IT policy
-
ఐటీ పాలసీతో కంపెనీల ఏర్పాటు సులభతరం
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ పాలసీతో కంపెనీల స్థాపన మరింత సులభతరం కానుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16, 17 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ ఏర్పాట్లు తదితర అంశాలపై పల్సస్ గ్రూప్ లిమిటెడ్ సీఈవో గేదెల శ్రీనుబాబు నేతృత్వంలో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. వచ్చే ఏడాది కాలంలో విశాఖకి పలు ఐటీ దిగ్గజ కంపెనీలు రానున్నాయని చెప్పారు. విశాఖను బీచ్ ఐటీ డెస్టినీగా అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపె నీలకు తెలియజేసే ఉద్దేశంతోనే జనవరి నుంచి ఏప్రిల్ వరకు పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులతో పాటు గ్లోబల్ టెక్ సదస్సును విశాఖలో నిర్వహిస్తున్నామని వివరించారు. జనవరి 6,7,8 తేదీల్లో విశాఖలో హెల్త్ సమ్మిట్ జరగబోతుందని, అదే నెల 20, 21 తేదీల్లో ఇన్ఫినిటీ ఐటీ సదస్సు జరుగుతుందని చెప్పారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జీ 20 సదస్సు, మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు విశాఖలోనే నిర్వహిస్తున్నామని తెలి పారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు, గ్లోబల్ టెక్ సమ్మిట్ ద్వారా పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు, భారీ పరిశ్రమలు విశాఖకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఒకటి, రెండు నెలల్లో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, అమెజాన్ త్వరలోనే విశాఖలో అడుగుపెట్టబోతుందని, హెచ్‌సీఎల్ విశాఖ, తిరుపతి, కాకినాడ, గుంటూరులో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిందని గుర్తుచేశారు. ఐటీ రంగానికి చెందిన యాంకర్ యూనిట్లు విశాఖకు వస్తే, ఐటీ హబ్‌గా పేరొందిన పలు నగరాల సరసన విశాఖ కూడా నిలుస్తుందన్నారు. విశాఖలో వాతావరణం కూడా ఐటీ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందన్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో కూడా ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర పది రంగాలకు చెందిన పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి విశాఖలో ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు తెలియజేస్తామన్నారు. త్వరలో ఎంఎస్ఎంఈలతోపాటు ఐటీ ఇన్సెంటివ్‌లను కూడా విడుదల చేస్తామని చెప్పారు. గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ గ్లోబల్ టెక్ సమ్మిట్‌కు 1,000 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశముందన్నారు. ఈ సమ్మిట్‌కు సంబంధించి ఇప్పటికే భువనేశ్వర్, ఢిల్లీ, హైదరాబాద్‌లో రోడ్ షోలు నిర్వహించామని చెప్పారు. జీ 20 దేశాలలో కూడా ఈ సదస్సు ప్రాధాన్యత వివరించి ఐటీ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలను సదస్సుకు ఆహ్వానించనున్నామని తెలిపారు. జీవీఎల్‌కు విభజన హామీల మీద చర్చించే ధైర్యం ఉందా.. రాష్ట్ర విభజన హామీల అమలుపై చర్చించే ధైర్యం బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావుకు ఉందా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. కేంద్రం ఇ వ్వాల్సిన ప్రాజెక్ట్‌లు, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై చర్చించేందుకు తాను సిద్ధమని దా నికి జీవీఎల్ సిద్ధమా అని సవాల్ విసిరారు. జీవీ ఎల్‌ను నాయకుడిగా బీజేపీ వాళ్లే గుర్తించడం లేదన్నారు. 2024 నాటికి జీవీఎల్ ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదని మంత్రి వ్యాఖ్యానించారు. -
నిర్మలా సీతామారామన్ ఆగ్రహం, హమ్మయ్యా..సమస్య తీరింది
న్యూఢిల్లీ: కొత్త ఆదాయపు శాఖ (ఐటీ) పోర్టల్‌పై ప్రారంభంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు తొలగిపోయినట్లేనని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన పేర్కొంది. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం గత ఎనిమిది నెలల డేటాను పరిశీలిస్తే.. 2021–22 అసెస్మెంట్ ఇయర్‌కు (2020–21 ఆర్థిక సంవత్సరం) సంబంధించి గత ఎనిమిది నెలల్లో (ఫిబ్రవరి 6వ తేదీ నాటికి) పోర్టల్‌పై దాదాపు 6.17 కోట్ల ఐటీ రిటర్నులు (ఐటీఆర్), 19 లక్షల పన్ను ఆడిట్ రిపోర్టులు (టీఏఆర్)లు దాఖలయ్యాయి. ♦ దాఖలైన 6.17 కోట్ల ఐటీ రిటర్నుల్లో 48 శాతం అంటే దాదాపు 2.97 కోట్లు ఐటీఆర్–1కు సంబంధించినవి. 9 శాతం ఐటీఆర్–2కు (56 లక్షలు) ఉద్ధేశించినవి. 13 శాతం అంటే 81.6 లక్షలు ఐటీఆర్–3కి సంబంధించినవి. 27 శాతం ఐటీఆర్–4 (1.65 కోట్లు)కు సంబంధించినవి. 10.9 లక్షలు ఐటీఆర్–5, 4.84 లక్షలు ఐటీఆర్–6కు, 1.32 లక్షలు ఐటీఆర్–7కు సంబంధించినవి. ఇక ప్రధాన ఆడిట్ రిపోర్ట్ దాఖలు సంఖ్య 19 లక్షలుకాగా, ఇతర ఆడిట్ రిపోర్టులు 1.61 లక్షలకుపైగా ఉన్నాయి. ♦ చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా, ఎటువంటి ఆలస్యం లేకుండా ఐటీఆర్, టీఏఆర్లు ఫైల్ చేయాలని పన్ను చెల్లింపుదారులను, చార్టర్డ్ అకౌంటెంట్లకు సూచిస్తూ, ఆదాయపు పన్ను శాఖ ఈ–మెయిల్స్, ఎస్ఎంఎస్, ట్వీటర్ ద్వారా రిమైండర్లను జారీ చేస్తోంది. ♦కార్పొరేట్లు 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (2021–22 అసెస్మెంట్ ఇయర్) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువును మార్చి 15వ తేదీ వరకూ పొడిగిస్తూ, సీబీడీటీ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆడిట్ నివేదిక, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆడిట్ నివేదికను దాఖలు చేయడానికి గడువును కూడా ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. కార్పొరేట్లకు ఐటీ రిటర్న్ ఫైలింగ్‌కు గడువు పొడిగింపు ఇది మూడవసారి. కోవిడ్ సమస్యలకుతోడు, ఎలక్ట్రానిక్ విధానంలో రిటర్న్ దాఖలులో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో పన్ను చెల్లింపు, తత్సంబంధ ఇతర వర్గాలు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంచుతూ సీబీడీటీ ఈ నిర్ణయం తెలిపింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్ గడువు 2021 డిసెంబర్‌తో పూర్తయిన సంగతి తెలిసిందే. కొత్త పోర్టల్ కథ ఇదీ... కొత్త ఐటీ పోర్టల్ అభివృద్ధికి 2019లో ఇన్ఫోసిస్‌కు కేంద్రం రూ.4,242 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. 2019 జనవరి నుంచి 2021 జూన్ మధ్య రూ.164.5 కోట్లు చెల్లించింది. 2021 జూన్ 7న కొత్త ఆదాయపు పన్ను పోర్టల్ ప్రారంభమైంది. ఇన్ఫోసిస్ అభివృద్ధి చెందిన పోర్టల్ తొలినాళ్లలో తీవ్ర అవాంతరాలు నెలకొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దాఖలు చైసిన రిటర్నులను సరిదిద్దుకోలేకపోవడం (రెక్టిఫికేషన్), రిఫండ్ ఏ దశలో ఉందో తెలుకోలేకపోవడం, 2013–14 అసెస్మెంట్ సంవత్సరానికి ముందు నాటి రిటర్నులను చూసే అవకాశం లేకపోవడం వంటివి వీటిల్లో కొన్ని. తమకు ఎదురవుతున్న సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో వీటిని పరిష్కరించాలని ప్రభుత్వం తొలుత ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులను కోరింది. అయినా అవి పరిష్కారం కాలేదు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ 2021 ఆగస్ట్ 23న ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరీఖ్‌కు సమన్లు ఇచ్చింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారులతో ఇన్ఫోసిస్ సీఈవో ఆధ్వర్యంలోని బృందం సమావేశమైంది. అందులో సమస్యల పట్ల మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. సెప్టెంబర్ 15 నాటికి అన్నింటినీ పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యల కారణంగా ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును పలు దఫాలు పొడిగిస్తూ వచ్చింది. సెప్టెంబర్ 15 నాటికి పూర్తిగా సమస్యలు తొలగిపోనప్పటికీ, క్రమంగా వీటిని ఇన్ఫోసిస్ సరిదిద్దింది. ఫామ్స్.... ఎవరికి ఏమిటి? ఐటీఆర్ ఫామ్ 1 (సహజ్), ఐటీఆర్ ఫామ్ 4 (సుగమ్)లు భారీ సంఖ్యలో ఉండే చిన్న మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు ఉద్దేశించినవి. రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తి, అలాగే జీతం, ఒక ఇంటి ఆస్తి, ఇతర వనరుల (వడ్డీ, మొదలైనవి) నుండి ఆదాయాన్ని పొందే వ్యక్తి సహజ్‌ను దాఖలు చేయవచ్చు. వ్యాపారం, వృత్తి ద్వారా మొత్తం రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు, హెచ్‌యూఎఫ్ (హిందూ అవిభక్త కుటుంబాలు), సంస్థలు ఐటీఆర్–4దాఖలు చేయవచ్చు. వ్యాపారం, వృత్తి నుండి లాభాలుగా పొందే వ్యక్తులు ఐటీఆర్–3ని దాఖలు చేస్తారు. ఎల్ఎల్పీ (లిమిటెడ్ లయబుల్ పార్ట్నర్షిప్), వ్యాపారాలు, ట్రస్టులు ఐటీఆర్ 5,6,7 ఫామ్స్‌ను దాఖలు చేస్తారు. వ్యాపారం, వృత్తి నుండి ఆదాయం కాకుండా ఇతర ఆదాయాన్ని పొందేవారు ఐటీఆర్ ఫామ్ 2ను దాఖలు చేయవచ్చు. జీతం, పెన్షన్ నుండి వచ్చే ఆదాయం. ఇంటి ఆస్తి నుండి వచ్చే ఆదాయం (ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తి నుండి వచ్చే ఆదాయం) పొందేవారు ఈ కోవలోకి వస్తారు. -
2nd ICT Policy: ఐదు అంశాలు.. పన్నెండు రంగాలు
ఐదేళ్ల క్రితం 2016లో ప్రారంభించిన తొలి ఇన్ఫర్మేషన్, కమ్యూనిటీ టెక్నాలజీ (ఐసీటీ) పాలసీ లక్ష్యాలకు కొనసాగింపుగా.. రాష్ట్ర ప్రభుత్వం రెండో ఐసీటీ పాలసీని గురువారం ప్రకటించింది. 2021 నుంచి 2026 వరకు అమల్లో ఉండే ఈ పాలసీలో 12 రంగాలు, ఐదు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపింది. – సాక్షి, హైదరాబాద్ 5 అంశాలివీ.. ►పౌరులను డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, డిజిటల్ సేవలు, ఆవిష్కరణలు, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఐసీటీ రంగాన్ని అభివృద్ధి చేయడం, కోవిడ్ సంక్షోభ పరిస్థితి ఆధారంగా ఐటీ పరిష్కారాలు కనుగొని అభివృద్ధి బాటలో సాగడం లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించినట్టు వెల్లడించింది. 12 రంగాలివీ.. ►ఐటీ ఉత్పత్తులు, ఐటీ ఆధారిత ఇతర ఉత్ప త్తులు, ఎలక్ట్రానిక్స్, కొత్త ఆవిష్కరణలు, నైపుణ్య శిక్షణ, కాగిత రహిత పాలన, డిజి టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ అక్షరాస్యత, ఎమర్జింగ్ టెక్నాలజీ, క్లౌడ్ పాలసీ, టెక్నా లజీ వినియోగాన్ని పెంచేలా ఐటీ శాఖను బలోపేతం చేయడం, పట్టణ ప్రాంతాలకు అవసరమైన టెక్నాలజీ రూపకల్పన. రెండో ఐసీటీ పాలసీ విశేషాలు.. ►ఐటీ రంగం ద్వారా 2026 నాటికి 10 లక్షల ఉద్యోగాల కల్పన, రూ.3 లక్షల కోట్ల వార్షిక ఎగుమతుల లక్ష్యం. ►ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మొబైల్స్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలు, స్టోరేజీ ఎనర్జీ వ్యవస్థలు, ఐటీ హార్డ్‌వేర్, టెలికాం ఉపకరణాలు, సెమీకండక్టర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, మెడికల్ డివైజెస్, ఆటోమోటివ్, రక్షణ రంగ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీకి ప్రోత్సాహం. ►8వేలకు పైగా స్టార్టప్‌ల ద్వారా రూ.10 వేలకోట్ల మేర పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యం. రూ.1,300 కోట్లతో స్టార్టప్ ఫండ్, రూ.100 కోట్లతో క్షేత్రస్థాయి ఆవిష్కరణల నిధి ఏర్పాటు. ►స్థానికులకు ఐటీ నైపుణ్యాల్లో శిక్షణ. కనీసం 80శాతం మందికి నైపుణ్య శిక్షణ. ఏటా 50వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు. ►పౌరసేవలను వంద శాతం ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తేవడం. వెయ్యికి పైగా ప్రభుత్వ సేవలను మొబైల్ ఫోన్ల ద్వారా అందజేయడం. ►రాష్ట్రవ్యాప్తంగా 5జీ సేవలు, టీఫైబర్ ద్వారా 2026 నాటికి ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వంద శాతం ఇంటర్నెట్ సౌకర్యం. ►ఐదు ప్రాంతీయ కేంద్రాల ద్వారా జిల్లాల్లో ఆవిష్కరణల వాతావరణం కల్పించడం. ►ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కనీసం 5శాతం ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతులు సాధించడం. -
ఏటా మూడు లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు.. 10 లక్షల ఉద్యోగాలు
సాధారణ స్మార్ట్‌ఫోన్ యాప్‌ల వినియోగం మొదలుకుని, అత్యాధునిక సాంకేతికత దాకా రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ జీవితాన్ని అందిస్తాం. ప్రజల రోజువారీ జీవితానికి తోడ్పడేలా మెరుగైన పౌర సేవలను కాగిత రహిత విధానంలో అందిస్తాం. ప్రతి ఇంట్లో ఒకరిని, స్వయం సహాయక సంఘాల మహిళలను డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, మారుమూల ప్రాంతాల ప్రజానీకానికి డిజిటల్ సేవలు అందించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ‘డిజిటల్ తెలంగాణ సెంటర్లు’ఏర్పాటు చేస్తాం. – మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో రూ.3లక్షల కోట్ల వార్షిక ఎగుమతులు సాధించాలని.. పది లక్షల మందికి ఉద్యోగాల కల్పి ంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావు ప్రకటించారు. డిజి టల్ ప్రపంచానికి పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని అన్ని సామాజిక నేపథ్యాల ప్రజలు సాధికారత సాధించేలా రెండో ‘ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)’పాలసీకి రూపకల్పన చేశామని తెలిపారు. 2021 నుంచి 2026 వరకు అమలు చేసే ఈ రెండో ఐసీటీ పాలసీని గురువారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉత్పాదకత, ఇంజనీరింగ్, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన ద్వారా దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని ప్రకటించారు. స్టార్టప్‌లు, పెట్టుబడిదారులకు తెలంగాణను మొదటి గమ్యస్థానంగా మార్చుతామని.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్‌లను స్థాపించడం ద్వారా ఐటీ రంగంలో కొత్తగా 50వేల ఉద్యోగాలు సృష్టిస్తామని తెలిపారు. చదవండి: గృహ రుణ గ్రహీతలకు ఎస్బీఐ బొనాంజా కొత్త ఐటీ పాలసీ లక్ష్యాలెన్నో.. డ్రైవింగ్ టెస్ట్ వంటి సేవలు మినహా దాదాపు ప్రభుత్వ సేవలన్నింటినీ.. వెబ్, మొబైల్ యాప్‌ల ద్వారా అందుబాటులోకి తెస్తామని, కాగితరహిత పాలన అందిస్తామని కేటీఆర్ చెప్పారు. ‘‘కొత్త టెక్నాలజీల యుగంలో ఐటీ పట్టభద్రులు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా కృత్రిమ మేథస్సు (ఏఐ) సాంకేతికతపై ప్రాథమిక శిక్షణ ఇస్తాం. రూ.13 వందల కోట్లతో స్టార్టప్ ఫండ్‌తోపాటు ప్రభుత్వ పెట్టుబడుల కమిటీ ఏర్పాటు చేసి 8వేల స్టార్టప్‌లకు చేయూతనిస్తాం. దేశంలోనే తెలంగాణను స్టార్టప్‌లకు గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం. ఎలక్ట్రానిక్ వాహనాలు, బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, వైద్య ఉపకరణాలు, ఆటోమొబైల్ రం గాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తాం. ఎలక్టానిక్స్ రంగం ద్వారా రూ.75వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు సాధిస్తాం. పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ‘తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీ కారిడార్’ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీల వినియోగాన్ని ప్రోత్సహిస్తాం. డేటా స్టాక్, డేటా ఎనాలసిస్ వింగ్ ఏర్పాటు చేస్తాం. స్థానికంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరి ష్కారాల ద్వారా రాష్ట్ర, దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) అం డగా నిలుస్తాం. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ భాగస్వామ్యంతో ‘స్మార్ట్ సిటీస్ వింగ్’ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 40 ‘స్మార్ట్ రీజియన్లు’సృష్టిస్తాం..’’అని ప్రకటించారు. చదవండి: ఏకతాటిపైకి టెల్కోలు ప్రతికూల పరిస్థితుల్లోనూ వృద్ధి కరోనా సంక్షోభ సమయంలోనూ తెలంగాణ ఐటీ రంగం అద్వితీయంగా పురోగమించిందని నాస్కామ్ చైర్పర్సన్ రేఖా మీనన్ అభినందించారు. రెండో ఐటీ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో మీనన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పాలసీలతో పురో గామి విధానాలు అవలంభిస్తోందని ప్రశంసిం చారు. ఇక తెలంగాణ ఐటీ రంగంతో అమెరికాకు గాఢమైన బంధముందని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రైఫ్మన్ అన్నారు. హైదరాబాద్‌లో 48 అమెరికా ఐటీ సం స్థల కార్యకలాపాల ద్వారా 1.10 లక్షల మంది ఉద్యోగాలు పొందారని చెప్పారు. కార్యక్రమంలో సైయంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, రాజన్న(టీసీఎస్), ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ రమాదేవి లంక, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్లు పాల్గొన్నారు. దేశంలోనే వేగంగా పురోగమిస్తున్నాం కోవిడ్‌తో జాతీయ వృద్ధిరేటు 1.26 శాతానికి పడిపోయినా.. రాష్ట్రం 2020–21లో రూ.9.78 లక్షల జీఎస్డీపీ, 8%వృద్ధిరేటు సాధించిందని, తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉందని కేటీఆర్ అన్నారు. రూ.1.45 లక్షల కోట్ల ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతులు సాధించామని, 2016 నాటి తొలి ఐసీటీ పాలసీ లక్ష్యాలను అం దుకున్నామని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రముఖ పెట్టుబడిదారులను ఆకర్షించామని, 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు సాధించామని తెలిపారు. ఇం దులో కేవలం ఎలక్ట్రానిక్స్ రంగంలోనే 1.5 లక్షల ఉద్యోగాలు సృష్టించడంతోపాటు దేశంలోని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో 7% వాటా సాధించామన్నారు. టీహబ్, వీహబ్, టీఎస్ఐసీ, రీచ్, టాస్క్, టీవర్క్స్ వంటివాటితో ఆవిష్కరణల వాతావరణాన్ని సృష్టించామని, 15 వందలకుపైగా స్టార్టప్‌లకు రూ.1,800 కోట్ల మేర నిధులు అందా యని తెలిపారు. టాస్క్‌ద్వారా 3 లక్షల మందికి నైపుణ్య శిక్షణ, ఆన్లైన్లో 500 రకాల ప్రభుత్వ సేవలు, టీ యాప్ ఫోలియో ద్వారా 250 ప్రభు త్వ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఓపెన్‌డేటా, బ్లాక్ చెయిన్, డేటా అనలిటిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ అడాప్షన్ వంటి పాలసీలు, 3వేలకు పైగా పబ్లిక్ వైఫై పాయింట్లు, ఐదు లక్షల మందికి డిజిటల్ అక్షరాస్యత వంటి లక్ష్యాలను ఐదేళ్లలో సాధించామన్నారు. -
తెలంగాణ నూతన ఐటి పాలసీ 2.0 ఆవిష్కరణ
-
ఏపీ: ఐటీకి ప్రోత్సాహం.. ఉద్యోగాలకు ఊతం
సాక్షి, అమరావతి: కోవిడ్–19తో ఐటీ రంగంలో మారుతున్న పరిణామాలను అందిపుచ్చుకుంటూ ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు పెద్ద పీట వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఐటీ పాలసీ 20 21–24ను విడుదల చేసింది. ఇంటి నుంచే పనిచేసే విధానం (వర్క్ ఫ్రమ్ హోమ్) పెరుగుతున్న నేప థ్యంలో సొంతంగా ఐటీ ప్రాజెక్టులు చేసుకునే గిగ్ వర్కర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఐటీ పాలసీలో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏ ర్పాటు చేసే ఐటీ కంపెనీలకు ప్రత్యేక రాయితీలను ప్రవేశపెట్టారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఐటీ పాలసీ విధివిధానాలను రాష్ట్ర ఐటీ శాఖ ము ఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి శుక్రవారం విడుదల చే శారు. పాలసీలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ►రాష్ట్రంలో ఐటీ క్యాంపస్‌లు, ఐటీ పార్కులు నిర్మించే సంస్థలకు ఉద్యోగ కల్పన ఆధారంగా పారదర్శకంగా భూములు కేటాయించే విధంగా పాలసీలో విధివిధానాలు రూపొందించారు. ►రాష్ట్రంలో ఏదైనా సంస్థ ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలంటే ఆ సంస్థ కనీసం 10,000 మంది ఉద్యోగులను కలిగి ఉండటంతో పాటు వరుసగా మూడేళ్లపాటు రూ.500 కోట్లకు పైగా వ్యాపారాన్ని చేస్తూ ఉండాలి. అదే విదేశీ కంపెనీ అయితే ఫార్చ్యున్ 1,000 కంపెనీ అయ్యి ఉండాలి. ►ఐటీ పార్కుల్లో కనీసం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అభివృద్ధి చేసే సంస్థలకే అనుమతిస్తారు. అలాగే ఐటీ పార్కులు నిర్మించే సంస్థలు గత మూడేళ్లుగా రూ.25 కోట్లకు పైగా వ్యాపారాన్ని చేస్తూ ఉండాలి. భూమి కేటాయించిన ఆరేళ్లలోపు ప్రతి ఎకరానికి కనీసం 500 ఉద్యోగాలు కల్పించాలి. ►కనీసం 10 ఎకరాలు కేటాయించి ఉంటే.. వారు అభివృద్ధి చేసిన భూమిలో 30 శాతం ఇతర అవసరాల వినియోగానికి అనుమతిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చి, మూడేళ్ల పాటు అంటే 2024 మార్చి 31 వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. ►ఐటీ రంగంలో మహిళలు, వెనుకబడిన సామాజిక వర్గాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ఐటీ పాలసీలో ప్రత్యేక రాయితీలను ప్రకటించారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీలు కల్పించే ప్రతి స్థానిక ఉద్యోగికి వార్షిక ఆదాయంలో 15 శాతం రాయితీగా అందిస్తారు. ►ఉన్నత స్థాయి ఉద్యోగం కల్పిస్తే గరిష్టంగా రూ.1,50,000.. మధ్య స్థాయి ఉద్యోగానికి రూ.1,12,500.. ప్రవేశ స్థాయి ఉద్యోగానికి రూ.75,000 వరకు చెల్లిస్తారు. మిగతా ఐటీ కంపెనీలకు ఈ రాయితీ 10 శాతంగా ఉంది. ►మిగిలిన ఐటీ కంపెనీల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం కల్పిస్తే గరిష్టంగా రూ.1,00,000.. మధ్య స్థాయి ఉద్యోగానికి రూ.75,000.. ప్రవేశ స్థాయి ఉద్యోగానికి రూ.50,000 వరకు చెల్లిస్తారు. ఈ రాయితీని మూడు విడతలుగా చెల్లిస్తారు. దీంతో పాటు పారిశ్రామిక విద్యుత్ రాయితీ, ప్రతి ఉద్యోగికి రవాణా సబ్సిడీగా నెలకు రూ.500 చొప్పున రెండేళ్ల పాటు ఇస్తారు. ►ఈ విధంగా ఒక సంస్థకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. స్థానిక ఉద్యోగికి అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం ఉద్యోగికి రూ.10,000 ఒకేసారి చెల్లిస్తారు. స్టార్టప్ కంపెనీలను అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తారు. ఒక కంపెనీ క్వాలిటీ సర్టిఫికేషన్ తీసుకోవడానికి చేసే వ్యయంలో 50 శాతం చొప్పున గరిష్టంగా రూ.5 లక్షల వరకు రాయితీ అందిస్తారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’కు ప్రత్యేక రాయితీలు ►కోవిడ్ తర్వాత పెరుగుతున్న ఇంటి వద్ద నుంచే పనిచేసే (వర్క్ ఫ్రమ్ హోమ్) విధానం, ఇంటి దగ్గర నుంచే సొంతంగా ప్రాజెక్టులు చేపట్టే (గిగ్ ఎకనామీ) అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పాలసీలో ప్రత్యేక రాయితీలు ప్రవేశపెట్టారు. ►రాష్ట్రంలో నుంచి పని చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చుకోవడానికి రూ.20,000 అందిస్తారు. సొంతంగా ఐటీ కాంట్రాక్టులు తీసుకొని పనిచేసే గిగ్ వర్కర్లు కొనుగోలు చేసే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల వ్యయంలో 50 శాతం లేదా గరిష్టంగా రూ.20,000 రాయితీ అందిస్తారు. గిగ్ వర్క్రర్ కనీస వార్షిక వ్యాపార పరిమాణం రూ.3,00,000 దాటితేనే ఈ రాయితీ లభిస్తుంది. ►వ్యయాన్ని భారీగా తగ్గించే విధంగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో పని చేసుకునే విధంగా మూడు ప్రాంతాల్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేయడంతో పాటు విశాఖలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. ►వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పెరుగుతుండటంతో ఈ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా పంచాయతీల్లో డిజిటల్ లైబ్రరీలు, కోవర్కింగ్ ప్లేస్‌లను అభివృద్ధి చేయనున్నారు. ►రాష్ట్రంలో ఉన్న స్థానిక ఐటీ కంపెనీలకు ఊతమిచ్చే విధంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక కంపెనీల నుంచే ఐటీ కొనుగోళ్లు చేయాలన్న నిబంధన ప్రవేశపెట్టారు. -
ఐటీ ఇన్ఫ్రాకు అందలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రంగంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా భారీ మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తూ 2021–24 ఐటీ పాలసీని రూపొందించింది. వ్యయాన్ని భారీగా తగ్గించే విధంగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో పని చేసుకునే విధంగా మూడు ప్రాంతాల్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేయడంతో పాటు విశాఖలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ పార్కులో ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఇంక్యుబేషన్ సెంటర్లు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ల్యాబ్స్, కో–వర్కింగ్ స్పేస్, స్టేట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పెరుగుతుండటంతో ఈ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా పంచాయతీల్లో డిజిటల్ లైబ్రరీలు, కోవర్కింగ్ ప్లేస్‌లను అభివృద్ధి చేయనున్నారు. కొత్తగా అభివృద్ధి చేసే కాన్సెప్ట్ సిటీలు, ఐటీ పార్కులకు అనుమతులు త్వరితగతిన ఇచ్చే విధంగా పలు చర్యలు తీసుకున్నారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక రాయితీలు ఐటీ రంగంలో మహిళలు, వెనుకబడిన సామాజిక వర్గాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ఐటీ పాలసీలో ప్రత్యేక రాయితీలను ప్రకటించారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీలు కల్పించే ప్రతి స్థానిక ఉద్యోగికి వార్షిక ఆదాయంలో 15 శాతం రాయితీగా అందిస్తారు. హైఎండ్ జాబ్ కల్పిస్తే గరిష్టంగా రూ.1,50,000, మిడ్ లెవల్ జాబ్‌కు రూ.1,12,500, ఎంట్రీ లెవల్ జాబ్‌కు రూ.75,000 వరకు చెల్లిస్తారు. మిగతా ఐటీ కంపెనీలకు ఈ రాయితీ 10 శాతంగా ఉంది. హైఎండ్ జాబ్ కల్పిస్తే గరిష్టంగా రూ.1,00,000, మిడ్ లెవల్ జాబ్‌కు రూ.75,000, ఎంట్రీలెవల్ జాబ్‌కు రూ.50,000 వరకు చెల్లిస్తారు. ఈ రాయితీని మూడు విడతలుగా చెల్లిస్తారు. దీంతో పాటు పారిశ్రామిక విద్యుత్ రాయితీ, ప్రతి ఉద్యోగికి నెలకు రూ.500 చొప్పు రెండేళ్ల పాటు గరిష్టంగా ఒక సంస్థకు రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. స్థానిక ఉద్యోగికి అవసరమైన నైపుణ్య శిక్షణకు ఉద్యోగికి రూ.10,000 ఒకసారి చెల్లిస్తారు. స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్ నిధిని ఏర్పాటు చేస్తారు. క్వాలిటీ సర్టిఫికేషన్ కోసం అయ్యే వ్యయంలో 50 శాతం చొప్పున గరిష్టంగా ఒక సంస్థకు రూ.5 లక్షల వరకు రాయితీ అందిస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రత్యేక రాయితీలు కోవిడ్ తర్వాత పెరుగుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్, గిగ్ ఎకనామీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పాలసీలో ప్రత్యేక రాయితీలు ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో నుంచి పని చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు అవసరమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చుకోవడానికి వన్‌టైమ్ ఇన్సెంటివ్ కింద రూ.20,000 అందిస్తారు. అదే విధంగా సొంతంగా ఐటీ కాంట్రాక్టులు తీసుకొని పనిచేసే గిగ్ వర్కర్లకు హార్డ్‌వేర్ కొనుగోళ్లలో 50 శాతం.. గరిష్టంగా రూ.20,000 వరకు రాయితీ అందిస్తారు. గిగ్ వర్క్ర్ కనీస వార్షిక టర్నోవర్ రూ.3,00,000 ఉన్న వారికి మాత్రమే ఈ రాయితీ లభిస్తుందన్న నిబంధన విధించారు. భూ కేటాయింపుల్లో పారదర్శకత ► ఐటీ కంపెనీలు, పార్కులకు పూర్తి పారదర్శక విధానంలో భూ కేటాయింపులు జరిపే విధంగా స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించారు. కనీసం రూ.500 కోట్ల పెట్టుబడి.. 5,000 ఎంట్రీ లెవిల్ ఉద్యోగాలు కల్పించే మెగా ప్రాజెక్టలకు ప్రత్యేక రాయితీలను అందిస్తారు. ► కనీసం 250 మంది ఉద్యోగులు ఉండి, గత మూడేళ్లుగా రూ.15 కోట్ల టర్నోవర్ నమోదు చేస్తున్న సంస్థలకు మాత్రమే భూ కేటాయింపులు చేస్తారు. భూమి కేటాయించిన మూడేళ్లలోగా ఎకరానికి కనీసం 500 ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. ► ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలంటే ఆ కంపెనీ అంతర్జాతీయంగా 10,000 మంది ఉద్యోగులను కలిగి ఉండాలి. అలాగే వరుసగా మూడేళ్లపాటు రూ.500 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలి. అదే విదేశీ కంపెనీ అయితే ఫార్చున్ 1,000 కంపెనీ లేదా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.350 కోట్లు అయ్యి ఉండాలి. ► కనీసం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన సంస్థలకు మాత్రమే ఐటీ పార్కుల నిర్మాణానికి అనుమతిస్తారు. గడిచిన మూడేళ్లుగా రూ.25 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలి. ఐటీ పార్కుకు భూమి కేటాయించిన 6 ఏళ్లలోపు ప్రతి ఎకరానికి 500 మందికి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు కల్పించాలి. ► కనీసం 10 ఎకరాలు కేటాయించి ఉంటే.. వారు అభివృద్ధి చేసిన భూమిలో 30 శాతం ఇతర అవసరాలకు వినియోగానికి అనుమతిస్తారు. బుధవారం క్యాబినెట్ ఆమోదం తెలిపిన ఈ పాలసీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చి మూడేళ్ల పాటు అంటే 2024 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. -
ఐటీ పాలసీ లక్ష్యం ఇదే కావాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. మన పిల్లలకు హై ఎండ్ స్కిల్స్ నేర్పించే కంపెనీలకు, సంస్థలకు పాలసీలో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారికి మంచి ప్రోత్సాహకాలను ఇవ్వాలని ఆదేశించారు. దీని వల్ల పిల్లల్లో అంతర్జాతీయ స్థాయిలో పనిలో అనుభవం, నైపుణ్యాలు పెరుగుతాయన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీపడే పరిస్థితి ఉంటుందని, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఏపీలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది ఇన్సెంటివ్‌లు చెల్లిస్తామని ప్రకటించారు. వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్, డిజిటల్ లైబ్రరీలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పనకు విశాఖపట్నం ప్రధాన కేంద్రం అవుతుందన్నారు. ప్రభుత్వం కల్పించనున్న మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. విశాఖ స్థాయిని మరింతగా పెంచుతాయని, భవిష్యత్‌లో ఐటీ రంగానికి మంచి కేంద్రంగా మారుతుందన్నారు. కాలక్రమేణా ఈ అంశాలన్నీ సానుకూలంగా మారి కంపెనీలకు ఈ నగరం ఒక ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందని తెలిపారు. నాణ్యమైన విద్యకు విశాఖను కేంద్రంగా చేయడం ద్వారా వల్ల మంచి ప్రతిభావంతమైన మానవ వనరులు లభిస్తాయని అన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, అధికారులు హై ఎండ్ ఐటీ స్కిల్స్ యూనివర్సిటీ – ఐటీ రంగంలో అత్యుత్తమ యూనివర్సిటీని విశాఖపట్నం తీసుకురావాలి. ఐటీ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ లెర్నింగ్‌కు ఈ యూనివర్శిటీ డెస్టినేషన్‌గా మారాలి. – ఏపీలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది ఇన్సెంటివ్‌లు చెల్లిస్తాం. కనీసం ఏడాది పాటు ఒక ఉద్యోగి స్థిరంగా అదే కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది. మొదటి ఏడాది పూర్తవగానే ఆ కంపెనీకి ఇన్సెంటివ్ చెల్లింపులు ప్రారంభం అవుతాయి. ఈ నిబంధన వల్ల మన పిల్లలకు ఏడాదిపాటు స్థిరమైన ఉపాధి లభిస్తుంది. అంతేకాక నిర్ణీత కాలం పని వల్ల నైపుణ్యం కూడా మెరుగు పడుతుంది. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలు – వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలి. గ్రామాలకు మంచి సామర్థ్యం ఉన్న ఇంటర్నెట్ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడి నుంచే పని చేసుకునే సదుపాయం ఉంటుంది. – డిసెంబర్ నాటికి సుమారు 4 వేల గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చేలా అ«ధికారులు ముందడుగు వేస్తున్నారు. ఈ చర్యలతో గ్రామాల నుంచే వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ మరింత బలోపేతం అవుతుంది. అన్ని గ్రామ పంచాయతీల్లో రెండేళ్లలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి. – విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలలో ఐటీ కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలి. ఇందుకు అవసరమైన భూములను గుర్తించాలి. – కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నిర్మిస్తున్న వైఎస్సార్ ఈఎంసీ ప్రగతి గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. అక్టోబర్‌లో ప్రారంభోత్సవం చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. – ఈ సమీక్షలో పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్(ఈఎంసీ) సీఈఓ ఎం.నందకిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఐటీ పాలసీపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐటీ పాలసీపై బుధవారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుపై ఆయన అధికారులతో చర్చించారు. మంచి ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశమని, హైఎండ్ స్కిల్స్ నేర్పించే కంపెనీలకు పాలసీలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాలకు మంచి సామర్థ్యం ఉన్న ఇంటర్నెట్ను తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. డిసెంబర్‌లోపు సుమారు 4వేల గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అ«ధికారులను ఆదేశించారు. ఐటీ రంగంలో అత్యుత్తమ యూనివర్శిటీని విశాఖకు తీసుకురావాలని, అత్యాధునిక టెక్నాలజీ లెర్నింగ్‌కు ఈ వర్శిటీ డెస్టినేషన్ పాయింట్‌గా మారాలని సీఎం జగన్ ఆదేశించారు. భవిష్యత్‌లో విశాఖ నగరం ఐటీకి ప్రధాన కేంద్రంగా మారనుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి, అనంతపురం పట్టణాలలో కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేయాలని, అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసి, అవసరమైన భూములను గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది ఇన్సెంటివ్‌లు చెల్లిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్‌ను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశానికి ఐటీ, పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్(ఈఎంసీ) సీఈఓ ఎం.నందకిషోర్, తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
త్వరలో ఐటీకి కొత్త పాలసీ
సాక్షి, హైదరాబాద్: త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ప్రస్తుతమున్న పాలసీ త్వరలో ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కొత్త ఐటీ పాలసీ తెస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రకటించిన ఐటీ పాలసీతో ఐటీ పరిశ్రమలో పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగం పనితీరుపై మంత్రి కేటీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆరేళ్లుగా ఐటీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు ‘2021–26’మధ్య ఐదేళ్ల పాటు అమల్లో ఉండే నూతన ఐటీ పాలసీ ఆవిష్కరణకు సంబంధించిన అంశాలపైనా సమీక్షించారు. పౌరుడే కేంద్రంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని, కొత్తగా సాంకేతిక అభివృద్ధిని ఆలంబనగా చేసుకుని సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల ద్వారా అందే పౌర సేవలను రాబోయే తరానికి చేరువయ్యేలా ఐటీ శాఖ దృష్టి పెట్టాలన్నారు. భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులోకి రానున్న టీ ఫైబర్ నెట్వర్క్ ద్వారా అందించాల్సిన కార్యక్రమాలపైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, దీని ద్వారా తమ గడప నుంచే ప్రభుత్వ సేవలు పొందేలా చూడాలని సూచించారు. చదవండి: (ఆ ప్రాజెక్టులకు నిధులు ఆగొద్దు: కేసీఆర్) ఆవిష్కరణల వాతావరణం బలోపేతం.. ఆరేళ్లుగా రాష్ట్రంలో బలమైన ఆవిష్కరణల వాతావరణం (ఇన్నోవేషన్ ఎకో సిస్టం) ఏర్పడిందని, దీనిని మరింత బలోపేతం చేస్తూ గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాల్సిన అవసరముందని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా విద్యార్థులను ఇన్నోవేటర్లుగా మార్చేందుకు అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. గత ఆరేళ్లుగా నూతన పెట్టుబడులను రాష్ట్రానికి ప్రత్యేకించి హైదరాబాద్‌కు రప్పించడం ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పించామని పేర్కొన్నారు. ఇప్పటికే స్థానిక యువతకు ఎక్కువ మొత్తంలో ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిందన్నారు. స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగాలు దక్కేలా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. -
ఐటీ నైపుణ్యాల కోసం యూనివర్సిటీ
సాక్షి, అమరావతి: ద్వితీయ శ్రేణి (టైర్–2) నగరాల్లో నిపుణులైన ఐటీ ప్రొఫెషనల్స్ కొరత సహజమని, దాన్ని తీర్చడానికి విశాఖపట్నంలో ఐటీ హై ఎండ్ స్కిల్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. టైర్–1 నగరాల్లో అయితే నిపుణుల కొరత అనే అంశం ఉత్పన్నం కాదు కాబట్టి సమస్యలుండవని, టైర్–2 నగరాల్లో వీరిని తయారు చెయ్యడానికి శిక్షణ అవసరమని ఆయన స్పష్టంచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రొబోటిక్స్ వంటి అత్యాధునిక అంశాల్లో అక్కడ శిక్షణ ఇవ్వాలని చెప్పారాయన. ఐటీ విధానంపై ముఖ్యమంత్రి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హై ఎండ్ స్కిల్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ప్రాంతంలోనే ప్రభుత్వ ఐటీ విభాగం కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రస్తుతం ప్రభుత్వం ఏటా రూ.3,000 కోట్ల విలువైన ఐటీ సేవలను వినియోగించుకుంటోంది. ఇదంతా ఐటీ విభాగం ద్వారానే జరుగుతోంది. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఈ స్కిల్డ్ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో నైపుణ్యాన్ని మరింత పెంచడానికి వీలవుతుంది. ప్రభుత్వ ఐటీ విభాగం ఉండటం వల్ల విద్యార్థులకు అప్రెంటిస్ షిప్ సమస్య ఉండదు. ఉపాధి అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి’’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తద్వారా అత్యుత్తమమైన మానవ వనరులను తయారు చేసుకునే అవకాశం వస్తుందన్నారు. వీలైనంత త్వరగా ఈ యూనివర్సిటీ పనులు ప్రారంభించాలన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. – స్వదేశీ, విదేశీ ఐటీ దిగ్గజ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలి. – ఆయా కంపెనీలు ఇక్కడి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా, వారిలో నైపుణ్యాన్ని పెంచేలా చూడాలి. – తద్వారా ఐటీ కంపెనీలకు తగినట్టుగా మానవ వనరులు సిద్ధం కావాలి. – ఏటా కనీసం రెండు వేల మందికి విశాఖ సంస్థలో శిక్షణ ఇవ్వాలి. – అక్కడ శిక్షణ పొందడం ప్రతిష్టాత్మకంగా భావించాలి. ఆ సర్టిఫికెట్లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి. – ఐటీలో డిమాండ్‌కు అనుగుణంగా డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులు కూడా ప్రారంభించాలి. – సమీక్షలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యంతోపాటు ఐటీ, పరిశ్రమల శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
మూడు సంస్థలకు కొత్త సీఈవోలు
సాక్షి, అమరావతి: వచ్చే నెలలో కొత్త ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీ రానుండటంతో అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే విధంగా ఏపీ ప్రభుత్వం పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రంగానికి చెందిన మూడు సంస్థలు ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ (అపిట), ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ (ఐఐడీటీ)లకు ఆయా రంగాల్లో విశేష అనుభవం ఉన్న వ్యక్తులను త్వరలో సీఈవోలుగా నియమించనుంది. ఒక్కొక్క సంస్థకు సంబంధించి ఇప్పటికే 8 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని, వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సీఈవోను ఎంపిక చేయనున్నట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ‘సాక్షి’కి తెలిపారు. (చదవండి: బోస్‌కు సముచిత స్థానం) ► ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రమోటింగ్ ఏజెన్సీగా అపిట వ్యవహరిస్తుంది. ► కొత్త కొత్త పరిశోధనలను ప్రోత్సహించడం కోసం ఇన్నోవేషన్ సొసైటీ కృషి చేస్తుంది. ► తిరుపతి కేంద్రంగా ఉన్న ఐఐడీటీ డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి కోర్సులను అందిస్తుంది. ► ఇలా మూడు సంస్థలకు సమర్థవంతమైన కొత్త సీఈవోలను ఎంపిక చేయడం ద్వారా ఈ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జట్టీలు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లపై సర్వే కృష్ణా, ప.గోదావరి జిల్లాల్లో 27 ప్రాంతాల్లో అధ్యయనం సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీర ప్రాంతాల్లో నిర్మించతలపెట్టిన జట్టీలు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సైసెఫ్ (సెంటర్ ఫర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజినీరింగ్ ఫర్ ఫిషరీ) కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు రోజుల క్రితం సర్వే కార్యక్రమాలను పూర్తి చేసింది. బెంగళూరు కేంద్ర కార్యాలయం నుంచి ఇంజనీరింగ్, ఫిషరీస్ విభాగాలకు చెందిన ఆరుగురు నిపుణులు 27 ప్రాంతాలను 10 రోజులు పరిశీలించారు. మత్స్యకారులకు వేటలో లభిస్తున్న మత్స్య సంపద, మత్స్యసంపద నిల్వ, మార్కెటింగ్ పరిస్ధితులను అధ్యయనం చేశారు. మత్స్యకారుల మరపడవలు, పడవలు లంగరు వేసుకోడానికి వార్ఫు, ఫ్లాట్‌ఫారాలు, కోల్డుస్టోరేజి ప్లాంట్ల నిర్మాణాలకు అయ్యే ఖర్చుపై ప్రాథమిక అంచనాకు వచ్చారు. వీటి ఏర్పాటు తరువాత ఈ ప్రాంతాల అభివృద్ధి ఏమేరకు ఉంటుంది, మత్స్యకారుల జీవన ప్రమాణాలు ఏ మేరకు పెరుగుతాయి అనే అంశాలపైనా పరిశీలన చేశారు. వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కృష్ణాజిల్లాలోని నాగాయలంక, ఈలచెట్ల దిబ్బ, ఎదర్లంక, గొల్లలమోద, క్యాంప్‌బెల్‌పేట, పల్లెతుమ్మలపాలెం, ప.గో. జిల్లా దెయ్యపుదిబ్బ వంటి ప్రాంతాలపై అధ్యయనం చేశారని మత్స్యశాఖ కమిషనర్ సోమశేఖరం తెలిపారు. -
త్వరలో కొత్త ఐటీ పాలసీ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కొత్త ఐటీ పాలసీని త్వరలోనే ప్రకటిస్తామని రాష్ట్ర పారిశ్రామిక, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రకటించారు. విశాఖలోని మధురవాడ హిల్–3 లో ఉన్న ఐటీ ఇన్నోవేషన్ వ్యాలీలో ఐటీ పరిశ్రమల సీఈవోలు, ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు గౌతంరెడ్డి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఐటీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవసరాలు, ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు అన్న విషయాలను పరిశ్రమల ప్రతినిధులను అడిగి తెలసుకున్నారు. ఐటీ రంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారనీ, పరిశ్రమల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఐటీ పాలసీని త్వరలోనే ప్రకటించనున్నామనీ.. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన రాయితీలు అందించేలా ఇది ఉంటుందని వివరించారు. ఏడాదికి 50వేల ఐటీ ఉద్యోగాల కల్పన దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. టీడీపీ హయాంలో మంజూరు కాని సబ్సిడీ నిధుల బకాయిలు త్వరలో విడుదల చేస్తామని కంపెనీ సీఈవోలకు హామీ ఇచ్చారు. విశాఖ ఐటీ హిల్స్‌లో ఎన్ని పరిశ్రమలున్నాయి, ఎంత భూమిని పొందాయి, ఎన్ని ఉద్యోగాలు కల్పించాయి, స్థలాలు తీసుకుని బిల్డింగ్లు నిర్మాణం చేసి వాటిని ఏవిధంగా వినియోగిస్తున్నారు.. మొదలైన వివరాల్ని వచ్చే సమావేశం సమయానికి తనకు అందించాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. అన్ని సదుపాయాలు కల్పిస్తాం పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా రవాణా, విద్యుత్, మంచినీటి సరఫరా మొదలైన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. పరిశ్రమలు విశాఖ నుంచి తరలిపోతున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాల్ని ఐటీ అసోసియేషన్ ప్రతినిధులు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టుల్ని ప్రశంసించిన మంత్రులు.. ఈ సందర్భంగా.. వివిధ పరిశ్రమల్ని మంత్రులు పరిశీలించి.. ఉద్యోగులతో మాట్లాడారు. నీటిలో మునిగిపోతున్న వారిని కాపాడే ‘రిమోట్ కంట్రోల్ వాటర్ రెస్క్యూ క్రాప్’ ప్రాజెక్టుని రూపొందించిన ఉద్యోగుల్ని మంత్రులు గౌతంరెడ్డి, ముత్తంశెట్టి ప్రశంసించారు. ఇది ఒడ్డు నుంచి 2 కిలో మీటర్లు దూరం వరకు వెళ్లి రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు తయారీకి రూ.5 లక్షలు వరకు ఖర్చవుతుందని మంత్రులకు వివరించారు. -
త్వరలో ఐటీ పాలసీ.. స్టార్టప్ కంపెనీలూ వస్తాయ్
సాక్షి, అమరావతి: గత చంద్రబాబు ప్రభుత్వం గందరగోళానికి గురిచేసేరీతిలో ఐటీ విధానాన్ని అవలంబించడంతోపాటు ఐటీ కంపెనీలకు సరైన ప్రోత్సాహం అందించలేదని, అందువల్లే గతంలో ఐటీ కంపెనీలు రాష్ట్రానికి రాలేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్ హబ్ కోసం గత చంద్రబాబు సర్కార్ రూ. 100 కోట్లు కేటాయించి.. ఖర్చు పెట్టింది సున్నా అని ఆయన శుక్రవారం సభలో వెల్లడించారు. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతోనే నాస్కామ్ ఏపీ రాకుండా వెళ్లిపోయిందన్నారు. ప్రపంచంలోనే ఉత్తమమైన ఇంక్యూబేటరీ కంపెనీలతో తాము మాట్లాడుతున్నామని, ఇందులో ఇజ్రాయెల్‌కు చెందిన ఉత్తమ ఇంక్యూబేటరి కంపెనీ కూడా ఉందని తెలిపారు. ఈ మూడు ఇంక్యూబేటరీ కంపెనీలతో ఒప్పందం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కంపెనీలు వాళ్ల ఖర్చుతో రాష్ట్రంలో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేయనున్నాయని, ఈ ఇంక్యూటేరీస్ ద్వారా రాబోయే రోజుల్లో స్టార్టప్ కంపెనీలు రానున్నాయని తెలిపారు. స్టార్టప్ కంపెనీలు వస్తే.. వాటితోపాటు వెంచర్ క్యాపిటలిస్టులు సహజంగా వస్తారని వెల్లడించారు. భూమి ఇచ్చి మళ్లీ అద్దెకు తీసుకుంది! తెలంగాణ ఐటీ పాలసీ సరళంగా ఉండటంతో అక్కడ ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టించారని గౌతంరెడ్డి తెలిపారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ పాలసీలు గందరగోళంగా సంక్లిష్టంగా ఉన్నాయని, ఈ పాలసీల వల్ల ఐటీశాఖలోనే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. డీటీపీ పాలసీ కింద ప్రభుత్వం భూమిని కేటాయించగా.. దానిని పలు కంపెనీలు అభివృద్ధి ఇచ్చాయని, మళ్లీ ఆ భూమినే ప్రభుత్వం తిరిగి అద్దెకు తీసుకుందని వెల్లడించారు. ఈ డీటీపీ పాలసీల వల్ల చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పేర్కొన్నారు. న్యూనెట్, సాఫ్ట్‌సాల్వ్, ప్లేకార్డు తదితర కంపెనీలకు భూములిచ్చి.. వాళ్లు అభివృద్ధి చేశాక మళ్లీ వారి నుంచి ప్రభుత్వం అద్దెకు తీసుకుని.. డబుల్ చెల్లింపులు జరిపిందన్నారు. ఏపీలో గత సర్కారు ఐటీ విధానం అయినవారికి ఒకవిధంగా బయటివారికి మరో విధంగా ఉండటంతో.. రాష్ట్రానికి ఐటీ కంపెనీలు రాలేదని వివరించారు. కేవలం పది పేజీల తెలంగాణ ఐటీ పాలసీ సరళంగా ఉండటంతో అక్కడికి కంపెనీలు వెళుతున్నాయని, తెలంగాణ ఐటీ పాలసీ తరహాలో సరళమైన సమగ్రమైన ఐటీ పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారని తెలిపారు. -
త్వరలోనే నూతన ఐటీ పాలసీ
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శనివారం ఐటీ హబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన ఐటీ పాలసీ రూపకల్పనపై దృష్టి సారించామన్నారు. ఇందుకోసం 100 రోజుల కార్యచరణని సిద్ధం చేశామన్నారు. గత ప్రభుత్వం ఐటీని నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. బెంగళూరు, హైదరాబాద్‌కు ధీటుగా విశాఖలో ఐటీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో జరిగిన భూ కేటాయింపులపై సమీక్షిస్తున్నామన్నారు. -
న్యూ బీపీఓ పాలసీ : ఇక ఇంటి నుంచే కొలువులు
సాక్షి, న్యూఢిల్లీ : యువతులు, గృహిణులకు అనుకూలంగా ఐటీ, బీపీఓ కొలువులను ఎంచక్కా ఇంటి నుంచే చక్కబెట్టుకునే అవకాశం తలుపుతట్టనుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద బీపీఓ ప్రోత్సాహక పధకంలో ఈ వెసులుబాటును చేర్చాలని ఐటీ, ఎలక్ర్టానిక్స్ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. నూతన యూనిట్లు నెలకొల్పాలనుకునే సంస్థలకు ఇచ్చే రాయితీలకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్లనూ వర్తింపచేయాలని ఐటీ మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ పధకం కింద 4034 సీట్లతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో బీపీఓ, ఐటీ అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు గత నెలలో ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. తొమ్మిదో విడత బిడ్డింగ్ అనంతరం మరో 24 నూతన యూనిట్లు వివిద నగరాల్లో అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. 1.5 లక్షల మందికి ఉపాధి సమకూర్చాలనే ఉద్దేశంతో 2016లో కేంద్ర ప్రభుత్వం బీపీఓ ప్రోత్సాహక పధకాన్ని డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పధకంలో యూనిట్లను నెలకొల్పే సంస్ధలకు నష్టం వాటిల్లకుండా ఒక్కో ఉద్యోగానికి రూ లక్ష వరకూ వయబిలిటీ గాయప్ ఫండింగ్ రూపంలో ప్రభుత్వం అందచేస్తోంది. దీనికోసం రూ 493 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మరోవైపు మరో 300 కోట్లతో ఈ పధకాన్ని మూడేళ్ల పాటు పొడిగించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు కుటుంబ బాధ్యతల దృష్ట్యా పూర్తిస్ధాయి ఉద్యోగాలు చేయడం కుదరని మహిళలకు చక్కని అవకాశమని, ఈ వెసులుబాటు ద్వారా మరో లక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
పీఎంఓలో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ఐటీని కొత్తపుంతలు తొక్కించేందుకు వివిధ శాఖలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రధానమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి (సీఐఓ)ని నియమంచాలని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ సూచించారు. సమర్ధ టెక్నాలజీ విధానం కోసం ప్రభుత్వం సీఐఓను నియమించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐటీ వ్యూహాల రూపకల్పనతో పాటు వివిధ శాఖలతో సమన్వయం కోసం ఈ ఏర్పాటు ఉండాలని చెప్పారు. బిగ్ డేటాను సమర్ధంగా నిర్వహించేందుకు భారత్‌కు చీఫ్ డేటా సైంటిస్ట్ అవసరమని అన్నారు. పలు ఆర్థిక లావాదేవీలకు ఆధార్‌ను అనుసంధానిస్తుండటంతో సీఐఓ పాత్ర అత్యంత కీలకంగా మారుతుందని చెప్పారు.వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఆధార్ నెంబర్‌తో ఆర్థిక లావాదేవీలను టెక్నాలజీని అనుసంధానించి మిళితం చేయనుంది. వైట్ హౌస్ సీఐఓ మాదరిగానే సీఐఓ కేంద్ర ప్రభుత్వంతో ఐటీ మౌలిక సదుపాయాలకు సంధానకర్తగా ఉంటారని అధికారులు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం వెచ్చించే ఐటీ వ్యయాలకు కూడా వైట్‌హౌస్ సీఐఓ బాధ్యత వహిస్తారు. -
‘రియల్’ రయ్.. రయ్..
♦ దిగ్గజ కంపెనీల రాకతో పెరిగిన ఆదాయం ♦ భారీగా నమోదైన రిజిస్ట్రేషన్లు ♦ రాష్ట్ర ఖజానాకు జిల్లానే మూలస్తంభం ♦ పూర్వవైభవం దిశగా రియల్ఎస్టేట్ ♦ రాజకీయ స్థిరత్వంతో పెరిగిన వ్యాపారం ♦ 27 శాతానికిపైగా నమోదైన వృద్ధి రేటు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుంది. రెండేళ్లకాలంలో ఎన్నడూలేనంతగా పరుగులు పెడుతోంది. 27శాతానికిపైగా వృద్ధి రేటు సాధించింది. రాజకీయ స్థిరత్వం.. ప్రపంచ శ్రేణి సంస్థల తాకిడితో జిల్లాలో స్థిరాస్తి రంగం వేగం పుంజుకుంది. అమెజాన్, ఆపిల్, గూగుల్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీల రాకతో రియల్‌ఎస్టేట్‌కు పూర్వవైభవం వస్తోంది. రాజకీయ అనిశ్చితితో గతేడాది వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ రంగం.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆశావహ వాతావరణంతో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఐటీ పాలసీ, నూతన పారిశ్రామిక విధానంతో అనుమతులను సరళతరం చేయడం.. పరిశ్రమల స్థాపనలకు అనువైన వాతావరణం సృష్టించడం.. పెట్టుబడిదారుల్లో ఆశలు చిగురింపజేశాయి. ఇదే భరోసా సామాన్యుల్లో కూడా కలగడంతో జిల్లాలో స్థలాల క్రయవిక్రయాలు గణనీయంగా పెరిగాయి. మొన్నటివరకు వేచిచూసే ధోరణిని అవలంబించిన దిగువ, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2015-16లో రియల్ ఎస్టేట్‌కు రెక్కలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,759.62 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చడంలో జిల్లా మూలస్తంభంగా నిలిచింది. జిల్లాలోని రెండు రిజిస్ట్రేషన్ల విభాగాలకు రూ.2,212.93 కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, ఈ లక్ష్యసాధనలో జిల్లాలో వెనుకబడినప్పటికీ, 2014-15తో పోలిస్తే (రూ.1,383.86 కోట్లు) రూ.375.76 కోట్ల రాబడిని సమకూర్చుకోగలిగింది. ఈ మేరలో ఆదాయం రావడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి తెరపడడమే. 2009 నుంచి 2014 వరకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున లేవడం.. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక మాంద్యం నెలకొనడంతో రియల్టీ రంగం అటుపోట్లను ఎదుర్కొంది. ఈ క్రమంలోనే స్థలాల కొనుగోళ్లు, ఇళ్ల నిర్మాణాలపై సహజంగానే ఎక్కువ ఆసక్తి చూపే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొంత వెనుకడుగు వేశారు. దీనికి కొనసాగింపుగానే రాష్ట్ర విభజన జరగడంతో గతేడాది క్రితం వరకు స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో అచితూచి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, ఇటీవల బహుళ జాతి సంస్థలు భాగ్యనగరంవైపు దృష్టి సారించడం.. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ కంపెనీలు నగర శివార్లలో క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. వీటితోపాటు విమానయానరంగంలో బడా కంపెనీలుగా పేరొందిన ఎయిర్‌బస్, టాటా తదితర సంస్థలు విమాన విడిభాగాల తయారీ హబ్‌లను జిల్లాలో ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇవేకాకుండా మొబైల్, టీవీ ఉపకరణాల తయారీ సంస్థలు కూడా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావడంతో రియల్టీ జోరందుకుంది. ఈ క్రమంలోనే బడా బిల్డర్లు శివార్లలో అత్యాధునిక ప్రమాణాలతో విల్లాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు రాష్ర్ట విభజనతో ఏపీ రాజధాని అమరావతి వైపు ఆశగా చూసిన నిర్మాణ సంస్థలు, రియల్టర్లు కూడా అక్కడ నెలకొన్న రాజకీయ వాతావరణం.. ఆసాధారణంగా పెరిగిన భూముల ధరలతో రియల్ వ్యాపారానికి హైదరాబాదే మేలనే నిర్ణయానికి రావడం కూడా జిల్లాలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడానికి కారణమైంది. -
అలరించిన తెలంగాణ రోబో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తయారైన తొలి రోబో సోమవారం ఐటీ పాలసీ ఆవిష్కరణ వేదికపై అలరించింది. ‘టీ-వన్’గా పేరుపెట్టిన ఈ రోబో ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. వేదికపై ఒక చివర నుంచి ముఖ్య అతిథి సీటు వరకు వెళ్లి... ఐటీ పాలసీ పత్రాలను అందించే పనిని దీనికి అప్పగించారు. ఈ రోబో నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి పత్రాలను అందించడం అందరినీ అలరించింది. కార్యక్రమం ముగిశాక వేదికపై ఉన్న ప్రముఖులు ఈ రోబో తో ఫొటోలకు ఫోజులి వ్వడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన రోబోటిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబొరేటరీకి చెందిన బృందం ఈ రోబోను తయారు చేసింది. ఆ బృందాన్ని సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ అభినందించారు. ఎల్ఈడీ మెరుపులతో ప్రారంభం అధికారికంగా నిర్వహించే ఉత్సవాలు, వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడం ఆనవాయితీ. అందుకు భిన్నంగా ఐటీ పాలసీని ఆవిష్కరించే వేడుక సరికొత్తగా ప్రారంభమైంది. ఎల్ఈడీ బల్బుల మిరుమిట్ల మధ్య కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. జ్యోతి ప్రజ్వలనకు బదులుగా తెలంగాణ, అందులో పది జిల్లాల నైసర్గిక స్వరూపం కనబడేలా 130 ఎల్ఈడీ బల్బులతో రూపొందించిన చిత్రపటాన్ని ఆన్ చేశారు. ఈ ఎల్ఈడీ బల్బులన్నీ తెలంగాణలో తయారైనవి కావటం విశేషం. రెజల్యూట్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వీటిని రాష్ట్రంలో మొదటిసారిగా తయారు చేసింది. కంపెనీ అధినేత రమిందర్సింగ్ను సీఎం ఈ సందర్భంగా అభినందించారు. -
ఐటీ అనుబంధ విధానాలు
హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విధానంతోపాటు అనుబంధంగా నాలుగు విధానాలను ప్రభుత్వం ప్రకటించింది. స్టార్టప్ కంపెనీలను ఆకర్షించేందుకు ఇన్నోవేషన్ పాలసీ, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు ఈఎస్డీఎం (ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్) పాలసీ, గ్రామీణ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రూరల్ టెక్ పాలసీ, యానిమేషన్ అండ్ గేమింగ్ కంపెనీలకు ఇమేజ్ పాలసీలను ఆవిష్కరించింది. ఎలక్ట్రానిక్స్‌లో అగ్రస్థానం వైపు.. వినూత్నంగా ‘ఈఎస్డీఎం’ విధానం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో ఈ పాలసీ ప్రభుత్వం ప్రకటించింది. లక్ష్యాలు: ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు ఆదర్శ గమ్య స్థానంగా తెలంగాణను మార్చడం, మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం, 1.6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ప్రస్తుతం ఉన్న ఒక బిలియన్ డాలర్ల నుంచి 7.5 బిలియన్ డాలర్లకు పెంచడం. రాయితీలు: పబ్లిక్ అండ్ ప్రైవేటు సంస్థలతో సమన్వయం, నాణ్యమైన రహదారులు, రవాణా, మౌలిక సదుపాయాల కల్పన. కార్మికుల శిక్షణకు సబ్సిడీ, ట్యాక్స్ అండ్ ఫిస్కల్ రాయితీలు, లీజు డీడ్, మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీల్లో 100% రీయింబర్స్, ఐదేళ్ల వరకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు, తెలంగాణలో కేంద్ర కార్యాలయం ఉన్న సంస్థలకు పేటెంట్ ఖర్చు, క్వాలిటీ సర్టిఫికేషన్‌కు అయ్యే ఖర్చుల్లో 50% రీయింబర్స్ (గరిష్టంగా రూ.2లక్షల వరకు), 100% వ్యాట్/సీఎస్టీ, ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, మొదటి 25 మెగా కంపెనీలకు 20% పెట్టుబడి రాయితీ ( రూ.2కోట్లవరకు), మొదటి 50 సూక్ష్మ, చిన్నతరహా కంపెనీలకు గరిష్టంగా రూ.50లక్షలు, అర్హత కలిగిన కంపెనీలకు 25% సబ్సిడీతో పదేళ్ల వరకు లీజు పద్ధతిన భూమి కేటాయింపు, డార్మిటరీల నిర్మాణానికి 20% భూమి కేటాయింపు. ‘కళ’కు తోడ్పాటుగా.. ఇమేజ్ (గేమింగ్ అండ్ యానిమేషన్) పాలసీ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కామిక్స్, గేమింగ్ పరిశ్రమ (ఏవీసీజీఐ) కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ఇమేజ్ పాలసీకి శ్రీకారం చుట్టింది. లక్ష్యాలు: రంగారెడ్డి జిల్లాలో టీఎస్ఐఐసీ సహకారంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇమేజ్ సిటీని ఏర్పాటు చేస్తారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ అకాడమీని నెలకొల్పుతారు. రాయితీలు: రూ.5 కోట్లకు పైగా పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు గరిష్టంగా రూ.25లక్షలు లేదా 25శాతానికి మించకుండా పెట్టుబడి రాయితీ. యానిమేషన్ ఫిల్మ్‌లు, కార్టూన్లు, గేమ్‌ల తయారీకయ్యే వ్యయంలో 20 శాతం రీయింబర్స్మెంట్. తెలంగాణలోనే పూర్తిస్థాయిలో తయారయ్యే వీఎఫ్ఎక్స్ చిత్రానికి వంద శాతం వినోదపు పన్ను మినహాయింపు. మూడేళ్ల పాటు రూ.3 లక్షలకు మించకుండా ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ చార్జీల రీయింబర్స్మెంట్. ఔత్సాహికులకు ప్రోత్సాహం.. స్టార్టప్‌ల కోసం ఇన్నోవేషన్ పాలసీ ఐటీ విధానంలో స్టార్టప్ కంపెనీలకు పెద్దపీట వేసింది. లక్ష్యాలు: వచ్చే ఐదేళ్లలో స్టార్టప్‌ల కోసం 10లక్షల చదరపు అడుగుల ఇంక్యుబేటర్ల అభివృద్ధి, వచ్చే ఐదేళ్లలో 900 స్టార్టప్‌లకు అవకాశం కల్పిస్తూ రెండో దశ టీ-హబ్. 1000 ఐటీ, 300 ఎలక్ట్రానిక్స్, 400 గ్రీన్‌టెక్ స్టార్టప్‌లతో కలిపి 5 వేల స్టార్టప్‌ల అభివృద్ధికి కృషి, దీనికి రూ.2వేల కోట్ల నిధుల సేకరణ. రాయితీలు: ఇంక్యుబేటర్లకు 2 జీబీపీఎస్ ఇంటర్నెట్ సదుపాయం, టీ-హబ్ తో అనుసంధానమైన స్టార్టప్‌ల కార్యకలాపాలను అందరికీ అందుబాట్లోకి తేవడం, స్టార్టప్‌ల ద్వారా యువతకు అవసరమైన ఇంటర్న్‌షిప్, కెరీర్ అవకాశాలు. వ్యాపారాభివృద్ధికి ఇన్నోవేషన్ అడ్వయిజరీ కౌన్సిల్ ఏర్పాటు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ద్వారా పరిశోధ నాభివృద్ధి కోసం సాంకేతిక సంస్థలను ప్రోత్సహించడం. ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల సహకారంతో నిధులు. గ్రామ యువతకు చేయూత ‘రూరల్ టెక్నాలజీ సెంటర్స్’ విధానం స్థూల దేశీయోత్పత్తిలో సుమారు 10% వాటా కలిగిన ఐటీ సుమారు 35లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. వీరిలో ఎక్కువ మంది పల్లెల నుంచి వస్తున్న వారే. దీంతో ప్రభుత్వం గ్రామీణ సాంకేతిక కేంద్రాల (రూరల్ టెక్నాలజీ సెంటర్లు-ఆర్టీసీలు) ఏర్పాటును ప్రతిపాదిస్తోంది. కేవలం ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. లక్ష్యాలు: రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఒక్కో రూరల్ టెక్నాలజీ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తారు. ఒక్కో కేంద్రం ద్వారా కనీసం 2,500 మంది యువతకు ఉపాధి కల్పిస్తారు. ప్రతి జిల్లా నుంచి 10 వేల మంది గ్రామీణ యువతకు ‘తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)’లో శిక్షణ ఇస్తారు. రాయితీలు: మొదటి మూడేళ్ల పాటు తొలుత ఏర్పాటయ్యే ఐదు ఐటీ కంపెనీలకు పంచాయతీలు విధించే పన్నులు రీయింబర్స్ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఐటీ ప్రమోషన్ కార్యక్రమాల నిర్వహణకయ్యే ఖర్చులో 50శాతం లేదా గరిష్టంగా రూ.5 లక్షల వరకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యుత్ రాయితీ ఇస్తారు. గరిష్టంగా రూ.40లక్షల పెట్టుబడితో ముందుకు వచ్చే తొలి మూడు పరిశ్రమలకు 50శాతం, తర్వాత వచ్చే వాటికి 10శాతం పెట్టుబడి రాయితీ ఇస్తారు. మూడేళ్ల పాటు ఇంటర్నెట్, టెలిఫోన్ చార్జీల్లో 25శాతం తిరిగి చెల్లిస్తారు. ఉద్యోగం కల్పించేవారికి శిక్షణ రాయితీ కింద నెలకు రూ.2,500 చెల్లింపు. -
మన లక్ష్యం 1
వినూత్నంగా ఐటీ విధానం సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలోనే తెలంగాణను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం కొత్త ఐటీ విధానాన్ని ఆవిష్కరించింది. ఐటీలో నూతన సాంకేతిక విజ్ఞానానికి ప్రధాన చిరునామాగా, దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణను నిలపాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. పౌర సేవల వినియోగం, వినిమయంలో ఐటీని గణనీయంగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ప్రధానంగా పది అంశాల ఎజెండాను ప్రకటించింది. ఐటీ కంపెనీల విస్తరణ, ఎలక్ట్రానిక్స్, కొత్త పరిశ్రమల స్థాపన (ఎంటర్ ప్రెన్యూర్షిప్), శిక్షణ నైపుణ్యం (స్కిల్లింగ్), ప్రభుత్వపరంగా ఐటీ సేవలు (ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఐటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ బై గవర్నమెంట్), కొత్త ఆవిష్కరణలు (న్యూ ఇనీషియేటివ్స్), ఈ-గవర్నెన్స్, ఎం-గవర్నెన్స్, డిజిటల్ తెలంగాణ, ఉత్పత్తుల ప్రాచుర్యం(ప్రమోషన్స్), జీవన ప్రమాణాల పెంపు అంశాలను ఇందులో పొందుపరిచింది. ప్రధాన అంశాలివీ.. ► కొత్త ఐటీ క్లస్టర్ల ఏర్పాటు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీలు, బీపీవోల ఏర్పాటుకు ప్రోత్సాహం. చిన్న, సూక్ష్మ కంపెనీలకు కొత్త టవర్స్ నిర్మాణంతో పాటు ఆర్థిక చేయూతనివ్వడం. ► ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు 15 రోజుల్లో అనుమతులు. రెండు ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటు. 600 ఎకరాల్లో ఈ-సిటీ, 310 ఎకరాల్లో సైన్స్ పార్కు. ► స్టార్టప్‌లకు వేదికగా టీ-హబ్ విస్తరణ. ఐఐఐటీ, ఐఎస్బీ, నల్సార్, ఐఐటీ, బిట్స్‌తో ప్రభుత్వం భాగస్వామ్య పద్ధతిలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, మేనేజ్మెంట్, లా వివిధ విభాగాల్లో ఔత్సాహికులకు ప్రోత్సాహం. ఇంక్యుబేటర్స్, యాక్సిలేటర్స్, సీడ్ ఫండ్స్ ఏర్పాటుకు అండ. ► తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా శిక్షణ. ఉపాధి కల్పన ► ప్రభుత్వ విభాగాల్లో ఐటీ సేవల విస్తరణ. ప్రభుత్వ రంగ సంస్థల ఆవిష్కరణలను ఆధునికీకరించేందుకు ఐటీ కంపెనీలతో అనుబంధం. ► గేమింగ్, యానిమేషన్, డేటా ఎనలిటిక్స్ కంపెనీలకు వీలుగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు. సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి,కొత్త పరిజ్ఞానం రూపకల్పనకు చేయూత. ► పౌర సేవలను మరింత వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు మొబైల్ అప్లికేషన్ల వినియోగం. టెలికం ప్రొవైడర్లు, మొబైల్ స్టోర్స్ ద్వారా సర్కారు సేవలు. ► తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం. ప్రధాన పట్టణాలు, నగరాల్లో వైఫై సదుపాయం. రాబోయే ఐదేళ్లలో ప్రతి కుటుంబంలో కనీసం ఒకరిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం. ప్రతి పాఠశాలలో ఆరో తరగతి నుంచి విద్యార్థులకు కంప్యూటర్ విద్య. ► రాష్ట్రంలో పెట్టుబడులకు ఐటీ కంపెనీలకున్న అవకాశాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం. అంతర్జాతీయ, జాతీయ ప్రదర్శనలు, ట్రేడ్ షోలు, సదస్సులు, సెమినార్లలో పాల్గొనడం. ► జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా ‘బ్రాండ్ హైదరాబాద్’ను నిలబెట్టడం. ఐటీ/ఐటీఈఎస్ విస్తరణకు ప్రోత్సాహకాలు మెగా కంపెనీలు, ఐటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో నెలకొల్పే ఐటీ కంపెనీలు, ఇంజనీరింగ్ సేవలందించే కంపెనీలు, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ కంపెనీలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు నెలకొల్పే కంపెనీలుగా వర్గీకరించింది. భూముల కేటాయింపు, విద్యుత్ చార్జీల రాయితీ, రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ, పేటెంట్ చార్జీల్లో రాయితీ, నాణ్యత సర్టిఫికెట్లలో రాయితీలను అన్ని కంపెనీలకు వర్తింపజేసింది. ► మెగా కంపెనీలకు స్వీయ అవసరాలకు సరిపడే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు లెసైన్స్ ఇస్తారు. వంద కిలోవాట్లకు మించిన సౌర విద్యుత్ యూనిట్ నెలకొల్పుకునేందుకు రూ.20 లక్షలు లేదా మూలధనంలో పది శాతం.. ఏది తక్కువైతే అంత మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఏటా వంద మంది విద్యార్థులను క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకుంటే రూ.10 వేల చొప్పున నియామక సాయం అందిస్తారు. ► రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీల్లో పరిశోధనకయ్యే ఖర్చులో పది శాతం గ్రాంటుగా చెల్లిస్తారు. ప్రతిభ ఆధారంగా 25 శాతం పీహెచ్డీ విద్యార్థులకు ప్రతి నెలా రూ.25 వేలు స్టైఫండ్ ఇస్తారు. క్యాంపస్ రిక్రూట్మెంట్కు రూ.20 వేల చొప్పున సాయం. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో.. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో ఐటీ కంపెనీలు నెలకొల్పితే మొదటి మూడేళ్లు మున్సిపల్ ట్యాక్స్ రీయింబర్స్ చేస్తారు. రూ.20 వేల చొప్పున రిక్రూట్మెంట్ సాయం. బీపీవోలు నెలకొల్పితే 50 శాతం లేదా గరిష్టంగా రూ.20 లక్షలకు మించి పెట్టుబడి రాయితీ. అభ్యర్థులకు శిక్షణ భృతి ఇస్తారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకం.. రూ.5లక్షలలోపు టర్మ్, పెట్టుబడి రుణాల్లో ఐదేళ్లపాటు మహిళలకు 5 శాతం వడ్డీ రాయితీ, ఎస్సీ ఎస్టీలకు 8.5 శాతం వడ్డీ రాయితీ ఇస్తారు. విద్యుత్ చార్జీల్లో యూనిట్‌కు రూపాయిన్నర చొప్పున రీయింబర్స్మెంట్. మూలధనంలో 25 శాతం ( మహిళలకు రూ.20 లక్షలకు మించకుండా, ఎస్సీ ఎస్టీలకు రూ.25 లక్షలకు మించకుండా) సబ్సిడీ అందిస్తారు. ఏడాదికి 50 మంది ఐటీ నిపుణులను రిక్రూట్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున నియామక సాయం అందిస్తారు. -
ఐటీకి అపారమైన అవకాశాలు
► నూతన ఐటీ పాలసీ ఆవిష్కరణ ► నాలుగు అనుబంధ పాలసీలూ ఆవిష్కరణ ► కలసికట్టుగా అభివృద్ధి చెందుదాం ► ఐటీ కంపెనీలు, పెట్టుబడిదారులకు ఆహ్వానం ► అవినీతికి తావు లేదు.. అడ్డంకులు అసలే లేవు ► పారిశ్రామిక విధానాన్ని అవినీతి రహితంగా అమలు చేస్తున్నాం ► గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలన్న లక్ష్యం అద్భుతం: గవర్నర్ ► ప్రపంచస్థాయి ఐటీ హబ్‌గా ఎదగాలి: నారాయణమూర్తి సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి.. కలసి రండి.. కలసికట్టుగా అభివృద్ధి చెందుతాం..’ అని ఐటీ కంపెనీలు, ఔత్సాహిక పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం విలువలను విశ్వసిస్తుందని.. విలువలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఏడాది కింద ప్రకటించిన పారిశ్రామిక విధానాన్ని నూటికి నూరు శాతం అవినీతి రహితంగా, పెట్టుబడిదారులకు పెన్నిధిగా అమలు చేసి చూపించామని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో తెలంగాణ నూతన ఐటీ పాలసీని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. గవర్నర్ నరసింహన్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి, నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.సారస్వత్, పలువురు ఐటీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీ విస్తరణ లక్ష్యంగా రూపొందించిన ప్రధాన పాలసీతో పాటు ఇన్నోవేషన్ పాలసీ, గేమింగ్ యానిమేషన్ (ఇమేజ్) పాలసీ, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ, రూరల్ టెక్నాలజీ పాలసీలను కూడా ప్రభుత్వం ఇదే వేదికపై ప్రకటించింది. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఆశించిన పురోగతి సాధించిం దని.. ఇక ముందు మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మాట నిలబెట్టుకున్నాం.. 20 నెలల కిందే తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిందని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ఎంతో శ్రమిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘ఏడాది కింద తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాం. అప్పుడు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. అప్పటికే ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాల్లో పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులిచ్చే విధానాలున్నా.. పలు సమస్యలున్నాయి. కానీ తెలంగాణలో ఒక్క అడ్డంకి కూడా ఉండదని, పెట్టుబడిదారుల పెన్నిధిగా ఉంటుందని అదే రోజు చెప్పాను. ఇప్పటివరకు 1,691 కంపెనీలకు అనుమతులిచ్చాం. అందులో 883 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించే దశలో ఉన్నాయి. ఈ కంపెనీలన్నింటికీ నిర్ణీత 15 రోజుల గడువులోనే లేనిపోని చిక్కులు, అవినీతికి తావు లేకుండా అనుమతులు జారీ చేశాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. తెలంగాణ ఎంతో ఆకర్షణీయమైన ప్రాంతం. భౌగోళికంగా, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పెట్టుబడులకు అనుకూలం. ప్రజల ఆదరాభిమానాలున్న కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్. ఐటీలో పెట్టుబడులకు ఇక్కడ అపారమైన అవకాశాలున్నాయి. అందుకు మీ సహాయ, సహకారాలు అందించండి. పాలనాపరమైన చిక్కులుండవు. అవినీతికి తావుండదు. తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి..’’ అని పారిశ్రామికవేత్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి, నాస్కామ్ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్, మణిపాల్ గ్లోబల్‌టెక్ అధినేత మోహన్‌దాస్ పాయ్, ఇంటెల్ దక్షిణాసియా ఎండీ దేబ్జానీ ఘోష్, ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రతినిధి పంకజ్ మొహిందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త విధానం భేష్: నరసింహన్ సాంకేతిక విజ్ఞానం పట్టణాలకే పరిమితమైన తరుణంలో గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే లక్ష్యంతో ఐటీ విధానాన్ని రూపొందించటం హర్షనీయమని గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాలు వృద్ధి చెందితేనే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందని... సాంకేతిక విజ్ఞానం గ్రామీణ ప్రాంతాలకు చేరితేనే ఈ లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. ఐటీవిధానాన్ని గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానించాలని నిర్ణయించినందుకు మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలపాలని పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. నంబర్ వన్ చేస్తాం: మంత్రి కేటీఆర్ ఐటీ రంగంలో హైదరాబాద్ గత 25 ఏళ్లుగా రెండో స్థానంలో ఉందని... త్వరలోనే నంబర్‌వన్ స్థానానికి తీసుకొస్తామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఐటీ రంగానికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నిలుస్తోందన్నారు. గ్రామీణ, పట్టణ యువతను ప్రోత్సహించే విధంగా ఐటీ పాలసీని రూపొందించామని పేర్కొన్నారు. వినయంతో అభివృద్ధి: నారాయణమూర్తి ప్రపంచంలోనే అత్యున్నతమైన సిలికాన్ వ్యాలీ, బీజింగ్, టోక్యోలాంటి ఐటీ హబ్‌లతో పోటీపడాలనే లక్ష్యంతో తెలంగాణ ముందడుగేయాలని ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సూచించారు. ప్రతి నిర్ణయం పారదర్శకంగా, వేగంగా, విశాల దృ క్పథంతో తీసుకోవాలన్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని, సాంకేతిక విజ్ఞానం ఎంత ఎదిగినా మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వినయంతో అభివృద్ధి సాధించాలని సూచించారు. కీలక ముందడుగు: వీకే సారస్వత్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీలు అభివృద్ధి వైపు కీలకమైన ముందడుగని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ పాలసీ కేంద్రం తీసుకొచ్చిన మేకిన్ ఇండియాకు చాలా అనుకూలంగా ఉందన్నారు. స్టార్టప్ కంపెనీలకు అందిస్తున్న ప్రోత్సహకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. జిల్లాలకూ విస్తరించాలి: బీవీఆర్ మోహన్‌రెడ్డి బంగారు తెలంగాణ సాధనలో అందరం భాగస్వాములం కావాలని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. డిజిటల్ తెలంగాణ సాధించే లక్ష్యంలో తమ వంతుగా మూడేళ్లలో రూ.10కోట్లు ఖర్చు పెడతామని వెల్లడించారు. ఐటీ కంపెనీలన్నీ తెలంగాణలోని మిగతా తొమ్మిది జిల్లాలకు విస్తరించాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం బిజినెస్ ఫ్రెండ్లీగా ఉంటోందని, ఇక్కడి అధికారులు, పాలనా వ్యవస్థ పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పేర్కొన్నారు. -
'ఐటీ పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం'
హైదరాబాద్: భౌగోళికంగా, వాతావరణపరంగా ఐటీ పెట్టుబడులకు హైదరాబాద్ నగరం అనుకూలంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సింగిల్ విండో ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని ఆయన అన్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ పాలసీని ఆవిష్కరించిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఐటీ పరిశ్రమలకు కావాల్సిన అనుమతులు నిర్ణీత సమయంలో మంజూరు చేశామని ఆయన అన్నారు. ఈ ఏడాదిలో కొత్తగా రాష్ట్రానికి 1691 కంపెనీలు వచ్చాయని చెప్పారు. అన్ని పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చామన్నారు. 20 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. ప్రతిరంగంలో అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీపై కేసీఆర్ సమీక్ష జీహెచ్ఎంసీపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 11, 12 తేదీల్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. 13న వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేటర్లకు శిక్షణ ఇప్పించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా స్లమ్‌లెస్ సిటీగా హైదారాబాద్‌ను మార్చాలని ఆయన అన్నారు. ప్రతి 5 వేల మందికి ప్రజా కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 4,700 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించాలని కేసీఆర్ సూచించారు. కాగా, ఈ సమీక్ష సమావేశానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
హైటీ బుమ్!
జాతీయ సగటును మించిన ఐటీ ఉత్పత్తుల ఆదాయం కొలువుదీరనున్న మరో 100 కంపెనీలు ఐటీ పాలసీపై పారిశ్రామికవేత్తల ఆసక్తి హైటెక్ మహానగరం ఐటీకి రాజధానిగా మారుతోంది. సీఎం కేసీఆర్ సోమవారం ఐటీ పాలసీ ప్రకటించనున్న నేపథ్యంలో నగరం ఇక ఐటీ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఐటీ రంగం రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం మొదటిసారిగా రంగంలోకి దిగుతోంది. ఈ రంగంలో కొత్త అవకాశాలు సృష్టించేందుకు పెద్దఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉంది. ఐటీ పరిశ్రమైపైన స్పష్టమైన విధానాలు ప్రకటించనున్నందున అన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకర ప్రకటనలుంటే వెంటనే రంగంలోకి దిగాలని వేచి చూస్తున్నాయి. తద్వారా నగరంలో ఐటీ రంగం మెరుగుపడడంతోపాటు వేలాది మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. మరోవైపు గతేడాది ఐటీ ఎగుమతుల్లో 16 శాతం వృద్ధి నమోదైనట్లు ఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వృద్ధి రేటు జాతీయస్థాయి ఐటీ ఎగుమతుల్లో పెరుగుదల కంటే 3 శాతం అధికం. ఈ అంశం కూడా నగరంలో ఐటీ వృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరో -
ఐటీ పాలసీ ఆవిష్కరణ నేడే
హెచ్ఐసీసీలో ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి నిమిత్తం ప్రభుత్వం రూపొందించిన ఐటీ పాలసీని రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్, ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణ మూర్తి తదితర ప్రముఖుల సమక్షంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో మధ్యాహ్నం 3గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు మోహన్‌దాస్, ఇంటెల్ ఇండియా ప్రెసిడెంట్ ఘోష్, సిలికాన్ వ్యాలీ ప్రెసిడెంట్ రాంరెడ్డి, మైక్రోసాఫ్ట్ ఎండీ భాస్కర్ ప్రామాణిక్, ఎల క్ట్రానిక్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఈవో మహాపాత్ర, శ్యాంసంగ్ వైస్‌చైర్మన్ దీపక్ భరద్వాజ, నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తదితరులు హాజరుకానున్నారు. ఇదే వేదికపై ఐటీకి అనుబంధ ంగా మరో మరో నాలుగు పాలసీలను ప్రముఖులు ఆవిష్కరించనున్నారు. స్టార్టప్స్‌కు చేయూత ఇచ్చే విధంగా ఇన్నోవేషన్ పాలసీ, ఐటీ సెక్టార్‌ను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేలా రూరల్ టెక్నాలజీ పాలసీ, రాష్ట్రంలో హార్డ్‌వేర్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఎల క్ట్రానిక్స్ పాలసీ, గేమింగ్ అండ్ యానిమేషన్ పాలసీలను ప్రభుత ్వం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. పాలసీల ఆవిష్కరణలతో పాటు ఆయా రంగాల్లోని దిగ్గజ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం, టి-హబ్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్(టాస్క్) అవగాహన ఒప్పందాల(ఎంవోయూ)ను కుదుర్చుకోనున్నాయి.