సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సులు సచివాలయానికి పరుగులు తీశాయి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వం వివిధ ప్రాంతాల నుంచి మహిళలను పెద్ద ఎత్తున తరలించింది. ఇందుకోసం సిటీబస్సులను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, భువనగరి, చౌటుప్పల్, సంగారెడ్డి తదితర శివారు జిల్లాలతో పాటు నగరంలోని వివిధ నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలను పెద్ద సంఖ్యలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
దీంతో ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. బస్సులన్నీ సచివాలయం కోసమే ఏర్పాటు చేయడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా సాయంత్రం విధులు ముగించుకొని ఇళ్లకు చేరుకొనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇళ్లకు బయలుదేరిన విద్యార్థులు గంటలతరబడి బస్సుల కోసం పడిగాపులు కాశారు.
చివరకు ఆటోలు, తదితర ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లవలసి వచ్చింది. మరోవైపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. అమీర్‌పేట్, ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్డు, లిబర్టీ, ఇందిరాపార్కు లోయర్‌ట్యాంక్‌బండ్ తదితర చోట్ల వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే ఉండాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment