అల్ట్రాటెక్‌ చేతికి ఇండియా సిమెంట్స్‌ | UltraTech Cement acquires majority stake in India Cements | Sakshi
Sakshi News home page

అల్ట్రాటెక్‌ చేతికి ఇండియా సిమెంట్స్‌

Jul 29 2024 6:23 AM | Updated on Jul 29 2024 9:55 AM

UltraTech Cement acquires majority stake in India Cements

32.72 శాతం వాటా కొనుగోలు 

డీల్‌ విలువ రూ. 3,954 కోట్లు 

55 శాతానికి అల్ట్రాటెక్‌ వాటా 

మరో 26% వాటాకు ఓపెన్‌ఆఫర్‌ 

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం అల్ట్రాటెక్‌ చేతికి తాజాగా ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌(ఐసీఎల్‌)లో 32.72 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. సంస్థ ప్రమోటర్ల నుంచి రూ. 3,954 కోట్లకు ఆదిత్య బిర్లా గ్రూప్‌ సిమెంట్‌ దిగ్గజం వాటాను సొంతం చేసుకోనుంది. అంతేకాకుండా పబ్లిక్‌ వాటాదారుల వద్ద నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్‌ ఆఫర్‌ను సైతం ప్రకటించింది. తద్వారా తీవ్ర పోటీతోపాటు.. వేగవంత వృద్ధిలోనున్న దక్షిణాది(ప్ర«దానంగా తమిళనాడు) మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించేందుకు  అ్రల్టాటెక్‌కు వీలు చిక్కనుంది. కాగా.. దేశీ సిమెంట్‌ రంగంలో మరింత పోటీకి తెరతీస్తూ హైదరాబాద్‌ కంపెనీ పెన్నా సిమెంట్‌ను రూ. 10,422 కోట్లకు అదానీ గ్రూప్‌ సొంతం చేసుకున్న నెల రోజుల తదుపరి అ్రల్టాటెక్‌ సైతం సిమెంట్‌  కంపెనీ కొనుగోలుకి తెరతీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది! 

షేరుకి రూ. 390 
షేరుకి రూ. 390 చొప్పున ఇండియా సిమెంట్స్‌లో ప్రమోటర్లు, సహచరుల వాటాను కొనుగోలు చేయనున్నట్లు అ్రల్టాటెక్‌ తాజాగా స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. ప్రమోటర్లు ఎన్‌.శ్రీనివాసన్, చిత్ర, రూపా గురునాథ్, ఎస్‌కే అశోక్‌ బాలాజీ నుంచి 28.42 శాతం, శ్రీ శారదా లాజిస్టిక్స్‌ నుంచి 4.3 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఇందుకు బోర్డు ఆమోదించినట్లు వెల్లడించింది.

 తాజా డీల్‌తో ఐసీఎల్‌లో అల్ట్రాటెక్‌ వాటా 55 శాతానికి జంప్‌ చేయనుంది. దీంతో సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్‌ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. దీనిలో భాగంగా షేరుకి రూ. 390 ధరలో 8.05 కోట్ల ఈక్విటీ షేర్లను వాటాదారుల నుంచి కొనుగోలు చేయనుంది. వారాంతాన ఐసీఎల్‌ షేరు రూ. 374.6 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే ఓపెన్‌ ఆఫర్‌ ధర 4 శాతం అధికం. 26 శాతం వాటాకు అల్ట్రాటెక్‌ రూ. 3,142 కోట్లు వెచి్చంచవలసి ఉంటుంది. కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ) అనుమతి తదుపరి ఐసీఎల్‌కు అల్ట్రాటెక్‌ ప్రమోటర్‌గా అవతరించనుంది. 

తొలుత ఇన్వెస్టర్‌గా.. 
మొత్తం 14.45 ఎంటీపీఏ సామర్థ్యంగల ఐసీఎల్‌లో ఈ ఏడాది జూన్‌లో అ్రల్టాటెక్‌ ఇన్వెస్టర్‌గా రెండు బ్లాక్‌ డీల్స్‌ ద్వారా 23 శాతం వాటాను చేజిక్కించుకుంది. డీమార్ట్‌ ప్రమోటర్లు దమానీ కుంటుంబం నుంచి ఈ వాటాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డీల్‌ విలువ రూ. 1,900 కోట్లుగా అంచనా. తాజా కొనుగోలుతో దక్షిణాది మార్కెట్లలోనూ కార్యకలాపాలు విస్తరించగలమని ఏబీ గ్రూప్‌ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా పేర్కొన్నారు.

అదానీ పోటీ 
అంబుజాను సొంతం చేసుకోవడం ద్వారా 2022 సెపె్టంబర్‌లో సిమెంట్‌ పరిశ్రమలోకి అడుగు పెట్టిన డైవర్సిఫైడ్‌ గ్రూప్‌ అదానీ సైతం దేశీయంగా దిగ్గజాలతో పోటీపడుతోంది. స్విస్‌ దిగ్గజం హోల్సిమ్‌ నుంచి 6.4 బిలియన్‌ డాలర్లకు(సుమారు రూ. 51,000 కోట్లు) అంబుజా సిమెంట్‌ను కొనుగోలు చేసింది. తద్వారా ఏసీసీలోనూ మెజారిటీ వాటాను పొందింది. అంతేకాకుండా 2023లో మైహోమ్‌ ఇండస్ట్రీస్, సంఘీ ఇండస్ట్రీస్‌లను చేజిక్కించుకుంది. 

వెరసి 2028కల్లా 140 ఎంటీపీఏపై దృష్టిపెట్టి ముందుకు కదులుతోంది. ఇందుకు ప్రస్తుత యూనిట్ల విస్తరణ, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితర ప్రణాళికలను అమలు చేస్తోంది. పెన్నా కొనుగోలుతో అదానీ గ్రూప్‌ సిమెంట్‌ తయారీ సామర్థ్యం 14 ఎంటీపీఏ పెరిగి 93 ఎంటీపీఏకు చేరిన సంగతి తెలిసిందే. 155 ఎంటీపీఏ(కన్సాలిడేటెడ్‌) సామర్థ్యంతో దేశీ సిమెంట్‌ రంగంలో నంబర్‌ వన్‌గా నిలుస్తున్న ఆదిత్య బిర్లా 
గ్రూప్‌ తదుపరి రెండో ర్యాంకులో అదానీ గ్రూప్‌ నిలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement