నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు అందరూ సహాయసహకారాలు అందించాలని కలెక్టర్ శ్రీకాంత్ కోరారు. స్థానిక పోలీసు కవాతు మైదానంలో 65వ గణతంత్రదినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఎగుర వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామికంగా జిల్లా ఎంతో అభివృద్ధి సాధిస్తోందన్నారు.
నాయుడుపేట, మాంబట్టు ఇండస్ట్రియల్ పార్క్‌లో, కృష్ణపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ద్వారా 21 మెగా ప్రాజెక్ట్‌లను నెలకొల్పనున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్‌ల కోసం రూ.1,22,733 కోట్లు వెచ్చించనున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే జిల్లాలో 1,35,504 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. ఇప్పటి వరకు 17 మెగా ప్రాజెక్ట్‌లను ప్రారంభించి 33,910మందికి ఉపాధి కల్పించినట్లు వివరించారు. జిల్లాలో బొగ్గు ఆధారితంగా రెండు పవర్ ప్రాజెక్ట్‌లు 1870 మెగావాట్ల సామర్థ్యంతో పని చేస్తున్నాయన్నారు. అలాగే 20 వేల మెగావాట్ల సామర్థ్యంతో 16 పవర్‌ప్రాజెక్ట్‌లు త్వరలో ఏర్పాటు కానున్నాయన్నారు.
ఏడో విడతలో 5910 ఎకరాలు
భూపంపిణీ
జిల్లాలో త్వరలో జరగనున్న ఏడో విడత భూపంపిణీలో 4311 మంది లబ్ధిదారులకు 5910 ఎకరాలు పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు ఫిబ్రవరి 10 నుంచి 25వ తేదీ వరకు మూడో విడత రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామన్నారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో నీరు ఉన్నం దున ఈ రబీలో 2,32, 864 హెక్టార్లలో వరి, మినుము, శనగ, పొగాకు, వేరుశనగ తదితర పంటలను సాగుచేశారన్నారు. చెరువుల కింద సాగుచేసే పంటలన్నీ ఎండుముఖం పట్టాయన్నారు. అలాంటి వాటిని కరవు మండలాలుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపామని కలెక్టర్ శ్రీకాంత్ తెలిపారు.
రూ.1305.72 కోట్లు ఆస్తుల పంపిణీ
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని 1127 పొదుపు సంఘాలు, 996 మంది లబ్ధిదారులకు రూ.1305.72 కోట్లు ఆస్తులను కలెక్టర్ శ్రీకాంత్ పంపిణీ చేశారు. వీటిలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ, మెప్మా, ఎస్సీ కార్పొరేషన్, ఐటీడీఏ, రాజీవ్ విద్యామిషన్, మైనార్టీ కార్పొరేషన్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, చేనేత,జౌళి, ఉద్యానవనశాఖలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారు.
-ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక
ద్వారా రూ.46.95 కోట్లు
జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధికి ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కింద రూ.46.95 కోట్లుతో విద్యార్థులకు వసతిగృహాలను మంజూరు చేసినట్టు కలెక్టర్ వివరించారు. తొలుత కలెక్టర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ, జేసీ లక్ష్మీకాంతం, ట్రైనీ కలెక్టర్ వర్షిణి, ఏజేసీ పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రగతిపథంలో నడుద్దాం
Published Mon, Jan 27 2014 3:23 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement