పాస్‌ల కోసం పెద్దసంఖ్యలో క్యూ కట్టిన సందర్శకులు
వాహనాలు నిలిపేందుకు ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం గురువారం సందర్శకులతో కిటకిటలాడింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి కొందరు వస్తే.. మరికొందరు తమ సొంత పనుల కోసం సచివాలయానికి వచ్చారు. అధికారులను, మంత్రులను కలిసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీఎత్తున మంత్రుల అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో సచివాలయం బయట ప్రాంగణంతోపాటు లోపల ఫోర్లు కిటకిటలాడాయి.
సాధారణంగా సచివాలయంలోకి వెళ్లడానికి పాస్‌లు జారీచేసి సాయంత్రం 3 గంటల నుంచి మాత్రమే అనుమతినిస్తారు. అయితే, జన సందోహం పెరగటంతో ఉదయం నుంచే పాస్‌ల కౌంటర్ వద్ద క్యూలు కట్టడం గమనార్హం. మరి కొందరు మంత్రులు, అధికారుల పేషీల నుంచి ఫోన్లు చేయించుకొని లోపలికి వెళ్లారు.
పార్కింగ్ కోసం ఇక్కట్లు..
భారీ ఎత్తున ప్రజలు రావడంతో వాహనాలు నిలిపేందుకు ఇబ్బంది పడ్డారు. గేట్ –2 దగ్గర సచివాలయం లోనికి వెళ్లేందుకు కార్లు క్యూ కట్టాయి. సచివాలయం ప్రాంగణంలో కూడా భారీగా వాహనాలు నిలపడంతో కార్లతో నిండిపోయింది. సందర్శకులను నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment