లక్ష్మీవిలాస్ బ్యాంక్- జేకే సిమెంట్ జోరు
ఆర్బీఐ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 307 పాయింట్లు జంప్‌చేసి 40,450ను తాకింది. కాగా.. పీఈ సంస్థ క్లిక్స్ గ్రూప్ నుంచి నాన్‌బైండింగ్ ఆఫర్ వచ్చిన వార్తలతో ప్రయివేట్ రంగ సంస్థ లక్ష్మీ విలాస్ బ్యాంక్ కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. మరోవైపు గుజరాత్ ప్లాంటు నుంచి సిమెంట్ విక్రయాలు ప్రారంభమైనట్లు వెల్లడించడంతో జేకే సిమెంట్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..
లక్ష్మీ విలాస్ బ్యాంక్
పీఈ సంస్థ క్లిక్స్ గ్రూప్ నుంచి విలీనానికి సంబంధించి నాన్‌బైండింగ్ ఆఫర్ లభించినట్లు లక్ష్మీ విలాస్ బ్యాంక్ పేర్కొంది. క్లిక్స్ గ్రూప్‌నకు చెందిన క్యాపిటల్ సర్వీసెస్, క్లిక్స్ ఫైనాన్స్ ఇండియా, క్లిక్స్ హౌసింగ్ ఫైనాన్స్‌లను లక్ష్మీ విలాస్ బ్యాంక్‌లో విలీనం చేసేందుకు నాన్‌బైండింగ్ ఆఫర్‌ను ఇచ్చినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 9 శాతం దూసుకెళ్లింది. రూ. 19.4 వద్ద ట్రేడవుతోంది. తొలుత 16 శాతం జంప్‌చేసి రూ. 20.70 వరకూ ఎగసింది.
జేకే సిమెంట్ లిమిటెడ్
గుజరాత్‌లోని బాలసినోర్‌లో ఏర్పాటు చేసిన 0.7 మిలియన్ టన్నుల గ్రే సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ కార్యకలాపాలు ప్రారంభించినట్లు జేకే సిమెంట్ పేర్కొంది. వాణిజ్య ప్రాతిపదికన వీటి డిస్పాచెస్ సైతం ప్రారంభించినట్లు తెలియజేసింది. దీంతో రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ యూనిట్లతో కలిపి మొత్తం గ్రే సిమెంట్ సామర్థ్యం 4.2 మిలియన్ టన్నులకు చేరినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో జేకే సిమెంట్ షేరు తొలుత 4.5 శాతం జంప్‌చేసి రూ. 1,660ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 3.2 శాతం లాభంతో రూ. 1,638 వద్ద ట్రేడవుతోంది.