ఏప్రిల్ నాటికి బీఎంఎం టేకోవర్ పూర్తి
సాగర్ సిమెంట్స్
ఆదాయంలో 24 శాతం వృద్ధి
50% మధ్యంతర డివిడెండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాగర్ సిమెంట్స్ సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసిక ఆదాయంలో 24 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ. 101 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది రూ.125 కోట్లకు చేరింది. గతేడాది రూ.1.15 కోట్ల నష్టాలను ప్రకటించిన కంపెనీ ఈ ఏడాది ఏకంగా రూ. 282 కోట్ల లాభాన్ని ప్రకటించడం విశేషం. వీఎస్‌సీపీఎల్, జేవీల్లో ఉన్న వాటాలను విక్రయించడం వల్ల రూ. 349 కోట్ల అదనపు ఆదాయం సమకూరడంతో నికరలాభం పెరగడానికి కారణంగా కంపెనీ ఇన్వెస్టర్ల నివేదికలో పేర్కొంది.
గతేడాదితో పోలిస్తే సిమెంట్ డిమాండ్ పెరుగుతోందని, ఇదే సమయంలో తొలి త్రైమాసికం చివర్లో సిమెంట్ ధరలు పెరగడంతో ఫలితాలు బాగుండటానికి కారణంగా సాగర్ సిమెంట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో సగటున రూ.300 ఉన్న సిమెంట్ బస్తా ధర ఈ ఏడాది రూ. 320కి చేరింది. పది రూపాయల ముఖ విలువ కలిగిన షేరుకు రూ. 5 (50 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ డివిడెండుకు రికార్డు తేదీని అక్టోబర్ 31గా నిర్ణయించారు.
టేకోవర్లపై దృష్టి : వ్యాపార విస్తరణలో భాగంగా టేకోవర్లపై దృష్టిసారిస్తున్నట్లు సాగర్ సిమెంట్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా బీఎంఎం సిమెంట్స్ టేకోవర్ ప్రక్రియ ఏప్రిల్1 కల్లా పూర్తవుతుందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రిలో 10 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన బీఎంఎం సిమెంట్ కంపెనీని రూ. 540 కోట్లకు సాగర్ సిమెంట్స్ గత నెలలో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలంలో వాటాదారులకు మంచి ప్రతిఫలాలను అందించే ఉద్దేశ్యంతో ఆర్గానిక్, ఇనార్గానిక్ గ్రోత్‌పై దృష్టిసారిస్తున్నట్లు శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం సాగర్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 50 శాతం, బీఎంఎం యూనిట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 శాతం వినియోగంలో ఉంది. ఈ వార్తల నేపథ్యంలో సాగర్ సిమెంట్ షేరు ధర 4 శాతం నష్టపోయి రూ. 330 వద్ద ముగిసింది.