సిమెంట్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 12 శాతం దూసుకెళ్లి రూ. 521 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 528 వరకూ ఎగసింది. గత నెల రోజుల్లో ఈ కౌంటర్ 50 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! నేటి ట్రేడింగ్‌లో తొలి అర్ధగంటలోనే ఈ కౌంటర్లో 12,000 షేర్లు చేతులు మారాయి. గత ఐదు రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,500 షేర్లు మాత్రమే. -
2025 నాటికి కోటి టన్నుల ఉత్పత్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ సాగర్ సిమెంట్స్ భారీగా విస్తరిస్తోంది. 2025 నాటికి వార్షిక తయారీ సామర్థ్యాన్ని 10 మిలియన్ టన్నులకు (కోటి టన్నులకు) చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రతి 10 ఏళ్లకు సామర్థ్యాన్ని రెండింతలు చేయాలన్నది సంస్థ ధ్యేయం. ప్రస్తుతం ఉన్న మూడు ప్లాంట్లతో కలిపి సంస్థ ఉత్పత్తి సామర్థ్యం 5.75 మిలియన్ టన్నులు. తాజా విస్తరణలో భాగంగా మధ్యప్రదేశ్, ఒడిశాలో ఏర్పాటు చేయనున్న రెండు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను దక్కించుకుంది. ఈ నెలలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వాల కాలుష్య నియంత్రణ మండలి నుంచి క్లియరెన్సులు రానున్నట్లు సాగర్ సిమెంట్స్ జేఎండీ సమ్మిడి శ్రీకాంత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఇవి పూర్తి అయితే తయారీ సామర్థ్యం 8.25 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని, విస్తరణకు కావాల్సిన నిధుల కోసం ఒక్కొక్కటి రూ.725 ధరలో 31,00,000 కన్వర్టబుల్ వారంట్లను జారీ చేస్తామని తెలిపారు. 2021 మార్చికల్లా పూర్తి.. కంపెనీ ఒక మిలియన్ టన్ను సామర్థ్యం గల ప్లాంటును మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వద్ద ఏర్పాటు చేస్తోంది. వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 5.5 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును సైతం నిర్మిస్తోంది. వీటి కోసం రూ.425 కోట్లు వెచ్చిస్తారు. ఇందులో ఈక్విటీ రూ.150 కోట్లు ఉంటుంది. ఇక ఒడిశాలోని జాజ్‌పూర్ వద్ద ఉన్న జాజ్‌పూర్ సిమెంట్స్‌ను(జేసీపీఎల్) ఇటీవలే రూ.108 కోట్లు వెచ్చించి సాగర్ సిమెంట్స్ దక్కించుకుంది. 100 శాతం అనుబంధ సంస్థగా ఉండే జాజ్‌పూర్ సిమెంట్స్ ద్వారా రూ.308 కోట్లతో 1.5 మిలియన్ టన్నుల గ్రైండింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నా రు. ప్రతిపాదిత కొత్త ప్రాజెక్టుల కోసం యంత్రాలకై ఆర్డర్లు ఇచ్చామని, డెన్మార్క్, జర్మనీకి చెందిన దిగ్గజ కంపెనీలు వీటిని సరఫరా చేస్తాయని చెప్పారాయన. 2021 మార్చికల్లా నిర్మాణాలు పూర్తి అవుతాయని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. కొత్త మార్కెట్లకు.. సాగర్ సిమెంట్స్ ప్రస్తుతం దక్షిణాది మార్కెట్లతోపాటు మహారాష్ట్ర, ఒడిశాలో విస్తరించింది. ఇండోర్ ప్లాంటు పూర్తయితే పశ్చిమ మధ్యప్రదేశ్, ఆగ్నేయ రాజస్తాన్, తూర్పు గుజరాత్, ఉత్తర మహారాష్ట్రలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమవుతుంది. ఇండోర్, వడోదర, బోపాల్, అహ్మదాబాద్ నగరాలు 110 నుంచి 330 కిలోమీటర్ల పరిధిలో ఉండడం కలిసొచ్చే అంశం. అలాగే ఒడిశా ప్లాంటు రాకతో ఉత్తర, మధ్య