Mega project
-
తీరంలో మెగా ప్రాజెక్ట్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ సముద్ర తీరంలో మెగా ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. నరసాపురం తీర ప్రాంతంలో దశాబ్దాల కలగా ఉన్న ఫిషింగ్ హార్బర్ పనులు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి. హార్బర్ నిర్మాణానికి అనువైన స్థలం, పూర్తి అవసరాలు తీర్చేలా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో హార్బర్ ప్రాంతాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు ఖరారు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. పర్యావరణ అనుమతులతో సహా అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుని రూ.429.43 కోట్లతో హార్బర్ నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. ఇప్పటికే హార్బర్ నిర్మాణ పనులను విశ్వసముద్ర సంస్థ దక్కించుకుంది. త్వరితగతిన ప్రక్రియ నరసాపురం నియోజకవర్గంలోని పీఎం లంక–బియ్యపుతిప్ప గ్రామాల మధ్య స్థలాన్ని ప్రభుత్వ భూమిని గుర్తించి హార్బర్‌కు కేటాయించారు. పనులకు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన కూడా పూర్తి చేశారు. హార్బర్ నిర్మాణానికి ఈ ఏడాది మే నెలలో ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలవగా విశ్వ సముద్ర సంస్థ పనులు దక్కంచుకుంది. వెంటనే ప్రాథమిక సర్వే ఆ సంస్థ చేపట్టింది. నిర్మాణానికి సంబంధించి సరుకుల రవాణా కోసం రోడ్డు మార్గాలు చూసుకోవడం, ప్రాజెక్ట్ స్వరూపంపై సర్వే చేయడం లాంటి పనులు పూర్తి చేసుకుని పనులను కొద్దిరోజుల్లో ప్రారంభించనుంది. దశాబ్దాల కల : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం నియోజకవర్గంలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ఈ ప్రాంతంలో బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ ప్రాంతంలో 10 వేల మత్స్యకార కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే మత్స్యకారుల సంక్షేమంపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. దీంతో బియ్యపుతిప్ప హార్బర్ డిమాండ్ అలాగే ఉండిపోయింది. మత్స్య సంపద, ఆక్వా ఎగుమతుల్లో ఉమ్మడి పశ్చిమకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఇక కొత్తగా ఏర్పడ్డ డెల్టా ప్రాంతంతో కూడిన పశ్చిమగోదావరి జిల్లా నుంచి దేశ, విదేశాలకు భారీగా ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. రొయ్యలు, చేపల సాగు పెరగడంతో ఆక్వా రంగం పుంజుకుంది. ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆక్వా రంగం నుంచి జిల్లాకు వస్తోంది. ఇటు తీర ప్రాంతంలో సముద్ర మత్స్యసంపద ద్వారా కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది. ఏటా నరసాపురం తీరంలో రూ.300 కోట్ల విలువ చేసే మత్స్య ఎగుమతులు సాగుతాయి. హార్బర్ లాంటి మౌలిక వసతులు ఉంటే మరో 40 శాతం ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. వేగంగా పనులు పూర్తిచేసేలా.. బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని దశాబ్దాలుగా మత్స్యకారులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కలను సాకారం చేశారు. హార్బర్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు, సాంకేతిక అనుమతులు వచ్చాయి. మరికొన్ని రోజుల్లో పనులు మొదలు పెడతారు. పనుల్లో తాత్సారం లేకుండా నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేసేలా టెండర్‌దారుడితో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. –ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ -
మంగోలియాలో మేఘా భారీ ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) తాజాగా మంగోలియాలో మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా అత్యాధునిక ముడిచమురు శుద్ధి కేంద్రాన్ని నిర్మించనుంది. డీల్ విలువ సుమారు రూ. 5,400 కోట్లు. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 15 లక్షల టన్నుల ముడిచమురు ఉత్పత్తి చేయనుందని కంపెనీ ప్రకటించింది. మేఘా ఇంజనీరింగ్ ఇప్పటికే మంగోలియాలో రూ.6,500 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులను చేపట్టింది. మంగోలియా రాజధాని ఉలాన్బటోర్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎంఈఐఎల్, మంగోల్ రిఫైనరీ స్టేట్ ఓన్డ్ ఎల్ఎల్సీ మధ్య ఒప్పందం జరిగింది. మంగోలియాలో తొలి గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ రిఫైనరీ నిర్మాణంలో భాగస్వా మ్యం అయినందుకు గర్వంగా ఉందని ఎంఈఐఎల్ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. -
జీ20 సమ్మిట్: మెగా రైల్వే అండ్ షిప్పింగ్ ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ
G20 Summit: న్యూడిల్లీ భారత్ మండపం వేదికగా జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించనున్నారు. ప్రపంచ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన భారతప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, సమావేశంలో పాల్గొనే ఇతర దేశాలు అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) ప్రకటించే అవకాశం ఉందని వైట్ హౌస్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు జోన్ ఫైనర్ తెలిపారు.గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ భాగస్వామ్యంలో భాగంగా బిడెన్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారు. G20 సమ్మిట్‌లో ప్రకటించబడే ప్రపంచ వాణిజ్యానికి సాధ్యమయ్యే గేమ్ ఛేంజర్‌గా దీన్ని అంచనావేస్తున్నారు. ఈ కారిడార్ మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా, యూరప్ దేశాలను కలుపుతుంది. భారతదేశాన్ని మధ్యప్రాచ్యం, చివరికి యూరప్‌తో అనుసంధానించే షిప్పింగ్ కారిడార్ కోసం శనివారం ప్రణాళికలను రూపొందించాలని యోచిస్తున్నారు. మహమ్మారి అనంతర ప్రపంచ క్రమంలో కొత్త సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం ఈ భారీ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ డీల్ తక్కువ ,మధ్య-ఆదాయ దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ కారిడార్ రైల్వేల నెట్వర్క్ ద్వారా మధ్యప్రాచ్యంలోని దేశాలను కలుపుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఓడరేవుల నుండి షిప్పింగ్ లేన్ల ద్వారా కూడా ఈ నెట్వర్క్ భారతదేశానికి అనుసంధానించబడుతుందని అంచనా. కాగా ఈ ఒప్పందంపై చర్చించేందుకు నాలుగు దేశాల ఉన్నత జాతీయ భద్రతా అధికారులు సౌదీ అరేబియాలో సమావేశమైన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. Been a productive morning at the G20 Summit in Delhi. pic.twitter.com/QKSBNjqKTL — Narendra Modi (@narendramodi) September 9, 2023 -
3 మెగా ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఓకే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు మెగా ప్రాజెక్టులకు సంబంధించిన రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ) సమావేశం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. కొత్తగా పలు మెగా ప్రాజెక్టుల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనల గురించి అధికారులు ఈ సమావేశంలో వివరించారు. ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్, ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌లు తమ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయని, వీటి ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. విశాఖలో కాలుష్య రహిత గ్రీన్ పరిశ్రమల ఏర్పాటునకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా పలు మెగా ప్రాజెక్టుల పెట్టుబడులకు సంబంధించి అధికారులు వెల్లడించిన వివరాలివీ.. ► చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ ఫుట్‌వేర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, రెండు దశల్లో రూ.700 కోట్ల పెట్టుబడికి సిద్ధమైన ఆ కంపెనీ ద్వారా 10 వేల మందికి ఉపాధి లభించనుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఇంటలిజెంట్ సెజ్ లిమిటెడ్ వైఎస్సార్ జిల్లా పులివెందులలో కూడా యూనిట్ ఏర్పాటు చేస్తుందని, అక్కడ కూడా రెండు వేల మందికి ఉపాధి లభించనుందని సీఎంకు అధికారులు వివరించారు. ► విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫ్–హైవే టైర్స్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని, మొత్తం రూ.980 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఆ సంస్థ ద్వారా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ► విశాఖ జిల్లా మధురవాడలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ.. ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదన గురించి సమావేశంలో అధికారులు వివరిస్తూ.. రూ.14,634 కోట్లను ఆ సంస్థ పెట్టుబడి పెట్టనుండగా, మొత్తం 24,990 మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. అలాగే స్కిల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనల గురించి కూడా వారు తెలిపారు. ► ఆయా కంపెనీలు కోరుతున్న రాయితీలను, ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహకారాన్ని, అదే సమయంలో సదరు సంస్థల ద్వారా లభ్యమయ్యే ఉపాధి అవకాశాలను అధికారులు సమావేశంలో వివరించారు. ► సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, పరిశ్రమలు వాణిజ్య శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యంతోపాటు వివిధ శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
బీఆర్ఐకి వ్యతిరేకం
చింగ్‌దావ్: చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) తమకు ఆమోదయోగ్యం కాదని భారత్ తేల్చిచెప్పింది. చైనాలోని చింగ్దావ్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశం వేదికగా బీఆర్ఐపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తన నిర్ణయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టారు. ఏ భారీ ప్రాజెక్టు అయినా.. ఈ కూటమి సభ్యదేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే.. మధ్య ఆసియా దేశాలతో స్నేహాన్ని పెంపొందించుకోవడంతోపాటు ఎస్సీవో చేపట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాద ప్రభావానికి అతి దురదృష్టకర ఉదాహరణగా అఫ్గాన్ నిలిచిందని.. అక్కడ శాంతి నెలకొల్పడంలో భారత్ కీలకంగా వ్యవహరిస్తుందని ప్రధాని తెలిపారు. అనంతరం ఎస్సీవో డిక్లరేషన్‌పై భారత్, రష్యా, పాకిస్తాన్, చైనా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్ దేశాలు సంతకం చేశాయి. భారత్ మినహా మిగిలిన దేశాలన్నీ బీఆర్ఐకి అంగీకారం తెలిపాయి. సదస్సు సందర్భంగా భారత్ ప్రధాని, పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ పరస్పరం కరచాలనం చేసుకుని, పలకరించుకున్నారు. అయితే వీరి మధ్య చర్చలేమీ జరగలేదు. రెండ్రోజుల ఎస్సీవో సదస్సు ముగిసిన అనంతరం మోదీ భారత్ బయల్దేరారు. అనుసంధానతే మా లక్ష్యం.. కానీ! ఆదివారం సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. బీఆర్ఐని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఏ మెగా ప్రాజెక్టు అయినా సభ్యదేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతలను గౌరవించాల్సిందే. ఇతర దేశాలతో అనుసంధానత పెంచుకోవడమే మా ప్రాధాన్యత. అయితే అందరినీ కలుపుకుపోయే ప్రాజెక్టులను మేం సంపూర్ణంగా స్వాగతిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ నార్త్–సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ (ఐఎన్ఎస్టీసీ – 7,200 కి.మీ. పాటు వివిధ రకాల రవాణా మార్గాలతో నిర్మించే ఈ ప్రాజెక్టు భారత్, ఇరాన్, అఫ్గానిస్తాన్, అర్మేనియా, అజర్బైజాన్, రష్యా, మధ్య ఆసియా, యూరప్‌లను కలపనుంది)లో భాగస్వామ్యం, ఇరాన్‌లోని ఛబహర్ పోర్టు అభివృద్ధి, అష్గాబట్ (వివిధ రవాణా మార్గాల ఏర్పాటుకు భారత్, ఇరాన్, కజకిస్తాన్, ఒమన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య కుదిరింది) ఒప్పందం తదితర ప్రాజెక్టుల్లో భారత్ చురుకైన పాత్ర పోషించడమే అనుసంధానతపై తమ విధానాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ఉగ్రవాదంపై సమైక్యపోరు: ఉగ్రవాదంపై అన్ని దేశాలు ఐకమత్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు. అఫ్గానిస్తాన్ ఉగ్రవాదానికి బలైపోయి దురదృష్టకర ఉదాహరణగా నిలిచిందన్నారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొల్పేందుకు ఆ దేశాధ్యక్షుడు ఘనీ చేస్తున్న ప్రయత్నాలను మోదీ ప్రశంసించారు. ప్రచ్ఛన్న యుద్ధ ఆలోచనలు మనకొద్దు: జిన్‌పింగ్ ఎస్సీవోలోకి భారత్, పాక్‌లు శాశ్వత సభ్యదేశాలుగా చేరడంతో ఈ కూటమి బలం పెరిగిందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేర్కొన్నారు. బీఆర్ఐ గురించి ప్రస్తావిస్తూ.. ‘అన్ని దేశాలూ ప్రాంతీయ ఆర్థిక సహకారాన్ని మెరుగుపరుచుకునేందుకు పరస్పర సహకారం అనే నినాదంతో పనిచేయాలి. బీఆర్ఐ సహకారాన్ని, మన అభివృద్ధి వ్యూహాలను పెంచుకోవాలి’ అని పేర్కొన్నారు. ‘ఎస్సీవో ఇప్పుడు కొత్త కళను సంతరించుకుంది. సరికొత్త సహకారం అందనుంది. అయితే మనం ప్రచ్ఛన్నయుద్ధ ఆలోచనలను తిరస్కరించాలి. సభ్యదేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణాన్ని, తమ భద్రతకోసం ఇతరుల భద్రతకు విఘాతం కలిగించే చర్యలను మానుకోవాలి. దీర్ఘదృష్టి లేకుండా తీసుకునే నిర్ణయాలను (పరోక్షంగా అమెరికాను ప్రస్తావిస్తూ) మనం సమర్థించకూడదు’ అని జిన్‌పింగ్ అన్నారు. బీఆర్ఐ ఏంటి? ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, యూరప్‌లలోని రోడ్డు, సముద్రమార్గాలను కలుపుతూ బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)ని నిర్మించనున్నట్లు చైనా 2013లో ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే దాదాపు రూ.8.5 లక్షల కోట్లు విడుదల చేసినట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు అంగీకరిస్తూ 80 దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు, ఇప్పటికే బీజింగ్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని చైనా వెల్లడించింది. అయితే పలు దేశాలకు ఈ ప్రాజెక్టుపై అనుమానాలున్నాయి. అంతర్జాతీయంగా చైనా ప్రభావాన్ని పెంచుకునేందుకే ఈ ప్రాజెక్టును ప్రారంభించారని ఆ దేశాలు భావిస్తున్నాయి. అయితే.. బీఆర్ఐలో చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) భాగంగా ఉంది. ఈ సీపీఈసీ కోసం చైనా రూ.3.4 లక్షలకోట్లు వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ గుండా వెళ్తోంది. వివాదాస్పదమైన ఈ ప్రాంతంలో చైనా ప్రాజెక్టును చేపట్టడం తమ సార్వభౌమత్వాన్ని అగౌరవపరచడమేనని భారత్ భావిస్తోంది. -
ప్రగతిపథంలో నడుద్దాం
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు అందరూ సహాయసహకారాలు అందించాలని కలెక్టర్ శ్రీకాంత్ కోరారు. స్థానిక పోలీసు కవాతు మైదానంలో 65వ గణతంత్రదినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఎగుర వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామికంగా జిల్లా ఎంతో అభివృద్ధి సాధిస్తోందన్నారు. నాయుడుపేట, మాంబట్టు ఇండస్ట్రియల్ పార్క్‌లో, కృష్ణపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ద్వారా 21 మెగా ప్రాజెక్ట్‌లను నెలకొల్పనున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్‌ల కోసం రూ.1,22,733 కోట్లు వెచ్చించనున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే జిల్లాలో 1,35,504 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. ఇప్పటి వరకు 17 మెగా ప్రాజెక్ట్‌లను ప్రారంభించి 33,910మందికి ఉపాధి కల్పించినట్లు వివరించారు. జిల్లాలో బొగ్గు ఆధారితంగా రెండు పవర్ ప్రాజెక్ట్‌లు 1870 మెగావాట్ల సామర్థ్యంతో పని చేస్తున్నాయన్నారు. అలాగే 20 వేల మెగావాట్ల సామర్థ్యంతో 16 పవర్‌ప్రాజెక్ట్‌లు త్వరలో ఏర్పాటు కానున్నాయన్నారు. ఏడో విడతలో 5910 ఎకరాలు భూపంపిణీ జిల్లాలో త్వరలో జరగనున్న ఏడో విడత భూపంపిణీలో 4311 మంది లబ్ధిదారులకు 5910 ఎకరాలు పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు ఫిబ్రవరి 10 నుంచి 25వ తేదీ వరకు మూడో విడత రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామన్నారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో నీరు ఉన్నం దున ఈ రబీలో 2,32, 864 హెక్టార్లలో వరి, మినుము, శనగ, పొగాకు, వేరుశనగ తదితర పంటలను సాగుచేశారన్నారు. చెరువుల కింద సాగుచేసే పంటలన్నీ ఎండుముఖం పట్టాయన్నారు. అలాంటి వాటిని కరవు మండలాలుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపామని కలెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. రూ.1305.72 కోట్లు ఆస్తుల పంపిణీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని 1127 పొదుపు సంఘాలు, 996 మంది లబ్ధిదారులకు రూ.1305.72 కోట్లు ఆస్తులను కలెక్టర్ శ్రీకాంత్ పంపిణీ చేశారు. వీటిలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ, మెప్మా, ఎస్సీ కార్పొరేషన్, ఐటీడీఏ, రాజీవ్ విద్యామిషన్, మైనార్టీ కార్పొరేషన్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, చేనేత,జౌళి, ఉద్యానవనశాఖలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారు. -ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక ద్వారా రూ.46.95 కోట్లు జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధికి ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కింద రూ.46.95 కోట్లుతో విద్యార్థులకు వసతిగృహాలను మంజూరు చేసినట్టు కలెక్టర్ వివరించారు. తొలుత కలెక్టర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ, జేసీ లక్ష్మీకాంతం, ట్రైనీ కలెక్టర్ వర్షిణి, ఏజేసీ పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.