సాగర్ సిమెంట్స్ చేతికి తొషాలి ‘గ్రైండింగ్’
రూ. 60 కోట్లతో కొనుగోలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీలో ఉన్న సాగర్ సిమెంట్స్ విశాఖపట్నం జిల్లా బయ్యవరం వద్ద ఉన్న తొషాలి సిమెంట్స్ గ్రైండింగ్ యూనిట్‌ను రూ.60 కోట్లకు కొనుగోలు చేస్తోంది. బుధవారం సమావేశమైన బోర్డు ఈ మేరకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. 2003లో విక్రయించిన గ్రైండింగ్ యూనిట్ తిరిగి తమ చేతికి రానుండడం ఆనందంగా ఉందని సాగర్ సిమెంట్స్ ఈడీ ఎస్.శ్రీకాంత్‌రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. సెప్టెంబరు 30లోగా ఈ డీల్ పూర్తి అవుతుందని ఆయన చెప్పారు. యూనిట్ వార్షిక సామర్థ్యం 1,81,500 టన్నులు. దీనిని 3 లక్షల టన్నులకు చేర్చనున్నట్టు వెల్లడించారు.
ఇందుకోసం రూ.6 కోట్లు ఖర్చు పెడతామన్నారు. సిమెంటు తయారీకి కావాల్సిన క్లింకర్‌ను నల్గొండ నుంచి ఈ యూనిట్‌కు సరఫరా చేస్తామన్నారు. గ్రైండింగ్ యూనిట్ కొనుగోలు ద్వారా రవాణా ఖర్చులు తగ్గుతాయని చెప్పారు. అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతోపాటు ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలకు స్లాగ్ సిమెంటును సరఫరా చేసేందుకు వీలవుతుందని తెలిపారు. ప్రస్తుతం సాగర్ గ్రూప్ వార్షిక సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 40 లక్షల టన్నులుంది. డీల్ తర్వాత ఇది 43 లక్షల టన్నులకు చేరుతుంది.