
మొన్న అదాని.. నేడు అల్ట్రాటెక్.. రేపు ఏ పరిశ్రమో?
చిలంకూరు ఐసీఎల్ (అల్ట్రాటెక్ )కు సున్నపురాయి రవాణాను అడ్డుకున్న ఎమ్మెల్యే ఆది అనుచరవర్గం
కాంట్రాక్ట్ కోసం బెదిరింపులు
‘స్పీడ్ ఆఫ్ లూటింగ్ బిజినెస్’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు
కలెక్టర్‌కు యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు
సాక్షి టాస్క్‌ఫోర్స్: సీఎం చంద్రబాబు సర్కారు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు బదులుగా ‘స్పీడ్ ఆఫ్ లూటింగ్ బిజినెస్’ విధానాన్ని అమలు చేస్తోందని సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు హోరెత్తుతున్నాయి. వైఎస్సార్ జిల్లా చిలంకూరులోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో కార్యకలాపాలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం నాలుగైదు రోజులుగా అడ్డుకోవడంతో ఉత్పత్తి ఆగిపోయి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న బెదిరింపులు మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
మొన్న అదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను అడ్డుకుని విధ్వంసం..! నిన్న ఆర్టీపీపీలో ఫ్లైయాష్ రవాణా లారీలను అడ్డుకుని దౌర్జన్యం..! తాజాగా అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి బెదిరింపులు..! వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి ఆది నుంచి అరాచకాలనే ప్రోత్సహిస్తూ దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు.
మూడున్నర దశాబ్దాలుగా స్థానికులకు ఉపాధి..
చిలంకూరు సిమెంట్ పరిశ్రమలో సుమారు 35 ఏళ్ల నుంచి స్థానికులు ఉపాధి పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకే అన్ని పనులు కావాలంటూ పరిశ్రమకు రవాణా అవుతున్న సున్నపురాయి, ఫ్‌లైయాష్‌ను బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులు శనివారం నుంచి అడ్డుకుంటున్నారు. దీంతో సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అగిపోయి మూతపడే దశకు వచ్చింది.
అల్ట్రాటెక్ పరిశ్రమలో ఉత్తరం వైపు సున్నపురాయి మైనింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినా మొత్తం పనులు తమకే కావాలని ఆదినారాయణరెడ్డి వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. చిలంకూరులోని ఐసీఎల్ (అల్ట్రాటెక్) సిమెంట్ పరిశ్రమకు సరఫరా అయ్యే సున్నపురాయిని ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవటంపై యజమాన్యం ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలెక్టర్ ఆదేశించారు.
చిలంకూరు సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అడ్డుకోవడంపై ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులైన ఎస్.జగదీశ్వర్‌రెడ్డితో పాటు పది మందిపై కేసు నమోదు చేసినట్లు యర్రగుంట్ల సీఐ నరేష్‌బాబు తెలిపారు. గురువారం చిలంకూరు ఐసీఎల్ (అల్ట్రాటెక్) మైనింగ్ క్వారీ వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఇవి అరాచకాలు
» గండికోట రిజర్వాయర్ ఆధారంగా చేపట్టిన అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను తమ వర్గీయులకే అప్పగించాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరులు మందీ మార్బలంతో విధ్వంసం సృష్టించారు.
» ఆర్టీపీపీ నుంచి సిమెంట్ కంపెనీలకు ఫ్‌లైయాష్ రవాణా చేస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన లారీలను అడ్డుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం దీన్ని తమకే అప్పగించాలంటూ వీరంగం సృష్టించింది.
» ఎర్రగుంట్ల మండలం చిలంకూరు పరిధిలో అల్ట్రాటెక్ (ఐసీఎల్) సిమెంటు పరిశ్రమకు ఫ్‌లైయాష్, సున్నపురాయి, ఇతర ముడి ఖనిజం సరఫరా, ప్యాకింగ్ ప్లాంట్ కాంట్రాక్టు పనులను 40 ఏళ్లుగా మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడు ఎంవీ రమణారెడ్డి చేస్తున్నారు. ఆ పనులన్నీ తమ వర్గీయులకే ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొంతకాలంగా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తోంది.