AP CM Jagan Meeting On AP IT Policy: మన పిల్లలకు మంచి ఉద్యోగాలు - Sakshi
Sakshi News home page

మన పిల్లలకు మంచి ఉద్యోగాలు

Published Thu, Jun 24 2021 3:20 AM | Last Updated on Thu, Jun 24 2021 4:22 PM

CM Jagan Says main objective of IT policy is to create good jobs for our children - Sakshi

సాక్షి, అమరావతి: మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశం కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. మన పిల్లలకు హై ఎండ్‌ స్కిల్స్‌ నేర్పించే కంపెనీలకు, సంస్థలకు పాలసీలో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారికి మంచి ప్రోత్సాహకాలను ఇవ్వాలని ఆదేశించారు. దీని వల్ల పిల్లల్లో అంతర్జాతీయ స్థాయిలో పనిలో అనుభవం, నైపుణ్యాలు పెరుగుతాయన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీపడే పరిస్థితి ఉంటుందని, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. 

ఏపీలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది ఇన్సెంటివ్‌లు చెల్లిస్తామని ప్రకటించారు. వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్, డిజిటల్‌ లైబ్రరీలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పనకు విశాఖపట్నం ప్రధాన కేంద్రం అవుతుందన్నారు. ప్రభుత్వం కల్పించనున్న మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. విశాఖ స్థాయిని మరింతగా పెంచుతాయని, భవిష్యత్‌లో ఐటీ రంగానికి మంచి కేంద్రంగా మారుతుందన్నారు. కాలక్రమేణా ఈ అంశాలన్నీ సానుకూలంగా మారి కంపెనీలకు ఈ నగరం ఒక ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందని తెలిపారు. నాణ్యమైన విద్యకు విశాఖను కేంద్రంగా చేయడం ద్వారా వల్ల మంచి ప్రతిభావంతమైన మానవ వనరులు లభిస్తాయని అన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, అధికారులు 

హై ఎండ్‌ ఐటీ స్కిల్స్‌ యూనివర్సిటీ
– ఐటీ రంగంలో అత్యుత్తమ యూనివర్సిటీని విశాఖపట్నం తీసుకురావాలి. ఐటీ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ లెర్నింగ్‌కు ఈ యూనివర్శిటీ డెస్టినేషన్‌గా మారాలి. 
– ఏపీలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది ఇన్సెంటివ్‌లు చెల్లిస్తాం. కనీసం ఏడాది పాటు ఒక ఉద్యోగి స్థిరంగా అదే కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది. మొదటి ఏడాది పూర్తవగానే ఆ కంపెనీకి ఇన్సెంటివ్‌ చెల్లింపులు ప్రారంభం అవుతాయి. ఈ నిబంధన వల్ల మన పిల్లలకు ఏడాదిపాటు స్థిరమైన ఉపాధి లభిస్తుంది. అంతేకాక నిర్ణీత కాలం పని వల్ల నైపుణ్యం కూడా మెరుగు పడుతుంది.

ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీలు  
– వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలి. గ్రామాలకు మంచి సామర్థ్యం ఉన్న ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడి నుంచే పని చేసుకునే సదుపాయం ఉంటుంది. 
– డిసెంబర్‌ నాటికి సుమారు 4 వేల గ్రామాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఇచ్చేలా అ«ధికారులు ముందడుగు వేస్తున్నారు. ఈ చర్యలతో గ్రామాల నుంచే వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ మరింత బలోపేతం అవుతుంది. అన్ని గ్రామ పంచాయతీల్లో రెండేళ్లలో డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి. 
– విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలలో ఐటీ కాన్సెప్ట్‌ సిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలి. ఇందుకు అవసరమైన భూములను గుర్తించాలి.  
– కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నిర్మిస్తున్న వైఎస్సార్‌ ఈఎంసీ ప్రగతి గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. అక్టోబర్‌లో ప్రారంభోత్సవం చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 
– ఈ సమీక్షలో పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి,  ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌  క్లస్టర్స్‌(ఈఎంసీ) సీఈఓ ఎం.నందకిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement