సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఫైళ్లన్నీ భద్రంగా ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. సచివాలయం తరలింపులో భాగంగా ఫైళ్లను జాగ్రత్త చేసేందుకు ప్రతి శాఖకు ఓ కస్టోడియన్ అధికారిని నియమించామని, ఫైళ్లన్నీ భద్రపర్చేందుకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, వయోపరిమితి పెంపు అంశం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలనలో ఉందన్నారు. బాషా పండితులు, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇప్పటివరకు 1.49 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 1.17 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీకి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కొన్ని కోర్టు కేసుల నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనలు ఇవ్వలేకపోయినట్లు తెలిపారు. పోటీ పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌లోనే కాకుండా ఉర్దూలో కూడా నిర్వహించాలని ఎమ్మెల్యే ఖాద్రీ ప్రభుత్వాన్ని కోరగా.. మంత్రి స్పందిస్తూ టీఎస్‌పీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షలను ఉర్దూలో కూడా నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు గతంలో 42 శాతం పీఆర్‌సీ అడిగితే కేసీఆర్ 43 శాతం ఇచ్చి రికార్డు సృష్టించారని తెలిపారు. ఈసారి కూడా తప్పకుండా ఉద్యోగులు సంతృప్తిపడేలా ఫిట్‌మెంట్ ఇస్తారని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా భారీ మొత్తంలో వేతనాలు పెంచారని తెలిపారు. 2018 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 130 ఏసీబీ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment