ఎస్‌ఐపీబీ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.11,239.16 కోట్ల పెట్టుబడితో కొత్తగా ఏడు పరిశ్రమల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం ఆమోదం తెలిపింది. ఈ పరిశ్రమల ద్వారా కొత్తగా ప్రత్యక్షంగా 17,334 మందికి ఉద్యోగాలు రానుండగా పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఏర్పాటు కానున్న పరిశ్రమల వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జాగ్రత్తలు తీసుకుంటూనే రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రిటైల్ పాలసీకి కూడా ఇదే సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకరించారు. ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదించిన పరిశ్రమలు, పెట్టుబడుల వివరాలు ఇవీ..
జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్ రూ.7,500 కోట్ల పెట్టుబడి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి గ్రామం తమ్మినపట్నం వద్ద జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్‌కు 860 ఎకరాలు తక్కువ ధరతో ఇచ్చేందుకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. 2.25 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్‌ను జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.7,500 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా నాలుగేళ్లలో ప్రత్యక్షంగా 2,500 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
రూ.401 కోట్లతో కొప్పర్తిలో ‘పిట్టి’ ప్రాజెక్టు
కడప సమీపంలోని కొప్పర్తి వద్ద పిట్టి రెయిల్ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ లిమిటెడ్ ప్రాజెక్టుకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇక్కడ ఎలక్ట్రికల్, లోకోమోటివ్, విద్యుత్తు, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం రూ.401 కోట్లు పెట్టుబడి పెట్టి ప్రత్యక్షంగా 2,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు.
రూ.486 కోట్లతో కొప్పర్తిలో నీల్‌కమల్ పరిశ్రమ
కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నీల్‌కమల్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ బోర్డు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా పలు పరిశ్రమలు నెలకొల్పిన నీల్‌కమల్ ఇక్కడ అన్నిటికంటే పెద్ద పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.486 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇక్కడ ఫర్నీచర్, ఇతర గృహోపకరణాల తయారీ చేపట్టనున్నారు. తద్వారా ప్రత్యక్షంగా 2,030 మందికి ఉద్యోగాలు రానుండగా పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
నాయుడుపేటలో రూ.627 కోట్లతో గ్రీన్‌టెక్ విస్తరణ
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ విస్తరణకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఫోర్డ్, హ్యుందాయ్, ఫోక్స్‌వాగన్ తదితర కంపెనీలకు గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ స్టీల్, ఐరన్ ఉత్పత్తులను అందిస్తోంది. అత్యాధునిక రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తుల తయారీ చేపట్టింది. జర్మనీ నుంచి ఐఎల్‌టీ ప్లాస్మా సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రీన్‌టెక్ వినియోగించనుంది. ప్రస్తుతం 2,700 మందికి ఉద్యోగాలు కల్పించగా విస్తరణ ద్వారా అదనంగా 2,200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటికే రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టగా విస్తరణ ద్వారా మరో రూ.627 కోట్ల మేర పెట్టుబడి పెట్టనుంది.
తాడేపల్లిలో రూ.194.16 కోట్లతో రిటైల్ బిజినెస్ పార్క్
టెక్స్‌టైల్స్, గార్మెంట్స్ మార్కెట్ ప్లేస్‌లో భాగంగా మెగా రిటైల్ పార్క్ నిర్మాణానికి ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో 5 ఎకరాల విస్తీర్ణంలో రిటైల్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.194.16 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నారు. పార్క్‌లో భాగంగా 900 వరకూ రిటైల్ యూనిట్స్ వస్తాయి. తద్వారా సుమారు 5 వేల మందికిపైగా ప్రత్యక్షం ఉద్యోగాలు, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కొనుగోలు, విక్రయాల హబ్‌గా ఈ పార్క్ ఏర్పాటు అవుతుంది. రాష్ట్రంలో తయారయ్యే వాటిలో దాదాపు 70 శాతం విక్రయాలు ఇక్కడనుంచే జరుగుతాయని అంచనా. పార్క్‌లో భాగంగా ఏర్పాటయ్యే ఒక్కో స్టోర్‌లో ఏటా సుమారు రూ.11 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా.
రూ.30 కోట్లతో చిత్తూరు జిల్లాల్లో వస్త్ర పరిశ్రమ
చిత్తూరు జిల్లా జిల్లా నిండ్ర మండలం ఎలకటూరులో అమ్మయప్పర్ టెక్స్‌టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. సుమారు రూ.30 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే పరిశ్రమ ద్వారా 2,304 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఇందులో 90 శాతం మహిళలకే ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇక్కడ పురుషులు, పిల్లల దుస్తులు తయారవుతాయి.
విశాఖలో సెయింట్ గోబియాన్ రూ.2,001 కోట్ల పెట్టుబడి
విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో నిర్మాణం జరుగుతున్న సెయింట్ గోబియాన్ పరిశ్రమకు ఏర్పాటు కాలవ్యవధి పొడిగింపునకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. కోవిడ్ కారణంగా ఫ్యాక్టరీ నిర్మాణ గడువు పెంచాలన్న సెయిట్ గోబియాన్ వినతి మేరకు జూన్ 2022 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సెయింట్ గోబియాన్ మూడు దశల్లో రూ.2,001 కోట్ల పెట్టుబడి పెడుతుంది. తద్వారా 1,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
► ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, కార్మికశాఖ మంత్రి జి.జయరాం, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment