
సాక్షి, న్యూఢిల్లీ : యువతులు, గృహిణులకు అనుకూలంగా ఐటీ, బీపీఓ కొలువులను ఎంచక్కా ఇంటి నుంచే చక్కబెట్టుకునే అవకాశం తలుపుతట్టనుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద బీపీఓ ప్రోత్సాహక పధకంలో ఈ వెసులుబాటును చేర్చాలని ఐటీ, ఎలక్ర్టానిక్స్ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. నూతన యూనిట్లు నెలకొల్పాలనుకునే సంస్థలకు ఇచ్చే రాయితీలకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్లనూ వర్తింపచేయాలని ఐటీ మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ పధకం కింద 4034 సీట్లతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో బీపీఓ, ఐటీ అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు గత నెలలో ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.
తొమ్మిదో విడత బిడ్డింగ్ అనంతరం మరో 24 నూతన యూనిట్లు వివిద నగరాల్లో అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. 1.5 లక్షల మందికి ఉపాధి సమకూర్చాలనే ఉద్దేశంతో 2016లో కేంద్ర ప్రభుత్వం బీపీఓ ప్రోత్సాహక పధకాన్ని డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పధకంలో యూనిట్లను నెలకొల్పే సంస్ధలకు నష్టం వాటిల్లకుండా ఒక్కో ఉద్యోగానికి రూ లక్ష వరకూ వయబిలిటీ గాయప్ ఫండింగ్ రూపంలో ప్రభుత్వం అందచేస్తోంది.
దీనికోసం రూ 493 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మరోవైపు మరో 300 కోట్లతో ఈ పధకాన్ని మూడేళ్ల పాటు పొడిగించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు కుటుంబ బాధ్యతల దృష్ట్యా పూర్తిస్ధాయి ఉద్యోగాలు చేయడం కుదరని మహిళలకు చక్కని అవకాశమని, ఈ వెసులుబాటు ద్వారా మరో లక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment