SIPB
-
సీమకు ఇం‘ధనం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) ఆమోద ముద్ర వేసింది. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు తరలిరానున్నాయి. ఇంధన రంగంలో పలు ప్రాజెక్టుల ద్వారా రూ.22,302 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. తద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులివీ ► జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ దాదాపు రూ.12,065 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. వైఎస్సార్ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్లు, శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బవద్ద 1,050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లె, రాప్తాడుల్లో 1,050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో డి.హీరేహాల్, బొమ్మనహాళ్‌లో 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 3,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ► జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల, కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం వద్ద రెండు విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. రూ.1,287 కోట్ల పెట్టుబడితో 171.60 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు సాకారం కావడం ద్వారా 200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ► శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లెలో 1,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ను ఆక్వా గ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.4,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. తద్వారా 1,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కుతాయి. 4. కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద 200 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్‌ను ఎక్రోన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1350 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా 200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. 5. శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్‌లను రెన్యూ విక్రం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ రూ.3,600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. తద్వారా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, ఆర్ధిక, ప్రణాళిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పర్యాటకశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, జీఏడీ స్పెషల్ సీఎస్ కె.ప్రవీణ్ కుమార్, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ ముఖ్యకార్యదర్శి (హేండ్లూమ్స్ అండ్ టెక్టŠస్టైల్స్) కె.సునీత, రవాణాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, పరిశ్రమలశాఖ కమిషనర్ సీహెచ్ రాజేశ్వర్‌రెడ్డి, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ, ఎండీ ఎస్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో భారీ పెట్టుబడులకు SIPB ఆమోదం
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో విస్తారంగా పెట్టుబడులే లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తెలిపింది. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. తద్వారా ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులు.. ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు దక్కన్నాయి. ఇక.. దాదాపు రూ. 12,065 కోట్ల పెట్టుబడితో 3350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనుంది జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్. ఇందులో భాగంగా.. వైయస్సార్ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బవద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లె, రాప్తాడుల్లో 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో డి.హీరేహాల్, బొమ్మనహాళ్ 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 3,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కుతాయి. నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల, కర్నూలు జిల్లా ప్యాపిలిమండలం జలదుర్గం వద్ద రెండు విండ్‌పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్. సుమారు 171.60 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటుతో రూ.1287 కోట్ల పెట్టుబడి పెడుతూ.. ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగాల కల్పన చేపట్టనుంది. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లెలో 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్న ఆగ్వాగ్రీన్ ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. రూ.4వేల కోట్లు ఖర్చు చేయనున్న కంపెనీ. ప్రత్యక్షంగా 1000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇక కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద 200 మెగావాట్ల విండ్‌పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్న ఎక్రోన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. రూ.1350 కోట్లు ఖర్చుతో ఈ ప్రాజెక్టు ద్వారా 200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. అనంతపురం ఉమ్మడి జిల్లాలో 600 మెగావాట్ల విండ్‌పవర్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనుంది రెన్యూ విక్రం శక్తి ప్రైవేట్ లిమిటెడ్. ఇందుకోసం రూ.3,600 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా.. 600 మంది ఉద్యోగాలు దక్కున్నాయి. -
AP: ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన ప్రాజెక్టుల ప్రగతిని శనివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ వేగవంతంగా ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వీటి ప్రగతిపై ప్రతి 15 రోజులకు నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌ను సీఎస్ ఆదేశించారు. నెలకు ఒకసారి ఈ అంశంపై సమీక్షిస్తానని సీఎస్ అన్నారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పరిశ్రమలకు సంబంధించి చేసుకున్న అవగాహనా ఒప్పందాలపై సీఎస్ సమీక్షించారు. ఆ సమ్మిట్‌లో పరిశ్రమల శాఖకు సంబంధించి వివిధ కంపెనీల ద్వారా 3 లక్లల 41వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 2 లక్షల 38 వేల మందికి ఉపాధి కల్పించే 107 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోగా ఇప్పటికే కొన్ని కంపెనీలు, పరిశ్రమలకు ముఖ్యమంత్రి స్వయంగానూ, వర్చువల్గానుశంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా? డిశంబరు నెలాఖరులోగా మరో 36 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఇంకా పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస చర్యలు తదితర అంశాలపై సీఎస్ అధికారులతో సమీక్ష జరిపారు. అంతకు ముందు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ కే.ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్ఐపీబీలో ఆమోదించిన ప్రాజెక్టులు వాటి ప్రగతిని వివరించారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న అవగాహనా ఒప్పందాలు ఆయా కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జేడీ రామలింగేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు. -
CM Jagan: స్థానికులకే ఉద్యోగాలు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం తాడేపల్లిలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు భేటీ జరిగింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ SIPB) పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అయితే.. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల్లో స్థానికులకే 75% ఉద్యోగాల కల్పన కచ్చితంగా అమలు చేయాలని, అది సమగ్రంగా అమలవుతుందా? లేదా? అనేది ఆరు నెలలకొకసారి నివేదిక పంపాలని కలెక్టర్లు ఆదేశించారు సీఎం జగన్. అదే సమయంలో ప్రైవేట్ పరిశ్రమల్లో కూడా 75 శాతం, ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాల్సిందేనని తెలిపారు. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని తప్పకుండా అమలు చేయలని, స్థానికులకు ఉద్యోగాలు కల్పన క్రమంలోనే పరిశ్రమలకు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నామని స్పష్టం చేశారాయన. ‘‘ఒక పరిశ్రమ సమర్థవంతా నడవాలంటే ఆ ప్రాంత ప్రజల మద్దతు అవసరం. రాబోతున్న పరిశ్రమల్లో కూడా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. రాష్ట్రంలో మానవవనరులు నైపుణాభివృద్ధికి కొరత లేదు. రైతుల వద్ద పంటల ఉత్పత్తుల, కనీస మద్దతు ధరకు కొనాల్సిందే!. ఇజ్రాయెల్ తరహా విధానాలనూ ఏపీలోనూ అమలయ్యేలా చూడాలని.. పరిశ్రమల్లో శుద్ధి చేసిన నీరు, డీ శాలినేషిన్ నీటినే వినియోగించేలా చూడాలని అధికారులకు సూచించారాయన. ఇదీ చదవండి: అవినీతి రహితం సంక్షేమ స్వర్ణయుగం -
AP: లక్షన్నర కోట్లు 'లక్షకుపైగా జాబ్స్'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.1,44,185.07 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తద్వారా కొత్తగా 1,03,075 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందనుండగా పరోక్షంగా మరింత మందికి ఉపాధి లభించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ ఎన్టీపీసీ అనకాపల్లి జిల్లాలో రూ.1.10 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో నెలకొల్పే న్యూ ఎనర్జీ పార్కుతోపాటు కడియం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్ విస్తరణ ప్రాజెక్టు, పలు రంగాల్లో పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు సమావేశంలో ఆమోదం తెలిపారు. పరిశ్రమలు స్థాపించే వారికి చేదోడుగా నిలవాలని ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తై కార్యకలాపాలు మొదలయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రానున్న ప్రతి పరిశ్రమలో ప్రభుత్వం రూపొందించిన చట్టం ప్రకారం 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని మరోసారి స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ ప్రాజెక్టుల విధానంలో కీలక మార్పులు తెచ్చామని ముఖ్యమం‘త్రి తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికే ఆదాయం వచ్చే పరిస్థితులు తీసుకొచ్చామన్నారు. విద్యుత్ ప్రాజెక్టుల కోసం తీసుకుంటున్న భూమికి ఎకరాకు ఏడాదికి రూ.31 వేలు లీజు కింద చెల్లింపులు చేస్తారని, దీనివల్ల కరువు ప్రాంతాల్లో రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి మెగావాట్‌కు లక్ష రూపాయల చొప్పున రాష్ట్రానికి కంపెనీలు చెల్లిస్తున్నాయని తెలిపారు. ఎస్జీఎస్టీ రూపంలో కూడా రాష్ట్రానికి రెవెన్యూ వస్తుందన్నారు. గ్రిడ్ బాధ్యతలు కూడా రాష్ట్రానికి లేవన్నారు. దీంతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. భోగాపురంలో అత్యంత అధునాతన సదుపాయాలతో ఐటీ పార్కు ఏర్పాటు కావాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడళ్లను పరిశీలించి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్ఐబీపీ ఆమోదించిన ప్రతిపాదనలు ఇవీ ► ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటు కానుంది. మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో మరో రూ.55 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడులతో తొలిదశలో 30 వేల మందికి, రెండో దశలో 31 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మొత్తంగా 61 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ పార్క్‌లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్, హైడ్రోజన్ సంబంధిత ఉత్పత్తులు తయారవుతాయి. మొదటి విడత 2027 నాటికి, రెండో విడత 20౩౩ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇంధన రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసి కొత్త తరహా ఇంధనాల ఉత్పత్తి దిశగా ఎన్టీపీసీ ముందడుగు వేస్తోంది. ► కడియం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్ విస్తరణ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా రూ.3,400 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2025 నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ► శ్రీకాళహస్తి, పుంగనూరులో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ ఫ్యాక్టరీల స్థాపన ద్వారా డీఐ పైపులు, ఫెర్రో అల్లాయిస్ తయారీ. శ్రీకాళహస్తిలో రూ.915.43 కోట్లు, పుంగనూరులో రూ.171.96 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. మొత్తంగా రూ.1,087 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ప్రత్యక్షంగా 2,350 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2023 డిసెంబర్ నాటికి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ► కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో విండ్, సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లు. ఒక్కొక్కటి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీటిని ఏర్పాటు చేస్తుంది. నాలుగు విడతల్లో మొత్తం రూ.10,500 కోట్ల పెట్టుబడుల ద్వారా 2 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దశలవారీగా 2027 మార్చి నాటికి పూర్తి స్ధాయిలో సిద్ధం కానుంది. ► రామాయపట్నంలో అకార్డ్ గ్రూప్ రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. కాపర్ కాథోడ్, కాపర్ రాడ్, సల్ఫూరిక్ యాసిడ్, సెలీనియం, ప్రత్యేక ఖనిజాల తయారీ ద్వారా ప్రత్యక్షంగా 2,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మే 2023లో పనులు ప్రారంభించి జూన్ 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ► వింగ్‌టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1489.23 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తిరుపతిలో నెలకొల్పే పరిశ్రమ ద్వారా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. టెలీ కమ్యూనికేషన్ ఇంటిగ్రేషన్, సెమి కండక్టర్, ఆప్టికల్ మాడ్యూల్స్‌ను ఈ కంపెనీ తయారు చేస్తోంది. ► కృష్ణా జిల్లా మల్లవల్లి పార్కులో ఇథనాల్ ఇంధన తయారీకి అవిశా, ఫ్యూయెల్స్ కంపెనీ ముందుకొచ్చాయి. మొత్తంగా రూ.498.84 కోట్ల పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,300 మందికి ఉపాధి లభిస్తుంది. దీని సామర్థ్యం రోజుకు 500 కిలో లీటర్ల తయారీ. ఈ ఏడాది జూన్‌లో పనులు ప్రారంభించి వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ► విశాఖపట్నంలోని కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల డేటా సెంటర్‌ను వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తోంది. మొదటి విడతలో 10 మెగావాట్లతో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి స్థాయికి చేరుకునేలా సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తం రూ.7,210 కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 14,825 మందికి, పరోక్షంగా 5,625 మందికి.. మొత్తంగా 20,450 మందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న 200 మెగావాట్ల డేటా పార్కుకి ఇది అదనం. ► భోగాపురంలో 90 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ పార్కు ఏర్పాటుకు ఎస్ఐపీబీ ఆమోదం లభించింది. ► రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో జేఎస్‌డబ్యూ అల్యూమినియం లిమిటెడ్ తమ ప్రణాళికలను మార్చుకుంది. ఫ్యాక్టరీ కోసం ప్రెవేట్ వ్యక్తుల నుంచి సేకరించిన 985 ఎకరాల భూమిలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను ఎస్ఐపీబీ ఆమోదించింది. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, ఆర్ధిక, ప్రణాళిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, రెవెన్యూశాఖ (వాణిజ్య పన్నులు) స్పెషల్ సీఎస్ రజత్‌భార్గవ, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, జీఏడీ స్పెషల్ సీఎస్ కె.ప్రవీణ్ కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, ఏపీపీసీబీ సభ్య కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ ఎండీ షన్మోహన్, ఎన్ఆర్ఈడీసీఎపి వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.1,26,622.23 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం
సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామిక రంగంలో నూతన శకాన్ని లిఖిస్తూ రూ.1,26,622.23 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రిక్ వాహనాలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఆయా కంపెనీల ఏర్పాటు ద్వారా 36,380 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఇందులో ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే రూ.81,043 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇండోసోల్ సోలార్, ఆస్త్రా గ్రీన్, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రా, ఏఎం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్కో వంటి సంస్థలు పర్యావరణ ఉపయుక్తమైన ఆరు పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఆరు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా 17,930 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఈ యూనిట్ల ద్వారా 20,130 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. వీటితో పాటు నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్ సోలార్ కంపెనీ మరో రూ.43,143 కోట్లతో మెటలర్జికల్ గ్రేడ్ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్.. రోల్డ్ గ్లాసెస్ తయారీ యూనిట్‌తో పాటు సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. కాకినాడ సెజ్ వద్ద రూ.1,900 కోట్ల పెట్టుబడితో లైఫిజ్ ఫార్మా, వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద కాసిస్ రూ.386.23 కోట్లతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కేంద్రం, కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద రూ.150 కోట్లతో అవిశాఫుడ్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ) బూడి ముత్యాలనాయుడు, విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, సీఎస్ సమీర్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్ఐపీబీ సమావేశంలో మంత్రులు, అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెట్టుబడుల ప్రతిపాదనల వివరాలు ► రూ.286.23 కోట్లతో కాసిస్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్. ► వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో పరిశ్రమను ఏర్పాటు చేయనున్న కాసిస్ ఇ – మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్. ► రూ.386.23 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ. ఇందులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం రూ.286.23 కోట్లు, చార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం రూ.100 కోట్ల పెట్టుబడి. ► తొలి విడతలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని 1,000 ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేయాలని లక్ష్యం. ► 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు. రూ.1,900 కోట్లతో లైఫిజ్ ఫార్మా యూనిట్ ► కాకినాడ ఎస్ఈజెడ్లో యూనిట్ ఏర్పాటు చేయనున్న లైఫిజ్ ఫార్మా. ► మొత్తంగా రూ.1,900 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ. ► 2 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. ► ఏప్రిల్ 2024 నాటికి కంపెనీ ఏర్పాటు పూర్తి చేయాలని లక్ష్యం. ► ఏపీఐ డ్రగ్ తయారీలో చైనా దిగుమతులపై ఆధార పడకుండా.. స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు. ► పరిశ్రమ కోసం ఇప్పటికే 236.37 ఎకరాలు సేకరించిన కంపెనీ. రూ.150 కోట్లతో అవిశా ఫుడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ ► కృష్ణా జిల్లా మల్లవల్లిలో మెగా ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేయనున్న అవిశా ఫుడ్స్ లిమిటెడ్. ► రూ.150 కోట్ల పెట్టుబడి, 2,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. ► 2023 మార్చి నాటికి పూర్తి చేసే దిశగా కంపెనీ అడుగులు. ► ఇందు కోసం 11.64 ఎకరాల భూమి కేటాయింపు. రూ.43,143 కోట్లతో ఇంటిగ్రేటెడ్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ► మెటలర్జికల్ గ్రేడ్ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్ అండ్ రోల్డ్ గ్లాసెస్ తదితర వాటి తయారీ కోసం పరిశ్రమతో పాటు సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్. ► మూడు విడతల్లో మొత్తంగా రూ.43,143 కోట్ల పెట్టుబడి. ► 11,500 మందికి ప్రత్యక్షంగా, 11 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు. ► నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద 5,147 ఎకరాల్లో తయారీ పరిశ్రమ, దీంతో పాటు 50 గిగావాట్లు, 10 గిగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పనున్న ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్. రైతుల ఆదాయం పెరుగుతుంది: సీఎం రాష్ట్రంలో కొత్తగా వస్తున్న పెట్టుబడులతో రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం మారడంతో పాటు క్లీన్ ఎనర్జీలో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పెద్దగా ఆదాయం రాని భూముల్లో గ్రీన్ ఎనర్జీ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు లీజు రూపంలో ఏటా ఎకరాకు రూ.30,000 ఆదాయం వస్తుందన్నారు. ‘గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ప్రాజెక్టుల్లో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పురోగమించడమే కాకుండా క్లీన్ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూములకు లీజు కింద డబ్బు వస్తుంది. దీనివల్ల వారికి ఆదాయాలు పెరుగుతాయి. పరిశ్రమల ఏర్పాటు, వాటి నిర్వహణ తదితర వాటి కోసం పెద్ద ఎత్తున సంస్థలు ప్రవేశిస్తాయి. వాటి ద్వారా నైపుణ్యాభివృద్ధి జరుగుతుంది’ అని చెప్పారు. ఆరు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఇవీ.. ► వైఎస్సార్ జిల్లా వొంగిమల్ల వద్ద 1,800 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికోసం రూ.8,240 కోట్ల పెట్టుబడి. ప్రత్యక్షంగా 4 వేల మందికి ఉద్యోగాలు. 1,390 ఎకరాల్లో ప్రాజెక్టు ఏర్పాటు. డిసెంబర్ 2029 నాటికి ఏర్పాటు చేయాలని లక్ష్యం. ► సోమశిల, ఎర్రవరం వద్ద రెండు పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం. సోమశిల వద్ద 900 మెగావాట్లు, ఎర్రవరం వద్ద 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. 2,100 మెగావాట్ల ప్రాజెక్టు కోసం రూ.8,855 కోట్లు ఖర్చు చేయనున్న షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. 1600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు. జూలై 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. ► అవుకు, సింగనమల వద్ద రెండు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ. మొత్తంగా రూ.6,315 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అరబిందో రియాల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. 1,600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు. అవుకు వద్ద 800 మెగావాట్లు, సింగనమల వద్ద 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు. డిసెంబర్ 2028 నాటికి ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యం. ► వైఎస్సార్ జిల్లా పైడిపాలెం వద్ద పంప్డ్ హైడ్రో, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్. 7,200 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం రూ.33,033 కోట్లు ఖర్చు చేయనున్న కంపెనీ. పైడిపాలెం ఈస్ట్ 1,200 మెగావాట్లు, నార్త్ 1,000 మెగావాట్లు, 3,500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, 1500 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు. 7,200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి. డిసెంబర్ 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ. ► కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. రూ.5 వేల కోట్ల పెట్టుబడి. ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ. 1,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. 700 మెగావాట్ల సోలార్, 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న కంపెనీ. మార్చి 2025 నాటికి ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యం. ► కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పంప్డ్, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న గ్రీన్కో. 1,680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు, 2,300 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనున్న గ్రీన్కో. మొత్తంగా రూ.19,600 కోట్ల పెట్టుబడి. 4,230 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. సెప్టెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. -
Andhra Pradesh: రూ.2,134 కోట్లతో 5 కొత్త పరిశ్రమలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.2,134 కోట్ల పెట్టుబడులతో కొత్తగా ఐదు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 8,578 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఈ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం లభించింది. పరిశ్రమలకు భూముల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. కంపెనీల విస్తరణకు అవకాశాలున్న చోట భూములు కేటాయించాలని సూచించారు. భవిష్యత్తులో పరిశ్రమలను విస్తరించేందుకు అనువుగా తగిన వనరులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ జి.అనంతరాము, జీఏడీ ముఖ్య కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్, ఐటీ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ఐదు పరిశ్రమలు ఇవీ ► వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్– రిటైల్ లిమిటెడ్ ఏర్పాటు కానుంది. ఇక్కడ జాకెట్స్, ట్రౌజర్ల తయారీని చేపట్టనున్నారు. ఆదిత్యా బిర్లా రూ.110 కోట్ల పెట్టుబడితో 2,112 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ► వైఎస్సార్ జిల్లా బద్వేలులో సెంచురీ కంపెనీ ప్లైవుడ్ తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది. రూ.956 కోట్ల పెట్టుబడితో 2,266 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. మరోవైపు ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల రైతులకు కూడా భారీగా మేలు జరగనుంది. దాదాపు 22,500 ఎకరాల్లో యూకలిఫ్టస్ చెట్లను గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తారు. రూ.315 కోట్ల విలువైన ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేయనున్నారు. ► తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం వద్ద ఇండస్ట్రియల్ కెమికల్స్ తయారీ పరిశ్రమకు ఎస్‌ఐపీబీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ రూ.861 కోట్ల పెట్టుబడితో ఇక్కడ 1,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుంది. స్థానిక ప్రజల అభ్యంతరాల నేపథ్యంలో థర్మల్ పవర్ ప్లాంట్‌ను నెలకొల్పబోమని గ్రాసిమ్ కంపెనీ స్పష్టం చేసింది. ప్రజల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని విరమించుకుంటున్నట్లు తెలిపింది. ఈమేరకు కంపెనీ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఐపీబీ ఆమోదం లభించింది. ► వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తి ఈఎంసీలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల (హెచ్ఏసీ కెమెరా, ఐపీ కెమెరా, డీవీఆర్) తయారీ పరిశ్రమను ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నెలకొల్పనుంది. రూ.127 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 1,800 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ► కొప్పర్తి ఈఎంసీలోనే ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరో పరిశ్రమను కూడా ఏర్పాటు చేయనుంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, కెమెరా, డీవీఆర్ తయారీకి సంబంధించి రూ.80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 1,100 మందికి డిక్సన్ కంపెనీ ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుంది. -
7 పరిశ్రమలు.. రూ.11,239.16 కోట్లు పెట్టుబడుల వెల్లువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.11,239.16 కోట్ల పెట్టుబడితో కొత్తగా ఏడు పరిశ్రమల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం ఆమోదం తెలిపింది. ఈ పరిశ్రమల ద్వారా కొత్తగా ప్రత్యక్షంగా 17,334 మందికి ఉద్యోగాలు రానుండగా పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఏర్పాటు కానున్న పరిశ్రమల వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జాగ్రత్తలు తీసుకుంటూనే రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రిటైల్ పాలసీకి కూడా ఇదే సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకరించారు. ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన పరిశ్రమలు, పెట్టుబడుల వివరాలు ఇవీ.. జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్ రూ.7,500 కోట్ల పెట్టుబడి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి గ్రామం తమ్మినపట్నం వద్ద జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్‌కు 860 ఎకరాలు తక్కువ ధరతో ఇచ్చేందుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. 2.25 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్‌ను జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.7,500 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా నాలుగేళ్లలో ప్రత్యక్షంగా 2,500 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రూ.401 కోట్లతో కొప్పర్తిలో ‘పిట్టి’ ప్రాజెక్టు కడప సమీపంలోని కొప్పర్తి వద్ద పిట్టి రెయిల్ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ లిమిటెడ్ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇక్కడ ఎలక్ట్రికల్, లోకోమోటివ్, విద్యుత్తు, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం రూ.401 కోట్లు పెట్టుబడి పెట్టి ప్రత్యక్షంగా 2,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. రూ.486 కోట్లతో కొప్పర్తిలో నీల్కమల్ పరిశ్రమ కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నీల్కమల్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు ఎస్ఐపీబీ బోర్డు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా పలు పరిశ్రమలు నెలకొల్పిన నీల్కమల్ ఇక్కడ అన్నిటికంటే పెద్ద పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.486 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇక్కడ ఫర్నీచర్, ఇతర గృహోపకరణాల తయారీ చేపట్టనున్నారు. తద్వారా ప్రత్యక్షంగా 2,030 మందికి ఉద్యోగాలు రానుండగా పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నాయుడుపేటలో రూ.627 కోట్లతో గ్రీన్‌టెక్ విస్తరణ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ విస్తరణకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఫోర్డ్, హ్యుందాయ్, ఫోక్స్‌వాగన్ తదితర కంపెనీలకు గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ స్టీల్, ఐరన్ ఉత్పత్తులను అందిస్తోంది. అత్యాధునిక రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తుల తయారీ చేపట్టింది. జర్మనీ నుంచి ఐఎల్టీ ప్లాస్మా సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రీన్‌టెక్ వినియోగించనుంది. ప్రస్తుతం 2,700 మందికి ఉద్యోగాలు కల్పించగా విస్తరణ ద్వారా అదనంగా 2,200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటికే రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టగా విస్తరణ ద్వారా మరో రూ.627 కోట్ల మేర పెట్టుబడి పెట్టనుంది. తాడేపల్లిలో రూ.194.16 కోట్లతో రిటైల్ బిజినెస్ పార్క్ టెక్స్టైల్స్, గార్మెంట్స్ మార్కెట్ ప్లేస్‌లో భాగంగా మెగా రిటైల్ పార్క్ నిర్మాణానికి ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో 5 ఎకరాల విస్తీర్ణంలో రిటైల్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.194.16 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నారు. పార్క్‌లో భాగంగా 900 వరకూ రిటైల్ యూనిట్స్ వస్తాయి. తద్వారా సుమారు 5 వేల మందికిపైగా ప్రత్యక్షం ఉద్యోగాలు, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కొనుగోలు, విక్రయాల హబ్‌గా ఈ పార్క్ ఏర్పాటు అవుతుంది. రాష్ట్రంలో తయారయ్యే వాటిలో దాదాపు 70 శాతం విక్రయాలు ఇక్కడనుంచే జరుగుతాయని అంచనా. పార్క్‌లో భాగంగా ఏర్పాటయ్యే ఒక్కో స్టోర్‌లో ఏటా సుమారు రూ.11 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. రూ.30 కోట్లతో చిత్తూరు జిల్లాల్లో వస్త్ర పరిశ్రమ చిత్తూరు జిల్లా జిల్లా నిండ్ర మండలం ఎలకటూరులో అమ్మయప్పర్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. సుమారు రూ.30 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే పరిశ్రమ ద్వారా 2,304 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఇందులో 90 శాతం మహిళలకే ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇక్కడ పురుషులు, పిల్లల దుస్తులు తయారవుతాయి. విశాఖలో సెయింట్ గోబియాన్ రూ.2,001 కోట్ల పెట్టుబడి విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో నిర్మాణం జరుగుతున్న సెయింట్ గోబియాన్ పరిశ్రమకు ఏర్పాటు కాలవ్యవధి పొడిగింపునకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. కోవిడ్ కారణంగా ఫ్యాక్టరీ నిర్మాణ గడువు పెంచాలన్న సెయిట్ గోబియాన్ వినతి మేరకు జూన్ 2022 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సెయింట్ గోబియాన్ మూడు దశల్లో రూ.2,001 కోట్ల పెట్టుబడి పెడుతుంది. తద్వారా 1,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ► ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, కార్మికశాఖ మంత్రి జి.జయరాం, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం తదితరులు హాజరయ్యారు. -
3 మెగా ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఓకే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు మెగా ప్రాజెక్టులకు సంబంధించిన రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ) సమావేశం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. కొత్తగా పలు మెగా ప్రాజెక్టుల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనల గురించి అధికారులు ఈ సమావేశంలో వివరించారు. ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్, ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌లు తమ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయని, వీటి ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. విశాఖలో కాలుష్య రహిత గ్రీన్ పరిశ్రమల ఏర్పాటునకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా పలు మెగా ప్రాజెక్టుల పెట్టుబడులకు సంబంధించి అధికారులు వెల్లడించిన వివరాలివీ.. ► చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ ఫుట్‌వేర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, రెండు దశల్లో రూ.700 కోట్ల పెట్టుబడికి సిద్ధమైన ఆ కంపెనీ ద్వారా 10 వేల మందికి ఉపాధి లభించనుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఇంటలిజెంట్ సెజ్ లిమిటెడ్ వైఎస్సార్ జిల్లా పులివెందులలో కూడా యూనిట్ ఏర్పాటు చేస్తుందని, అక్కడ కూడా రెండు వేల మందికి ఉపాధి లభించనుందని సీఎంకు అధికారులు వివరించారు. ► విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫ్–హైవే టైర్స్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని, మొత్తం రూ.980 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఆ సంస్థ ద్వారా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ► విశాఖ జిల్లా మధురవాడలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ.. ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదన గురించి సమావేశంలో అధికారులు వివరిస్తూ.. రూ.14,634 కోట్లను ఆ సంస్థ పెట్టుబడి పెట్టనుండగా, మొత్తం 24,990 మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. అలాగే స్కిల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనల గురించి కూడా వారు తెలిపారు. ► ఆయా కంపెనీలు కోరుతున్న రాయితీలను, ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహకారాన్ని, అదే సమయంలో సదరు సంస్థల ద్వారా లభ్యమయ్యే ఉపాధి అవకాశాలను అధికారులు సమావేశంలో వివరించారు. ► సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, పరిశ్రమలు వాణిజ్య శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యంతోపాటు వివిధ శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రధాన కార్యదర్శి లేకున్నా తండ్రీ కొడుకులకు ఓకే..!
సాక్షి, అమరావతి : రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్ఐపీబీ) సమావేశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కలిసి నిర్వహిస్తుండడం మంత్రుల్లో, అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు గత నెల 9వ తేదీన, ఈ నెల 6వ తేదీన ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించారు. పలు ఐటీ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా భారీ రాయితీలు ఇచ్చేశారు. ఎస్‌ఐపీబీకి కన్వీనర్‌గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఈ రెండు సమావేశాలకు హాజరు కాకపోవడం గమనార్హం. ఎస్ఐపీబీ సమావేశాలంటే పెదబాబు, చినబాబుల ఇష్టారాజ్యంగా మారిందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందుబాటులో ఉండి కూడా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి లేకుండా ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించిన దాఖలాలు గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడూ లేవని అధికారులు గుర్తుచేస్తున్నారు. వచ్చే పదేళ్లపాటు పలు ఐటీ కంపెనీలకు రాయితీలు ఇస్తూ ఎస్ఐపీబీ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు. ఎస్‌ఐపీబీకి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. సభ్యులుగా ఆర్థిక, రెవెన్యూ, ఐటీ, మున్సిపల్, వ్యవసాయ, కార్మిక, ఉపాధి, శిక్షణ, పరిశ్రమలు, ఇంధన శాఖ మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు ఉంటారు. సభ్య కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం 2017 ఏప్రిల్ 20న జీవో నం.51 జారీ చేసింది. అయితే, ఫిబ్రవరి 9న నిర్వహించిన ఎస్ఐపీబీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి సాయి ప్రసాద్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోఖ్యరాజ్, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్‌బాబు మాత్రమే పాల్గొన్నారు. మిగతా మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖల కార్యదర్శులు పాల్గొనలేదు. అలాగే ఈ నెల 6న నిర్వహించిన ఎస్ఐపీబీ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి అందుబాటులో ఉండి కూడా హాజరు కాలేదు. మిగతా సభ్యులైన మంత్రులు కూడా హాజరు కాలేదు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి విజయానంద్, సీఎం కార్యాలయ కార్యదర్శి గిరిజాశంకర్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్ మాత్రమే పాల్గొన్నారు. సమావేశం కంటే ముందే నిర్ణయాలు ఎన్నికల ముందు హడావిడిగా ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నందువల్లే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఆర్థిక శాఖ కార్యదర్శి హాజరుకాలేదని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఎవరికి, ఏ కంపెనీలకు ఏ ధరకు భూములు ఇవ్వాలి, ఎన్ని రాయితీలు ఇవ్వాలనే విషయాన్ని ముందుగానే నిర్ణయించేస్తున్నారని, తరువాత ఎస్ఐపీబీ సమావేశం ఏర్పాటుచేసి అందులో ఆమోదింపజేస్తున్నారని, అలాంటి సమావేశాలకు వెళ్లడం కంటే దూరంగా ఉండటమే మేలని మంత్రులు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే వారు హాజరుకావడం లేదని తెలుస్తోంది. -
ప్రభుత్వం సంస్థను కాదని...
-
‘ప్రైవేట్’ కోసం ప్రజలకు టోపీ
రూ. 5,615 కోట్లు భరిస్తే దాదాపు 32,900 కోట్ల రూపాయల విలువైన భారీ కేంద్ర ప్రాజెక్టు మన రాష్ట్రానికొచ్చేది. భారీగా ఉద్యోగాలొచ్చేవి. అయితే ఈ మొత్తం భరించలేమంటూ చంద్రబాబు తేల్చిచెప్పారు. అదేసమయంలో ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన.. దానికి ఏకంగా రూ. 12,578 కోట్ల అదనపు రాయితీలను ప్రకటించేశారు. రూ.5,615 కోట్లు కట్టే స్థోమత లేదని చెప్పుకున్న ఆయన ప్రైవేటు సంస్థకు రెట్టింపు రాయితీలను ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధమైన చర్యలతో రాష్ట్రం నుంచి మరో భారీ కేంద్ర ప్రాజెక్టు జారిపోయింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కాకినాడలో రూ.32,900 కోట్లతో భారీ క్రాకర్, పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకు వచ్చినా ముఖ్యమంత్రి ప్రైవేటు సంస్థకే మొగ్గు చూపారు. కోల్‌కతాకు చెందిన హల్దియా పెట్రోకెమికల్స్ సంస్థతో వేగంగా ఒప్పందం కుదుర్చుకోవడమే కాకుండా గత నెలలో కాకినాడలో ఆగమేఘాల మీద శంఖుస్థాపన కూడా చేసేశారు. అంతేకాదు పారిశ్రామిక పాలసీ ప్రకారం లభించే రాయితీలు కాకుండా అదనంగా రూ. 12,578 కోట్ల రాయితీలను ఇస్తూ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (ఎస్ఐపీబీ) నిర్ణయం తీసుకుంది. హల్దియాకు వివిధ రూపాల్లో ఇస్తున్న భారీ రాయితీలను చూసి అధికారులకే కళ్లుతిరుగుతున్నాయి. ప్రభుత్వం సంస్థను కాదని... రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు హెచ్‌పీసీఎల్–గెయిల్ కలిసి క్రాకర్, పెట్రో కెమికల్ యూనిట్ పెట్టడానికి 2017లో జరిగిన సీఐఐ పెట్టుబడుల సదస్సులో ఒ్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం కాకినాడ సెజ్‌లో 2,000 ఎకరాల్లో 1.55 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఈ ప్రాజెక్టు లాభదాకతపై ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ స్టడీలో రూ. 5,615 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అవసరమవుతుందని, ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని, మిగతా అన్ని యూనిట్లలో ఇదే విధానం అనుసరిస్తున్నారని ఆ కేంద్ర సంస్థలు పేర్కొన్నాయి. లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రూ. 5,615 కోట్లు వీజీఎఫ్ కింద ఇచ్చే పరిస్థితిలేదని, ఈ మొత్తాన్ని కూడా కేంద్రమే భరించాలంటూ ముఖ్యమంత్రి పట్టుపడుతూ వచ్చారు. చివరకు ఎన్నికల సమయంలో తామే సొంతంగా ఏర్పాటు చేస్తామంటూ హల్దియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారీ రాయితీలు.. కేంద్ర సంస్థకు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ప్రైవేటు సంస్థకు రూ. 12,578 కోట్ల ప్రయోజనాలను ఏ విధంగా కల్పిస్తుందంటూ పలువురు పారిశ్రామిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా 2015–20 పాలసీ ప్రకారం లభించే ఇతర రాయితీలు కూడా ఆ ప్రైవేటు సంస్థకు లభిస్తాయని పేర్కొంటున్నారు. ఇదే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చి ఉంటే రెట్టింపు సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేసేవని, తద్వారా రాష్ట్ర యువతకు ఉద్యోగాలతో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయం వచ్చేదని పలువురు ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా చేయకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక ప్రైవేటు సంస్థకు.. అది కూడా ఎన్నికల ముందు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. హల్దియా సంస్థ ఈ ప్రాజెక్టుకు ఆమోదం కోసం ఎస్ఐపీబీ డిసెంబర్ 28, డిసెంబర్ 29న వరుసగా రెండుసార్లు సమావేశం కావడం, జనవరి 3న జీవో చేయడం ఆ మరుసటి రోజే కాకినాడలో ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారంటే దీని వెనుక ఉన్న శక్తుల గురించి అర్థం చేసుకోవచ్చంటున్నారు. -
ఐదు మెగా ప్రాజెక్టులకు ఓకే
* అనుమతులిచ్చిన పారిశ్రామిక ప్రోత్సాహక మండలి * 21 రోజుల్లో అనుమతులివ్వకపోతే చర్యలు: సీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐదు మెగా ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణా జిల్లా భోగాపురంలో మోహన్ స్పిన్నింగ్స్, అనంతపురం జిల్లా హిందూపురంలో ఇండియన్ డిజైన్స్, తూర్పుగోదావరి జిల్లా ఒంటిమామిడి గ్రామంలో దివీస్ లేబొరేటరీ, చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆటో మొబైల్ పరిశ్రమ ఎన్‌హెచ్‌కే స్ప్రింగ్స్, కర్నూల్ జిల్లాలో జైన్ ఇరిగేషన్ నేతృత్వంలో ఫుడ్ పార్కు, విశాఖ జిల్లాలో వేహాన్ కాఫీ పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) అనుమతినిచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకొన్నారు. రూ. 2,300 కోట్లతో ఏర్పాటయ్యే ఈ ఐదు ప్రాజెక్టుల వల్ల 35,700 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా తంగడెంచలో అంబూజా, జైన్ సంస్థలు ఆహారశుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేస్తున్న కారణంగా, ఈ రంగంలో యూనిట్లను ప్రోత్సహించాలని అధికారులకు సీఎం సూచించారు. నాయుడుపేటలో గ్రీన్‌టెక్ పరిశ్రమ తమ యూనిట్‌ను పెట్టేందుకు ఆసక్తి చూపుతోందని, ఖాయిలా పడ్డ చక్ర సిమెంట్స్‌ను పునరుద్ధరించేందుకు ఆ సంస్థ ముందుకొస్తోందని చంద్రబాబు అధికారుల దృష్టికి తెచ్చారు. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో సింగిల్‌డెస్క్ కృషి చేస్తోందని వివరించారు. ఇప్పటి వరకూ 417 పరిశ్రమలు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయని, ఇందులో 217 దరఖాస్తులను క్లియర్ చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. అక్టోబర్ 12 నుంచి 14వ తేదీ వరకూ ఏపీలో గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్‌ను నిర్వహించాలని సీఎం సూచించారు. విశిష్ట కృషి చేసిన వారికి అవార్డులు ఇద్దామని ప్రతిపాదించారు. చంద్రబాబుతో కేంద్ర మంత్రి తోమర్ భేటీ కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సీఎంతో భేటీ అయ్యారు. ఆధునీకరణతో పాటు విస్తరణ పూర్తి చేసుకున్న విశాఖ స్టీల్ ప్లాంటును వచ్చే జూలైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించే కార్యక్రమంపై తోమర్ సీఎంతో చర్చించారు. వచ్చె నెల 2న కేబినెట్ భేటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వచ్చే నెల 2వ తేదీన నిర్వహించాలని సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంతో పాటు అనేక అంశాలపై చర్చించనున్నారు. 29న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఈ నెల 29న సచివాలయంలో జరగనుంది. అదే రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ పరపతి ప్రణాళికను ముఖ్యమంత్రి విడుదల చేస్తారు.