ఏర్పాట్లను పరిశీలిస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి శ్రీధర్‌బాబు. చిత్రంలో అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించనున్న అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ మృతికి నివాళులర్పించే ఎజెండాతో సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సంతాప ప్రతిపాదనను ప్రవేశపెట్టి, మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను ఉటంకించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్రను విశదీకరిస్తూ ప్రసంగించనున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్ సేవల గురించి ప్రసంగించనున్నారు.
సంతాప తీర్మానాన్ని ఆమోదించాక సభ వాయిదా పడనుంది. కాగా, సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఆదివారం పరిశీలించారు. సభ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సిబ్బందిని స్పీకర్ ఆదేశించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్‌లతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన స్పీకర్.. సమావేశాల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని అందించాలని కోరారు.
అది మన బాధ్యత.. ఎంపీ మల్లురవి: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను స్మరించుకోవడం మన బాధ్యత అని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి అభిప్రాయపడ్డారు. ఆయనను గుర్తు చేసుకునేందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినందుకు మల్లు రవి.. సీఎం రేవంత్‌రెడ్డికి ఆదివారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. గొప్ప మేధావికి తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న నివాళిగా ఈ సమావేశం నిలిచిపోతుందని మల్లు రవి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment