సాక్షి, అమరావతి బ్యూరో : ‘రాష్ట్రంలో ఏం జరుగుతోంది.. ఎలా జరుగుతోంది.. ఎవరేం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియాలి’....ఇదీ రాష్ట్ర పోలీసు బాస్‌లకు సీఎం చంద్రబాబు డైరెక్షన్. అందుకు ఆయన జపిస్తున్న మంత్రం.. అమలుచేస్తున్న కుతంత్రం ఫోన్ ట్యాపింగ్. అందుకోసం ఆయన ఇంటెలిజెన్స్ విభాగంలో ఓ ఉన్నతాధికారిని ప్రత్యేకంగా నియమించుకుని పోలీసు ఇంటెలిజెన్స్ వ్యవస్థను అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారు. అసాంఘిక శక్తుల కట్టడికి ఉద్దేశించిన కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థను తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టారాజ్యంగా వాడుకునేందుకు బరితెగిస్తున్నారు.
రాజకీయ ప్రత్యర్థులు, ఉన్నతాధికారులే టార్గెట్
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లజ్జగా అడ్డదారులు తొక్కుతోంది. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులు, ఉన్నతాధికారులతోపాటు సొంత నేతల కదలికలు, ఫోన్ సంభాషణలను ట్యాపింగ్ చేయమని పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దలు విస్పష్టమైన ఆదేశాలిచ్చారు. నిబంధనల ప్రకారం ఫోన్ ట్యాపింగ్‌కు స్పష్టమైన విధివిధానాలున్నాయి. ఉగ్రవాద సంస్థలు, మావోయిస్టు పార్టీలు, ఇతర అసాంఘిక శక్తుల కట్టడికి మాత్రమే పోలీసులు ఆ పనిచేయాలి. ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇచ్చి మరీ అమలుచేయాల్సి ఉందని కేంద్ర టెలిగ్రాఫ్ చట్టం చెబుతోంది. కానీ, ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
ఓటుకు కోట్లు కేసు అనుభవంతో..
పక్కా వ్యవస్థను ఏర్పాటుచేసుకుని మరీ రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ దారుణానికి పాల్పడుతోంది. తీవ్రవాదులు, అసాంఘిక శక్తుల కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కేంద్రంగా కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థ ఉండేది. విభజన అనంతరం మన రాష్ట్రంలో ఆ వ్యవస్థను ఏర్పాటుచేయలేదు. 2015లో తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొనుగోలుకు చంద్రబాబు ప్రయత్నించిన ఉదంతాన్ని ఈ కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థ ద్వారానే కేసీఆర్ ప్రభుత్వం బట్టబయలు చేసింది. దాంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు అమరావతిలో ఈ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో మావోయిస్టుల కట్టడికి కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థను కొనుగోలుకు అనుమతివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం అనుమతితో విదేశాల నుంచి భారీ మొత్తం వెచ్చించి ఈ వ్యవస్థను ఏర్పాటుచేసుకుంది. దీని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏటా అప్‌డేట్ చేయడానికి కూడా పెద్దఎత్తున ఖర్చుచేస్తోంది. మరి ఇంత భారీగా ప్రజాధనాన్ని వెచ్చిస్తూ నిర్వహిస్తున్న కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థను భద్రతాపరమైన అంశాలకు కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుండటం అందరినీ విస్మయపరుస్తోంది.
ట్యాపింగ్‌తో విజిలెన్స్ దాడులు కూడా..
కాగా, ఇటీవల విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో టీడీపీ రాజకీయ ప్రత్యర్థుల వ్యాపార సంస్థలపై విజిలెన్స్ దాడులు నిర్వహించి వేధించడం వెనుక కూడా ఫోన్ ట్యాపింగ్ అంశమే ప్రధాన పాత్ర పోషించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఇలా మరింతగా అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు ప్రభుత్వం బరితెగించనుందని కూడా ఆ వర్గాలు చెబుతున్నాయి.
అస్మదీయ అధికారుల కనుసన్నల్లో..
ఇంటెలిజెన్స్ విభాగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే దుర్వినియోగం చేస్తూ వస్తోంది. మరోవైపు.. ఇంటర్‌సెప్టర్ వ్యవస్థ అజమాయిషీకి ఈ విభాగంలో అస్మదీయ అధికారులను కూడా ఇటీవలే ప్రత్యేకంగా నియమించింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక ఉన్నతాధికారిగా ఉన్న వ్యక్తి ఫక్తు టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలులో ఈయనే క్రియాశీలంగా వ్యవహరించడం తెలిసిందే. తాజాగా రాజకీయ ప్రత్యర్థులు, ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ కోసం మరో అస్మదీయ అధికారిని ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రభుత్వం నియమించింది.
ఈ కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థ కొనుగోలు చేయడంలో ఆయనే క్రియాశీలంగా వ్యవహరించారు. తరువాత ఆయన పలు జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. తాజాగా ఆయన్ని మళ్లీ ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ చేశారు. కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థ పనితీరు, ఫోన్ ట్యాపింగ్‌లపై ఆయనకు పూర్తి అవగాహన ఉన్నందునే ఆయన్ని కీలకస్థానంలో నియమించారు. అంతేకాకుండా.. ఫోన్ ట్యాపింగ్, ఇతర సాంకేతిక అంశాలపై అవగాహన ఉన్న నలుగురు అధికారులను కూడా ఆయన పరిధిలోకి తీసుకువచ్చారు. ఆ బృందం ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే.. ఎంతో సమర్థుడిగా గుర్తింపు పొందిన ఓ కలెక్టర్‌ను హఠాత్తుగా అమరావతికి బదిలీ చేశారు. మరో ఐపీఎస్ అధికారిని లా అండ్ ఆర్డర్ నుంచి అప్రధాన పోస్టుకు మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment