రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే.. | SIPB meeting proposed allocation of lands to it company | Sakshi
Sakshi News home page

రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..

Published Sat, Apr 19 2025 3:17 AM | Last Updated on Sat, Apr 19 2025 10:02 AM

SIPB meeting proposed allocation of lands to it company

అప్పుడే పుట్టిన ఉర్సా ఐటీ కంపెనీకి కేటాయింపునకు చినబాబు స్కెచ్‌ 

కుట్రలో భాగంగానే టీసీఎస్‌కు ఎకరా 99 పైసలకే 

ఉర్సా విషయం ప్రశ్నిస్తే టీసీఎస్‌కు ఇచ్చామని తప్పించుకునే ప్లాన్‌ 

టీసీఎస్‌ ముసుగులో కారు చౌకగా అస్మదీయ సంస్థలకు చంద్రబాబు సర్కారు భూ కేటాయింపులు 

టీసీఎస్‌కు 21.16 ఎకరాలు.. డేటా సెంటర్‌ పేరుతో ఉర్సా క్లస్టర్‌కు 60 ఎకరాలు 

ఫిబ్రవరి 12న హైదరాబాద్‌ కేంద్రంగా ఉర్సా క్లస్టర్‌ ఏర్పాటు 

కంపెనీ ఏర్పాటై రెండు నెలలు కూడా గడవక ముందే ఏప్రిల్‌ 15న భూ కేటాయింపునకు రంగం సిద్ధం 

ఇదే బాటలో మరికొన్ని కంపెనీలకు కారు చౌకగా భూకేటాయింపులు 

డిసెంబర్‌లో రాష్ట్ర ప్రతినిధులను కలిసి వెళ్లాక జనవరి 3న ఇండిచిప్‌ కంపెనీ ఏర్పాటు 

ఓర్వకల్లు సెజ్‌లో కారుచౌకగా వందల ఎకరాల అప్పగింతకు రంగం సిద్ధం 

2 నెలల క్రితం ఏర్పాటైన చింతా ఎనర్జీతో రెండు గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఒప్పందం 

వేల ఎకరాలు అప్పగింతకు సిద్ధమైన ప్రభుత్వం 

ఈ కంపెనీల ప్రమోటర్లు, వారివెనుక ఉన్న శక్తులను చూసి ఆశ్చర్యపోతున్న అధికారులు

సాక్షి, అమరావతి: కావాల్సిన వారికి కారు చౌకగా భూములు కేటాయించాలంటే ఏం చేయాలి..? ముందుగా పేరెన్నికగన్న కంపెనీకి అలా కొంత భూమి కేటాయించి.. అదే మా పాలసీ అంటూ మనవాళ్లకు కట్టబెట్టేయడమే. ఇప్పుడు కూటమి సర్కారు అమలు చేస్తున్నది ఇదే.. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఐటీ కంపెనీలకు చౌకగా భూములు కేటాయించే అంశాన్ని పరిశీలించండి అని మంత్రి నారా లోకేశ్‌.. సీఎం చంద్రబాబుకు చెప్పడం.. వెంటనే ఆయన ఆ విధంగా ఐటీ పాలసీని రూపొందించండి అంటూ అధికారులను ఆదేశించడం.. అసలు ఐటీ పాలసీ రాకుండానే ఐటీ కంపెనీలకు ఎకరా రూ.50 కోట్ల విలువ చేసే భూమిని 99 పైసలకే కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదించడం వెంటవెంటనే జరిగిపోయాయి. 

వాస్తవానికి భారీ లాభాలతో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) చౌకగా భూములు కేటాయించండి అని అడగనేలేదు. అయినా, విశాఖ ఐటీ హిల్‌ నంబర్‌ 3లో 21.16 ఎకరాలను ఎకరా 99 పైసలకే టీసీఎస్‌కు కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా మంచి పేరున్న టీసీఎస్‌కి చౌకగా భూములు కేటాయించినా ఎవరూ ఏమీ అనరు అన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే, ఇక్కడే ఉంది అసలు సిసలైన గిమ్మిక్కు. ‘‘ఇదిగో ఇదీ మా ఐటీ పాలసీ’’ అంటూ ఘనంగా ప్రచారం చేసుకుంటూ స్వామి కార్యంతో పాటు స్వకార్యం చక్కబెట్టేస్తోంది. 

అలా టీసీఎస్‌కు భూమి కేటాయించగానే.. ఇలా డేటా సెంటర్‌ పేరుతో ఉర్సా క్లస్టర్స్‌ అనే సంస్థకు ఏకంగా 60 ఎకరాల విలువైన భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడో విచిత్రం ఏమిటంటే ఈ కంపెనీ ఏర్పాటైంది రెండు నెలలు క్రితమే. అయినప్పటికీ అత్యంత విలువైన ఐటీ హిల్‌ నెంబర్‌3 లో 3.5 ఎకరాలు , కాపులుప్పాడలో 56.36 ఎకరాలు కేటాయించడానికి రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. 

టీసీఎస్‌ పాలసీ ముసుగు
ఉర్సా క్లస్టర్‌కు భూమిని ఎంత రేటుకు కేటాయిస్తుంది మంత్రి మండలిలో స్పష్టంగా చెప్పకుండా పాలసీ నియమ నిబంధనల ప్రకారం భూకేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. పాలసీ ప్రకారం రెండు నెలల క్రితం ఏర్పాటైన ఉర్సా క్లస్టర్‌కు కారు చౌకగా భూములు కేటాయించడానికి ప్రభుత్వం ఈ విధానం ఎంచుకుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మధురవాడ, కాపులుప్పాడలో ఎకరా రూ.50 కోట్లపైనే పలుకుతోంది. ఇంతటి ఖరీదైన భూములను తమ వారి చేత కంపెనీలు పెట్టించి భూములు కొట్టేసే విధంగా కూటమి సర్కారు ప్రణాళికలు వేస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 

ఇప్పుడు టీసీఎస్‌కు ఇచ్చిన ప్రకారం ఎకరా 99 పైసలకే ఇస్తే సుమారు రూ.3,000 కోట్ల విలువైన భూములను కేవలం రూ.59కే ఇచ్చే విధంగాప్రభుత్వ ముఖ్య నేతలు ఎత్తుగడ వేశారంటున్నారు. ఫిబ్రవరి 12న హైదరాబాద్‌ కేంద్రంగా ఉర్సా క్లస్టర్స్‌ కంపెనీ ఏర్పాటైంది. అప్పటి వరకు శంషాబాద్‌ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టులో మేనేజర్‌గా పనిచేస్తున్న పెందుర్తి విజయకుమార్, అమెరికాలో మన రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సతీష్‌ అబ్బూరి కలిసి రూ.9.10 లక్షల మూలధనంతో కంపెనీని ఏర్పాటు చేశారు.

 కేవలం రెండు నెలల క్రితం అదీ కూడా డేటా సెంటర్, ఐటీ కార్యాలయాలు నిర్వహణలో ఎటువంటి అనుభవం లేని వ్యక్తులు ఏర్పాటు చేసిన సంస్థకు ఇంతటి ఖరీదైన భూములు కేటాయిస్తుండటంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎటువంటి రాయితీలు లేకుండానే టీసీఎస్‌ మిలియన్‌ టవర్‌లో ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే అడగకపోయినా 99 పైసలకే భూములు కేటాయిస్తూ... దీన్ని ఒక పాలసీగా చూపిస్తూ విలువైన భూములను రాజమార్గంలో కొట్టేయడమేనని పదవీ విరమణ చేసిన మాజీ ఐఏఎస్‌ ఒకరు వ్యాఖ్యానించారు.

ఇలా పెట్టు.. అలా భూమి పట్టు
‘ముందుగా వచ్చి మాట్లాడు.. ఆ తర్వాత వెళ్లి కంపెనీ పెట్టు.. వెంటనే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకో.. ఆ తర్వాత వందల ఎకరాల భూమి తీసుకో..’ ఇప్పుడిది మన రాష్ట్రంలో జరుగుతున్న తీరు. గతేడాది డిసెంబర్‌ ఆఖరు వారంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను కొంతమంది వ్యక్తులు వచ్చి కలిసి వెళ్లారు. వెంటనే జనవరి 3న రూ.కోటి మూలధనంతో కాన్పూర్‌ ఆర్‌వోసీలో ఇండిచిప్‌ పేరిట కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ వెంటనే జనవరి 11న ఏకంగా రూ.14,000 కోట్లతో కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సెమీ కండక్టర్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా కేంద్రంగా ఏర్పాటైన ఇండిచిప్‌ సెమీ కండక్టర్‌ కంపెనీలో పీయూష్‌ బిచోరియా, వెబ్‌ చాంగ్, సందీప్‌ గార్గ్‌లు డైరెక్టర్లుగా, కీలక అధికారిగా రాజీవ్‌ వ్యవహరిస్తున్నారు. వీరికి ఇంత వరకు సెమీకండక్టర్‌ తయారీ విభాగంలో ఎలాంటి అనుభవం లేదు.. అంత ఆర్థిక శక్తి కూడా లేదు. అయినప్పటికీ ఇప్పుడు ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌లో అత్యంత విలువైన వందల ఎకరాలను ఇండిచిప్‌కు అత్యంత చౌకగా కేటాయించనున్నారు. అలాగే రెండు నెలల క్రితం ఏర్పాటైన చింతా గ్రీన్‌ ఎనర్జీ తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో సుమారు రూ.10,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని ఐదో రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆమోదం తెలిపారు. 

ఈ కంపెనీలో నవయుగ గ్రూపునకు చెందిన చింతా విశ్వేశ్వరరావు, అట్లూరి గౌరీనాథ్‌ డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కారులోని పెద్దలకు అత్యంత దగ్గరగా ఉండే నవయుగ గ్రూపునకు గ్రీన్‌ ఎనర్జీ పేరిట వేల ఎకరాలను కట్టబెట్టనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకనేతగా ఉన్న వ్యక్తికి అత్యంత సన్నిహితునిగా ఉన్న పేరున్న కిలారు సునీల్‌కి చెందిన డల్లాస్‌ టెక్నాలజీ సెంటర్‌ రూ.50 కోట్లతో పెట్టుబడి పెడుతుందంటూ తొలి ఎస్‌ఐపీబీలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

ఒక క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న వ్యక్తికి చెందిన డల్లాస్‌ టెక్నాలజీ సెంటర్‌ను టీసీఎస్‌కు కేటాయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చివరకు టీసీఎస్‌ను ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి చెందిన మిలీనియం టవర్స్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా అత్యంత విలువైన భూములను సొంత వారికి వేగంగా కేటాయిస్తూ పోతుండటంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement