సిమెంటు ఖర్చు అడుగుకు 150? | Cement makers in AP, TS in losses | Sakshi
Sakshi News home page

సిమెంటు ఖర్చు అడుగుకు 150?

Published Sat, Jun 10 2017 12:40 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

సిమెంటు ఖర్చు అడుగుకు 150?

సిమెంటు ఖర్చు అడుగుకు 150?

రూ.5000 వసూలు చేస్తున్నారేం?
రియల్టర్లకు సిమెంటు సంస్థల ప్రశ్న
బస్తాకు 330–350 ఉంటేనే నిలదొక్కుకుంటాం
కనీసం 10 శాతం రిటర్నులూ లేవు
సిమెంటు కంపెనీల ప్రతినిధుల వ్యాఖ్య


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నిర్మాణంలో సిమెంటుకయ్యే వ్యయం ఒక చదరపు అడుగుకు రూ.150–175 మాత్రమేనని, కానీ నిర్మాణ సంస్థలు ఫ్లాట్‌కు ఒక చదరపు అడుగుకు రూ.5,000 పైన వసూలు చేస్తున్నాయని సిమెంటు కంపెనీల ప్రతినిధులు చెప్పారు. నిర్మాణానికి అంత ఖర్చు ఎందుకవుతోందో ఈ సంస్థలు చెప్పాలని వారు ప్రశ్నించారు. ‘‘ఒక చదరపు అడుగుకు 25 కిలోల సిమెంటు కావాలి. బస్తాకు రూ.50 అధికమైనా, నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.25 మాత్రమే పెరగాలి కదా?’’ అని ఇండియా సిమెంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ రాకేశ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

సాగర్‌ సిమెంట్స్‌ ఈడీ శ్రీకాంత్‌ రెడ్డి, భారతి సిమెంట్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఎం.రవీందర్‌ రెడ్డితో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. 2015తో పోలిస్తే తెలంగా ణ, ఏపీలో ఇప్పుడున్న సిమెంటు ధర తక్కువని చెప్పారాయన. అయిదేళ్లుగా సిమెంటు ధరల పెరుగుదల ఏటా 1% మాత్రమేనని, అదే రియల్టీ ధరల పెరుగుదల ఏటా 10% ఉందని తెలిపారు. అమ్ముడుపోకుండా పెద్ద సంఖ్యలో గృహాలు  ఉన్నా,  ధర మాత్రం తగ్గడం లేదని గుర్తుచేశారు.

మార్కెట్‌ ఆధారంగానే ధర..
‘‘గతేడాది పెట్‌ కోక్‌ ధర టన్నుకు 45 డాలర్లుంటే, ఇప్పుడు 100 డాలర్లు దాటింది. రవాణా వ్యయం బస్తాకు రూ.50 అవుతోంది. సిమెంటుపై 27% పన్నులున్నాయి. మార్కెట్‌ ఆధారంగానే సిమెంటు ధర నిర్ణయమవుతోంది. పరిశ్రమపైన రూ.50,000 కోట్ల అప్పులున్నాయి. కంపెనీలపై వడ్డీల భారం ఉంది. సిమెంటు ధర పెరగడానికి గల కారణాలను చూడకుండా సిమెంటు కంపెనీలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బస్తా సిమెంటు ధర రూ.270–330 ఉంది. కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇక్కడి మార్కెట్లో ధర రూ.330–350 ఉంటేనే కంపెనీలు నిలదొక్కుకుంటాయి’’ అని శ్రీకాంత్‌ రెడ్డి చెప్పారు. సిమెంటుపై తక్కువ పన్నుంటుందని ప్రజలు, కంపెనీలు ఆశించినా, జీఎస్టీలో 28% శ్లాబులో చేర్చి ప్రభుత్వం నిరుత్సాహపరిచిందని అన్నారు.

భారంగా ఉత్పత్తి సామర్థ్యం..: దేశంలో 1989కి ముందు 10 సిమెంటు కంపెనీలే ఉండేవి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5.9 కోట్ల టన్నులు. ఇప్పుడు కంపెనీల సంఖ్య 70కిపైమాటే. సామర్థ్యం 42 కోట్ల టన్నులకు ఎగసింది. దక్షిణాదిన 50 బ్రాండ్లు పోటీపడుతున్నాయి. వీటి ఉత్పత్తి సామర్థ్యం 150 మిలియన్‌ టన్నులు. ప్లాంట్ల వినియోగం దేశవ్యాప్తంగా 70% ఉంటే, దక్షిణాది రాష్ట్రాల్లో ఇది 60% లోపేనని రవీందర్‌ రెడ్డి తెలిపారు. డిమాండ్‌ పడిపోయి సామర్థ్యానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడం, అధిక తయారీ వ్యయాలు కంపెనీలకు సమస్యగా మారిందని, పెట్టుబడిమీద రాబడి 10%లోపే ఉంటోందని కంపెనీల ప్రతినిధులు వాపోయారు.

తెలుగు రాష్ట్రాలు బెటర్‌..
‘‘సంయుక్త రాష్ట్రంలో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నెలకు 24 లక్షల టన్నుల సిమెంటు అమ్మకాలు నమోదయ్యాయి. 2015–16లో ఇది 12–14 లక్షల టన్నులకు చేరింది. ఏడాదిగా తమిళనాడులో సిమెంటు విక్రయాలు తిరోగమనంలో ఉన్నాయి. సిమెంటు వినియోగంలో వచ్చే మూడేళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 10–18 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’’ అని శ్రీకాంత్‌ తెలిపారు. తమిళనాడు స్థిరంగా, కర్ణాటకలో 2–5 శాతం వృద్ధి ఉండొచ్చని చెప్పారు. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలు 5–7 శాతం అధికం అవుతాయని అంచనా వేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, వైట్‌ ట్యాపింగ్‌ రోడ్లు, అందుబాటు గృహాల నిర్మాణం వేగిరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు తక్కువ ధరకు సిమెంటును సరఫరా చేస్తున్నట్టు గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement