‘ప్రైవేట్‌’ కోసం ప్రజలకు టోపీ | Chandrababu given hand for another central project in the division law | Sakshi
Sakshi News home page

‘ప్రైవేట్‌’ కోసం ప్రజలకు టోపీ

Published Sat, Feb 23 2019 2:21 AM | Last Updated on Sat, Feb 23 2019 9:30 AM

Chandrababu given hand for another central project in the division law - Sakshi

రూ. 5,615 కోట్లు భరిస్తే దాదాపు 32,900 కోట్ల రూపాయల విలువైన భారీ కేంద్ర ప్రాజెక్టు మన రాష్ట్రానికొచ్చేది. భారీగా ఉద్యోగాలొచ్చేవి. అయితే ఈ మొత్తం భరించలేమంటూ చంద్రబాబు తేల్చిచెప్పారు. అదేసమయంలో ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన.. దానికి ఏకంగా రూ. 12,578 కోట్ల అదనపు రాయితీలను ప్రకటించేశారు. రూ.5,615 కోట్లు కట్టే స్థోమత లేదని చెప్పుకున్న ఆయన ప్రైవేటు సంస్థకు రెట్టింపు రాయితీలను ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధమైన చర్యలతో రాష్ట్రం నుంచి మరో భారీ కేంద్ర ప్రాజెక్టు జారిపోయింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కాకినాడలో రూ.32,900 కోట్లతో భారీ క్రాకర్, పెట్రోకెమికల్స్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకు వచ్చినా ముఖ్యమంత్రి ప్రైవేటు సంస్థకే మొగ్గు చూపారు. కోల్‌కతాకు చెందిన హల్దియా పెట్రోకెమికల్స్‌ సంస్థతో వేగంగా ఒప్పందం కుదుర్చుకోవడమే కాకుండా గత నెలలో కాకినాడలో ఆగమేఘాల మీద శంఖుస్థాపన కూడా చేసేశారు. అంతేకాదు పారిశ్రామిక పాలసీ ప్రకారం లభించే రాయితీలు కాకుండా అదనంగా
రూ. 12,578 కోట్ల రాయితీలను ఇస్తూ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (ఎస్‌ఐపీబీ) నిర్ణయం తీసుకుంది. హల్దియాకు వివిధ రూపాల్లో ఇస్తున్న భారీ రాయితీలను చూసి అధికారులకే కళ్లుతిరుగుతున్నాయి.

ప్రభుత్వం సంస్థను కాదని...
రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు హెచ్‌పీసీఎల్‌–గెయిల్‌ కలిసి క్రాకర్, పెట్రో కెమికల్‌ యూనిట్‌ పెట్టడానికి 2017లో జరిగిన సీఐఐ పెట్టుబడుల సదస్సులో ఒ్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం కాకినాడ సెజ్‌లో 2,000 ఎకరాల్లో 1.55 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో యూనిట్‌ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఈ ప్రాజెక్టు లాభదాకతపై ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ స్టడీలో రూ. 5,615 కోట్ల వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ అవసరమవుతుందని, ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని, మిగతా అన్ని యూనిట్లలో ఇదే విధానం అనుసరిస్తున్నారని ఆ కేంద్ర సంస్థలు పేర్కొన్నాయి. లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రూ. 5,615 కోట్లు వీజీఎఫ్‌ కింద ఇచ్చే పరిస్థితిలేదని, ఈ మొత్తాన్ని కూడా కేంద్రమే భరించాలంటూ ముఖ్యమంత్రి పట్టుపడుతూ వచ్చారు. చివరకు ఎన్నికల సమయంలో తామే సొంతంగా ఏర్పాటు చేస్తామంటూ హల్దియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

భారీ రాయితీలు..
కేంద్ర సంస్థకు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ప్రైవేటు సంస్థకు రూ. 12,578 కోట్ల ప్రయోజనాలను ఏ విధంగా కల్పిస్తుందంటూ పలువురు పారిశ్రామిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా 2015–20 పాలసీ ప్రకారం లభించే ఇతర రాయితీలు కూడా ఆ ప్రైవేటు సంస్థకు లభిస్తాయని పేర్కొంటున్నారు. ఇదే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చి ఉంటే రెట్టింపు సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేసేవని, తద్వారా రాష్ట్ర యువతకు ఉద్యోగాలతో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయం వచ్చేదని పలువురు ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా చేయకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక ప్రైవేటు సంస్థకు.. అది కూడా ఎన్నికల ముందు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. హల్దియా సంస్థ ఈ ప్రాజెక్టుకు ఆమోదం కోసం ఎస్‌ఐపీబీ డిసెంబర్‌ 28, డిసెంబర్‌ 29న వరుసగా రెండుసార్లు సమావేశం కావడం, జనవరి 3న జీవో చేయడం ఆ మరుసటి రోజే కాకినాడలో ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారంటే దీని వెనుక ఉన్న శక్తుల గురించి అర్థం చేసుకోవచ్చంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement