quality education
-
మన విద్యా రంగమే భేష్
‘మన విద్యా విధానం మరింత బలపడాలి. స్కూల్ స్థాయి నుంచే ఉన్నత అవకాశాలు కల్పించే విధంగా బోధన ఉండాలి. యువతకు కళాశాల స్థాయిలోనే విస్తృత బోధన సదుపాయాలు కల్పించాలి’ – మన విద్యా రంగంపై నిరంతరం వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది.అయితే దీనికి భిన్నంగా.. మన విద్యా వ్యవస్థ.. కెరీర్ అవకాశాల విషయంలో నేటి తరం యువత స్పందించడం గమనార్హం. ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశ విద్యా విధానమే బాగుంటుందనే ఆశాభావాన్ని యువత వ్యక్తం చేసింది. అదే విధంగా కెరీర్ అవకాశాల కోణంలోనూ భవిష్యత్.. బ్రహ్మాండంగానే ఉంటుందనే రీతిలో స్పందించింది.ఈ వివరాలు.. టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు నిర్వహించే ప్రముఖ టెస్టింగ్ సంస్థ.. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్)(ETS survey) నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి. ఈ మేరకు మొత్తం 18 దేశాల్లో 18 వేల మంది యువత అభిప్రాయాల ఆధారంగా మానవాభివృద్ధి నివేదికను ఈటీఎస్ విడుదల చేసింది. ఇందులో పలు అంశాలను స్పృశించింది.మన విద్యా వ్యవస్థ బాగుంటుంది..మన దేశ విద్యా వ్యవస్థ బాగుంటుందని 70 శాతం యువత సర్వేలో ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే భవిష్యత్తులోనూ ప్రగతి ఉంటుందని 76 శాతం మంది పేర్కొన్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం 30 శాతం మంది మాత్రమే తమ విద్యా వ్యవస్థ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 64 శాతం మంది ప్రగతిశీలత ఉంటుందని చెప్పారు.నాణ్యతతో కూడిన విద్య కష్టమే..ఒకవైపు.. మన విద్యా వ్యవస్థ బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన యువత.. నాణ్యమైన విద్యను అందుకోవడం మాత్రం కష్టంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని వర్గాల వారే ప్రయోజనం పొందేలా విద్యావకాశాలు ఉన్నాయని ఏకంగా 78 శాతం మంది పేర్కొన్నారు. అదే విధంగా ఉపాధ్యాయుల కొరత ఉందని 74 శాతం మంది స్పష్టం చేశారు. అలాగే అత్యున్నత నాణ్యమైన కోర్సులు, విద్యా సంస్థల విషయంలో ఇప్పటికీ కొరత ఉందన్నారు.ముందంజలో నిలిచే అవకాశం..ప్రస్తుత అవకాశాలతో కెరీర్లో ముందంజలో నిలవడానికి అవకాశం ఉంటుందని 69% మంది భారత యువత అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 59% మాత్రమే కావడం గమనార్హం. అదే విధంగా 2035 నాటికి తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుందని 72% మంది ఆశాభావం వ్యక్తం చేశారు.ఉద్యోగాల కొరత..ఉద్యోగాల కొరత ఉంటుందని 40 శాతం మంది భారతీయ యువత పేర్కొనగా.. అంతర్జాతీయంగా ఇది 34 శాతంగా నమోదైంది. అదే విధంగా చదువుకోవడం ఖరీదైన విషయంగా మారిందని 33 శాతం మంది వెల్లడించారు. నూతన నైపుణ్యాలవైపు పరుగులు..మన దేశ విద్యార్థులు, ఉద్యోగార్థులు నూతన నైపుణ్యాలు అందిపుచ్చుకోవడంలో పరుగులు పెడుతున్నారని ఈటీఎస్ సర్వే వెల్లడించింది. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది కెరీర్ సుస్థిరతకు తోడ్పడుతుందని 91 శాతం మంది పేర్కొనడం విశేషం. అదే విధంగా యూనివర్సిటీల డిగ్రీలకంటే ఆయా విభాగాల్లో క్రెడెన్షియల్స్, సర్టిఫికేషన్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని 88 శాతం మంది పేర్కొన్నారు.ఏఐ.. అవకాశాల వేదిక..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్న పరిస్థితుల్లో.. తాజా సర్వేలో మాత్రం ఇందుకు భిన్నంగా యువత స్పందించింది. ఏఐని ముప్పుగా భావించట్లేదని, తమకు లభించిన అవకాశంగా భావిస్తున్నామని 88 శాతం మంది స్పష్టం చేయడం విశేషం. అదే విధంగా.. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి పది మంది ఉద్యోగుల్లో నలుగురు.. ఏఐ లిటరసీ, మానవ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు.లాభాపేక్ష లేని సంస్థలు కూడా..దేశంలో అత్యున్నత విద్యను అందించడంలో లాభాపేక్ష లేని సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సంస్థలకు మన దేశం అత్యంత అనుకూల దేశంగా ఉందని.. సర్వేలో పాల్గొన్న వారిలో 26 శాతం మంది తెలిపారు. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 19 శాతంగానే ఉంది.ఆ 3 స్కిల్స్ ప్రధానంగా..జాబ్ మార్కెట్లో ముందంజలో నిలవడానికి ఏఐ/డిజిటల్ లిటరసీ, సృజనాత్మకత, కమ్యూనికేషన్లు కీలకంగా నిలుస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇందుకోసం అవసరమైతే సంస్థలు శిక్షణ సదుపాయాలు కల్పించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.బోధన, మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడాలినేటి యువత వాస్తవ పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకుంటున్నారు. అందుకే అప్ స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్ అవసరమని భావిస్తున్నారు. ఇందుకోసం కళాశాల స్థాయి నుంచే కృషి చేస్తున్నారు. అయితే దీనికి తగినట్లుగా మౌలిక సదుపాయాలు, బోధన అవకాశాలు మరింత మెరుగు పడాలి. అంతర్జాతీయంగా పోలిస్తే మన విద్యార్థులు ఏ దేశంలోనైనా.. ఉన్నత విద్య, ఉద్యోగ రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారు.– రమేశ్ లోగనాథన్, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, కో–ఇన్నోవేషన్స్, ట్రిపుల్ఐటీ–హైదరాబాద్ -
అక్షర యజ్ఞం
పేదబిడ్డల జీవితాల్లో విద్యా వెలుగులు నింపాలని.. వారికి నాణ్యమైన విద్య అందాలని దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ సంస్థ అక్షర యజ్ఞం చేస్తోంది. అభాగ్యులకు అక్షరాలు నేర్పించి సమాజంలో నిలబెట్టాలని సంకల్పించింది. బడిఈడు పిల్లలకు సంస్కారవంతమైన చదువునిచ్చి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో పనిచేస్తోంది ‘వందేమాతరం ఫౌండేషన్’. – తొర్రూరుతొర్రూరు కేంద్రంగా..మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంగా కొనసాగుతున్న వందేమాతరం ఫౌండేషన్ ఎందరో సామాన్య పేదబిడ్డలను అసామాన్యులుగా తీర్చిదిద్దింది. అక్షరాస్యత పెరుగుతోంది..అరాచకాలు తగ్గలేదు. ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి.. నిర్భాగ్యులు ఉంటూనే ఉన్నారు. ఈ విషయాలే తొర్రూరు నివాసి తక్కెళ్లపల్లి రవీంద్రను ఆలోచనలో పడేశాయి. దీనికోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే 2005లో వందేమాతరం ఉద్యమానికి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈమేరకు తన విద్యా ఉద్యమానికి ‘వందేమాతరం’ అని పేరుపెట్టారు. దీనిలో భాగంగా ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. దీంట్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతోపాటు గ్రామస్తుల్ని భాగం చేశారు. ‘వందేమాతరం ఫౌండేషన్’ కార్యక్రమాలు నచ్చి తొర్రూరులో ఎన్నారై డాక్టర్ అశోక్‌రెడ్డి తన కుమారుడు నితిన్ జ్ఞాపకార్థం కట్టించిన సామాజిక భవనాన్ని ఫౌండేషన్ కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి ఇచ్చారు. ఏటా ‘పది’విద్యార్థులకు ఉచిత శిక్షణ శిబిరంఅనేకానేక కారణాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు మార్కుల్లో కార్పొరేట్ విద్యాసంస్థల విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. ఆ పరిమితులను అధిగమించడానికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదోతరగతి పిల్లలకు వార్షిక పరీక్షల ముందు 45 రోజులపాటు విద్యా శిబిరాలు ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, జీవన నైపుణ్య శిక్షకుల చేత మెళకువలు నేర్పిస్తున్నారు. తొమిదేళ్లుగా చేపడుతున్న ఈ శిబిరంలో ఏటా 500 మంది విద్యార్థులకు భోజన, వసతి కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది. ఎంతోమంది విద్యార్థులు పదికి పది గ్రేడ్ తెచ్చుకొని ట్రిపుల్ ఐటీల్లో చేరుతున్నారు. ఈ శిక్షణకు హాజరైన రాయపర్తి మండలం పెర్కవేడు గ్రామానికి చెందిన పుల్లూరు శరత్ ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. ఈ విధానం మెచ్చి పలు జిల్లాల కలెక్టర్లు ఇలాంటి శిబిరాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. » ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఫౌండేషన్ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభా పురస్కారాలు అందిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. రవీంద్ర కృషిని ముఖ్యమంత్రి ప్రశంసించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం పురస్కారాలు అందిస్తుందని సీఎం ప్రకటించారు. » వీఎంఎఫ్ సంస్థ నిర్వహించే ఉచిత శిక్షణ శిబిరాల్లో శిక్షణ పొందిన వారిలో దాదాపు 680 మంది ఐఐటీలకు, 1,500 మంది పేరుమోసిన కళాశాలల్లో ఫ్రీ సీట్లకు అర్హత పొందారు. » అక్షరాభ్యాసం కార్యక్రమం ద్వారా పదేళ్లలో పలు జిల్లాలకు చెందిన 1,93,500 మందికి పైగా విద్యార్థులను పాఠశాలకు దూరం కాకుండా ఉండేందుకు తోడ్పడింది. » రాష్ట్రంలో చదువుపై అమితాసక్తి, చాలా ఉత్సాహవంతులైన ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను ‘కలాం–100’అనే కార్యక్రమం ద్వారా ఎంపిక చేసి వారికి మెడిసిన్, ఐఐటీ, ఇతర పోటీ పరీక్షలకు అవసరమైన ఉచిత శిక్షణను ఫౌండేషన్ అందిస్తోంది. ఆరో తరగతిలో ఉన్నప్పుడే ఎంపిక చేసిన పిల్లలకు దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘకాలం పాటు శిక్షణ అందించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతోంది. » సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 70 గ్రామాల్లో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి పేద బిడ్డలకు విద్యనందిస్తున్నారు. » ఎస్సీఆర్టీతో కలిసి విద్యా ముసాయిదాను తయారు చేశారు. » అక్షరాభ్యాసం మొదలు తల్లిదండ్రులకు వందనం వంటి కార్యక్రమాల ద్వారా స్ఫూర్తిగా నిలిచింది. » బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమ ముసాయి దాకు ఫౌండేషన్ రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.7,200 కోట్లు కేటాయించేందుకు మూలమైంది. » ఫౌండేషన్‌లో శిక్షణ పొందిన 680 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. రూ.2.80 కోట్ల ఉపకార వేతనాలు అందుకున్నారు. » గత కొన్నేళ్లలో 903 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు, 47 మంది ఐఐటీలకు ఎంపికయ్యారు. వివిధ ఎన్ఐటీల్లో 105 మంది, 2,400 మంది విద్యార్థులు పాలిటెక్నిక్‌కు, 4వేల మంది ఇంటర్ ఉచిత విద్య అవకాశాలను అందిపుచ్చుకున్నారు. 280 మంది ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు. » సంస్థ కార్యక్రమాలు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోనూ కొనసాగుతున్నాయి. » వందేమాతరం ఫౌండేషన్‌కు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు రావాలి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రతిభలో ఎవరికీ తీసిపోరు. వారికి తగిన తోడ్పాటు అందించకపోవడమే వారి ప్రతిభకు ప్రతిబంధకంగా మారుతోంది. వారిలోని నైపుణ్యాలను వెలికితీసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకే ఏటా ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం. దాతల సహాయంతో శిబిరం విజయవంతంగా నడుపుతున్నాం. విద్యతోపాటు జీవితంపై పలురకాల నైపుణ్య అంశాలపై విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నాం. ప్రభుత్వం సైతం ఇలాంటి శిబిరాలను నిర్వహిస్తే పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. – తక్కెళ్లపల్లి రవీంద్ర, వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ ఫౌండేషన్ కృషితో లక్షలాది మంది జీవితాల్లో వెలుగులుపేద బిడ్డల అభ్యున్నతికి వందేమాతరం ఫౌండేషన్ చేస్తున్న కృషి వెలకట్టలేనిది. అక్షరాలు అందిస్తే పేద బిడ్డలు అత్యున్నత స్థాయికి ఎదుగుతారని రవీంద్ర అభిలాష. ఆయన సంకల్పానికి 2009 నుంచి తోడుగా ఉన్నాను. నా శేష జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చే సేవ ఇదే. విద్యార్థులు చదువుతో సంస్కారం, క్రమశిక్షణ నేర్చుకోవడం మంచి పరిణామం. – చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త -
ఆమె ఒడి... అనాథల బడి
‘మా అమ్మాయి బాగా చదువుకోవాలి. పెద్ద ఉద్యోగం చేయాలి’ అనే కల తల్లిదండ్రులు అందరికీ ఉంటుంది. మరి అనాథపిల్లల గురించి ఎవరు కల కంటారు? సమాధానం వెదుక్కోవాల్సి ఉంటుంది. ఎవరో ఎందుకు కల కనాలి? ఆ పిల్లలే బాగా చదువుకుంటే బాగుంటుంది కదా! అయితే, అనిపించవచ్చు. ‘పేరుకే చదువు’ అనుకునే పరిస్థితుల్లో... నాణ్యమైన విద్య అనేది అందని పండు అనుకునే పరిస్థితుల్లో ఆ పిల్లల చదువు ముందుకు సాగకపోవచ్చు. కల కనడం అసాధ్యం కావచ్చు. ఈ పరిస్థితిని గమనించిన న్యాయమూర్తి సునీత కుంచాల అనాథపిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఒక వేదికను ఏర్పాటు చేశారు.న్యాయసేవాధికార సంస్థ తరఫున అనాథ బాలల వసతి గృహాలను సందర్శిస్తూ ఉంటుంది నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల. అలా వెళుతున్న క్రమంలో బాలికల సదన్‌లో పిల్లలు చదువుకుంటున్న తీరు ఆమెకు బాధగా అనిపించేది. ‘నేను మాత్రం ఏంచేయగలను!’ అనే నిట్టూర్పుకు పరిమితం కాలేదు.‘ఏదైనా చేయాల్సిందే’ అని గట్టిగా అనుకున్నారు. ఆనుకున్నదే ఆలస్యం అక్కడ ఉన్న 30 మంది బాలికలకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందడుగు వేశారు.ఒక మంచిపనికి పూనుకున్నప్పుడు, ‘మీ సహకారం కావాలి’ అని అడిగితే ఎవరు మాత్రం ముందుకు రారు! సునీత అడగగానే హైకోర్టు న్యాయవాది సరళ మహేందర్‌రెడ్డి 23 మంది బాలికలకు తమ పాఠశాల ‘రవి పబ్లిక్ స్కూల్’లో పదవ తరగతి వరకు ఉచితంగా చదువు అందించేందుకు ముందుకు వచ్చారు. సరళ మహేందర్ రెడ్డి స్ఫూర్తితో మరో రెండు పాఠశాలల వారు తమ వంతు సహకరిస్తామని ముందుకు వచ్చారు. దీంతో నిజామాబాద్ ‘బాలసదన్’లోని 30 మంది అనాథ బాలికలకు నాణ్యమైన విద్య అందుతోంది.సునీత కుంచాలకు సహాయం అందించడానికి ఐపీఎస్ అధికారులు రోహిణి ప్రియదర్శిని (సెవెన్త్ బెటాలియన్ కమాండెంట్), కల్మేశ్వర్ శింగనవార్ (నిజామాబాద్ పోలీసు కమిషనర్), ఐఏఎస్ అధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు(నిజామాబాద్ కలెక్టర్) ముందుకు వచ్చారు. విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ డ్రెస్... ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను అందించేందుకు సునీతతో పాటు పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ శింగనవార్, బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని సిద్ధమయ్యారు. వీరంతా కలిసి తమ బ్యాచ్‌మేట్స్ సహకారంతో కొంత మొత్తాన్ని సమకూర్చారు. బాలికలను తమ స్కూల్స్‌కు వెళ్లివచ్చేందుకు వీలుగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పోలీసు వాహనాన్ని సమకూర్చారు. తాము బదిలీ అయ్యాక కూడా ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగేందుకు వీలుగా ‘భవిష్య జ్యోతి’ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేశారు.ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా తెరిచి వాట్సాప్ గ్రూపు ద్వారా ప్రతి లావాదేవీని పారదర్శకంగా కనిపించేలా చేశారు. ‘విద్య అనే పునాది గట్టిగా ఉంటేనే కలలు నిలుస్తాయి. సాకారం అవుతాయి’ అంటున్న సునీత కుంచాల ఇతర జిల్లాల్లోనూ అధికారుల సహకారం తీసుకొని ఇలాంటి ట్రస్ట్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. భవిష్యత్తుకు భరోసా!ఒక జిల్లా న్యాయమూర్తిగా లైంగిక వేధింపులకు గురైన బాధిత అమ్మాయిలను చూశాను. తల్లిదండ్రులు లేని ఆ పిల్లలకు ప్రభుత్వం వసతి సదుపాయాల వరకు కల్పిస్తుంది. అయితే చదువుకోకపోతే వారి భవిష్యత్తు ఏంటి అనిపించేది. ఆ ఆలోచనలో భాగంగా ఆ పిల్లలున్న హాస్టల్‌కు వెళ్లాం. వారితో మాట్లాడుతున్నప్పుడు వారి చదువు అంతంత మాత్రంగానే ఉందని అర్థమైంది. వారికి మంచి చదువు ఇప్పించాలనుకున్నాం. సాధారణంగా ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో 25 శాతం నిరుపేద పిల్లలకు ఉచితవిద్యను అందించాలి. స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వాళ్లను పిలిచి, ఈ పిల్లల చదువు గురించి అడిగాం. ఫీజు లేకుండా పిల్లలకు చదువు చెప్పడానికి మూడు స్కూళ్లు ముందుకు వచ్చాయి. అయితే బుక్స్, స్కూల్ డ్రెస్‌ల సమస్య వచ్చింది. ఒక్క ఏడాదితో ఈ సమస్య తీరదు. పిల్లల చదువు పూర్తయ్యేంతవరకు వారికి సాయం అందాలి. దీంతో పిల్లల కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చే స్తే మంచిదనే ఆలోచన వచ్చింది. మా నాన్న గారైన గురువులు గారి స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటు అయింది. దీనిద్వారా దాతలు స్పందించి, పిల్లల చదువుకు సాయం అందిస్తున్నారు. ప్రతి జిల్లాల్లోనూ ఇలాంటి పిల్లలకు నాణ్యమైన విద్యావకాశాలు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపితే బాగుంటుంది. – సునీత కుంచాల, జిల్లా న్యాయమూర్తి, నిజామాబాద్ – తుమాటి భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ -
AP Education Reforms : నాణ్యమైన విద్యతోనే మార్పు, ప్రవాసాంధ్రుల ప్రశంసలు
ప్రపంచాన్ని మార్చడానికి విద్య చాలా ముఖ్యమైన ఆయుధం అని నెల్సన్ మండేలా అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అదే నమ్మకంతో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారు. అమ్మ ఒడి, విద్యా కానుక, ఫీజు రీయింబర్స్మెంట్, ఉన్నత విద్యలో సంస్కరణలు, కొత్త వైద్య కళాశాలలు మొదలైన అనేక సంక్షేమ పథకాలను ఆయన ప్రారంభించారు.ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుని ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు...విద్యకు పెద్ద పీట వేస్తే ఇలాంటివి ఎన్నయినా సాధిస్తారు... ఇదొక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు అనేకం... ఇంగ్లిష్ మీడియం చదువులు, ప్రభుత్వ బడుల్లో ఆధునిక టెక్నాలజీ ఉపయోగం.. బడులు/భవనాల ఆధునికరణ... నాడు నేడు కింద ఆధునీకీకరణ ఎలా జరిగింది. ప్రభుత్వ బడుల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఏమేం సౌకర్యాలు వచ్చాయి.. మరుగు దొడ్లలో మార్పులు... ఇంకా మరెన్నో. విద్యలో చేపట్టిన సంస్కరణల గురించి చర్చించిన ఈ డిబేట్లో రానున్న రోజుల్లో విద్య వల్ల సమాజానికి ఎలాంటి పురోగతిని అనే వాటి గురించి సాక్షి ఒక చర్చ నిర్వహించింది. ఈ చర్చలో అమెరికాలోని పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. డాక్టర్ కామేశ్వర బద్రి, PhD, మోర్హౌస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్, డైరెక్టర్, ప్రెసిడెంట్, అసోసియేషన్ ఆఫ్ సైంటిస్ట్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇన్ అమెరికా, హ్యూస్టన్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేష్ రెడ్డి మైలం, ఫీనిక్స్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధీరజ్ పోలా, హార్ట్ఫోర్డ్ నుంచి చరణ్ పింగిళి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అట్లాంటా నుంచి కమల్ కిరణ్ జనుమల, సీవోవో, రెడ్ యాంట్స్ గ్రూప్ (IT, ఫైనాన్స్ & మీడియా ఈ చర్చల్లో పాల్గొన్నారు. -
విద్యలో తెలంగాణ వెనుకబాటు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): విద్య విషయంలో ఇతర అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వెనుకబడి ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక, మదర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యాసామర్థ్యాలు అందించడం ప్రభుత్వ చట్టబద్ధత బాధ్యతగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, విద్యకు తెలంగాణ రాష్ట్రం బడ్జెట్లో అత్యంత తక్కువ ఖర్చు చేస్తోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చును విద్యపై పెడితే తెలంగాణలో ఉన్న స్కూల్స్ అన్నీ బాగుపడేవని చెప్పారు. కాంట్రాక్టర్లు కమీషన్లు ఇస్తారు కాబట్టే విద్యపై కాకుండా ప్రాజెక్టులపై ఖర్చు చేశారని విమర్శించారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని, సరిపడా టీచర్లు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ శాంతాసిన్హా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దిగజారిన విద్యా ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో డ్రాపౌట్లు పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్య అందించకపోవడం రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘనగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వినర్ ఆర్.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక కన్వినర్ జి.వేణుగోపాల్, మదర్స్ అసోసియేషన్ కన్వినర్ జి.భాగ్యలక్ష్మి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరులు ప్రసంగించారు. -
నాణ్యమైన విద్యను అందించడంలో భారత్ విధానం: యునెస్కో ఛీఫ్
ప్రధాని నరేంద్ర మోదీ మన్కి బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్‌కు చేరుకోవడం చారిత్రాత్మకం. ఈసందర్భంగా ఈ వందవ ఎపిసోడ్‌ని ఇండియాలోని వివిధ భాషలతో సహా 11 విదేశీ భాషల్లో కూడా ప్రసారం చేయడం విశేషం. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో భారత్ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రసారమైంది. ఈ నేపథ్యంలో యునెస్కో చీఫ్ ఆడ్రీ అజౌలే మోదీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మోదీని పలు ప్రశ్నలు అడిగారు. 2030 నాటికి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలనే యునెస్కో లక్ష్యం గురించి అజౌలే మోదీతో మాట్లాడారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్ అనుసరించే మార్గం ఏమిటని మోదీని ప్రశ్నించారు. అందుకు మోదీ బదులిస్తూ..విద్యను అందించడంలో నిస్వార్థంగా పనిచేసిన వారి పేర్లను మోదీ గుర్తు చేస్తుకున్నారు. ఈ మేరకు దివంగత డి ప్రకాశ్ రావుని గుర్తుతెచ్చుకుంటూ..ఆయన టీ అమ్మేవాడు. నిరుపేద పిల్లలను చదివించడమే అతని జీవిత లక్ష్యం అని చెప్పారు. అలాగే జార్ఖండ్ గ్రామాల్లో డిజిటల్ లైబ్రెరీని నిర్వహిస్తున్న సంజయ్ కశ్యప్ , కోవిడ్-19 సమయంలో ఇ లెర్నింగ్ ద్వారా పిల్లలకు సహాయం చేసిన హేమలత గురించి మాట్లాడారు మోదీ. ఇంకా అజౌల్ ఈ ఏడాది భారత్ నేతృత్వంలోని జీ 20 శిఖరాగ్ర సమావేశం గురించి మాట్లాడుతూ..అతర్జాతీయా ఎజెండాలో దేశ సంస్కృతి, విద్యను మోదీ ఎలా అత్యున్నత స్థానంలోకి తీసుకువెళ్లబోతున్నారనే దాని గురించి కూడా అడిగారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతికి పరిరక్షణ, విద్య రెండూ ఇష్టమైన అంశాలుగా నిలిచాయి. అది లక్ష్యద్వీప్‌లోని కుమ్మెల్ బ్రదర్స్ చాలెంజర్ క్లబ్ లేదా కర్ణాటక కావెంశ్రీకీ కళా చేతన్ మంచ్ కూడా కావచ్చు అన్నారు. అలాగే దేశం నలుమూలల నుంచి ప్రజలు లేఖలు ద్వారా అలాంటి వాటి గురించి తెలియజేశారు. అందులో భాగంగా మేము రంగోలి, దేశ భక్తిగీతాలు, లాలి పాటలు కంపోజ్ చేయడం గురించి మాట్లాడుకున్నాం. ఈ కార్యక్రమం వల్లే విభిన్న ప్రపంచ సంస్కృతిని మరింత సుసంపన్నం చేయాలనే సంకల్పం బలపడిందని మోదీ చెప్పారు. (చదవండి: మన్ కీ బాత్ @100.. మోదీ కామెంట్స్ ఇవే..) -
బైజూస్ బోధన..ఉచితంగా నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కొనే విధంగా నాణ్యమైన విద్య అందించేందుకు బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. విద్యార్థిని ఇంగ్లిష్ మీడియంలో తీర్చిదిద్దేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతోంది. ప్రైవేట్‌గా ఈ తరహా విద్యాబోధనకు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ తరహా విద్యను ప్రారంభించి ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది. నెల్లూరు (టౌన్): ప్రభుత్వ పాఠశాలలంటే ఆకర్షించే తరగతి గదులు, మౌలిక వసతులే కాకుండా నాణ్యమైన విద్య సైతం అందించడమే లక్ష్యంగా ఇప్పటికే నాడు–నేడుతో పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలు ఉండే విధంగా జిల్లాలో 51 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టారు. దీంతో పాటు మెరుగైన బోధన అందించేందుకు జిల్లాలో 17 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్‌ను ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునే విధంగా నాణ్యమైన విద్య అందించేందుకు బైజూస్ ఎడ్టెక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 4వ తరగతి నుంచి బైజూస్ ద్వారాా ఆన్లైన్లో వీడియో పాఠాలు బోధన అందించే విధంగా చర్యలు చేపట్టింది. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఉచితంగా నాణ్యమైన విద్య ఉమ్మడి జిల్లాలో 4 నుంచి 10వ తరగతి వరకు 1,42,907 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ బైజూస్ అప్లికేషన్ ద్వారా తరగతికి సంబంధించి కంటెంట్‌ను అప్లోడ్ చేయనున్నారు. బైజూస్యాప్తో విద్యాబోధన అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ఈ యాప్‌తో పాటు ఇంగ్లిషు లెర్నింగ్ యాప్‌ను ఉచితంగా అందజేస్తోంది. పర్చువల్ పద్ధతిలో ప్రశ్నలు, జవాబులు ఉంటాయి. విద్యార్థి స్వయంగా నేర్చుకునే విధంగా యాప్‌ను రూపకల్పన చేశారు. యానిమేషన్, బొమ్మలు, గ్రాఫిక్స్ ద్వారా విద్యార్థులు బోధనను మరింత సులభంగా అర్థం చేసుకునే వీలుంటుంది. సోషల్, సైన్స్, మ్యాథ్స్ తదితర సబ్జెక్ట్లన్నింటిని ఇంగ్లిష్తో పాటు తెలుగులో అందుబాటులో ఉంచనున్నారు. దీంతో విద్యార్థులు భాషా పరంగా ఇబ్బందులు ఎదుర్కొకుండా సులభంగా అర్థం చేసుకోగలరు. వీడియో పాఠాలు నాణ్యతతో పాటు స్పష్టతతో ఉంటాయి. నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు ప్రశ్నలు యాప్‌లో పొందుపరిచారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాలపై నెలవారీగా ప్రొగ్రెస్ రిపోర్టు ఇవ్వనున్నారు. బైజూస్ యాప్‌ను విడిగా కొనుగోలు చేయాలంటే రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. అటువంటిది ఉచితంగా అందిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో 85,572 మంది బైజూస్ ప్రీమియం యాప్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే యాప్ ద్వారా విద్యాబోధన ప్రారంభమైంది. 21,092 మందికి ఉచితంగా ట్యాబ్‌లు బైజూస్ వీడియో పాఠాల కోసం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 21,092 మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లను అందజేయనున్నారు. ట్యాబ్‌లను ఈ నెలలో ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బయట మార్కెట్లో ఒక్కో ట్యాబ్ ధర 19,446 ఉంది, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.12,843లకే అందుబాటులోకి తీసుకురానుంది. బైజూస్ కంటెంట్‌కు ఒక్కో విద్యార్థిపై తరగతి బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం 8వ తరగతి విద్యార్థులకు సబ్జెక్ట్‌లకు సంబంధించి కంటెంట్‌ను అప్లోడ్ చేయనున్నారు. వీళ్లు 9వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతికి వెళ్లే సమయంలో ఆయా తరగతి సబ్జెక్ట్‌లకు సంబంధించిన కంటెంట్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు. విద్యార్థులకు బైజూస్ ప్లాట్‌ఫాం లాంటిది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బైజూస్ ప్లాట్‌ఫాం లాంటింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బైజూస్‌తో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు మెరుగైన బోధన అందించడం అభినందనీయం. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు. వీడియో పాఠాల ద్వారా బైజూస్ సబ్జెక్ట్‌లకు సంబంధించి కంటెంట్‌ను అందిస్తోంది. రివిజన్‌కు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. – సుబ్బారావు, ఇన్చార్జి డీఈఓ -
మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్
సాక్షి, అమరావతి: విద్యా పరంగా ప్రపంచంతో పోటీ పడేలా మన పిల్లలను తీర్చిదిద్దాలనే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం, చిత్తశుద్ధి, ఆశయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే పిల్లలు సీబీఎస్ఈ బోర్డు (పదో తరగతి) పరీక్షలు సమర్థవంతంగా రాసేలా ఇప్పటి నుంచే తీర్చిదిద్దుతోంది. టెక్నాలజీ ఆధారిత నాణ్యమైన విద్య అందించేంబదుకు అవసరమైన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే 4.72 లక్షల మంది పిల్లలకు రూ.606.18 కోట్ల వ్యయంతో, 8వ తరగతి పాఠాలు చెప్పే 50,194 మంది టీచర్లకు రూ.64.46 కోట్లతో ప్రముఖ కంపెనీ శ్యామ్‌సంగ్ ట్యాబ్‌లను ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా అతి పెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ ఉచితంగా కంటెంట్‌ను ఇవ్వనుంది. రివర్స్ టెండరింగ్‌తో మార్కెట్ ధర కంటే తక్కువ ► జగనన్న విద్యా కానుకలో భాగంగా ఈ ఏడాది నవంబర్ 15 తర్వాత 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ట్యాబ్‌లు పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శ్యామ్‌సంగ్ ట్యాబ్‌లను అత్యంత పారదర్శకంగా, రివర్స్ టెండరింగ్ ద్వారా బయట మార్కెట్ కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. ► మెమొరీ కార్డుతో సహా మూడేళ్ల వారంటీ వంటి ఫీచర్స్ అన్నీ కలిపితే బయట మార్కెట్లో శ్యామ్‌సంగ్ ఒక్కో ట్యాబ్ ఖరీదు రూ.16,446 చొప్పున.. 5.22 లక్షల ట్యాబ్‌లకు రూ.858.48 కోట్ల వ్యయం అవుతుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా పారదర్శకంగా వ్యవహరించడంతో ఒక్కో ట్యాబ్‌ను రూ.12,843 చొప్పున 5.22 లక్షల ట్యాబ్‌లను రూ.670.64 కోట్లతో కొనుగోలు చేస్తోంది. ఈ లెక్కన రూ.187.84 కోట్లు ఆదా చేసింది. ► 5.22 లక్షల మంది 8వ తరగతి పిల్లలు, టీచర్లకు రూ.1,923.20 కోట్ల విలువైన బైజూస్ కంటెంట్‌ను, శ్యామ్‌సంగ్ ట్యాబ్‌లను ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది. ఒక్కో విద్యార్థికి, టీచర్‌కు రూ.24 వేల విలువైన బైజూస్ కంటెంట్, రూ.12,843 ట్యాబ్ కలిపి మొత్తం రూ.36,843 విలువైన మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తోంది. ట్యాబ్‌ల ప్రత్యేకతలు ఇవీ.. ► ట్యాబ్‌లు, బ్యాటరీకి మూడేళ్ల వారంటీ (సాధారణంగా ఏడాది మాత్రమే) ఉంటుంది. ► మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ (ఎండీఎం), ఓటీజీ కేబుల్, ఫ్లిప్ కవర్‌తో 8.7 అంగుళాలు ఉంటుంది. ► పిల్లలు చూడకూడని సైట్లు బ్లాక్ చేసే సాఫ్ట్‌వేర్‌ను ట్యాబ్‌లలో లోడ్ చేసి ఇస్తారు. తద్వారా పిల్లలు అవాంఛనీయ సైట్ల జోలికి వెళ్లే అవకాశం ఏ కోశానా ఉండదు. ► కంటెంట్ డేటా కార్డుతో పాటు 64 జీబీ మెమొరీ కార్డు. ► ఏటా పదవ తరగతి వరకు విద్యార్థులకు ఇదే ట్యాబ్‌లో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి ఇస్తారు. ► ప్రతి ఏటా ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్, బైజూస్ కంటెంట్ ఇస్తారు. ► ఏదైనా రిపేరు వస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇస్తే.. వారంలోగా సరిచేసి లేదా రీప్లేస్ చేసి ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. బ్యాటరీ పాడైపోయినా రీప్లేస్ చేయనున్నారు. ► విజువల్ గ్రాఫిక్స్‌తో కూడిన కంటెంట్‌ను ట్యాబ్‌లో అప్లోడ్ చేయడంతో పిల్లలు సులభంగా అర్థం చేసుకోనున్నారు. బైజూస్‌తో ఒప్పందంలో ముఖ్యాంశాలు ► ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 32 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. బైజూస్‌తో ఒప్పందంతో వీరందరికీ లెర్నింగ్ యాప్ ద్వారా నాణ్యమైన విద్య అందుతుంది. ► 2025 నాటికి పదో తరగతి విద్యార్థులు, అంటే ఇప్పటి 8వ తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ నమూనాలో పరీక్షలు రాసేందుకు వీలుగా వారిని సన్నద్ధం చేసేందుకు ఈ యాప్‌తోపాటు అదనంగా ఇంగ్లిష్ లెర్నింగ్ యాప్ కూడా ఉచితంగా అందుబాటులోకి వస్తోంది. ► బైజూస్ లెర్నింగ్ యాప్‌లో బోధన అత్యంత నాణ్యతగా ఉంటుంది. యానిమేషన్, బొమ్మలు, గ్రాఫ్స్ ద్వారా విద్యార్థులు మరింత సులభంగా, క్షుణ్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. ► మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఈ సబ్జెక్టులన్నీ ఇటు ఇంగ్లిష్, అటు తెలుగు మాధ్యమంలోనూ అందుబాటులో ఉంటాయి. తద్వారా భాషా పరమైన ఆటంకాలు లేకుండా పిల్లలు సులభంగా నేర్చుకునేందుకు ఉపయోగ పడుతుంది. ► వినూత్న, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంతో వీడియో పాఠ్యాంశాలు అత్యంత స్పష్టత, నాణ్యతతో ఉంటాయి. ► విద్యార్థులు ఎంత వరకు నేర్చకున్నారన్న దానిపై ప్రతి ఒక్కరికీ ఫీడ్ బ్యాక్ పంపుతారు. ► సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా మ్యాపింగ్ చేస్తూ యాప్‌లో పాఠ్యాంశాలకు రూపకల్పన చేశారు. సీబీఎస్ఈ పాఠ్య ప్రణాళికను అనుసరించి ప్రతి సబ్జెక్టులో.. ప్రతి అధ్యాయంలోనూ వివిధ అంశాలపై ప్రశ్నావళి ఉంటుంది. ► 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, సామాన్య శాస్త్రం సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఇంటరాక్టివ్ గేమ్స్ కూడా యాప్‌లో ఉంటాయి. ► పునశ్చరణ చేసుకునేలా, నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు, అభ్యసనం కోసం వెనువెంటనే ప్రశ్నలు, వీడియోలు, గేమ్స్, అనుకరణ.. అన్నీ యాప్‌లో పొందుపరిచారు. ► 6 నుంచి 8వ తరగతి వరకు మ్యాథ్స్‌లో ఆటో సాల్వర్ స్కాన్ క్వశ్చన్స్ (లైవ్ చాట్ పద్ధతిలో నేరుగా), స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ ఈ యాప్ ద్వారా లభిస్తాయి. ► తరచూ సాధన చేయడానికి వీలుగా మాదిరి ప్రశ్నపత్రాలు అందుబాటులోకి వస్తాయి. ► విద్యార్థి నేర్చుకున్న అంశాలపై నెలవారీగా ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తారు. ఆన్లైన్లో ఉపాధ్యాయుడితో మీటింగ్ కూడా ఉంటుంది. -
నాణ్యమైన విద్యే లక్ష్యం
పాఠశాలల్లో కొన్ని తరగతుల విలీనం చేయడం ద్వారా నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల తరగతులు, హైస్కూల్లో ప్రాథమికోన్నత పాఠశాల తరగతులు విలీన ప్రక్రియను ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరంభించింది. అయితే ఈ విధానాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నా.. విద్యార్థుల్లో కింది తరగతుల నుంచే విద్యా ప్రమాణాలు పెంపు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెల్లూరు (టౌన్): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే విద్యా విధానంలో అనేక సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా 2022–23 విద్యా సంవత్సరం నుంచి మరో కొత్త అడుగు వేసింది. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఒకటి నుంచి మూడు కి.మీ. దూరంలో ఉండే ప్రాథమికోన్నత పాఠశాలల్లో, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 6, 7, 8 తరగతుల విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా విద్యాశాఖాధికారులు ఈ మేరకు పాఠశాలల విలీనం మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పటికే కొంత మంది విద్యార్థులను సమీప పాఠశాలల్లో విలీనం చేశారు. మరికొన్ని పాఠశాలల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. 17,588 మంది విద్యార్థులు విలీనం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కి.మీ. దూరంలోపు ఉన్న 478 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను 276 హైస్కూల్స్ల్లోకి విలీనం చేశారు. మరో 113 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను 87 ప్రా«థమికోన్నత పాఠశాలల్లోకి విలీనం చేశారు. కిలో మీటరు నుంచి 3 కి.మీ.లోపు ఉన్న 19 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతులు చదువుతున్న విద్యార్థులను 15 ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేశారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 17,588 మంది విద్యార్థులు విలీనమయ్యారు. ఫౌండేషన్ నుంచి హైస్కూల్ ప్లస్‌గా ఏర్పాటు నూతన విద్యావిధానం అమల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి ఫౌండేషన్ స్కూల్స్ నుంచి హైస్కూల్స్ ప్లస్‌గా తరగతుల వారీగా ఏర్పాటు చేయనున్నారు. ఫౌండేషన్ స్కూల్స్‌గా పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు, ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్‌గా పీపీ–1, పీపీ–2, 1 నుంచి 5 తరగతుల వరకు, ప్రీ హైస్కూల్స్‌లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, హైస్కూల్లో 3 నుంచి 10వ తరగతి వరకు, హైస్కూల్ ప్లస్ స్కూల్లో 3 నుంచి 12 తరగతుల వరకు నిర్వహిస్తారు. నూతన విద్యా విధానం ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఉపాధ్యాయుడిని నియమించనున్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు నూతన విద్యా విధానం అమలు చేయడంతో ఉపాధ్యాయులను త్వరలో సర్దుబాటు చేయనున్నారు. ప్రతి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ఇప్పటికే అవసరానికి మించి 2,514 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కలు తేల్చారు. 980 మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నట్లు తేలింది. వీరిని విద్యార్థులు ఎక్కువ సంఖ్య ఉన్న పాఠశాలలను గుర్తించి సర్దుబాటు చేయాలని ఆదేశించారు. ప్రతి సబ్జెక్ట్‌కు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఉపాధ్యాయులకు వారంలో 30 నుంచి 32 గంటలకు మించి పనిభారం పడకుండా 45 పిరియడ్లకు మించకుండా చర్యలు తీసుకోనున్నారు. విలీనం వల్ల ఉపయోగాలు విద్యార్థుల్లో ప్రాథమిక తరగతుల నుంచి విద్యా పునాదులు వేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులు ఉన్నా.. విద్యార్థులను బట్టి ఒకరిద్దరూ మాత్రమే ఉపాధ్యాయులు ఉంటారు. దీని వల్ల ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులను బోధించడం వల్ల ప్రాథమిక స్థాయిలో మెరుగపడడం కష్టం. అదే 3, 4, 5 తరగతులను హైస్కూల్స్‌లో విలీనం చేయడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రాథమిక విద్య నుంచే సబ్జెక్ట్‌కు ఒక టీచరు బోధించడం వల్ల విద్యార్థులోనైపుణ్యం పెరగడంతో పాటు ఉత్తమ బోధన అందుతుంది. ఉన్నత పాఠశాలల్లో ల్యాబ్, గ్రంథాలయం ఉండడం వల్ల విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది. ఆటలు ఆడుకునేందుకు విశాల మైదానం ఉంటుంది. బాలురు, బాలికలకు విడివిడిగా టాయ్‌లెట్స్ ఉంటాయి. వీటితో పాటు మెరుగైన వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం వల్ల విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వ ఆలోచన. విద్యార్థులకు ఎంతో మేలు 3, 4, 5 తరగతులను హైస్కూల్స్‌ల్లో విలీనం చేయడం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. ప్రతి సబ్జెక్ట్‌కు ఒక టీచరు ఉండడం వల్ల సబ్జెక్ట్‌పై విషయ పరిజ్ఞానం పెంచకునేందుకు వీలు పడుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబరు 117ను స్వార్థంగా ఆలోచించే ఉపాధ్యాయలు మాత్రమే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. – జీవీ ప్రసాద్, ఏపీ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ ఏ ఒక్క పాఠశాల మూతపడదు నూతన విద్యా విధానం వల్ల ఏ ఒక్క పాఠశాల మూతపడదు. 3, 4, 5 తరగతుల విద్యార్థులను కి.మీ. లోపు ఉంటే హైస్కూల్స్‌కు పంపిస్తున్నాం. ఆరు అంచెల విద్యావిధానాన్ని అమలు చేస్తున్నాం. 3, 4 ,5 తరగతులకు సబ్జెక్ట్‌కు ఒక టీచరు ఉండడం వల్ల నాణ్యమైన బోధన అందుతుంది. హైస్కూల్స్‌ల్లో పూర్తిస్థాయిలో వసతులు ఉంటాయి. – పి. రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి -
పిల్లల భవిష్యత్తు కోసం...
తల్లిదండ్రులకు పిల్లలంటే పంచ ప్రాణాలు. వారి కోసం ఏ త్యాగానికి అయినా సిద్ధంగా ఉంటారు. చెప్పలేనంత ప్రేమ కురిపిస్తారు. ఇవన్నీ సహజమే. వారి మెరుగైన భవిష్యత్తుకు మీరు ఏమి చేయగలరు? ఇది అత్యంత కీలకమైన విషయం. ‘పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి విద్య’ అని వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు. కనుక పిల్లలపై ప్రేమతో మీరు ఏం చేసినా అది నాణేనికి ఒక కోణమే. వారికి నాణ్యమైన విద్య అందించడం రెండో కోణం అవుతుంది. దీనికి ముందు చూపు కావాలి. పక్కా ఆచరణతో నడవాలి. మెరుగైన ప్రణాళిక కావాలి. దీనికి క్రమశిక్షణ తోడవ్వాలి. అప్పుడే కల నెరవేరుతుంది. భవిష్యత్తుకు సంబంధించి ఏ లక్ష్యాలు సాధించాలని అనుకుంటున్నారు? వాటికి ఎంత వ్యవధి ఉంది? వీటిపై ముందు స్పష్టత తెచ్చుకోవాలి. పిల్లలకు సంబంధించి భవిష్యత్తు లక్ష్యాల్లో ముందుగా వచ్చేది విద్యా అవసరాలే. తర్వాత వివాహం. సాధారణ ద్రవ్యోల్బణం కంటే విద్యా ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా ఉంటోంది. ఫీజులు ఏటా 10–15% చొప్పున పెరుగుతున్నాయి. కనుక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో విద్యకు అయ్యే వ్యయంపై అంచనాలకు రావాలి. ఉన్నత విద్యా ఖర్చుల కోసం ముందు నుంచి సన్నద్ధం కావాలి. వివాహ ఖర్చు అన్నది మీ చేతుల్లో ఉండేది. పరిస్థితులకు అనుగుణంగా కొంత తగ్గించుకోగలరు. ముందు విద్యకు ప్రాధా న్యం ఇచ్చి, ఆ తర్వాత వివాహ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. విద్యా ఖర్చుకు సంబంధించిన అంచనాల్లో ఎక్కువ మంది బోల్తా పడుతుంటారు. ఆ సమయం వచ్చే సరికి కావాల్సినంత సమకూరదు. కనుక పెరిగే ఖర్చులకు తగ్గట్టు పొదుపు ప్రణాళికలు ఉండాలి. అధిక నాణ్యమైన విద్యను అందించే సంస్థలు, అత్యుత్తమ బోధనా సిబ్బంది, వసతులు, విదేశీ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు కలిగినవి సహజంగానే విద్యార్థులను ఆకర్షిస్తుంటాయి. ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే ఈ తరహా విద్యా సంస్థల ఫీజులు అధికంగా ఉంటుంటాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఇవి గరిష్ట ఫీజులను వసూలు చేస్తుంటాయి. చదువుతోపాటు ఇతర కళలు విద్యతోపాటే సమాంతరంగా పిల్లలకు నేర్పించే ఇతర నైపుణ్యాలు కూడా ఉంటాయని మర్చిపోవద్దు. క్రీడలు, సంగీతం, కళలు తదితర వాటిల్లో ఏదైనా ఒక విభాగంలో మీ చిన్నారిని చాంపియన్‌గా తీర్చిదిద్దాలనుకోవచ్చు. కనుక ఈ తరహా నైపుణ్యాల కోసం చేసే ఖర్చు అదనంగా ఉంటుంది. దీనికితోడు విడిగా ట్యూషన్ చెప్పించాల్సి రావచ్చు. ఆ ఖర్చును కూడా తల్లిదండ్రులు పరిగణనలోకి తీసుకోవాలి. వ్యయ అంచనాలు శిశువుగా ఉన్నప్పుడే పిల్లలకు సంబంధించి ప్రణాళిక మొదలు పెడితే.. పెట్టుబడులకు ఎంతలేదన్నా 15–20 ఏళ్ల కాలవ్యవధి మిగిలి ఉంటుంది. ఈ కాలంలో ద్రవ్యోల్బణం సగటున ఎంత ఉంటుందన్న అంచనాకు రావాలి. ఒకవేళ ఉన్నత విద్య కోసం పిల్లలను విదేశీ విద్యా సంస్థలకు పంపించాలనుకుంటే అప్పుడు ద్రవ్యోల్బణంతోపాటు.. రూపాయి మారకం విలువను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సగటు విద్యా ద్రవ్యోల్బణం 8–10 శాతం మధ్య ఉంటోంది. ఐదేళ్ల క్రితం ఇది 6 శాతం స్థాయిలోనే ఉంది. కనుక భవిష్యత్తులోనూ 8–10 శాతం వద్దే ఉంటుందని అనుకోవడానికి లేదు. ఇంకాస్త అదనపు అంచనా వేసుకున్నా నష్టం ఉండదు. భవిష్యత్తులో ఏ కోర్సు చేయాలన్నది పిల్లల అభిమతంపైనే ఆధారపడి ఉంటుంది. అది ముందుగా తెలుసుకోలేరు. కనుక తల్లిదండ్రులు తమ ఇష్టానుసారం ఒక కోర్సును అనుకుని దానికి సంబంధించి ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఈ అంచనాకు 10 శాతం అదనంగా సమకూర్చుకునే ప్రణాళికతో ముందుకు సాగిపోవాలి. విదేశీ విద్య అయితే.. గతంతో పోలిస్తే విదేశాల్లో గ్రాడ్యుయేషన్, ప్రోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వారి సంఖ్య పెరిగింది. విదేశీ విద్యతో విదేశాల్లోనే మెరుగైన అవకాశాలు సొంతం చేసుకుని అక్కడే స్థిరపడాలన్న ధోరణి కూడా పెరుగుతోంది. తల్లిదండ్రులుగా మీ పిల్లలను విదేశాలకు పంపించాలనుకుంటే.. లేదా పిల్లలు భవిష్యత్తులో విదేశీ ఆప్షన్ కోరుకునే అవకాశం ఉందనుకుంటే.. అందుకోసం పెద్ద నిధి అవసరం పడుతుంది. ఐఐఎంలో చేసే కోర్సు వ్యయంతో పోలిస్తే హార్వర్డ్ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కోర్సు వ్యయం నాలుగైదు రెట్లు అధికంగా ఉంటోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కోర్సులను అందించే దేశీయ ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ కోర్సుల వ్యయాలు అధికంగానే ఉన్నాయి. విదేశీ విద్య అయితే అక్కడ నివాస వ్యయాలు కూడా కలుస్తాయి. ఇవి ఎక్కువగా ఉంటాయి. దేశీయంగా అయితే నివాస వ్యయాలు తక్కువగా ఉంటాయి. పేరున్న విద్యా సంస్థల్లో అధిక ఫీజులు ప్రైవేటు విద్యా సంస్థల్లో కోర్సులకు అధిక ఫీజులు చెల్లించాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చౌకగా పూర్తవుతుందనే అభిప్రాయం ఉంటే దాన్ని తీసివేయండి. ప్రభుత్వంలోనూ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు చాలానే ఉన్నాయి. వీటిల్లో కోర్సుల వ్యయాలు ప్రైవేటుకు ఏ మాత్రం తీసిపోవు. ఐఐటీలు, నిట్లు, ఏఐఐఎంఎస్, ఐఐఎస్సీ, ఐఐఎంల్లో ప్రవేశాలకు ఏటా డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇక్కడ సరఫరా తక్కువ డిమాండ్ ఎక్కువ. కాకపోతే వీటిల్లో కోర్సులకు ‘హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ’ నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. వీటిల్లో చాలా ఇనిస్టిట్యూషన్స్ సొంతంగానే వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కనుకనే ఎప్పటికప్పుడు ఇవి ఫీజులను సవరిస్తున్నాయి. ప్రాథమిక విద్య నిర్లక్ష్యం వద్దు.. పిల్లల భవిష్యత్తు విద్యా అవసరాలకు ప్రణాళిక వేసుకునే సమయంలో పాఠశాల విద్యను తక్కువ అంచనా వేసుకోవద్దు. కొన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నత విద్యా కోర్సుల స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. పిల్లల విద్య ఖర్చు భరించలేక అప్పులు చేసే వారు చాలా మంది ఉన్నారు. ముందు చూపు లేకపోవడం వల్ల వచ్చే సమస్యే ఇది. ముందు నుంచే కావాల్సినంత మేర పొదుపు, మదుపు చేస్తూ వస్తే రుణాల అవసరం ఏర్పడదు. ఒకవేళ కొంచెం అంచనాలు తప్పినా పెద్ద ఇబ్బంది ఏర్పడదు. విద్యా రుణాలను ఉన్నత విద్య సమయంలో తీసుకోవడం తప్పు కాదు. అది పూర్తగా వారికొచ్చే వేతనం నుంచి చెల్లింపులు చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ, పాఠశాల విద్యకు సొంత వనరులే మార్గం కావాలి. మొదటి నుంచే రుణ బాట పడితే.. 15 ఏళ్ల తర్వాత భారీ వ్యయాలు అయ్యే కోర్సుల్లో చేరటం కష్టమవుతుంది. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో పిల్లల విద్యకు సంబంధించి పెట్టుబడుల విషయంలో భావోద్వేగాలకు చోటు ఇవ్వొద్దు. తమ అవసరాలకు సరిపడే ఉత్పత్తులను ఎక్కువ మంది ఎంపిక చేసుకోకపోవడాన్ని గమనించొచ్చు. పిల్లల కోసం పెట్టుబడి, తమకు ఏదైనా జరగరానికి జరిగితే బీమా రక్షణ కలగలసిన ఉత్పత్తులను ఎంపిక చేసుకుంటుంటారు. కానీ, బీమా, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈ రెండూ విడిగా లభించే సాధనాలు. అటువంటప్పుడు రెండింటినీ కలపాల్సిన అవసరం ఏముంటుంది? అందుకుని ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్‌ను తగినంత కవరేజీతో తీసుకోవాలి. ఏదైనా ఊహించనిది జరిగితే ఎంతో ప్రేమించే తమ కుటుంబం ఇబ్బందుల్లో పడకుండా టర్మ్ ప్లాన్ ఆదుకుంటుంది. కుటుంబ వ్యయాలు, పిల్లల విద్యా వ్యయాలు, ఇతర అవసరాలను కలిపి టర్మ్ కవరేజీ ఎంతన్నది నిర్ణయించుకోవాలి. ఆరోగ్య అవసరాలు, రుణ అవసరాలు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముందే ఆరంభిస్తే కాంపౌండింగ్ కలిసొస్తుంది. రిస్క్ తీసుకుని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు లభిస్తుంది. ఎక్కువ పెట్టుబడులను ఈక్విటీకే కేటాయించుకోవచ్చు. తద్వారా అధిక రాబడులు అవకాశం ఉంటుంది. ఈక్విటీల్లో స్వల్ప కాలంలోనే (3–5ఏళ్లు) రిస్క్. దీర్ఘకాలంలో కళ్లు చెదిరే రాబడులు ఉంటాయి. అదే ఆలస్యంగా మొదలు పెడితే రిస్క్‌కు అవకాశం ఉండదు. కనుక డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. వీటిల్లో రాబడి 8 శాతం మించదు. ద్రవ్యోల్బణం కూడా ఇదే స్థాయిలో ఉంటుంది కనుక నికరంగా వచ్చే రాబడి ఏమీ ఉండదు. కనీసం ఐదేళ్లకు పైబడిన కాలానికే ఈక్విటీలను ఎంపిక చేసుకోవచ్చు. ఐదేళ్లలోపు కోసం అయితే ఈక్విటీలు సూచనీయం కాదు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలన్నది నిపుణుల సూచన. బీమా, ఈక్విటీలతో కూడిన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, వీటిల్లో వ్యయాలు ఎక్కువ. రాబడులను సమీక్షించుకోవడం మ్యూచువల్ ఫండ్స్ పథకాలతో పోలిస్తే కొంచెం క్లిష్టం. కనుక మెరుగైన ఈక్విటీ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడమే మంచి మార్గం అవుతుంది. ఒకవేళ పిల్లల విదేశీ విద్య కోసం అయితే.. విదేశీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా కరెన్సీ మారకం విలువ మార్పులకు హెడ్జ్ చేసుకున్నట్టు అవుతుంది. డెట్ సాధనాల్లో అయితే సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెల కోసం), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. పొదుపు... చిన్న అడుగులు పొదుపు ముందే ప్రారంభిస్తే లక్ష్యం సులభం అవుతుంది. ఆలస్యం చేసిన కొద్దీ అది భారంగా మారుతుంది. 5 ఏళ్లు ఆలస్యం చేసినా, చేయాల్సిన పొదుపు రెట్టింపు అయిపోతుంది. అందుకనే చిన్నారి జన్మించిన వెంటనే పొదుపు, పెట్టుబడి ఆరంభించాలి. ఆలస్యం చేసినా మొదటి పుట్టిన రోజు నుంచి అయినా ఈ ప్రణాళికను అమలు చేయాలి. అప్పుడే అనుకున్నంత సమకూర్చుకోగలరు. ఉన్నత విద్య కోసం సాధారణంగా 18 ఏళ్లు ఉంటుంది. ప్రాథమికోన్నత పాఠశాల విద్య కోసం 10 ఏళ్ల వ్యవధి ఉంటుంది. అందుకని ఉన్నతవిద్య, ప్రాథమిక విద్యకు వేర్వేరుగా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. విద్యా రుణం ఇది చివరి ఎంపికగానే ఉండాలి. విద్యా రుణం చాలా సులభంగా లభిస్తుంది. ఫీజులకు చాలకపోతే రుణం తీసుకోవచ్చులేనన్న భరోసాతో పెట్టుబడులను నిర్లక్ష్యం చేయవద్దు. నిజాయితీ పెట్టుబడులు చేస్తూ, చివర్లో కావాల్సిన మొత్తానికి తగ్గితే (రాబడుల అంచనాలు మారి) లేదా అంచనాలకు మించి కోర్సుల వ్యయాలు పెరిగిపోతే అప్పుడు ఎలానూ అదనంగా సమకూర్చుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో విద్యారుణం బాట పట్టొచ్చు. లేదా ఉద్యోగం లేదా ఉపాధి పరంగా సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. అటువంటి పరిస్థితుల్లో విద్యా రుణాన్ని ఆశ్రయించొచ్చు. అది కూడా ఉద్యోగం పొందిన తర్వాత పిల్లలు చెల్లించే సౌలభ్యం పరిధిలోనే ఉండేలా చూసుకోవడం మర్చిపోవద్దు. -
ఐటీ పాలసీ లక్ష్యం ఇదే కావాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. మన పిల్లలకు హై ఎండ్ స్కిల్స్ నేర్పించే కంపెనీలకు, సంస్థలకు పాలసీలో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారికి మంచి ప్రోత్సాహకాలను ఇవ్వాలని ఆదేశించారు. దీని వల్ల పిల్లల్లో అంతర్జాతీయ స్థాయిలో పనిలో అనుభవం, నైపుణ్యాలు పెరుగుతాయన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీపడే పరిస్థితి ఉంటుందని, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఏపీలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది ఇన్సెంటివ్‌లు చెల్లిస్తామని ప్రకటించారు. వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్, డిజిటల్ లైబ్రరీలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పనకు విశాఖపట్నం ప్రధాన కేంద్రం అవుతుందన్నారు. ప్రభుత్వం కల్పించనున్న మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. విశాఖ స్థాయిని మరింతగా పెంచుతాయని, భవిష్యత్‌లో ఐటీ రంగానికి మంచి కేంద్రంగా మారుతుందన్నారు. కాలక్రమేణా ఈ అంశాలన్నీ సానుకూలంగా మారి కంపెనీలకు ఈ నగరం ఒక ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందని తెలిపారు. నాణ్యమైన విద్యకు విశాఖను కేంద్రంగా చేయడం ద్వారా వల్ల మంచి ప్రతిభావంతమైన మానవ వనరులు లభిస్తాయని అన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, అధికారులు హై ఎండ్ ఐటీ స్కిల్స్ యూనివర్సిటీ – ఐటీ రంగంలో అత్యుత్తమ యూనివర్సిటీని విశాఖపట్నం తీసుకురావాలి. ఐటీ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ లెర్నింగ్‌కు ఈ యూనివర్శిటీ డెస్టినేషన్‌గా మారాలి. – ఏపీలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది ఇన్సెంటివ్‌లు చెల్లిస్తాం. కనీసం ఏడాది పాటు ఒక ఉద్యోగి స్థిరంగా అదే కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది. మొదటి ఏడాది పూర్తవగానే ఆ కంపెనీకి ఇన్సెంటివ్ చెల్లింపులు ప్రారంభం అవుతాయి. ఈ నిబంధన వల్ల మన పిల్లలకు ఏడాదిపాటు స్థిరమైన ఉపాధి లభిస్తుంది. అంతేకాక నిర్ణీత కాలం పని వల్ల నైపుణ్యం కూడా మెరుగు పడుతుంది. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలు – వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలి. గ్రామాలకు మంచి సామర్థ్యం ఉన్న ఇంటర్నెట్ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడి నుంచే పని చేసుకునే సదుపాయం ఉంటుంది. – డిసెంబర్ నాటికి సుమారు 4 వేల గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చేలా అ«ధికారులు ముందడుగు వేస్తున్నారు. ఈ చర్యలతో గ్రామాల నుంచే వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ మరింత బలోపేతం అవుతుంది. అన్ని గ్రామ పంచాయతీల్లో రెండేళ్లలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి. – విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలలో ఐటీ కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలి. ఇందుకు అవసరమైన భూములను గుర్తించాలి. – కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నిర్మిస్తున్న వైఎస్సార్ ఈఎంసీ ప్రగతి గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. అక్టోబర్‌లో ప్రారంభోత్సవం చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. – ఈ సమీక్షలో పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్(ఈఎంసీ) సీఈఓ ఎం.నందకిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
పాఠశాలకు ఫారిన్ టచ్
సాక్షి, హైదరాబాద్: ఐటీ, బీపీవో, కేపీవో రంగాలకు కొంగు బంగారంగా నిలిచిన హైదరాబాద్ నగరానికి, విద్యారంగంలోనూ విదేశీ పెట్టుబడులు వెల్లువలా తరలివస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విఖ్యాత విద్యాసంస్థలు నగర విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుండటం విశేషం. హైదరాబాద్‌లో పిల్లలను అంతర్జాతీయ ప్రమాణాలున్న విద్యాసంస్థల్లో చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం, లక్షల్లో ఫీజులు చెల్లించేందుకు వెనుకాడకపోవటం, నాణ్యమైన విద్యను బోధించే టీచర్లు ఉండడం, తీరైన మౌలిక వసతులు, జీవన ప్రమాణాలకు నగరం నిలయంగా మారటంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది నగర విద్యారంగంలోకి సుమారు రూ.2 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రముఖ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా సంస్థ ‘సెరేస్ట్రా ’తాజా అధ్యయనంలో తేలింది. రూ. 200 నుంచి 500 కోట్ల పెట్టుబడులు అమెరికా, యూకే దేశాల్లో అమల్లో ఉన్న విద్యా విధానాలను నగర విద్యార్థులకు చేరువ చేసేందుకు పలు కార్పొరేట్ విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ కరిక్యులంతో పాటు.. అత్యాధునిక విద్యావిధానాన్ని పరిచయం చేసేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే నగరంలో ఓక్రిడ్జ్, చిరెక్, యూరోకిడ్స్ వంటి కార్పొరేట్ విద్యా సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. వీటికి తోడు తాజాగా ఫిన్లాండ్కు చెందిన కాగ్నిటా, హాంకాంగ్ చెందిన నార్డ్ ఏంజిలా వంటి విద్యా సంస్థలు నగరంలో తమ బ్రాంచీలను నెలకొల్పేందుకు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ సంస్థలతో పాటు నూతనంగా వస్తున్న సంస్థలు రూ.200 – 500 కోట్ల పెట్టుబడులను ఈ ఏడాది నగర విద్యా రంగంలో పెట్టేందుకు ముందుకు రావడం విశేషం. పెట్టుబడుల వెల్లువకు కారణాలివే.. ►కార్పొరేట్ విద్యా సంస్థల్లో తమ పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం. ►లక్షల్లో ఫీజులు చెల్లించేందుకు వెనుకాడకపోవడం. అంతర్జాతీయ ప్రమాణాలను తమ చిన్నారులు అందిపుచ్చుకుంటారన్న నమ్మకం. ►కార్పొరేట్ విద్యా సంస్థల ఫ్రాంచైజీలను దక్కించుకునేందుకు నగరంలో పలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం. -
అందరికీ నాణ్యమైన విద్య: సబిత
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రతి విద్యార్థి బడిలో ఉండాలి, వారికి నాణ్యమైన విద్యను అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో మోడల్ స్కూళ్లు, గురుకులాలు, టెన్త్ వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లు వదిలి గురుకులాల్లో చేరుతున్న పరిస్థితి ఉందన్నారు. నూతన విద్యా విధానం ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో సబిత పాల్గొన్నారు. బిల్లుకు సంబంధించి రాష్ట్రం తరఫున పలు సూచనలు చేశారు. ప్రైమరీ స్కూళ్లలో మాతృభాషలో బోధించాలని బిల్లులో ప్రతిపాదించారని, అయితే ప్రైవేటు పాఠశాలల్లోనూ దాన్ని అమలు చేయాలని, అప్పుడే ప్రభుత్వ స్కూళ్లు మనుగడ సాధిస్తాయని మంత్రి చెప్పారు. -
నాణ్యమైన విద్య అందించాలి
సాక్షి, కేయూ క్యాంపస్: రాష్ట్రంలో పాఠశాల నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రమాణాలు పెంపొందించి నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ, కేయూ ఇన్చార్జి వీసీ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. ప్రధానంగా హాజరు శాతం పెంచేలా కృషి చేయాలని, అధ్యాపకులు స్వీయ మూల్యం కణం బేరీజు వేసుకోవాలని సూచించారు. కేయూ ఇన్చార్జి వీసీగా నియామకమైన తర్వాత తొలిసారి సోమవారం క్యాంపస్‌కు వచ్చిన ఆయన అన్ని విభాగాల అధ్యాపకులతో నిర్వహంచిన సమావేశంలో మాట్లాడారు. కొందరు పాఠశాల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు లేవని, సబ్జెక్టుల అంశాలు చెప్పలేక పోతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 29 లక్షల మంది విద్యార్థులు ఉండగా నిత్యం 30శాతం మంది గైర్హాజరవుతున్నారని తెలిపా రు. ఇదే పరిస్థితి కళాశాల విద్యలోనూ ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కేయూలో హాజరుశాతం గురించి అడగ్గా సైన్స్ విభాగాల్లో 80 శాతం, ఆర్ట్స్ విభాగాల్లో 50 శాతం ఉందని ఆయా విభాగాల అధిపతులు తెలిపారు. పీజీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని తీరిక సమయాలు, సెలవుల్లో వారికి విద్యాబోధన చేయాలని, ఇందుకు వర్సిటీల హెచ్వోడీలు అధ్యాపకులు సహకరించాలని అన్నా రు. వనరుల కొరత సాకుగా చూపకుండా కౌన్సిలర్ సిస్టం అమలు చేయాలని తెలిపారు. ఫార్మాసీ విభాగం ప్రొఫెసర్ ఎం.సారంగపాణి మాట్లాడుతూ కేయూలో 391 అధ్యాపక పోస్టులకు 128 మంది పనిచేస్తున్నారని పలు విభాగా ల్లో ఇద్దరు ముగ్గురే ఉన్నారని, రిటైర్ అయిన సీనియర్ ప్రొఫెసర్ల సేవలను వినియోగించుకుంటే బాగుంటుందని అనగా.. విభాగాల వారీ గా ఎంత మంది ఉన్నారు.. జాబితా తయారు చేయాలని వీసీ సూచించారు. అందులో ఉచితంగా సేవలను అందించే, గెస్ట్ ఫ్యాకల్టీలుగా ఉండేవారి జాబితా ఇస్తే ఉత్తర్వులు జారీ చేస్తానని చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో వసతులకు నిధులు అవసరమని, అధ్యాపకుల కొరత ఉం దని కోఎడ్యూకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సి పాల్ పి.మల్లారెడ్డి తెలుపగా ప్రతిపాదనలు ఇస్తే వచ్చే ఏడాది బడ్జెట్లో నిధులను కేటాయించేలా చూస్తానని వీసీ హామీ ఇచ్చారు. ఎమ్మెస్పీ ఐదేళ్ల కోర్సుల విద్యార్థులకు బోధన చేయడానికి అధ్యాపకుల కొరత ఉందని కెమిస్ట్రీ విభాగం అధిపతి డాక్టర్ జి.హన్మంతు అనగా రెగ్యులర్ అధ్యాపకుల నియామకం అయ్యేవరకు గెస్ట్‌ఫ్యాకల్టీగానే తీసుకోవాలని సూచించారు. మీవద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయని అడగ్గా.. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీయన్ స్టడీసెంటర్ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని పొలిటికల్‌సైన్స్ విభాగం అధిపతి సంజీవరెడ్డి చెప్పగా.. సెమినార్లు, వర్క్‌షాప్‌ను నిర్వహించబోతున్నట్లు కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. మైక్రోబయాలజీ విభాగం అధిపతి డాక్టర్ సుజాత మాట్లాడుతూ బయాలజీ ఉపాధ్యాయులకు వర్క్‌షాప్ నిర్వహించబోతున్నామన్నారు. కేయూ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కోల శంకర్ మాట్లాడుతూ కేయూలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఖాళీగా ఉన్న డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులను అర్హులకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలని కోరారు. కేయూ టెక్నికల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పుల్లా శ్రీనివాస్, డాక్టర్ విష్ణువర్ధన్, కేయూ ఎన్జీవో జనరల్ సెక్రటరీ వల్లాల తిరుపతి, ఏఆర్ పెండ్లి అశోక్, డాక్టర్ మహేష్ తదితరులు వీసీతో మాట్లాడారు. సమావేశంలో రిజిస్ట్రార్ కె.పురుషోత్తంమాట్లాడారు. -
మెదక్‌లో ‘జాయ్‌ఫుల్ లెర్నింగ్’
సాక్షి, పాపన్నపేట(మెదక్): ‘కష్టంతో కాదు.. ఇష్టంతో చదివినప్పుడే ఆ చదువులకు సార్థకత.’ కానీ కొందరు చిన్నారులకు బడి అంటే బందీఖానాల కనిపిస్తుంది. విద్యార్థిలో భయాన్ని పార ద్రోలేందుకు డీఈఓ రవికాంత్‌రావు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి ‘జాయ్‌ఫుల్ లెర్నింగ్’ అనే పేరుతో కృత్యాధార బోధన పద్ధతి ప్రవేశపెట్టారు. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తద్వారా పాఠశాల అంటే విద్యార్థిలో ఉన్న భయం తొలగిపోయి, చురుకుగా విద్యాభ్యాసం చేస్తాడు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తారు. దీంతో స్థాయికి తగిన సామర్థ్యాలు సాధిస్తారు. ఈ విధానాన్ని పోలిన‘హ్యాపినెస్ కరికులం’పై కూడా అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కొంతమంది టీచర్లను, హెచ్ఎంలను ఢిల్లీకి పంపేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కృత్యాధార విధానంతో ఖుషీ.. ఖుషీ కృత్యాధార బోధన ద్వారా పాఠ్యాంశంలో విద్యార్థులు పాల్గొనేలా చేస్తూ వారిని ఆకట్టుకునే విధంగా బోధించడం, బడి అంటే ఆటల ఒడిగా తీర్చిదిద్దడం ‘జాయ్‌ఫుల్ లెర్నింగ్’ ముఖ్య ఉద్దేశ్యం. పదో తరగతి చదువుతున్నా కొంత మంది విద్యార్థులు తెలుగు.. హిందీలు చదవులేక పోవడం, కూడికలు.. తీసివేతలు చేయలేక పోవడం.. కనీస సామర్థ్యాలు సాధించలేక పోవడం చూసిన సిద్దిపేట, మెదక్ జిల్లాల విద్యాధికారి ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఇందుకోసం 30 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసుకొన్నారు. 1నుంచి 10వ తరగతి వరకు గల పాఠ్యాంశాలపై అనుబంధ కార్యక్రమాలను రూపొందించారు.స్థానికంగా దొరికే, ఖర్చు లేని వస్తువులు, వాడి పారేసిన పరికరాలు, ఉచితంగా దొరికే భాగాలను ఉపయోగించుకొని ఆకర్షణీయమైన బోధనోపకరణాలు తయారు చేసుకోవాలని నిర్ణయించారు. వాటితో విద్యార్థులను ఆకట్టుకునేలా కృత్యాధార బోధన కొనసాగించాలి. ఆటలు, పాటలు, నాటికలు, కథలు చెప్పడం, కథలు రాయడం, యోగా, ధ్యానం తదితర కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఆకట్టుకునేలా బోధించడంతో ఆశించిన ఫలితాలు సాధించవచ్చని ఆశిస్తున్నారు. ఈ మేరకు తయారు చేసిన ప్రణాళికలు ఈ నెల 15 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. పాఠ్యాంశాన్ని నిత్య జీవితంలోని సంఘటనలతో, లభ్యమయ్యే వనరులతో అనుసంధానం చేస్తూ కృత్యాధార కార్యక్రమాలు కొనసాగించాలి. విద్యార్థులు స్వయంగా కృత్యాలలో పాల్గొనడం ద్వారా వారిలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం పెరగడం, కృత్యాల పట్ల ఆసక్తి నెలకొనడం, నాయకత్వ లక్షణాలు అలవడటం లాంటి చర్యలతో బడి అంటే బందీఖాన కాదని.. ఆట పాటల ఒడి అనే భావం అలవడుతుంది. ప్రతీ పాఠాన్ని విద్యార్థి ద్వారా బోధించేలా చూస్తారు. పుస్తకాల బరువును తగ్గించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుంది. విద్యార్థి కేంద్రంగా బోధన కొనసాగాలి బడి అంటే భయం పోవాలి. బట్టీ విధానం మాయం కావాలి. విద్యార్థి పాత్ర పెరగాలి. ఇందుకు కృత్యాధార విధానమే మేలు. అందుకు పలు అధ్యయనాలు జరిపి, పలువురి అభిప్రాయలు సేకరించి ‘జాయ్ ఫుల్ లెర్నింగ్’ విధానానికి రూపకల్పన చేశాం. విద్యార్థి కేంద్రంగా ఈ విధానం కొనసాగుతుంది. ఆట పాటలతో పాటు, కథలు వినడం, కథలు రాయడం, నాటికలు లాంటి కార్యక్రమాలకు విద్యార్థి ఆకర్షితుడవుతాడు. పాఠ్యాంశాలను స్థానికంగా ఉన్న వనరులతో.. సంఘటనలతో సమన్వయం చేసి కళ్లకు కట్టుకునేలా బోధన కొనసాగిస్తారు. ఫీల్డ్ ట్రిప్స్ లాంటి కార్యక్రమాలతో విద్యార్థులు పూర్తి స్థాయి పరిజ్ఞానం పొందుతారు. స్వయంగా పాఠ్యాంశాన్ని బోధిచండం ద్వారా నాయకత్వ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. – రవికాంత్‌రావు, ఇన్చార్జి డీఈఓ -
గంటలో 247 అడ్మిషన్లు!
తిరువనంతపురం: నాణ్యమైన విద్యను అందిస్తే.. ఆ పాఠశాలకు, టీచర్లకు పిల్లల్లో, తల్లిదండ్రుల్లో ఎంతటి డిమాండ్ ఉంటుందో చెప్పేందుకు కేరళలలోని ఓ పాఠశాల తాజా ఉదాహరణగా నిలుస్తోంది. చదువంటే కేవలం అక్షరాలు రుద్దించడం మాత్రమే కాదని, పిల్లల్ని అన్నివిధాలా తీర్చిదిద్దడమేనని నిరూపిస్తున్న సదరు పాఠశాలలో ప్రవేశాలకు క్యూ కడుతున్నారు. ప్రవేశాలను ప్రారంభించిన తొలి గంటలోనే 247 మంది చేరారంటే.. ఆ పాఠశాల మిగతావాటి కంటే భిన్నమైనదనే చెప్పాలి. వివరాల్లోకెళ్తే.. కేరళలోని అలప్పుజా జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశాల కోసం మే 3న 15 కౌంటర్లు తెరిచారు. దీంతో ఒక్క గంటలోనే 247 మంది ప్రవేశం పొందారు. ఫస్ట్ క్లాసులో 170 మంది, రెండో తరగతిలో ఆరుగురు, మూడో తరగతిలో ఐదుగురు విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకున్నారు. ఇక ఎల్కేజీ, యూకేజీలోనైతే భారీగా చేరారు. ఇంతగా ఈ పాఠశాలలో చేరడానికి కారణమేంటంటే.. ఇక్కడ చదువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. ఎక్స్ట్రా – కరిక్యూలర్ యాక్టివిటీస్ చేయించడానికి కూడా అంతకు మించి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే గతేడాది రెండున్నర గంటల్లో 233 మంది విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకున్నారు. ఈసారి ఆ రికార్డు బ్రేక్ అయ్యింది. కాగా ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంటుందని పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ పుష్పలత తెలిపారు. మొత్తంగా ఈ పాఠశాలలో 650 మంది విద్యార్థులు చదువుతున్నారు. -
సదువొస్తలేదు..!
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడుల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యార్థుల పరిస్థితిలో ఏమాత్రం వ్యత్యాసం లేకుండాపోయింది. చాలా మంది విద్యార్థులు కనీస అభ్యసన స్థాయిలైన చదవడం, రాయడం చేయలేకపోతున్నారు. చతుర్విద ప్రక్రియల్లో భాగంగా గోడమీద రాతలు కూడా చదవని పరిస్థితి ఉందంటే ప్రభుత్వ పాఠశాలల్లో బోధన తీరును ఇట్టే అర్థమవుతోంది. సగానికి పైగా విద్యార్థులు అక్షరాలు గుర్తించడంలో వెనుకంజలో ఉన్నారు. ప్రతియేడాది విద్యార్థుల ప్రగతి మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఏదో ఒక కార్యక్రమం చేపట్టినా అది పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, కొంతమంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు శాపంగా మారుతోంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) ప్రతి సంవత్సరం 3, 5, 8, 10వ తరగతి విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు పరీక్షలు ని ర్వహిస్తున్నారు. ఈ ఫలితాల్లో జిల్లా వెనుకబడే ఉంటోంది. గత మూడు నాలుగేళ్లుగా పదో తరగ తి పరీక్ష ఫలితాల్లో కూడా రాష్ట్రస్థాయిలో కింది నుంచి మొదటి స్థానం మనదే ఉండడం గమనార్హం. జిల్లాలో.. జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో మొత్తం 56,600 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. 455 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. గతేడాది నవంబర్ మాసంలో జాతీయ మదింపు పరీక్ష(ఎన్ఏఎస్)లో 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులకు ఎంపిక చేసిన పాఠశాలల్లో పరీక్ష నిర్వహించింది. ఇందులో చాలామందికి చదవడం, రాయడం రావడం లేదని, బోధన విధానం డొల్లతనాన్ని బయటపెట్టింది. విద్యార్థులు చిన్న చిన్న లెక్కలు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారని సర్వేలో తేటతెల్లమైంది. ప్రతియేడాది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం కనిపించడంలేదు. ఈ యేడాది కూడా ఉపాధ్యాయులకు ఈ నెలలో శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా లోపాలు మాత్రం విద్యాశాఖ అధికారులు సవరించలేకపోతున్నారు. ఇందుకు సీసీఈ విధానమే కారణమని కొంతమంది ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అసైన్మెంటు ఇవ్వడం, అవగాహన లేని కారణంగా విద్యార్థులు చేయలేకపోతున్నారు. దీనికితోడు కొంతమంది ఉపాధ్యాయులకు కూడా వీటిపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. విద్యార్థి తాను పరిసరాలను చూసినేర్చుకోవాలనేది ఈ విధానం ముఖ్య ఉద్దేశం. లక్ష్యం మంచిదే అయినా ఆచరణలో మాత్రం పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. త్వరలో ఉపాధ్యాయులకు శిక్షణ.. ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలపై ఈ పది రోజుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. మూడు దశల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. షార్ట్ టర్మ్, మిడ్‌టర్మ్, లాంగ్ టర్మ్ వారీగా ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించనున్నారు. ఈ శిక్షణలో విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థులు ఏయే అంశాల్లో వెనుకబడి ఉన్నారనే విషయాలను ఉపాధ్యాయులు గ్రహించి వారికి ప్రత్యేక బోధన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈయేడాదైనా మెరుగు పడేనా.. ప్రతియేడాది నవంబర్‌లో రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిల్లో విద్యార్థుల సామర్థ్య స్థాయి పరీక్షలు నిర్వహిస్తారు. గతేడాది రాష్ట్రస్థాయిలో చివరి స్థానంలో నిలిచిన విషయం విదితమే. ఈసారైనా జిల్లాలోని సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల స్థాయి మెరుగు పడేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఉపాధ్యాయులు వారిపై ప్రత్యేక దృష్టి సారించి ఈసారి ప్రతిభ కనబర్చేలా చూడాలని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా జిల్లాలోని 58 ప్రాథమిక పాఠశాలల్లో 813 మంది 3వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. తెలుగులో 50.48 శాతం సగటు మార్కులు వచ్చాయి. గణితంలో 51.12 శాతం, పరిసరాల విజ్ఞానంలో 48.40 శాతం ప్రగతి ఉంది. అదేవిధంగా 57 ప్రాథమిక పాఠశాలల్లో 1,074 మంది 5వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. తెలుగులో 43.02 శాతం సగటు మార్కులు వచ్చాయి. గణితంలో 40.95 శాతం, పరిసరాల విజ్ఞానంలో 40.05 శాతం, 8వ తరగతితో 51 ఉన్నత పాఠశాల్లో 1301 విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. తెలుగులో 43.62 శాతం సగటు మార్కులు వచ్చాయి. గణితంలో 31.01 శాతం, సామాన్య శాస్త్రంలో 31.51 శాతం, సాంఘిక శాస్త్రంలో 33.51 శాతం వచ్చాయి. 80 పాఠశాలల్లో 2642 మంది పదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. తెలుగులో 46.81 శాతం, ఆంగ్లంలో 33.34 శాతం, గణితంలో 33.23 శాతం, సామాన్య శాస్త్రంలో 33.94 శాతం, సాంఘిక శాస్త్రంలో 36.23 శాతం విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ ఫలితాల్లో 10వ తరగతి విద్యార్థులు కేవలం 31 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఇదీ జిల్లా పరిస్థితి. -
విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు : కడియం
సాక్షి, హైదరాబాద్ : పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల్ని పటిష్టం చేయాలని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని, అన్ని స్కూళ్లకు మిషన్ భగీరథ ద్వారా నల్లా నీరు అందిస్తామన్నారు. కడియం శ్రీహరి శుక్రవారమిక్కడ మాట్లాడుతూ...విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్‌ను పంపిణీ చేస్తామని, స్కూల్ గ్రాంట్లను 12 నెలలకు పెంచుతామన్నారు. ఉపాధ్యాయుల సంఖ్యను కూడా పెంచే అంశం పరిశీలనలో ఉందని కడియం తెలిపారు. -
నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం
► బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న ► బొప్పారంలో బీసీ గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన కేతేపల్లి (నకిరేకల్): పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. కేతేపల్లి మండల పరిధిలోని బొప్పారం శివారులో మూసీ ప్రాజెక్టు వద్ద రూ.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీసీ గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి సోమవారం విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. పేదవారికి నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకువస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 119 గురుకుల పాఠశాలలను మంజూరు చేశారన్నారు. ఆయా పాఠశాలల పక్కా భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో రూ.380 కోట్లు కేటాయించిందని తెలిపారు. బీసీలను ఓటు బ్యాంకుగా వినియోగించుకున్న గత పాలకులు వారికి విద్య, వైద్యం, ఉపాధి సౌకర్యాలు కల్పించడంలో విస్మరించారని అన్నారు. బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఉచితంగా రూ.20 లక్షల అందజేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. విద్యాభివృద్ధికి పెద్దపీట : మంత్రి జగదీశ్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విద్యుత్‌శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఒకే ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి పీజీ వరకు మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి ఆంధ్ర పాలకుల హయాంలో జిల్లాలో 26 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండగా, తెలంగాణ ప్రభుత్వం అదనంగా 44 పాఠశాలలు మంజూరు చేసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో నకిరేకల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.2000కోట్లు మంజూరు చేసిందన్నారు. విద్యార్థులు కేవలం సర్టిఫికెట్ల కోసమే చదవడం కాకుండా భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు సాధించి తమను కన్నవారి కలలను సాకారం చేయాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మూసీ ప్రాజెక్టు దిగువన ఉన్న 90 ఎకరాల స్థలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. కాసనగోడు, గుడివాడ గ్రామాల మధ్య విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేయాలన్నారు. అంతకు ముందు పాఠశాల భవన నిర్మాణ నమూనాను మంత్రులు పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శోభాదేవి, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మందడి వెంకట్రాంరెడ్డి, కేతేపల్లి ఎంపీపీ గుత్తా మంజుల, వివిధ గ్రామాల సర్పంచ్‌లు కె.లింగయ్య, కె.వెంకటరమణ, బి.సైదమ్మ, కె.లక్ష్మి, ఎంపీటీసీ కె.మోహన్, టీఆర్ఎస్ నాయకులు బడుగుల లింగయ్యయాదవ్, పూజర్ల శంభయ్య, కె.శ్రీనివాస్‌యాదవ్, బి.సుందర్, గుత్తా మాధవరెడ్డి, బి.దయాకర్‌రెడ్డి, కె.మల్లేష్‌యాదవ్, కత్తుల వీరయ్య పి.ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యతోనే ఉద్యోగాలు
ఫ్యాప్సీతో ఐవైఎఫ్ అవగాహన సాక్షి, సిటీబ్యూరో: యువతకు నాణ్యమైన విద్యను అందిస్తేనే మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ యూత్ ఫెలోషిప్ (ఐవైఎఫ్) రీజినల్ డైరెక్టర్ డాంగ్ యాప్ కిమ్ చెప్పారు. వివిధ దేశాల్లో మైండ్ ఎడ్యుకేషన్ వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ యువత అభ్యున్నతికి పాటు పడుతున్న ఐవైఎఫ్... సోమవారం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో (ఎఫ్టిఏíపీసీసీఐ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ...యువతకు నాణ్యమైన చదువులు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశారు. ఫ్యాప్సీతో కలిసి చేపట్టే కార్యక్రమాల ద్వారా వచ్చే నిధులను యువత విద్యకు వెచ్చిస్తామని చెప్పారు. తమ సామాజిక బాధ్యతలో ఇది కూడా భాగమేనని ఫ్యాప్సీ యూత్ కమిటీ చైర్మన్ అనిరుధ్, ఐవైఎఫ్ డైరెక్టర్ జాన్ యోహాన్ తెలిపారు. -
నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు
నెల్లూరు(టౌన్) : పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ మువ్వా రామలింగం, ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అధికారి కనకనరసారెడ్డిలు తెలిపారు. గురువారం నెల్లూరులోని డీఈఓ కార్యాలయంలో ఎంఈఓలు, సెక్టోరియల్ అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కస్తూర్బాగాంధీ విద్యాలయాలను సందర్శించి మౌలిక వసతులపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. మండల పరిధిలో పనిచేసే ఎంఐఎస్ కో–ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనితీరుపై వివరాలు ఇవ్వాలని ప్లానింగ్ కో–ఆర్డినేటర్ రమణారెడ్డికి తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్య కమిటీ వివరాలు శుక్రవారం లోపు అందజేయాలని సూచించారు. ప్రతి సోమవారం ఎంఈఓలు, సెక్టోరియల్ అధికారులతో సమావేశం జరుపుతామన్నారు. -
ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన విద్య అవసరం
ప్రాథమిక స్థాయి నుంచే మెరుగైన విద్యతో చిన్నారులను ప్రోత్సహించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మ్యాడం జనార్థన్‌రావు అధ్యక్షతన ఆదివారం కాచిగూడలోని మ్యాడం అంజయ్య హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ] ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్టడీ మెటీరియల్, స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నైపుణ్యాలతో కూడిన విద్యతోనే విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోగలరని పేర్కొన్నారు. పేద ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్‌బోర్డు సభ్యులు పుంజరి బద్రినారాయణ, ప్రొఫెసర్ మ్యాడం వెంకట్రావు, గంప చంద్రమోహన్, జెల్లి సిద్దయ్య, ఆకుల పాండురంగం, పి.విష్ణువర్ధన్, తెలంగాణ మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కాశెట్టి ఆనంద్తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య అందిస్తాం
♦ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం ♦ అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసేలా చేసిన ఘనత కేసీఆర్‌దే ♦ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మేడ్చల్ రూరల్ : రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మం గళవారం మేడ్చల్ మండలం గిర్మాపూర్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పాకొ ని చెరువులో మిషన్ కాకతీయ రెండో దశ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాల కుల హయాంలో ధ్వంసం అయిన విద్యావ్యవస్థను సరైన దారిలో పెట్టేం దుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంబేద్కర్ 125వ జయుంతి సందర్భంగా ఆయున స్పూర్తిని, ఆశయూలను బావితరాలకు అందించాలని సీఎం హైదరాబాద్‌లో 125అడుగుల ఎత్తుగల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేశాన్నారు. అదే రోజున దళిత,పేద విద్యార్ధుల కోసం ఈ సంవత్సరంనుంచే 240 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయూలని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికీ చాలా పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని శ్రీహరి అన్నారు. వాటి పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నా రు. మిషన్ కాకతీయు, మిషన్ భగీరథ వంటి ఎన్నో కార్యక్రవూలతో ఇతర రాష్ట్రాలు తెలంగాణవైపు చూసేలా చేసి న ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: వుంత్రి వుహేందర్‌రెడ్డి రాష్ట్రంలో ఏ జిల్లాకు రానంతగా రంగారెడ్డి జిల్లాకు ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేశానని వాటితో జిల్లాలో పనులు చేపట్టి జిల్లాను అబివృద్ధిలో ముందుంచుతానని రాష్ట్ర రోడ్డు, రవా ణాశాఖ మంత్రి వుహేందర్‌రెడ్డి అన్నా రు. మిషన్ కాకతీయు,మిషన్ భగీరథ లాంటి కార్యక్రవూలతో సీఎంగా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా వూర్చుతున్నారన్నారు. మిషన్ భగీర థ ద్వారా మరో నెల రోజుల్లో మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. వురో మూడేళ్లలో జిల్లాలోని అన్ని గ్రావూలకు గోదావరి జలాలు అందేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రవుంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశం, డీఈ వెంకటరవుణ, మేడ్చల్ ఎంపీపీ విజయులక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు శైలజ, వైస్ ఎంపీపీ భవాని, ఘట్కేసర్, శామీర్‌పేట్ ఎంపీపీలు శ్రీనివాస్‌గౌడ్, చంద్రశేఖర్‌యూదవ్, ఇరిగేషన్ ఏఈ నర్సయ్యు, ఎంపీడీఓ దేవసహా యుం, తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఈఓ పీఆర్డీ జ్యోతిరెడ్డి, సర్పంచ్ నవనీత, ఎంపీటీసీ సభ్యురాలు రజిత, టీఆర్ఎస్ నాయకులు భాస్కర్‌యూదవ్, సత్యనారాయుణ పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యతోనే ప్రజల్లో నమ్మకం!
ఉపాధ్యాయ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 71 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించినపుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం రవీంద్రభారతిలో 71 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. వారికి శాలువా కప్పి, రూ.10వేల నగదు ప్రోత్సాహం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి, బంగారు తెలంగాణ సాధనకు టీచర్లు మార్గదర్శకులు కావాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు సాధించి.. దిగజారిపోతున్న విద్యా ప్రమాణాలను పెంచాలని సూచించారు. బడుగు, బలహీనవర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందిస్తేనే వారికి న్యాయం చేసిన వారు అవుతారన్నారు. అందుకోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టు పీజీ తెస్తున్నారన్నారు. నివాస వసతితో కూడిన ఇంగ్లిష్ మీడియం విద్యను (ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు) సీబీఎస్ఈ సిలబస్‌తో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 10 రెసిడెన్షియల్ స్కూళ్ల చొప్పున 1,190 స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. కేబీజీవీల్లో చదివే అనాథ పిల్లల బాగోగులను, పదో తరగతి తరువాత వారి ఉన్నత చదువులను ప్రభుత్వమే చూసుకునేలా కేసీఆర్ చర్యలు చేపట్టారన్నారు. అనాథ పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా విధానపర నిర్ణయం తీసుకున్నారని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేస్తామన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇంటర్మీడియెట్‌లో ఉచిత విద్యను అందించిన ఘనత మన ప్రభుత్వానిదేనన్నారు. వచ్చే మూడు నెలల్లో యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తామన్నారు. అనేకమంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారని, అయితే దాదాపు 8 వేల ఖాళీల్లో విద్యావలంటీర్లను నియమించాలని నిర్ణయించామని, ఈ నెల 21 నాటికి ప్రక్రియ చేపడుతామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం (జూన్) నాటికి ఆయా ఖాళీల్లో డీఎస్సీ ద్వారా కొత్త టీచర్లను నియమిస్తామన్నారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రాన్ని 100 శాతం అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్‌కు మార్గదర్శనం... ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో టీచర్ల పాత్ర కీలకమైందన్నారు. ఉపాధ్యాయులు అందించిన జ్ఞానం, తెలివితేటలతోనే గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని, కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు బాగా పనిచేసి ప్రభుత్వ స్కూళ్ల ఫలితాలను పెంచాలన్నారు. రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ విద్యారంగంలో గతంలోలాగా నిర్లక్ష్యానికి తావులేకుండా కడియం శ్రీహరి చర్యలు చేపడుతున్నారన్నారు.విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం వార్షిక పురస్కార కార్యక్రమంగా కాకుండా భవిష్యత్తు మార్గదర్శనానికి నాంది కావాలన్నారు. కొత్త రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపునకు తోడ్పాటు అందించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పూల రవీందర్, సుధాకర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు వాణిప్రసాద్, శైలజారామయ్యార్, అశోక్, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు రాష్ట్రపతి చేతులమీదుగా ప్రదానం సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యా య అవార్డులు అందుకున్నారు. శనివారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులు అందజేశారు. తెలంగాణ నుంచి అవార్డులు అవార్డులు అందుకున్న వారు: నాగమ్మ(నారాయణ్‌పేట్, మహబూబ్‌నగర్), కె.శశికళ (చిప్పకుర్తి,కరీంనగర్), పి.రఘునారాయణ(వరంగల్), డి.వెంకటేశం(ఖమ్మం), మహమ్మద్ రాజ్ మహమ్మద్(శివునిపల్లి, వరంగల్), సి.ప్రకాశ్(నిజామాబాద్),సంపతికుమారి(కొత్తపల్లి, కరీం నగర్), హైదరాబాద్‌లోని కేంద్ర విద్యాలయ-1(ఉప్పల్)కు చెందిన కె.వి.రామలక్ష్మి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అందుకున్నవారు: జి.శ్రీనివాసులురెడ్డి(జాట్ల కొండూరు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా), డి.వెంకట శ్రీమన్నారాయణ(గొల్లపూడి, కృష్ణా), వై.శ్రీనివాసరావు(జాలిపూడి, ప.గోదావరి), పి.మోహనరావు(పెరికిపాలెం, ప.గోదావరి, ఆర్.శ్రీనివాసులు(తాటిగుంట్లపాలెం, చిత్తూరు), యు.ఫణీంద్రకుమార్(ఆకునూరు, కృష్ణా), ఎల్.సుబ్రమణ్యం చౌదరి(చిన్నగొట్టిగల్లు, చిత్తూరు), ఐ.సత్యనారాయణ(తుని, తూర్పు గోదావరి), పి.కృష్ణవేణి(నడుపూరు, విశాఖపట్నం). -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
తిరుచానూరు: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందనీ.. తద్వారా మన భవిష్యత్తును బంగారుమయం చేసుకోవచ్చని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు, మిట్టమీదకండ్రిగ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 2014 పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్త మ గ్రేడ్లు సాధించిన విద్యార్థులకు శనివారం వైఎస్ఆర్ ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈసభకు ముఖ్యఅతిథిగా భూమన కరుణాకర్‌రెడ్డి హాజరై ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిని ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలను చెవిరెడ్డి అందజేయడం అభినందనీయమని తెలిపారు. చదువుతో పాటు పరిసర గ్రామాల ప్రాముఖ్యత, గ్రామం పేరు వెనుక చరిత్ర, ఆ గ్రామాల్లోని మహోన్నత వ్యక్తుల చరిత్రను విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అలాగే రిటైర్డ్ ఉపాధ్యాయులు దినచంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి, తులసీరాం, చెంచులాదేవిలను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యేలందరికీ చెవిరెడ్డి ఆదర్శం నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎమ్మెల్యేలందరికీ ఆదర్శప్రాయులని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి తెలిపారు. మిట్టమీదకండ్రిగ జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రతిభా పురస్కారం ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు తన సొంత డబ్బులతో చెవిరెడ్డి ప్రతిభా పురస్కారాలు అందజేయడం అభినందనీయమని తెలిపారు. చెవిరెడ్డి మాట్లాడుతూ తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసించి ఈ స్థాయిలో ఉన్నామని, ఎందరో మహనీయులు, మేధావులు, ప్రతిభావంతుల విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలల్లోనే జరిగాయని తెలిపారు. అనంతరం 2014 పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి గ్రేడ్లు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు జగన్నాధరెడ్డి, ఆనంద్‌రెడ్డి, వెంకట్రమణారెడ్డిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్‌నాయుడు, పాతూరు సర్పంచ్ శివలింగారెడ్డి, బ్రాహ్మణపట్టు ఎంపీటీసీ పద్మవేణుగోపాల్, తిరుచానూరు ఎంపీటీసీలు బుజ్జిరెడ్డి, నరేష్‌రెడ్డి, నాయకులు గిరిధర్‌రెడ్డి, మిట్టపాళెం జయచంద్రారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, శివారెడ్డి, యోగానందరెడ్డి, విడుదల మాధవరెడ్డి, చిన్నియాదవ్, దామినేటి కేశవులు, తిరుమలయ్య, రాజేంద్ర, యశోద, నగీనమ్మ, తిరుచానూరు పంచాయతీ ఈవో ఎం.జనార్దన్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఉష, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.