ఒడిషా, తూర్పు ఛత్తీస్‌గఢ్, దక్షిణ జార్ఖండ్, దక్షిణ పశ్చిమ బెంగాల్లో సిమెంటు మార్కెట్ చేసేందుకు వీలవుతుంది. భువనేశ్వర్, కటక్, బాలాసోర్, కోల్‌కతా, రాంచి, జంషెడ్పూర్ పట్టణాలను కవర్ చేయవచ్చునని కంపెనీ భావిస్తోంది. రెండేళ్లుగా ధర పెంచలేదు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ప్రాజెక్టులకు కావాల్సిన సిమెంటును రెండేళ్లుగా కంపెనీలు తక్కువ ధరలో సరఫరా చేస్తున్నాయి. డీజిల్ ధర ఈ రెండేళ్లలో 25 శాతం పెరిగిందని, వ్యయ భారం ఉన్నా హామీ ఇచ్చిన ధరలోనే కంపెనీలు సిమెంటును సప్లయ్ చేశాయని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తాయని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల్లో గతేడాది సిమెంటు అమ్మకాల్లో 40 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది వృద్ధి స్థిరంగా ఉండొచ్చని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
సాగర్ సిమెంట్స్ భారీ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ సాగర్ సిమెంట్స్ భారీగా విస్తరిస్తోంది. 2021 నాటికి వార్షిక తయారీ సామర్థ్యాన్ని 8.25 మిలియన్ టన్నులకు చేర్చనుంది. ప్రస్తుతం సంస్థ సామర్థ్యం 5.75 మిలియన్ టన్నులు. విస్తరణలో భాగంగా మిలియన్ టన్ను సామర్థ్యం గల ప్లాంటును మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వద్ద నెలకొల్పనుంది. ఇందుకోసం రూ.150 కోట్లను సద్గురు సిమెంట్‌లో (ఎస్‌సీపీఎల్) పెట్టుబడిగా పెట్టనుంది. అలాగే వేస్ట్ హీట్ రికవరీ పవర్ ప్రాజెక్టును రూ.426 కోట్ల వ్యయంతో స్థాపించనున్నారు. రెండు ప్రాజెక్టులు పూర్తి అయ్యాక ఎస్‌సీపీఎల్ ఈక్విటీలో సాగర్ సిమెంట్స్‌కు 65 శాతం వాటా ఉంటుంది. మరో కంపెనీలో 100 శాతం.. ఒడిషాలోని జాజ్‌పూర్ వద్ద ఉన్న జాజ్‌పూర్ సిమెంట్స్‌లో (జేసీపీఎల్) సాగర్ సిమెంట్స్ దశలవారీగా 100 శాతం వాటా దక్కించుకోనుంది. ఇందుకు ఈ కంపెనీలో సాగర్ సిమెంట్స్ రూ.108 కోట్లు పెట్టుబడి చేయనుంది. జేసీపీఎల్ ద్వారా 1.5 మిలియన్ టన్నుల గ్రైండింగ్ యూనిట్‌ను రూ.308 కోట్లతో నెలకొల్పనున్నారు. ఒడిషా ప్రభుత్వం, ఇతర నియంత్రణ సంస్థల అనుమతులు వచ్చిన తర్వాతే ఈ పెట్టుబడి ఉంటుందని సాగర్ సిమెంట్స్ జేఎండీ సమ్మిడి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. విస్తరణకు కావాల్సిన నిధుల కోసం ఒక్కొక్కటి రూ.725 ధరలో 31,00,000 కన్వర్టబుల్ వారంట్లను జారీ చేయాలన్న నిర్ణయానికి బుధవారం సమావేశమైన బోర్డు సమ్మతి తెలిపింది. నూతన మార్కెట్లకు.. సాగర్ సిమెంట్స్ ప్రస్తుతం దక్షిణాది మార్కెట్లలో పట్టిష్గంగా విస్తరించింది. మహారాష్ట్ర, ఒడిషాలోకి సైతం ప్రవేశించింది. ఇండోర్ ప్లాంటు సాకారమైతే పశ్చిమ మధ్యప్రదేశ్, ఆగ్నేయ రాజస్థాన్, తూర్పు గుజరాత్, ఉత్తర మహారాష్ట్రలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇండోర్, వడోదర, భోపాల్, అహ్మదాబాద్ నగరాలు 110 నుంచి 330 కిలోమీటర్ల పరిధిలో ఉండడం కలిసి వచ్చే అంశం. అలాగే ఒడిషా ప్లాంటు రాకతో ఉత్తర, మధ్య ఒడిషా, తూర్పు చత్తీస్‌గఢ్, దక్షిణ జార్ఖండ్, దక్షిణ పశ్చిమ బెంగాల్లో సిమెంటు మార్కెట్ చేసేందుకు వీలవుతుంది. భువనేశ్వర్, కటక్, బాలాసోర్, కోల్‌కత, రాంచి, జంషెడ్పూర్ పట్టణాలను కవర్ చేయవచ్చు. -
సిమెంటు ఖర్చు అడుగుకు 150?
► రూ.5000 వసూలు చేస్తున్నారేం? ► రియల్టర్లకు సిమెంటు సంస్థల ప్రశ్న ► బస్తాకు 330–350 ఉంటేనే నిలదొక్కుకుంటాం ► కనీసం 10 శాతం రిటర్నులూ లేవు ► సిమెంటు కంపెనీల ప్రతినిధుల వ్యాఖ్య హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణంలో సిమెంటుకయ్యే వ్యయం ఒక చదరపు అడుగుకు రూ.150–175 మాత్రమేనని, కానీ నిర్మాణ సంస్థలు ఫ్లాట్‌కు ఒక చదరపు అడుగుకు రూ.5,000 పైన వసూలు చేస్తున్నాయని సిమెంటు కంపెనీల ప్రతినిధులు చెప్పారు. నిర్మాణానికి అంత ఖర్చు ఎందుకవుతోందో ఈ సంస్థలు చెప్పాలని వారు ప్రశ్నించారు. ‘‘ఒక చదరపు అడుగుకు 25 కిలోల సిమెంటు కావాలి. బస్తాకు రూ.50 అధికమైనా, నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.25 మాత్రమే పెరగాలి కదా?’’ అని ఇండియా సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాకేశ్ సింగ్ వ్యాఖ్యానించారు. సాగర్ సిమెంట్స్ ఈడీ శ్రీకాంత్ రెడ్డి, భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డితో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. 2015తో పోలిస్తే తెలంగా ణ, ఏపీలో ఇప్పుడున్న సిమెంటు ధర తక్కువని చెప్పారాయన. అయిదేళ్లుగా సిమెంటు ధరల పెరుగుదల ఏటా 1% మాత్రమేనని, అదే రియల్టీ ధరల పెరుగుదల ఏటా 10% ఉందని తెలిపారు. అమ్ముడుపోకుండా పెద్ద సంఖ్యలో గృహాలు ఉన్నా, ధర మాత్రం తగ్గడం లేదని గుర్తుచేశారు. మార్కెట్ ఆధారంగానే ధర.. ‘‘గతేడాది పెట్ కోక్ ధర టన్నుకు 45 డాలర్లుంటే, ఇప్పుడు 100 డాలర్లు దాటింది. రవాణా వ్యయం బస్తాకు రూ.50 అవుతోంది. సిమెంటుపై 27% పన్నులున్నాయి. మార్కెట్ ఆధారంగానే సిమెంటు ధర నిర్ణయమవుతోంది. పరిశ్రమపైన రూ.50,000 కోట్ల అప్పులున్నాయి. కంపెనీలపై వడ్డీల భారం ఉంది. సిమెంటు ధర పెరగడానికి గల కారణాలను చూడకుండా సిమెంటు కంపెనీలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బస్తా సిమెంటు ధర రూ.270–330 ఉంది. కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇక్కడి మార్కెట్లో ధర రూ.330–350 ఉంటేనే కంపెనీలు నిలదొక్కుకుంటాయి’’ అని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. సిమెంటుపై తక్కువ పన్నుంటుందని ప్రజలు, కంపెనీలు ఆశించినా, జీఎస్టీలో 28% శ్లాబులో చేర్చి ప్రభుత్వం నిరుత్సాహపరిచిందని అన్నారు. భారంగా ఉత్పత్తి సామర్థ్యం..: దేశంలో 1989కి ముందు 10 సిమెంటు కంపెనీలే ఉండేవి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5.9 కోట్ల టన్నులు. ఇప్పుడు కంపెనీల సంఖ్య 70కిపైమాటే. సామర్థ్యం 42 కోట్ల టన్నులకు ఎగసింది. దక్షిణాదిన 50 బ్రాండ్లు పోటీపడుతున్నాయి. వీటి ఉత్పత్తి సామర్థ్యం 150 మిలియన్ టన్నులు. ప్లాంట్ల వినియోగం దేశవ్యాప్తంగా 70% ఉంటే, దక్షిణాది రాష్ట్రాల్లో ఇది 60% లోపేనని రవీందర్ రెడ్డి తెలిపారు. డిమాండ్ పడిపోయి సామర్థ్యానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడం, అధిక తయారీ వ్యయాలు కంపెనీలకు సమస్యగా మారిందని, పెట్టుబడిమీద రాబడి 10%లోపే ఉంటోందని కంపెనీల ప్రతినిధులు వాపోయారు. తెలుగు రాష్ట్రాలు బెటర్.. ‘‘సంయుక్త రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నెలకు 24 లక్షల టన్నుల సిమెంటు అమ్మకాలు నమోదయ్యాయి. 2015–16లో ఇది 12–14 లక్షల టన్నులకు చేరింది. ఏడాదిగా తమిళనాడులో సిమెంటు విక్రయాలు తిరోగమనంలో ఉన్నాయి. సిమెంటు వినియోగంలో వచ్చే మూడేళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 10–18 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’’ అని శ్రీకాంత్ తెలిపారు. తమిళనాడు స్థిరంగా, కర్ణాటకలో 2–5 శాతం వృద్ధి ఉండొచ్చని చెప్పారు. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలు 5–7 శాతం అధికం అవుతాయని అంచనా వేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, వైట్ ట్యాపింగ్ రోడ్లు, అందుబాటు గృహాల నిర్మాణం వేగిరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు తక్కువ ధరకు సిమెంటును సరఫరా చేస్తున్నట్టు గుర్తు చేశారు. -
సాగర్ సిమెంట్స్ లాభం రూ.4.6 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : జూన్ త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో సాగర్ సిమెంట్స్ నికర లాభం క్రితంతో పోలిస్తే రూ.23 కోట్ల నుంచి రూ.4.6 కోట్లకు పడిపోయింది. టర్నోవరు రూ.185 కోట్ల నుంచి రూ.136 కోట్లకు వచ్చి చేరింది. కన్సాలిడేటెడ్ ఫలితాల్లో జూన్ క్వార్టర్లో రూ.197 కోట్ల టర్నోవర్‌పై రూ.26 లక్షల నష్టం వాటిల్లింది. -
సాగర్ సిమెంట్స్ చేతికి తొషాలి ‘గ్రైండింగ్’
రూ. 60 కోట్లతో కొనుగోలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీలో ఉన్న సాగర్ సిమెంట్స్ విశాఖపట్నం జిల్లా బయ్యవరం వద్ద ఉన్న తొషాలి సిమెంట్స్ గ్రైండింగ్ యూనిట్‌ను రూ.60 కోట్లకు కొనుగోలు చేస్తోంది. బుధవారం సమావేశమైన బోర్డు ఈ మేరకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. 2003లో విక్రయించిన గ్రైండింగ్ యూనిట్ తిరిగి తమ చేతికి రానుండడం ఆనందంగా ఉందని సాగర్ సిమెంట్స్ ఈడీ ఎస్.శ్రీకాంత్‌రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. సెప్టెంబరు 30లోగా ఈ డీల్ పూర్తి అవుతుందని ఆయన చెప్పారు. యూనిట్ వార్షిక సామర్థ్యం 1,81,500 టన్నులు. దీనిని 3 లక్షల టన్నులకు చేర్చనున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం రూ.6 కోట్లు ఖర్చు పెడతామన్నారు. సిమెంటు తయారీకి కావాల్సిన క్లింకర్‌ను నల్గొండ నుంచి ఈ యూనిట్‌కు సరఫరా చేస్తామన్నారు. గ్రైండింగ్ యూనిట్ కొనుగోలు ద్వారా రవాణా ఖర్చులు తగ్గుతాయని చెప్పారు. అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతోపాటు ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలకు స్లాగ్ సిమెంటును సరఫరా చేసేందుకు వీలవుతుందని తెలిపారు. ప్రస్తుతం సాగర్ గ్రూప్ వార్షిక సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 40 లక్షల టన్నులుంది. డీల్ తర్వాత ఇది 43 లక్షల టన్నులకు చేరుతుంది. -
సాగర్ సిమెంట్స్ లాభం రూ. 15 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సాగర్ సిమెంట్స్ రూ. 153 కోట్ల ఆదాయంపై రూ. 15 కోట్ల నికర లాభం (స్టాండెలోన్) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆదాయం రూ. 181 కోట్లు కాగా లాభం రూ. 22 కోట్లు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 548 కోట్ల నుంచి రూ. 621 కోట్లకు పెరగ్గా లాభం సుమారు రూ. 50 కోట్లుగా నమోదైంది. కల్బుర్గి సిమెంట్‌లో వాటాల విక్రయంతో వచ్చిన నిధుల కారణంగా క్రిత ఆర్థిక సంవత్సరం లాభం రూ. 297 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. గురువారం బీఎస్ఈలో సంస్థ షేరు సుమారు అరశాతం తగ్గి రూ. 635 వద్ద క్లోజయ్యింది. -
65 కోట్లతో సాగర్ సిమెంట్స్ వేస్ట్ హీట్ రికవరీ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాగర్ సిమెంట్స్ రూ. 65.23 కోట్ల వ్యయంతో 6 మెగావాట్ల సామర్థ్యం గల వేస్ట్ హీట్ రికవరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. నల్లగొండ జిల్లా మట్టంపల్లిలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి శుక్రవారం సమావేశమైన బోర్డు ఆమోదముద్ర వేసింది. దీనికి కావాల్సిన నిధులను రుణాలు, అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. రూ. 10 ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుకు 50 శాతం డివిడెండ్ (రూ. 5)ను ప్రకటిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనికి రికార్డు తేదీ మార్చి 23గా నిర్ణయించింది. -
బీఎంఎం సిమెంట్స్ కొనుగోలు ప్రక్రియ మే నాటికి పూర్తి
సాగర్ సిమెంట్స్ ఈడీ శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీలో ఉన్న సాగర్ సిమెంట్స్.. బీఎంఎం సిమెంట్స్ కొనుగోలు ప్రక్రియను మే నెలలో పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఇరు కంపెనీల మధ్య గతేడాది నవంబరులో వాటా కొనుగోలు ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన ఇతర లాంఛనాలు మే 15కల్లా పూర్తి అవుతాయని సాగర్ సిమెంట్స్ ఈడీ శ్రీకాంత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. బీఎంఎం ఉత్పత్తి చేస్తున్న సిమెంటును కొనుగోలు చేసి సాగర్ సిమెంట్స్ బ్రాండ్‌తో విక్రయిస్తున్నట్టు కంపెనీ శుక్రవారం బీఎస్ఈకి వెల్లడించింది. బీఎంఎం కొనుగోలుకై సాగర్ సిమెంట్స్ రూ.540 కోట్లను వెచ్చిస్తోంది. బీఎంఎంకు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో ఏటా 10 లక్షల టన్నుల సిమెంటు ఉత్పత్తి చేయగల ప్లాంటుతోపాటు 25 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటు ఉంది. ఈ కంపెనీ చేరికతో సాగర్ సిమెంట్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 37.5 లక్షల టన్నులకు చేరుకుంది. -
ఏప్రిల్ నాటికి బీఎంఎం టేకోవర్ పూర్తి
సాగర్ సిమెంట్స్ ఆదాయంలో 24 శాతం వృద్ధి 50% మధ్యంతర డివిడెండ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాగర్ సిమెంట్స్ సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసిక ఆదాయంలో 24 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ. 101 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది రూ.125 కోట్లకు చేరింది. గతేడాది రూ.1.15 కోట్ల నష్టాలను ప్రకటించిన కంపెనీ ఈ ఏడాది ఏకంగా రూ. 282 కోట్ల లాభాన్ని ప్రకటించడం విశేషం. వీఎస్సీపీఎల్, జేవీల్లో ఉన్న వాటాలను విక్రయించడం వల్ల రూ. 349 కోట్ల అదనపు ఆదాయం సమకూరడంతో నికరలాభం పెరగడానికి కారణంగా కంపెనీ ఇన్వెస్టర్ల నివేదికలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే సిమెంట్ డిమాండ్ పెరుగుతోందని, ఇదే సమయంలో తొలి త్రైమాసికం చివర్లో సిమెంట్ ధరలు పెరగడంతో ఫలితాలు బాగుండటానికి కారణంగా సాగర్ సిమెంట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో సగటున రూ.300 ఉన్న సిమెంట్ బస్తా ధర ఈ ఏడాది రూ. 320కి చేరింది. పది రూపాయల ముఖ విలువ కలిగిన షేరుకు రూ. 5 (50 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ డివిడెండుకు రికార్డు తేదీని అక్టోబర్ 31గా నిర్ణయించారు. టేకోవర్లపై దృష్టి : వ్యాపార విస్తరణలో భాగంగా టేకోవర్లపై దృష్టిసారిస్తున్నట్లు సాగర్ సిమెంట్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా బీఎంఎం సిమెంట్స్ టేకోవర్ ప్రక్రియ ఏప్రిల్1 కల్లా పూర్తవుతుందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రిలో 10 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన బీఎంఎం సిమెంట్ కంపెనీని రూ. 540 కోట్లకు సాగర్ సిమెంట్స్ గత నెలలో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలంలో వాటాదారులకు మంచి ప్రతిఫలాలను అందించే ఉద్దేశ్యంతో ఆర్గానిక్, ఇనార్గానిక్ గ్రోత్‌పై దృష్టిసారిస్తున్నట్లు శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం సాగర్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 50 శాతం, బీఎంఎం యూనిట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 శాతం వినియోగంలో ఉంది. ఈ వార్తల నేపథ్యంలో సాగర్ సిమెంట్ షేరు ధర 4 శాతం నష్టపోయి రూ. 330 వద్ద ముగిసింది.