ఎస్‌ఐపీబీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు మెగా ప్రాజెక్టులకు సంబంధించిన రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్‌ఐపీబీ) సమావేశం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. కొత్తగా పలు మెగా ప్రాజెక్టుల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనల గురించి అధికారులు ఈ సమావేశంలో వివరించారు. ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్, ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌లు తమ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయని, వీటి ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. విశాఖలో కాలుష్య రహిత గ్రీన్ పరిశ్రమల ఏర్పాటునకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా పలు మెగా ప్రాజెక్టుల పెట్టుబడులకు సంబంధించి అధికారులు వెల్లడించిన వివరాలివీ..
► చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ ఫుట్‌వేర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, రెండు దశల్లో రూ.700 కోట్ల పెట్టుబడికి సిద్ధమైన ఆ కంపెనీ ద్వారా 10 వేల మందికి ఉపాధి లభించనుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఇంటలిజెంట్ సెజ్ లిమిటెడ్ వైఎస్సార్ జిల్లా పులివెందులలో కూడా యూనిట్ ఏర్పాటు చేస్తుందని, అక్కడ కూడా రెండు వేల మందికి ఉపాధి లభించనుందని సీఎంకు అధికారులు వివరించారు.
► విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫ్–హైవే టైర్స్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని, మొత్తం రూ.980 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఆ సంస్థ ద్వారా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
► విశాఖ జిల్లా మధురవాడలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ.. ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదన గురించి సమావేశంలో అధికారులు వివరిస్తూ.. రూ.14,634 కోట్లను ఆ సంస్థ పెట్టుబడి పెట్టనుండగా, మొత్తం 24,990 మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. అలాగే స్కిల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనల గురించి కూడా వారు తెలిపారు.
► ఆయా కంపెనీలు కోరుతున్న రాయితీలను, ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహకారాన్ని, అదే సమయంలో సదరు సంస్థల ద్వారా లభ్యమయ్యే ఉపాధి అవకాశాలను అధికారులు సమావేశంలో వివరించారు.
► సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, పరిశ్రమలు వాణిజ్య శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యంతోపాటు వివిధ శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment