తీరంలో మెగా ప్రాజెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

తీరంలో మెగా ప్రాజెక్ట్‌

Published Tue, Oct 3 2023 1:24 AM | Last Updated on Tue, Oct 3 2023 11:19 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ సముద్ర తీరంలో మెగా ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. నరసాపురం తీర ప్రాంతంలో దశాబ్దాల కలగా ఉన్న ఫిషింగ్‌ హార్బర్‌ పనులు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి. హార్బర్‌ నిర్మాణానికి అనువైన స్థలం, పూర్తి అవసరాలు తీర్చేలా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో హార్బర్‌ ప్రాంతాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు ఖరారు చేసి టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. పర్యావరణ అనుమతులతో సహా అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుని రూ.429.43 కోట్లతో హార్బర్‌ నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. ఇప్పటికే హార్బర్‌ నిర్మాణ పనులను విశ్వసముద్ర సంస్థ దక్కించుకుంది.

త్వరితగతిన ప్రక్రియ
నరసాపురం నియోజకవర్గంలోని పీఎం లంక–బియ్యపుతిప్ప గ్రామాల మధ్య స్థలాన్ని ప్రభుత్వ భూమిని గుర్తించి హార్బర్‌కు కేటాయించారు. పనులకు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన కూడా పూర్తి చేశారు. హార్బర్‌ నిర్మాణానికి ఈ ఏడాది మే నెలలో ఏపీ మారిటైమ్‌ బోర్డు టెండర్లు పిలవగా విశ్వ సముద్ర సంస్థ పనులు దక్కంచుకుంది. వెంటనే ప్రాథమిక సర్వే ఆ సంస్థ చేపట్టింది. నిర్మాణానికి సంబంధించి సరుకుల రవాణా కోసం రోడ్డు మార్గాలు చూసుకోవడం, ప్రాజెక్ట్‌ స్వరూపంపై సర్వే చేయడం లాంటి పనులు పూర్తి చేసుకుని పనులను కొద్దిరోజుల్లో ప్రారంభించనుంది.

దశాబ్దాల కల : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం నియోజకవర్గంలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ఈ ప్రాంతంలో బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. ఈ ప్రాంతంలో 10 వేల మత్స్యకార కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే మత్స్యకారుల సంక్షేమంపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. దీంతో బియ్యపుతిప్ప హార్బర్‌ డిమాండ్‌ అలాగే ఉండిపోయింది. మత్స్య సంపద, ఆక్వా ఎగుమతుల్లో ఉమ్మడి పశ్చిమకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఇక కొత్తగా ఏర్పడ్డ డెల్టా ప్రాంతంతో కూడిన పశ్చిమగోదావరి జిల్లా నుంచి దేశ, విదేశాలకు భారీగా ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. రొయ్యలు, చేపల సాగు పెరగడంతో ఆక్వా రంగం పుంజుకుంది. ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆక్వా రంగం నుంచి జిల్లాకు వస్తోంది. ఇటు తీర ప్రాంతంలో సముద్ర మత్స్యసంపద ద్వారా కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది. ఏటా నరసాపురం తీరంలో రూ.300 కోట్ల విలువ చేసే మత్స్య ఎగుమతులు సాగుతాయి. హార్బర్‌ లాంటి మౌలిక వసతులు ఉంటే మరో 40 శాతం ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది.

వేగంగా పనులు పూర్తిచేసేలా..
బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించాలని దశాబ్దాలుగా మత్స్యకారులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కలను సాకారం చేశారు. హార్బర్‌ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు, సాంకేతిక అనుమతులు వచ్చాయి. మరికొన్ని రోజుల్లో పనులు మొదలు పెడతారు. పనుల్లో తాత్సారం లేకుండా నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేసేలా టెండర్‌దారుడితో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

–ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement