సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రతి విద్యార్థి బడిలో ఉండాలి, వారికి నాణ్యమైన విద్యను అందించడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో మోడల్ స్కూళ్లు, గురుకులాలు, టెన్త్ వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లు వదిలి గురుకులాల్లో చేరుతున్న పరిస్థితి ఉందన్నారు. నూతన విద్యా విధానం ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో సబిత పాల్గొన్నారు. బిల్లుకు సంబంధించి రాష్ట్రం తరఫున పలు సూచనలు చేశారు. ప్రైమరీ స్కూళ్లలో మాతృభాషలో బోధించాలని బిల్లులో ప్రతిపాదించారని, అయితే ప్రైవేటు పాఠశాలల్లోనూ దాన్ని అమలు చేయాలని, అప్పుడే ప్రభుత్వ స్కూళ్లు మనుగడ సాధిస్తాయని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment