city buses
-
TSRTC: ఆర్టీసీ బస్సుల్లో సీటు బెల్టులు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా కార్లలో సీటు బెల్టులు వాడుతుంటారు. కానీ, తొలిసారి నగరంలో సీట్ బెల్టులుండే సిటీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. విదేశాల్లో బస్సుల్లో కూడా సీటు బెల్టులు తప్పని సరి. వాస్తవానికి మన దగ్గర కూడా బస్సుల్లోనూ సీటు బెల్టులుండాలనే నిబంధ న ఉన్నా అది అమలుకావటం లేదు. తొలిసా రి ఆర్టీసీ సిటీ సర్విసుల్లో ఆ తరహా సీట్లను అందుబాటులోకి తెస్తోంది. నగరంలో మరో నెలన్నరలో అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ఇవి కనిపించనున్నాయి. ఆ బస్సులు ఎలా ఉండనున్నాయో అధికారులు పరిశీలించేందుకు వీలుగా నమూనా బస్సును సోమవారం బస్‌భవన్‌కు తీసుకురాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్ మార్గాల్లో తిరిగేందుకు వీలుగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తిప్పాలని ఆర్టీసీ ఇటీవల నిర్ణయించింది. ఇప్పటికే పుష్పక్ పేరుతో 40 ఎలక్ట్రిక్ బస్సులు విమానాశ్రయం మార్గంలో తిరుగుతున్న విషయం తెలిసిందే. అవన్నీ లాభాల్లో ఉండటం, రద్దీకి చాలినన్ని లేకపోవటంతో అదనంగా మరిన్ని బస్సులు తిప్పాలని నిర్ణయించారు. దానితోపాటు ఐటీ కారిడార్‌లో మెట్రో రైలు సేవలు అందుబాటులో లేని రూట్లలో కొన్ని తిప్పనున్నారు. ప్రస్తుతం విమానాశ్రయ మార్గంలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులతో పోలిస్తే ఆధునిక వసతులు అదనంగా ఉన్న ఈ కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన రవాణా వసతిని అందించనున్నాయి. 500 బస్సులకు ఆర్డర్ 500 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నగరంలో తిప్పాలని నిర్ణయించిన ఆరీ్టసీ, ఇప్పటికే ఆర్డర్ ఇచి్చన విషయం తెలిసిందే. సిటీ బస్సులుగా తిప్పే సర్విసులకు సంబంధించి తొలి విడతలో 50 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అందులో 20 శంషాబాద్ విమానాశ్రయానికి, 30 ఐటీ కారిడార్‌లో తిరుగుతాయి. ఇందులో 25 బస్సులు నెలనెలన్నరలో రోడ్డెక్కుతాయని అధికారులు అంటున్నారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్దతిలో వీటిని ఆర్టీసీ అద్దెకు తీసుకుంటోంది. ఇవి కాకుండా మరో 800 ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా సమకూర్చుకోవాలనేది ఆర్టీసీ ఆలోచన. వాటికి ఇంకా టెండర్లు పిలవలేదు. ఆకుపచ్చ, తెలుపు రంగుతో.. ఆకుపచ్చ, తెలుపు రంగుతో ఈ బస్సులుంటాయి. రంగుల మేళవింపుపై ఎండీ సంతృప్తి వ్యక్తం చేశారు. బస్సు ముందువైపు ఆర్టీసీ లోగో లేకపోవటాన్ని ప్రశ్నించిన ఆయన, ప్రయాణికులకు కనిపించేలా లోగో ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని సీట్లకే బెల్టులుండటంతో, అన్ని సీట్లకు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఓఓ రవీందర్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్, ఒలెక్ట్రా కంపెనీ ప్రతినిధులు వేణుగోపాలరావు, ఆనంద్, యతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 12 మీటర్ల పొడవు.. ఇప్పుడు కొత్తగా సమకూరే ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు 12 మీటర్ల పొడవుతో ఉంటాయి. ఒక్కో బస్సులో 35 సీట్లుంటాయి.ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సాకెట్ అందుబాటులో ఉంటుంది. బస్సుల్లో మూడు సీసీ టీవీ కెమెరాలు అమర్చి ఉంటాయి. అవి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్‌తో ఉంటాయి. రివర్స్ చేసేప్పుడు డ్రైవర్‌కు వెనక భాగం కనిపించేలా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. ప్రయాణికులకు సూచనలు అందజేసేందుకు వీలుగా బస్సులో నాలుగు ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులుంటాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు వీలుగా బస్సులో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం ఉంటుంది. వెహికిల్ ట్రాకింగ్ సిస్టం కూడా ఉంటుంది. ఒకసారి ఫుల్ చార్జి అయితే 225 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తాయి. ఫుల్ చార్జింగ్కు దాదాపు 3 గంటల సమయం పడుతుంది. -
ఒకే టికెట్‌తో సిటీ బస్, మెట్రో, రైలులో ప్రయాణం.. ఎక్కడంటే!
సాక్షి, చెన్నై: రాజధాని నగరం చెన్నై రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇక్కడికి రోజూ లక్షలాది మంది వచ్చివెళ్తుంటారు. ఇక 2026లో చెన్నై సరిహద్దులు పూర్తిగా మారిపోనున్నాయి. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాలు, రాణిపేట జిల్లా పరిధిలోని అరక్కోణం వరకు 1,225 గ్రామాలు, ప్రాంతాలు చెన్నై మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలోకి రానున్నాయి. ఇది వరకు నగరం, సబర్బన్ ప్రాంతాలు 1,189 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండగా.. సరిహద్దు మార్పుతో అది ఏకంగా 5,904 చదరపు కిలోటమీటర్లకు చేరనుంది. కొత్తగా చెన్నై నగర సరిహద్దు చెంగల్పట్టు జిల్లా అచ్చరపాక్కం వరకు, రాణి పేట జిల్లా అరక్కోణం వరకు ఉండనుంది. ఈ విస్తరణ నేపథ్యంలో చెన్నై మహా మహా నగరంలో రవాణా వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా ఒకే గూటి కిందికి తెచ్చేందుకు డీఎంకే ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. సీఎండీఏ చుట్టూ రవాణా.. ప్రధాన రవాణా వ్యవస్థలుగా చెంగల్పట్టు నుంచి బీచ్ వరకు, సెంట్రల్ నుంచి అరర్కోణం , గుమ్మిండి పూండి వైపుగా ఎలక్ట్రిక్ రైలు సేవలు, బీచ్ నుంచి వేళచ్చేరి వరకు ఎంఆర్టీఎస్ రైలు సేవలు చెన్నైలో ఇప్పటికే ఉన్నాయి. ఇటీవల విమానాశ్రయం నుంచి కోయంబేడు – సెంట్రల్ మీదుగా విమ్కో నగర్‌కు ఓ మార్గం, సెయింట్ థామస్ మౌంట్ నుంచి ఆలందూరు మీదుగా అన్నా సాలై వైపుగా సెంట్రల్‌కు మారో మార్గంలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో ఎంఆర్టీఎస్ సేవలు మరికొన్ని నెలల్లో వేళచ్చేరి నుంచి సెయింట్ థామస్ మౌంట్ వరకు విస్తరించనున్నాయి. అలాగే మెట్రో సేవలు చెన్నై నగర శివారుల్లో ఓ వైపు కీలాంబాక్కం వరకు, మరోవైపు సిరుచ్చేరి వరకు, ఇంకో వైపు మాధవరం వరకు విస్తరించనున్నాయి. ఈ నగరానికి నలుదిశల్లో మెట్రో ప్రయాణమే కాకుండా అన్ని రకాల రవాణా వ్యవస్థను సులభతరం చేయనున్నారు. ఇందుకోసం కంబైన్డ్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ రంగంలోకి దిగింది. మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్‌లను ఏకీకృతం చేయడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేసింది. 2024లో అందుబాటులోకి.. ఒకే గూటి కిందికి అన్ని రకాల రవాణా సేవలను తీసుకొచ్చేందుకు కంబైన్డ్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ వేగవంతం చేసింది. ఒకే టికెట్టుతో పైన అన్ని రకాల రవాణా సేవలను ప్రజలు పొందేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆయా మార్గాలను ఏకం చేయడం, రైల్వేతో అనుసంధానించడం, బస్టాండ్ల ఏర్పాట్లు, ప్రయాణికులకు రవాణా మార్గాలను సులభతరం చేయడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. తద్వారా ప్రయాణ టికెట్ పొందేందుకు వీలుగా రూట్ మ్యాప్‌తో పాటు అన్ని రకాల రవాణా సమాచారం, సమయం తదితర వివరాలను ప్రత్యేకంగా ప్రయాణికులకు తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ యాప్‌లో ప్రయాణంలో బయలుదేరే ప్రాంతం, సమయం, చేరవలసిన ప్రాంతం గురించి వివరాలను, మధ్యలో ఉన్న అన్ని రకాల రవాణాలకు సంబంధించిన స్టేషన్లు, స్టాపింగ్‌ల సమాచారం ఉంటుంది. చేరవలసిన రూట్ మ్యాప్ ఆధారంగా వివరాలను నమోదు చేసిన పక్షంలో చార్జీ మొత్తం వివరాలు యాప్ ద్వారా తెలుసుకుని ఆన్లైన్ నగదు బదిలీకి అవకాశం కల్పిస్తున్నారు. ఒకే టికెట్టు ద్వారా అన్ని రకాల రవాణా సేవలను 2024 జనవరిలో అమల్లోకి తెచ్చే విధంగా ఆ అథారిటీ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. -
ప్రయాణికుల ఆనందమే లక్ష్యం.. సిటీ బస్సుల్లో 'టీఎస్ఆర్టీసీ రేడియో’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రయాణికులకు మరింతగా చేరువ అయ్యేందుకు కొత్త ఆలోచనలతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే ప్రయాణికుల ప్రయాణం వినోదాత్మకంగా, సంతోషంగా కొనసాగేందుకు బస్సుల్లో ‘టీఎస్ఆర్టీసీ రేడియో’ను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దానిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన తర్వాత.. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ సిటీలోని 9 ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ఈ రేడియోను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో కూకట్పల్లి డిపోకు చెందిన బస్సులో ఈ రేడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శనివారం ప్రారంభించారు. అనంతరం రేడియో పనితీరును పరిశీలించారు. రేడియో ఏర్పాటు, పనిచేస్తున్న విధానం, సౌండ్, తదితర విషయాల గురించి టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్, కూకట్పల్లి డిపో మేనేజర్ ఇషాక్ బిన్ మహ్మద్, మెకానికల్ సూపరింటెండెంట్ జయరాం, ఎలక్ట్రిషియన్ కేవీఎస్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. కాగా, పైలట్ ప్రాజెక్టుగా 9 సిటీ బస్సుల్లో ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ రేడియో ప్రయాణీకులను అలరించనుందని సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప్పల్-సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్-సికింద్రాబాద్, గచ్చిబౌలి-మెహిదీపట్నం, సికింద్రాబాద్-పటాన్చెరువు, కూకట్పల్లి-శంకర్పల్లి, కొండాపూర్-సికింద్రాబాద్, కోఠి-పటాన్చెరువు, ఇబ్రహీంపట్నం-జేబీఎస్ మార్గాల్లో నడిచే బస్సుల్లో ఈ రేడియోను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా బస్సుల్లో శనివారం నుంచే రేడియో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఈ రేడియోలో మంచి పాటలతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను, టీఎస్ఆర్టీసీ అందిస్తోన్న సేవలను ప్రయాణికులకు వివరిస్తున్నామని పేర్కొన్నారు. మానవ సంబంధాల ప్రాముఖ్యత, నైతిక విలువలను పెంపొందించే నీతి కథలను ఈ రేడియోలో అందుబాటులో ఉంచామని వివరించారు. అలాగే, ఈ రేడియో ద్వారా మహిళల, పిల్లల భద్రత, సైబర్, ఆర్థిక నేరాలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రయాణికులకు వినోదం అందించడంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు వివరించారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్‌బ్యాక్.. ప్రయాణికుల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత.. పూర్తిస్థాయిలో అన్ని బస్సుల్లోనూ రేడియోను అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యం భావిస్తుందని సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణికుల అభిప్రాయాల స్వీకరణకు 9 బస్సుల్లో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఆ క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్ ఫోన్లో స్కాన్ చేసి.. రేడియోపై ఫీడ్‌బ్యాక్‌ను ప్రయాణికులు ఇవ్వాలని సూచించారు. టీఎస్ఆర్టీసీ తీసుకువచ్చిన ఎన్నో కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదించారని, ఈ సరికొత్త విధానాన్ని కూడా ప్రోత్సహించాలని కోరారు. TSRTC launched a pilot project of radio services in 9 city buses in Hyderabad. It was inaugurated by our MD Sri V.C. Sajjanar, IPS, along with the Executive Director (Operations), Sri P.V.Munishekar. Passengers can share their valuable feedback by scanning the QR codes. pic.twitter.com/RD5ddzQkEr — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 28, 2023 -
TSRTC: నష్టాల సాకు.. బస్సులకు బ్రేకు
సాక్షి, హైదరాబాద్: ప్రగతి రథచక్రం ప్రజారవాణా నుంచి మెల్లగా తప్పుకుంటోంది. నష్టాల సాకుతో బస్సు సర్వీసులకు కోత పెడుతూ ‘సిటీ’జనులను ప్రత్యామ్నాయ రవాణా మార్గాల వైపు మళ్లేలా చేస్తోంది. దేశవ్యాప్తంగా మహానగరాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను ఆయా రాష్ట్రాల రవాణా సంస్థలు పెంచుతుండగా.. మన గ్రేటర్లో మాత్రం బస్సుల సంఖ్య దాదాపు సగానికి తగ్గిపోయింది. సామర్థ్యానికి మించి రాకపోకలు సాగించిన బస్సులను ఫిట్‌నెస్‌లేమి కారణంగా తుక్కుకు పంపిస్తుండగా.. వాటి స్థానాన్ని భర్తీ చేసేందుకు సరిపడా బస్సులను రోడ్డెక్కించడంలో ఆర్టీసీ విఫలమవుతోంది. దీనికి సంస్థ ఆర్థిక నష్టాలే ప్రధాన కారణం. దీంతో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయడం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంస్థకు భారంగా పరిణమించింది. ఆక్యుపెన్సీ బాగా ఉన్నా.. ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్న రూట్లలోనూ బస్సుల సంఖ్య పెంచుకోకపోవడానికి ఇది ప్రధాన అడ్డంకిగా మారింది. కేవలం 2,550 బస్సులే.. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు జనాభా 1.30 కోట్లు. ఆ నగరంలో సిటీ బస్సుల సంఖ్య 6 వేలు. మరో 2,500 బస్సులను కొనేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. అదే కోటి జనాభా దాటిన మన భాగ్యనగరంలో బస్సుల సంఖ్య ఎంతో తెలుసా? కేవలం 2,550 మాత్రమే. ఐదేళ్లలో హైదరాబాద్‌లో సిటీ బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అదే సమయంలో బెంగళూరు సహా ముంబై, ఢిల్లీ నగరాల్లో బస్సుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. మెట్రో నగరాల్లో ప్రజారవాణా సేవలను విస్తరించేందుకు ఆయా రవాణా సంస్థ ప్రత్యేకకార్యాచరణను అమలు చేస్తున్నాయి. శివార్లకు బస్సుల సంఖ్య పెంచడం, విమాన, రైల్వేస్టేషన్లకు బస్సులను అనుసంధానించడం ద్వారా రవాణా సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. అదే మన గ్రేటర్లో మాత్రం సిటీ బస్సుల సంఖ్య తగ్గి వ్యక్తిగత వాహనాలు భారీగా పెరిగాయి. మెట్రో, ఎంఎంటీఎస్, సిటీ బస్సుల మధ్య అనుసంధానత లేకపోవడంతో నగరవాసులు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో సుమారు 74 లక్షల సొంత వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. పడిపోయిన ప్రజా రవాణా... రవాణారంగ నిపుణుల అంచనాల ప్రకారం 2015 నాటికే హైదరాబాద్ నగరానికి కనీసం 6 వేల బస్సులు అవసరం. కానీ 2013 నుంచి ఇప్పటివరకు కేవలం 80 ఏసీ బస్సులు మాత్రమే కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. అప్పటివరకు ఉన్న 3,850 బస్సులలో 850 బస్సులను కార్గో వాహనాలుగా మార్చారు. మరికొన్నింటికి కాలం చెల్లిపోవడంతో తుక్కుగా మార్చారు. వాటి స్థానంలో ఒక్క నయా బస్సు కూడా అందుబాటులోకి రాలేదు. మూడేళ్ల క్రితం వరకు రోజుకు 42 వేల ట్రిప్పుల చొప్పున సుమారు 9 లక్షల కిలోమీటర్ల పైచిలుకు తిరిగిన బస్సులు ఇప్పుడు 30 వేల ట్రిప్పులు కూడా తిరగడం లేదు. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ ప్రవేశపెట్టాలని భావించినా నిధుల్లేమి కారణంగా ఆ ప్రతిపాదనను ఆర్టీసీ విరమించుకుంది. అయితే హెచ్ఎండీఏ సాయంతో బస్సులను ప్రవేశపెట్టే దిశగా ఏడాదిగా ఆలోచన చేస్తున్నా కార్యరూపం దాల్చలేదు. అదే ముంబైలో మాత్రం విద్యుత్‌తో నడిచే డబుల్ డెక్కర్ బస్సుల ప్రవేశానికి ఆ నగర రవాణా సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. మెట్రో నగరాల్లో ఇలా ►సుమారు 3.2 కోట్ల జనాభా కలిగిన ఢిల్లీలో మెట్రో రైలు సదుపాయాలను గణనీయంగా విస్తరించారు. మరోవైపు ప్రస్తుతం అక్కడ నడుస్తున్న 6,000కుపైగా సిటీ సీఎన్జీ బస్సుల స్థానంలో 2025 నాటికి పూర్తిగా విద్యుత్ ఆధారిత ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టారు. ►సుమారు 2.09 కోట్ల జనాభా కలిగిన ముంబై నగరంలో ప్రతిరోజూ 600కు పైగా లోకల్ రైళ్లు తిరుగుతున్నాయి. 4,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం 2,500 బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే 300 బస్సులు బృహన్ ముంబై విద్యుత్ సరఫరా, రవాణా (బెస్ట్)కు చేరాయి. మరో 100 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ►బెంగళూరు మహానగరంలో 6,000 ఏసీ బస్సులు తిరుగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ మేరకు మరో 2,500 బస్సులను కొత్తగా కొనుగోలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. దశలవారీగా 12,000 బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. విఫలమైన కనెక్టివిటీ ప్రపంచంలోని ఏ నగరంలోనైనా వివిధ రకాల ప్రజారవాణా వాహనాల మధ్య పటిష్టమైన కనెక్టివిటీ ఉంటుంది. లండన్ మహానగరంలో సుమారు 19,000 బస్సులతో రైల్వే వ్యవస్థకు కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రజారవాణాపై సమగ్ర సమీక్ష నిర్వహించి సదుపాయాలను విస్తరిస్తారు. హైదరాబాద్‌లో నాలుగు మార్గాల్లో మెట్రో రైళ్లు, ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి వంటి రద్దీ రూట్లలో ఎంఎంటీఎస్ అందుబాటులో ఉన్నా సిటీ బస్సులతో కనెక్టివిటీ లేదు. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు 7 జిల్లాల పరిధిలో విస్తరించింది. నగర శివార్ల నుంచి నగరంలోని ప్రధాన మార్గాలను అనుసంధానిస్తూ సర్వీసులనునడపాలనే ప్రజల డిమాండ్ మేరకు బస్సులు లేకపోవడం గమనార్హం. -
ఆర్టీసీ బస్సులో మహిళలతో కండక్టర్ అసభ్యకర ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో రంగంలోకి దిగిన షీ టీమ్స్.. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటన నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలోని సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఓ మహిళా ప్రయాణికురాలితో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సయీద్ అమీన్(40) బస్సులో మహిళా ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. బస్సు టికెట్స్ ఇచ్చే క్రమంలో మహిళా ప్రయాణీకులను తాకరాని చోట తాకుటుండటంతో వారు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా ప్రయాణీకురాలు ధైర్యం చేసి నాచారాం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ విషయాన్ని టీ షీమ్స్ దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన షీ టీమ్స్.. బస్సులో నిఘా ఉంచి కండక్టర్ అమీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఇలా చేస్తాడని ఎవరు అనుకోరు -
హైదరాబాద్: చార్జీలు సరే.. బస్సేదీ!
సాక్షి, హైదరాబాద్: టికెట్ ధరల్లో రౌండప్ పేరిట, డీజిల్ సెస్ పేరుతో భారీగా చార్జీలు పెంచిన ఆర్టీసీ తాజాగా విద్యార్థులను సైతం వదిలిపెట్టకుండా పాస్‌లపై మోత మోగించింది. చార్జీలను రెండింతలు చేసింది. ప్రయాణికుల రద్దీ, వివిధ ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌కు సరిపడా బస్సులు మాత్రం ఏర్పాటు చేయలేకపోతోంది. నగర శివారు ప్రాంతాల్లోని వందలాది కాలనీలు, బస్తీలకు తగినన్ని బస్సుల్లేవు. ఆర్టీసీ పెంచిన చార్జీలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా బస్సులు అందుబాటులో లేకపోవంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉదయం, సాయంత్రం విద్యార్థుల రద్దీ మేరకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడం విడ్డూరం. సకాలంలో బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సివస్తోంది. కొరత.. తీరని వ్యధ.. ∙కీసర, రాంలింగంపల్లి, తూముకుంట, బండకాడిపల్లి, ఉషారుపల్లి, ఉద్దమర్రి తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు ఈసీఐఎల్, కుషాయిగూడ, సైనిక్‌పురి, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్తుంటారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఘట్కేసర్, కీసర వైపు ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలకు వేలాది మంది విద్యార్థులు ప్రతి రోజు రాకపోకలు సాగిస్తారు. ఈసీఐఎల్ నుంచి ఉషారుపల్లి, ఉద్దమర్రి, బండకాడిపల్లి తదితర గ్రామాలకు బస్సులు పెంచాలని ఏడాదిగా స్థానికులు ఆర్టీసీని కోరుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ రూట్లో బస్సుల సంఖ్య పెరగలేదు. దీంతో విద్యార్ధులు, కూరగాయల రైతులు, పాల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగర శివార్లలోని అనేక ప్రాంతాల్లోనూ విద్యార్ధులు, స్థానికుల డిమాండ్ మేరకు సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో రోజుకు 6 ట్రిప్పులు తిరిగిన రూట్లలో ఇప్పుడు మూడు ట్రిప్పులే నడుస్తున్నాయి. 4 ట్రిప్పులను రెండింటికి కుదించారు. గ్రేటర్లో బస్సుల సంఖ్య భారీగా తగ్గడమే ఇందుకు కారణం. గతంలో 3850 బస్సులు ఉంటే ఇప్పుడు 2550 మాత్రమే తిరుగుతున్నాయి. ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గింది. విద్యా సంస్థలు తెరిస్తే కష్టమే... నగర శివార్లలోని ప్రాంతాల్లోని కళాశాలల్లో సుమారు 7 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వివిధ మార్గాల్లో ప్రతి రోజు 1500 బస్సులు నడుస్తున్నట్లు అంచనా. కానీ సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులకు రవాణా సదుపాయాన్నందజేసే ఈ బస్సుల్లో విద్యార్థులు ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నారు. అమ్మాయిలకు బస్సు ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. -
డబుల్’ ధమాకా! టికెట్ పైనే రెండు గంటలు ఉచిత ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: పుష్పక్ బస్సుల్లో ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు డబుల్ ధమాకా. ఎయిర్‌పోర్టు నుంచి పుష్పక్‌లో టికెట్ తీసుకున్నప్పటి నుంచి రెండు గంటల పాటు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రమయానికి నడిచే పుష్పక్ బస్సుల్లో ప్రయాణికుల భర్తీ సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు ఆర్టీసీ వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టింది. మరో వారం, పది రోజుల్లో ఇది అందుబాటులోకి రానుంది. విమానాశ్రయం నుంచి పుష్పక్‌లో వచ్చే ప్రయాణికులు తీసుకొనే టికెట్లపైనే ఈ రెండు గంటల ఉచిత ప్రయాణం నమోదై ఉంటుంది. ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఠంచన్‌గా పుష్పక్... ప్రస్తుతం 39 పుష్పక్ బస్సులు నగరంలోని జేఎన్టీయూ, పర్యాటక భవన్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల నుంచి వివిధ మార్గాల్లో ఎయిర్‌పోర్టు వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికుల అవసరాలకనుగుణంగా ఈ బస్సులు 24 గంటల పాటు అందుబాటులో ఉండేవిధంగా నడుపుతున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 70శాతం ఆక్యుపెన్సీతో బస్సులు నడుస్తున్నాయి. కానీ నగరం నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే సమయంలోనే 25 నుంచి 30 శాతం వరకే ఆక్యుపెన్సీ నమోదవుతోంది. ఫ్లైట్ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వెళ్లేటప్పుడు క్యాబ్‌లు, ఇతర వాహనాల్లో వెళ్తున్నట్లు ఆర్టీసీ గుర్తించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సిటీ నుంచి బయలుదేరే ప్రతి బస్సు కచ్చితమైన సమయపాలన పాటించేవిధంగా చర్యలు చేపట్టారు. బస్సుల సమయపాలనపై ప్రయాణికులకు నమ్మకాన్ని కలిగించేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టనున్నారు. బస్సుల్లో, బస్‌షెల్టర్‌లో కచ్చితమైన వేళలను ప్రదర్శించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పుష్పక్‌ల నిర్వహణపై ఎప్పటికప్పుడు ప్రయాణికుల స్పందన తెలుసుకొనేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల నుంచి అందే సమాచారం ఆధారంగా బస్సుల నిర్వహణలో మార్పులు, చేర్పులు ఉంటాయి. ఫ్లైట్ వేళలతో అనుసంధానం.. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 190కిపైగా జాతీయ విమాన సర్వీసులు, మరో 30కిపైగా అంతర్జాతీయ విమానాసర్వీసులు నడుస్తున్నాయి. రోజుకు 40 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. పుష్పక్‌లను వినియోగించుకొనేవారి సంఖ్య 5వేలు మాత్రమే. కనీసం మరో 10 వేల మంది ప్రయాణికులను పెంచుకోగలిగినా పుష్పక్ బస్సుల్లో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరుగుతుందని అధికారుల అంచనా. ఇందుకనుగుణంగా విమానాల వేళలను దృష్టిలో ఉంచుకొని ప్రతి బస్సు సకాలంలో ఎయిర్‌పోర్టుకు చేరేవిధంగా పుష్పక్‌ల నిర్వహణపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. (చదవండి: వడివడిగా ‘స్టడీ’...నిరుద్యోగులకు ప్రత్యేక కోచింగ్) -
సిటీ బస్సులో సీఎం.. ఆశ్చర్యపోయిన ప్రయాణికులు
సాక్షి ప్రతినిధి, చెన్నై : వినూత్న రీతిలో ప్రజలకు చేరువయ్యేందుకు యత్నిస్తున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం మరో కొత్త పంథాను అనుసరించారు. చెన్నై సిటీ బస్సులో నిలబడి ప్రయాణికులతో కలిసి కొద్దిసేపు పర్యటించారు. సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని గడిచిన ఎన్నికల మేనిఫెస్టోలో స్టాలిన్ పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే అమలు చేశారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పడి శనివారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా తన ఇంటి నుంచి తండ్రి కరుణానిధి నివసించిన గోపాలపురంలోని ఇంటికి చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు మేళతాళాలతో స్టాలిన్‌కు స్వాగతం పలికారు. ఇంటిలోని కరుణానిధి చిత్రపటం వద్ద నివాళులరి్పంచారు. తల్లి దయాళుఅమ్మాళ్కు నమస్కరించి ఆశీర్వాదం అందుకున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతూ స్టెల్లా మెరీస్ కాలేజీ వద్ద కారును నిలపమని చెప్పి అనుసరిస్తున్న మంత్రులను వెంట రావద్దని ఆదేశించారు. అక్కడికి సమీపంలోని బస్‌స్టాండ్ వద్దకు వెళ్లి పెరంబూరు–బిసెంట్‌నగర్ మధ్య ప్రయాణించే 29సి మహిళల ప్రత్యేక బస్సు ఎక్కారు. సిటీ బస్సులో అకస్మాత్తుగా సీఎం స్టాలిన్ ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు సంభ్రమాశ్చర్యాలకు లోనై లేచి నిలబడ్డారు. స్టాలిన్ వారిని కూర్చోమని చెప్పి సంభాషణ మొదలు పెట్టారు. తన జీవితంలో 29సి రూట్ బస్సును మరువలేనన్నారు. చిన్నతనంలో గోపాలపురం నుంచి 29సిలోనే స్కూలుకు వెళ్లానని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకం సౌకర్యంగా ఉందా..? అని ప్రశ్నించగా ప్రయాణికులంతో తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. తనకు రూ.9 వేలు జీతం, ఉచిత ప్రయాణం వల్ల నెలకు రూ.900 మిగులుతోందని ఓ ప్రయాణికురాలు బదులిచ్చారు. ఇలా మిగిలిన సొమ్మును ఏం చేస్తున్నారని స్టాలిన్ ప్రశ్నించగా పొదుపు చేస్తున్నట్లు బదులిచ్చారు. అలాగే బస్సులోని విద్యార్థినులను ‘డీఎంకే ఏడాది ప్రభుత్వం ఎలా ఉందని’ అడగ్గా, చాలా తృప్తిగా ఉందని బదులిచ్చారు. మిమ్మల్ని నేరుగా చూడటం ఆనందంగా ఉందని పేర్కొంటూ పలువురు ప్రయాణికురాళ్లు సెల్‌ఫోన్ ద్వారా సెలీ్ఫలు తీసుకున్నారు. సిటీ బస్సులు సమయానికి వస్తున్నాయా..?, ఉచిత టిక్కెట్లను సక్రమంగా ఇస్తున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. సుమారు 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన సీఎం ఆ తరువాత బస్సు దిగి వెనుకనే వస్తున్న కారులో ఎక్కి వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ షాక్? -
గుడ్‌న్యూస్: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
TSRTC Offers To Travelers: దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న సర్వీసు వద్దకు చేరే వరకు సిటీలో రెండు గంటల పాటు ఫ్రీగా ప్రయాణించే గొప్ప అవకాశం టీఎస్ ఆర్టీసీ కల్పించిందని భెల్ డిపో మేనేజర్ సత్యనారాయణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, తిరుపతి, చెన్నై, విశాఖపట్టణం, కాకినాడ, భద్రాచలం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు, 250 కిలోమీటర్ల దూరం మించి ఉన్న ప్రాంతాలకు ఆన్లైన్ లేదా బుకింగ్ కేంద్రాల వద్ద రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ అవకాశం పొందవచ్చన్నారు. ముందుగా బుక్ చేసుకున్న బస్సు బయలుదేరే టైం వరకు రెండు గంటల ముందు నగరంలో ఏ ప్రాంతం నుంచైనా బస్సు ఉన్న చోటుకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. నాన్ ఏసీ బుక్ చేసుకున్న ప్రయాణికులు నాన్ ఏసీ సిటీ సర్వీసుల్లో, ఏసీ బస్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఏసీ సర్వీస్‌ల్లోనూ, నాన్ ఏసీ బస్సుల్లోను ప్రయాణించే వెసులుబాటు ఉందని తెలిపారు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు వచ్చే ప్రయాణికులకు కూడా వారు షెడ్యూల్డ్ టైం నుంచి 2 గంటలలోపు వారి గమ్యస్థానాలకు చేరుకునే వరకు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. టీఎస్ ఆర్టీసీ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చదవండి: (నిలోఫర్‌లో ఇద్దరు చిన్నారుల మృతి? ఉద్రిక్తత) -
60 శాతం బస్సులు మేడారానికే.. హైదరాబాద్ పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సులు విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. సకాలంలో అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొద్ది రోజులుగా సిటీ ఆర్డినరీ బస్సులను మేడారం జాతరకు తరలిస్తున్నారు. దీంతో నగరంలో ట్రిప్పులు గణనీయంగా తగ్గాయి. ఉదయం, సాయంత్రం స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే సమయంలో తిరిగి ఇళ్లకు చేరుకొనేందుకు విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు ఉండడం లేదు. మరోవైపు విద్యార్థుల బస్‌పాస్‌లు కేవలం ఆర్డినరీ బస్సులో మాత్రమే చెల్లుబాటవుతాయి. మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్లలో వీరి పాస్‌లకు అనుమతి ఉండదు. ఆర్డినరీ బస్సులు లేకపోవడంతో మెట్రోల్లో చార్జీలు చెల్లించాల్సివస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఆర్డినరీ పాస్‌లపై రాకపోకలు సాగించే సాధారణ ఉద్యోగులు సైతం ఇబ్బందులను ఎదుర్కోవాల్సివస్తోంది. 60 శాతం బస్సులు అక్కడికే.. ► గ్రేటర్ పరిధిలో సుమారు 2,850 బస్సులు ఉన్నాయి. రోజుకు 20 వేలకు పైగా ట్రిప్పులు తిరుగుతున్నాయి. 25 లక్షల మంది ప్రయాణికులు సిటీ బస్సుల సేవలను వినియోగించుకుంటున్నట్లు అంచనా. ప్రస్తుతం 60 శాతం బస్సులను మేడారం జాతరకు తరలించారు. జాతర రద్దీని దృష్టిలో ఉంచుకొని నగరంలోని డిపోలను ఉమ్మడి వరంగల్ జిల్లా డిపోలతో అనుసంధానం చేశారు. దీంతో సిటీ డిపోల్లో బస్సుల నిర్వహణ ప్రస్తుతం వరంగల్ అధికారుల పర్యవేక్షణలో ఉంది. ► అధికారులను, సిబ్బందిని సైతం పెద్ద ఎత్తున మేడారంలో మోహరించారు. 3,845 బస్సులను మేడారం జాతర కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతో సిటీలో బస్సుల కొరత ఏర్పడింది. ఇది తాత్కాలికమే అయినా విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా బస్‌పాస్‌లు ఉన్న వారు చార్జీలు చెల్లించి మెట్రో బస్సుల్లో ప్రయాణం చేయాల్సివస్తోంది. ప్రత్యామ్నాయమేదీ? ► గ్రేటర్లో సుమారు 5 లక్షల స్టూడెంట్ పాస్‌లు ఉన్నాయి.1.5 లక్షల మందికి పైగా విద్యార్ధులు ఉచిత పాస్‌లపై ఆర్డినరీ బస్సుల్లో స్కూళ్లకు వెళ్తున్నారు. పదో తరగతి వరకు అమ్మాయిలకు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం ఉంది. ► కాలేజీలకు వెళ్లే విద్యార్థులంతా రూట్ పాస్‌లు, నెలవారీ బస్‌పాస్‌లపై వెళ్తున్నారు. ఆర్డినరీ బస్సులను మేడారానికి తరలించడంతో మెట్రో బస్సుల్లో వీటిని అనుమతించడం లేదు. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే పల్లెవెలుగు బస్సుల్లోనూ అనుమతించడం లేదు. ► జాతర పూర్తయ్యే వరకు తమ బస్‌పాస్‌లను పల్లెవెలుగు, మెట్రో బస్సుల్లో తాత్కాలికంగా అనుమతించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
పల్లె వెలుగులు .. పట్నం బాట
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు పల్లెవెలుగులుగా గ్రామీణ ప్రాంతాలకు తిరిగిన బస్సులు కొన్ని సిటీ సర్వీసులుగా మారనున్నాయి. ఈ మేరకు పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం చాలా ఊళ్లకు పల్లెవెలుగు బస్సులు తిరగటం లేదు. తక్కువ ఆక్యుపెన్సీ రేషియో ఉండటం, రోడ్లు బాగాలేకపోవటం తదితర కారణాలతో కొన్ని ఊళ్లకు బస్సులను ఆపేసిన విషయం తెలిసిందే. మరోవైపు అద్దె బస్సుల సంఖ్య కూడా పెరగటంతో కొన్ని పల్లెవెలుగు బస్సులు వృథాగా ఉన్నాయి. అయితే వాటిని సిటీ బస్సులుగా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో మియాపూర్‌లోని బస్‌బాడీ వర్క్‌షాపులో పల్లెవెలుగు బస్సులను సిటీ బస్సులుగా మారుస్తున్నారు. ప్రస్తుతానికి దాదాపు 350 బస్సులను ఈ విధంగా సిద్ధం చేస్తున్నారు. నగరంలో కొరత రానుండటంతో.. హైదరాబాద్‌లో తిరుగుతున్న సిటీబస్సుల్లో చాలావరకు పాతబడిపోయాయి. మరోవైపు ఇప్పట్లో కొత్త బస్సులు కొనే వీలు లేకుండా పోయింది. ఉన్న బస్సులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్క్రాప్ (తుక్కు)పాలసీ ప్రకారం 15 ఏళ్లు పూర్తయిన బస్సుల్ని తిప్పేందుకు వీలులేదు. ఈ కారణంగా వచ్చే మార్చి నాటికి నగరంలో దాదాపు 600 బస్సులను తొలగించాల్సి ఉంది. మరోవైపు రెండేళ్ల క్రితం సమ్మె జరిగిన సమయంలో ప్రభుత్వ ఆదేశం మేరకు దాదాపు 800 బస్సులను తగ్గించారు. వాటిల్లో ఎక్కువ శాతం బస్సులను ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన సరుకు రవాణా (కార్గో) బస్సులుగా మార్చేశారు. ఇలా కొన్ని కార్గో సర్వీసులుగా మారిపోవడం, 600 బస్సుల గడువు తీరిపోనుండటంతో నగరంలో బస్సులకు తీవ్రమైన కొరత ఏర్పడనుంది. దీంతో పల్లెవెలుగు బస్సులను సిటీ సర్వీసులుగా మార్చి నగర ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. అద్దెబస్సుల రాకతో మిగులు సమ్మె సమయంలో ఆర్టీసీ కొత్తగా 1,300 అద్దె బస్సులను తీసుకుంది. వీటిల్లో ఎక్కువ బస్సులను పల్లెవెలుగు సర్వీసులుగానే చేర్చుకుంది. దీంతో చాలా డిపోల్లో సొంత పల్లెవెలుగు బస్సులు మిగిలిపోయాయి. వాటిని అప్పట్లో కార్గోకు బదిలీ చేయాలని భావించారు. కానీ కార్గో విభాగం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటంతో అన్ని బస్సులు ఇవ్వాల్సిన అవసరం లేదని తర్వాత తేల్చారు. దీంతో మిగిలిపోయిన బస్సులన్నీ డిపోల్లో వృథాగా ఉన్నాయి. అలాగే వేరే ఇతర కారణాలతో నిలిపివేసిన బస్సులు కూడా ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని ఎంపిక చేసి సిటీ బస్సులుగా మారుస్తున్నారు. సీట్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయటంతో పాటు, నిర్మాణంలో తేడా ఉన్న వాటిని పూర్తిస్థాయిలో సరిచేసి రంగులేసి కొత్త బస్సుల తరహాలో సిద్ధం చేస్తున్నారు. పూర్తయిన వాటిని డిపోలకు అప్పగిస్తున్నారు. -
ఏ బస్సు ఎప్పుడొస్తుందో..?
నగరంలోని వివిధ రూట్లలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటేనే కష్టంగా మారింది. అర్జెంటుగా వెళ్లాల్సి ఉన్నా గంటల తరబడి బస్సుల కోసం బస్టాపుల్లో వేచి చూడాల్సిన దుస్థితి దాపురించింది. బస్సుల వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని, అందుకు బస్సులకు జీపీఎస్ అనుసంధానం చేసిన ప్రభుత్వం లాక్డౌన్ అనంతరం దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియక ఎదురు చూసి చివరకు అధిక డబ్బులు చెల్లించి క్యాబులు, ఆటోల్లో ప్రయాణించాల్సిన దుస్థితి ఉంది. చాలా రూట్లలో కనీసం సమయపాలన ఉండటం లేదు. నిత్యం ఆయా రూట్లలో ప్రయాణించేవారికి నరకం కనిపిస్తోంది. ఒకరోజు ఓ సమయానికి వచ్చిన బస్సు మరోరోజు ఆ సమయానికి రావడంలేదు. దీంతో ఉద్యోగులు, ఇతర అవసరాల నిమిత్తం వెళ్లేవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో రూట్ నంబర్ 279. సికింద్రాబాద్ జూబ్లీబస్‌స్టేషన్ నుంచి ఇబ్రహీంపట్నం. నిత్యం ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే రూట్ ఇది. కానీ బస్సెక్కాలంటే గంటల తరబడి పడిగాపులు కాయాల్సిందే. ఉప్పల్ నుంచి చాంద్రాయణగుట్ట, అత్తాపూర్ రూట్లో మెహిదీపట్నం రాకపోకలు సాగించే ‘300 రూట్లో ‘ నాలుగైదు బస్సులు వరుసగా బయలుదేరుతాయి. ఆ సమయంలో ప్రయాణికుల డిమాండ్ మేరకు ఒకటి, రెండు బస్సులు ఏర్పాటు చేస్తే చాలు. కానీ ఐదు బస్సులు ఒకేసారి బయలుదేరడం వల్ల మిగతా మూడు ఖాళీగా వెళ్లాల్సి వస్తోంది. ఈ రెండు రూట్లే కాదు.. గ్రేటర్‌లోని అనేక మార్గాల్లో బస్సుల నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో డిమాండ్‌కు తగిన విధంగా బస్సులు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు డిపోల మధ్య సమన్వయం కొరవడటం వల్ల వివిధ రూట్లలో బస్సులు తరచూ బంచింగ్ అవుతున్నాయి. నో టైమింగ్స్.. గ్రేటర్ పరిధిలో సుమారు 2,500 బస్టాపులు ఉన్నాయి. మరో 20కి పైగా బస్‌బేలు, సికింద్రాబాద్, జేబీఎస్, ఎంజీబీఎస్, కోఠీ, కాచిగూడ, ఈసీఐఎల్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, హయత్‌నగర్, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో బస్స్టేషన్లు, ప్రయాణ ప్రాంగణాలు ఉన్నాయి. ప్రతిరోజూ 29 డిపోల నుంచి సుమారు 2,500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ప్రధాన బస్స్టేషన్లలో మినహా ఎక్కడా బస్సుల రాకపోకలకు సంబంధించిన వివరాలు లేవు. గతంలో కొన్ని ముఖ్యమైన బస్టాపుల్లో ఎల్ఈడీ డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. ఏ బస్సు ఏ సమయానికి వస్తుందో ప్రదర్శించేవాళ్లు. లాక్డౌన్ నిబంధనల సడలింపు తర్వాత దశలవారీగా పూర్తిస్థాయిలో బస్సులను పునరుద్ధరించినప్పటికీ ‘సమయపాలన’ మాత్రం పునరుద్ధరించలేదు. దీంతో బస్సుల కోసం ఎదురుచూపులే మిగులుతున్నాయని నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొరవడిన సమన్వయం.. గ్రేటర్లో 29 డిపోల నుంచి సుమారు 1,150 రూట్లలో బస్సులు నడుపుతున్నారు. గతంలో రోజుకు 40 వేల ట్రిప్పులు తిరిగేవి. బస్సుల సంఖ్యను తగ్గించడంతో ట్రిప్పులు సైతం గణనీయంగా తగ్గాయి. వివిధ డిపోల నుంచి బస్సుల షెడ్యూల్స్ రూపొందించడంలో డిపోమేనేజర్లకు, ఉన్నతాధికారులకు మధ్య కచి్చతమైన సమన్వయం లేకపోవడం వల్ల ఒకే రూట్లో రెండు, మూడు డిపోలకు చెందిన బస్సులు ఒకే సమయంలో రాకపోకలు సాగిస్తున్నాయి. ‘కోవిడ్ అనంతరం బస్సుల నిర్వహణపైన సీరియస్‌గా దృష్టి సారించకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు’ ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అటకెక్కిన జీపీఎస్.. జీపీఎస్ ద్వారా బస్సుల రాకపోకలను ట్రాకింగ్ చేసే వ్యవస్థను గతంలో ప్రవేశపెట్టారు. బస్సుల నిర్వహణలో శాస్త్రీయమైన పద్ధతి ఉంటుందని భావించారు. ప్రతి ట్రిప్పును లెక్క వేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణికుల రద్దీ, బస్సుల డిమాండ్ వంటి అంశాలపైన అవగాహన ఏర్పడుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ప్రా జెక్టు ప్రస్తుతం అటకెక్కింది. ‘ఒకవైపు మెట్రో రైలు, మరోవైపు ప్రైవేట్ వాహనాలు గ్రేటర్ ఆరీ్టసీకి సవా ల్గా మారాయి. బస్సుల నిర్వహణలో కచ్చితమైన అంచనాలు ఉంటే తప్ప ఫలితాలను రాబట్టుకోవడం కష్టం..’ అని డిపో మేనేజర్ ఒకరు తెలిపారు. -
రోడ్డెక్కిన సిటీ బస్సులు
సాక్షి, అమరావతి: కోవిడ్ ఆంక్షల మధ్య రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్టణంలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ట్రయల్ రన్లో భాగంగా విజయవాడలో వంద, విశాఖపట్టణంలో వంద బస్సుల చొప్పున తిప్పారు. నేటి నుంచి పూర్తి స్థాయిలో బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. రెండు నగరాల్లో కలిపి సిటీ సర్వీసు బస్సులు 1,100 వరకు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రత్యేక మార్గదర్శకాల ప్రకారం అధికారులు బస్సుల్ని నడిపారు. ► నగర శివారు ప్రాంతాల నుంచి మెట్రో బస్ సర్వీసుల్ని 70 శాతం వరకు తిప్పారు. నగరాన్ని ఆనుకుని ఉన్న పల్లెలకు పల్లెవెలుగు బస్సులు నడిపారు. ► 60 ఏళ్లు పైబడిన వారిని వ్యక్తిగత బాధ్యతతో ప్రయాణానికి అనుమతించారు. వీరికి రాయితీ నిలిపేశారు. ► ప్రతి బస్ స్టాప్ వద్ద సిబ్బందిని అందుబాటులో ఉంచి బస్సు ఎక్కేవారి టెంపరేచర్ పరీక్షించారు. -
బెజవాడలో రోడ్డెక్కిన సిటీ బస్సులు
-
రోడ్డెక్కిన సిటీ బస్సులు
-
రోడ్డెక్కిన సిటీ బస్సులు
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ నేపథ్యంలో ఆరు నెలల పాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ సిటీ బస్సులు శనివారం విజయవాడ, విశాఖపట్నంలో రోడ్లపైకి వచ్చాయి. మొదటి రోజు ఉదయం ఆరు గంటల నుంచి వంద బస్సులు పలు రూట్లలో ప్రారంభమయ్యాయి.ఆర్టీసీ అధికారులు కోవిడ్ నిబంధనలను సిటీ బస్సులలో కఠినంగా అమలు చేస్తున్నారు. బస్సుల్లో స్టాడింగుకు అనుమతించడం లేదు. ప్రతి స్టాప్ వద్ద ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించిన తరువాతే బస్సులోకి ప్రయాణికులను సిబ్బంది అనుమతించనున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి బస్సులోకి అనుమతి లేదని తెలిపారు. ప్రయాణికులు ప్రతి ఒక్కరూ మాస్క్, సామాజిక దూరం పాటించాలని నింబంధనలు విధించారు. ఇక వృద్ధులు, పిల్లలు బస్సు ప్రయాణాలకు అనుమతి నిరాకరించారు. ప్రయాణికుల రద్దీ ఆధారంగా బస్సుల సంఖ్య పెంచనున్న ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలు తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ పరిస్థితులు రాగానే సీనియర్ సిటీజన్లకు రాయితీని వర్తింపు కొనసాగుతుందని తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైద్య శాఖ అనుమతి రాగానే రోడ్డెక్కనున్న సిటీ బస్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. లాక్డౌన్ 4.0లో భాగంగా ప్రజా రవాణాపై ఆంక్షలు ఎత్తేయడంతో సిటీ బస్‌లు తిప్పేందుకు వైద్య ఆరోగ్య శాఖను ఏపీఎస్ ఆర్టీసీ సంప్రదించింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు. హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం సిటీ సర్వీసులు నడుపుతామని అందులో పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అనుమతి రాగానే విజయవాడ, విశాఖలో సిటీ సర్వీసులు మొదలు కానున్నాయి. మిగిలిన బస్ సర్వీసులు కూడా 50 శాతం వరకు తిప్పేందుకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. కాగా, గత నెలలో రోజుకు 8 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని తిప్పిన ఆర్టీసీ.. గత వారం నుంచి రోజుకు 12 లక్షల కిలోమీటర్ల వరకు నడుపుతోంది. ఇక సర్వీసుల్ని 2,200 నుంచి 2,746కు పెంచింది. హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సులు ► అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఐదు నెలలకు పైగా ఖాళీగా ఉన్న ప్రైవేటు బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. ► రవాణా శాఖ అధికారుల అనుమతితో ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్‌కు బస్సులు తిప్పుతున్నారు. ఏపీలోని ప్రధాన ప్రాంతాల నుంచి శనివారం రాత్రి ఇవి ప్రారంభమయ్యాయి. 150 ప్రైవేటు బస్సులకు ఆన్లైన్లో టికెట్ రిజర్వేషన్ విధానాన్ని ఆపరేటర్లు మొదలుపెట్టారు. ► మరోవైపు హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు గానూ అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ దీనిపై తెలంగాణ సర్కార్ ఇంకా స్పందించలేదు. ► సర్వీసుల పెంపునకు టీఎస్ ఆర్టీసీ ససేమిరా అంటోంది. అలాగే ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ భూ భాగంలో తిప్పే కిలోమీటర్లు తగ్గించాలని.. తాము ఎట్టి పరిస్థితిలోనూ ఏపీ భూ భాగంలో కిలోమీటర్లు పెంచబోమని టీఎస్ ఆర్టీసీ తెగేసి చెబుతోంది. -
సిటీ బస్సులు ఇప్పట్లో లేనట్లే
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఆర్టీసీ సిటీ బస్సులతోపాటు ఎయిర్‌పోర్టు సర్వీసులను ఇప్పట్లో పునరుద్ధరించరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీ బస్సులతో ఇప్పటికే నష్టాలు వచ్చాయని, ప్రస్తుత పరిస్థితిలో సిటీ బస్సులు నడిపి ఇంకా నష్టాలు పెంచుకోరాదని నిశ్చయించింది. అలాగే తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రతో ఒప్పందాలు కుదుర్చుకున్నాకే అంతర్రాష్ట్ర బస్సు సర్వీ సుల రాకపోకలను అనుమతిం చాలని నిర్ణయించింది. మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఆర్టీసీపై సుదీర్ఘంగా సమీక్షించి ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్, అధికారులు పాల్గొన్నారు. బస్సుల సంఖ్య లెక్కనే ఒప్పందాలు ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందం ఆధారంగానే ఇప్పటివరకు మహా రాష్ట్ర, కర్ణాటకకు అంతర్రాష్ట బస్సు సేవలు నడిచాయి. తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకతో కొత్త ఒప్పందం కుదుర్చుకున్నాకే అంతర్రాష్ట్ర బస్సు సేవలను పునరుద్ధరించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర భూభాగంలో ఆయా రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరిగితే తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ఆయా రాష్ట్రాల్లో అన్ని కిలోమీటర్లు తిరిగేలా ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఆయా రాష్ట్రాల నుంచి కేటగిరీల వారీ (ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, వోల్వో)గా ఎన్ని బస్సులు తెలంగాణలో ఎన్ని కిలోమీటర్లు తిరిగితే అదే కేటగిరీలకు సంబంధించిన తెలంగాణ బస్సులు సైతం అదే సంఖ్యలో అన్ని కిలోమీటర్ల మేరకు ఆయా రాష్ట్రాల్లో తిరిగేలా ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ప్రధానంగా లాభాలొచ్చే రూట్లలో ఏపీఎస్ఆర్టీసీ అధిక సంఖ్యలో బస్సులు నడిపి నష్టాలు వచ్చే రూట్లలో తక్కువగా నడుపుతుండటంతో తెలంగాణ ఆర్టీసీ నష్టపోవాల్సి వస్తోందని ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల బస్సులు ఒక రూట్లో ఎన్ని కిలోమీటర్లు నడిపితే రాష్ట్ర బస్సులు సైతం అన్ని కిలోమీటర్లు నడిపేలా పకడ్బందీగా ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల సీఎస్‌లతో రాష్ట్ర సీఎస్ సమావేశమై ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాల్లో ఆర్టీసీకి నష్టాలెందుకు? కరోనా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేశాక జిల్లాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించినా నష్టాలు ఎందుకు వస్తున్నాయని సీఎం అధికారులను ప్రశ్నించారు. అయితే కరోనా వైరస్ భయంతో ప్రయాణికులు బస్సులు ఎక్కట్లేదని, దీంతో సగం సీట్లు ఖాళీగా పెట్టి బస్సులు నడపాల్సి వస్తోందని అధికారులు సీఎంకు నివేదించారు. రాష్ట్రంలో సరుకు రవాణా కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో 85 కార్గో బస్సు సర్వీసులను ప్రారంభించినా ప్రైవేటు ఆర్డర్లను సాధించడంలో రవాణా శాఖ అధికారులు విఫలమయ్యారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు కంపెనీలు ఆర్డర్లు తెచ్చుకుంటున్నా ఆర్టీసీ అధికారులు ఎందుకు ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లేదని సీఎం ప్రశ్నించినట్లు తెలిసింది. -
నయా కండక్టర్లు
విచిత్రమేంటంటే అసలు విధులు కాకుండా కొసరు పనుల్లో బిజీగా ఉన్న ఈ ముగ్గురు ఉన్నది ఉప్పల్ బస్టాప్‌లోనే కావటం విశేషం. డిపోలో ఇప్పటికే ఇద్దరు కంట్రోలర్లు ఉన్నారు. వారు కాకుండా కొత్తగా ఇలా ముగ్గురొచ్చారు. ఇలా ప్రధాన ప్రాంతాల్లో కండక్టర్లు ఈ పనుల్లో దర్శనమిస్తున్నారు. అసలు పనులు వదిలి ఇలా రోడ్డెక్కటానికి కారణం ఆర్టీసీ పొదుపు చర్యల్లో భాగమే. బస్సులు గ్యారేజీకి.. వీరు బస్టాపులకు.. ఆర్టీసీ నష్టాలను తగ్గించే క్రమంలో ఇటీవల పెద్ద సంఖ్యలో సొంత బస్సులను ఆర్టీసీ ఉపసంహరించుకుంది. ఇందులో సిటీలో దాదాపు 800 ఉండగా, కొత్తగా జిల్లాల్లో 1,300 అద్దె బస్సులు వచ్చి చేరనుండటంతో అంతే సంఖ్యలో సొంత బస్సులను రద్దు చేసుకుంటోంది. దీంతో పెద్ద సంఖ్యలో కండక్టర్లు, డ్రైవర్లు మిగిలిపోతున్నారు. నగరంలో ఇప్పటికే 800 బస్సుల రద్దు అమల్లోకి వచ్చింది. దీంతో దాదాపు 1,600 మంది వరకు కండక్టర్లు మిగిలిపోతున్నారు. ఇప్పటివరకు ఉన్న ఖాళీల్లో కొందరిని సర్దుబాటు చేయగా దాదాపు వేయి మందికిపైగా మిగిలిపోయారు. డ్రైవర్లలో మిగిలిన వారిని ఇతర శాఖలకు పంపేందుకు సిద్ధపడగా, ప్రస్తుతానికి ఫైర్ సర్వీసెస్ 42 మందిని తీసుకుంది. మిగతావారిలో ఎక్కువమందిని కొత్తగా ప్రారంభిస్తున్న సరుకు రవాణా విభాగానికి పంపుతున్నారు. కండక్టర్లకు మాత్రం వేరే శాఖల్లో అవకాశం లేక ఆర్టీసీలోనే అంతర్గతంగా వినియోగించుకోవాల్సి వచ్చింది. బస్సు రాగానే మైక్ పట్టుకుని దాని వివరాలను ప్రయాణికులకు వెల్లడిస్తున్న ఈయన కూడా సీనియర్ కండక్టరే. కానీ కండక్టర్ విధులు దక్కక ఇలా అదనపు డ్యూటీలో ఉండాల్సి వచ్చింది. సరుకు రవాణా విభాగంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్‌గా కొందరిని తీసుకోగా, మరికొందరిని ఇలా బస్టాపుల్లో ఉంచి బస్సుల నియంత్రణ, ఆటోలు అడ్డుగా లేకుండా చూడటం, ప్రయాణికులకు సమాచారమివ్వటం లాంటి పనులకు వినియోగిస్తున్నారు. బస్టాపుల్లో ఆటోలు తిష్ట వేయకుండా కొన్ని చోట్ల హోమ్గార్డులుండేవారు. ఇప్పుడు మిగిలిపోయిన కండక్టర్లను ఆయా బస్టాపులకు పంపి హోంగార్డుల పనులు వారికే అప్పగించినట్టు సమాచారం. ఉప్పల్ బస్టాపులో హోంగార్డులు లేక ఆటోవాలాలు రెచ్చిపోతున్నారు. కండక్టర్లనే బెదిరింపులకు గురిచేస్తూ బస్సులకు అడ్డంగా నిలిపి ప్రయాణికులను మళ్లించుకుంటున్నారు. ఈయన ఆర్టీసీలో సీనియర్ కండక్టర్. ప్రస్తుతం అసలు విధులు వదిలి ఉప్పల్ బస్టాప్‌లో బస్సుల రాకకు అడ్డుగా ఉన్న ఆటోలను పక్కకు తోలే పనిలో ఇలా నిమగ్నమయ్యాడు. సిటీలో 800 బస్సుల రద్దు.. నిజానికి నగరంలో బస్సులు తగ్గిపోవటంతో ప్రయాణికులకు ఇబ్బందులు పెరిగాయి. అసలే వాటి సంఖ్య చాలక కొన్ని ప్రాంతాలకు బస్సు ట్రిప్పులను నడపలేకపోతున్నారు. ఇప్పుడు ఏకంగా 800 బస్సులను తగ్గించటంతో కాలనీలకు వెళ్లే సర్వీసులు చాలా రద్దయ్యాయి. తక్కువ దూరం తిరిగే సర్వీసులను దూరప్రాంతాలకు పొడిగించారు. ఫలితంగా బస్టాపుల్లో పడిగాపులు పెరిగాయి. ఇటు ప్రయాణికులకు అటు మిగిలిపోయిన సిబ్బందికి ఈ చర్య ఇబ్బందిగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం వాస్తవాలు గుర్తించి పునరాలోచించాలన్న డిమాండు ప్రయాణికుల నుంచి బలంగా వస్తోంది. -
1000 సిటీ బస్సులు ఔట్?
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న కాలుష్యానికి విరుగుడుగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంచటంతోపాటు సొంత వాహనాల స్థానంలో జనం వీలైనంత ఎక్కువగా ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించేలా ప్రపంచవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రజా రవాణా వ్యవస్థలను బలోపేతం చేస్తున్నారు. అయితే, దేశంలో కాస్మోపాలిటన్ సిటీగా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో మాత్రం పరిస్థితి విరుద్ధంగా కని పిస్తోంది. దాదాపు కోటి జనాభా ఉన్న మరే నగరంతో పోల్చినా సిటీ బస్సులు ఇక్కడే తక్కువ. కేవలం ప్రధాన రోడ్లపై మాత్రమే సిటీ బస్సులు నడుస్తుంటాయి. దీంతో అంతర్గత ప్రాంతాల ప్రజలు బస్సు కోసం కొంత దూరం వెళ్లక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించ డానికి వీలైనన్ని ఎక్కువ బస్సులు అందుబాటులోకి తేవడం ద్వారా పెరిగిపోతున్న సొంత వాహనాల విస్తృతిని నియంత్రించాలని పలువురు సూచిస్తున్నారు. దీన్ని అనుసరించటం అటుంచి తే, ఇప్పుడు హైదరాబాద్‌లో ఏకంగా వేయి బస్సులను జనవరి 1 నాటికి తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో నగరంలో 2,700 బస్సులే ఉండనున్నాయి. పదేళ్ల క్రితం సిటీలో తిరిగిన బస్సుల సంఖ్యకిది సమానం. ఈ పదేళ్లలో హైదరాబాద్ లో 30 లక్షలకుపైగా జనాభా పెరిగింది. అందుకనుగుణంగా బస్సుల సంఖ్య పెరగాల్సి ఉండగా.. ఆర్టీసీ తిరోగమనంలో ఆలోచిస్తోంది. నష్టాలను తగ్గించేందుకేనంటూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ రూ.1200 కోట్ల నష్టాలను చవిచూడ నుందని అంచనా. ఇందులో రూ.550 కోట్ల నష్టం హైదరాబాద్ నుంచే ఉంటుందని చెబుతున్నారు. బస్సుల సంఖ్య పెరిగే కొద్దీ నష్టాలు పెరుగుతాయన్న సూత్రాన్ని అనుసరించి, బస్సుల సంఖ్య తగ్గించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన రెండు సమావేశాల్లో సిటీ బస్సులతో వస్తున్న నష్టాలపై చర్చ జరిగింది. మధ్యాహ్నం వేళ బస్సు లు ఒకదాని వెంట ఒకటి తిరుగుతున్నాయని, ఒక్కో బస్సులో పది, పదిహేను మందికి మించి ప్రయాణికులుండటం లేదని సీఎం పేర్కొన్నారు. నష్టాల నేపథ్యంలో ఇలా నడపడం ఎందుకని ప్రశ్నించారు. దీంతో అధికారులు ఇక బస్సుల సంఖ్య తగ్గించటమే మేలని నిర్ణయించారు. ఇలా చేస్తారు... ►ప్రస్తుతం కాలం చెల్లిన 600 బస్సులను ఈ ఖాతాలో తగ్గించేస్తారు. ►500 మంది వరకు డ్రైవర్ల కొరత ఉంది. దీంతో కొన్ని సర్వీసులు డిపోల కే పరిమితమవుతున్నాయి. ఆ మేరకు సర్వీసులకు కోత పెడతారు. ఇలా చేయొచ్చు... ►బస్సుల సంఖ్య తగ్గించటం కంటే ఉన్నవాటిని హేతుబద్ధీకరించాలి. మధ్యాహ్నం వేళ చాలా ప్రాంతాలకు రద్దీ తక్కువగా ఉంటున్నందున ఆ సమయాల్లో కొన్ని బస్సులను కొత్త ప్రాంతాలకు తిప్పాలి. ►ఓఆర్ఆర్ వరకు సిటీ విస్త రించినందున ఆ ప్రాంతాన్ని దాటి సమీపంలోని కొత్త ప్రాం తాలకు ఆ బస్సులు నడపాలి. దీంతో ఆదాయం పెరగొచ్చు. ►ఉదయం, రాత్రి రద్దీ వేళల్లో ఉన్న బస్సులే సరిపోవడంలే దు. బస్సుల సంఖ్య తగ్గిస్తే ఆ సమయాల్లో ఇబ్బంది తప్పదు. సిబ్బందినేం చేస్తారు?: ప్రస్తుతం ఆర్టీసీలో బస్సులు–సిబ్బంది దామాషా 1:6గా ఉంది. వేయి బస్సులు తగ్గిస్తే 6వేల మంది సిబ్బందిని తగ్గించాలి. ఇలా మిగిలే సిబ్బందిని ఇప్పుడేం చేస్తారన్నది ప్రశ్న. పైగా, ఆర్టీసీ మొత్తం వ్యయంలో 58 శాతం సిబ్బంది జీతాల రూపేణా ఖర్చవుతోంది. నష్టాలు తగ్గించేందుకు బస్సుల సంఖ్య తగ్గించినా, సిబ్బంది అలాగే ఉంటారు కదా. వారి జీతాలు తగ్గవన్న విషయం గుర్తించలేదా?. చార్జీలతో ఆదాయం పెరిగింది: ఇటీవల పెంచిన చార్జీలతో నగరంలో ఆర్టీసీకి దాదాపు 25 శాతం మేర ఆదాయం పెరిగింది. బస్సు పాస్‌ల ధరల పెంపుతో, ప్రభుత్వం నుంచి వచ్చే రీయింబర్స్మెంట్ మొత్తం కూడా పెరుగుతుంది. ఉన్న బస్సులను రేషనలైజ్ చేస్తే కొంత ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రెండు విషయాలను క్రోడీకరించుకునే కసరత్తు చేస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్: జనాభా దాదాపు కోటి ఆర్టీసీ బస్సులు: 3,700 పరిస్థితి: రాత్రి 9 తర్వాత బస్సులు చాలా పలచగా తిరుగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం ఆరు తర్వాత గానీ రోడ్లపై ఎక్కువగా కనిపించవు. సిఫారసు: ఉన్నఫళంగా వేయి బస్సులు పెంచాలని గతేడాది ఆర్టీసీపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచించింది. బెంగళూరు: జనాభా దాదాపు కోటి సిటీ బస్సులు: 6,500 పరిస్థితి: ఉదయం నాలుగు నుంచి రాత్రి 12 వరకు బస్సులు అందుబాటులో ఉండటమే కాకుండా, అంతర్గత కాలనీలకు కూడా నడుస్తున్నాయి. ప్రత్యేకత: దేశంలో ఢిల్లీ తర్వాత అన్ని ఏసీ బస్సులున్న నగరం ఇదే. ఏకంగా ప్రభుత్వమే సొంత నిధులతో గతంలో వేయి ఏసీ బస్సులు అందుబాటులో ఉంచింది. సిటీ కోసం ప్రత్యేకంగా ఉన్న కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరిన్ని బస్సులు సమకూరబోతున్నాయి. ఆర్టీసీలో 359 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 359 మంది సిబ్బందిని క్రమబద్ధీకరిస్తూ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆర్టీసీ లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం రెగ్యులరైజ్ అయినట్టయింది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎం కేసీఆర్ కాం ట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఎండీని ఆదేశించడంతో శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 296 మంది డ్రైవర్లు కాగా, మిగతా వారు కండక్టర్లు. నిజానికి వీరు 2015లోనే రెగ్యులరైజ్ కావాల్సి ఉంది. ఆ సమ యంలో వేతన సవరణ కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సమయంలో, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ డిమాండ్‌ను కూడా ప్రభుత్వం ముందుంచారు. దానికి సమ్మతిస్తూ అప్పట్లో కార్మిక సంఘాలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు 4,400 మందిని క్రమబద్ధీకరించారు. కానీ శాఖా పరమైన చర్యలకు గురైనవారు, ఇతర లోటుపాట్లు ఉన్నవారు మిగిలిపోయారు. అప్పటి నుంచి తమను కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ వస్తున్నారు. ఇటీవల సమ్మె నేపథ్యంలో సీఎం ప్రకటించి న వరాల్లో భాగంగా వీరికి కూడా అవకాశం లభించింది. 240 పనిదినాల అనుభవం ఉండటాన్ని అర్హతగా నిర్ధారించారు. వీరిలో చాలామంది ఐదారేళ్లుగా పనిచేస్తున్న వారుండటంతో దాదాపు అంతా దానికి అర్హత సాధించే అవకాశం ఉంది. ఎవరికైనా అన్ని పని దినాల అనుభవం లేకుంటే, వారు పని దినాలు పూర్తి చేసుకోగానే రెగ్యులరైజ్ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో ఎండీ పేర్కొన్నారు. -
సిటీ బస్సులను పునరుద్ధరించాలి
సాక్షి, ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ నుంచి గతంలో నడిచే సిటీ బస్సులను పునరుద్ధరించాలని విద్యార్థులు కోరారు. ఓయూ క్యాంపస్ నుంచి కోఠిమహిళా కాలేజీ, నిజాం కళాశాల, సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కాలేజీకి, వివిధ ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లకు విద్యార్థులు బస్సుల్లో వెళ్తుంటారు. అయితే.. క్యాంపస్ నుంచి బస్సులు తిరగక పోవడంతో ఆటోల్లో వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే టీఎస్ ఆర్టీసీ, ఏపీ ఆర్టీసీ బస్సులు క్యాంపస్ నుంచి వెళ్తుండగా.. లోకల్ బస్సులు మాత్రం క్యాంపస్ వెనుక నుంచి వెళ్లడం వల్ల విద్యార్థులతో పాటు వివిధ పనుల పై ఓయూ క్యాంపస్‌కు వచ్చే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తార్నాక నుంచి కోఠి, నాంపల్లి వెళ్లే 3, 136 నంబర్ బస్సులు క్యాంపస్ నుంచి వెళ్తూ ఆర్ట్స్ కాలేజీ, లా కళాశాల, లేడీస్ హాస్టల్, ఇంజినీరింగ్ కాలేజీ ఆంధ్రమహిళా సభ విద్యా సంస్థల బస్ స్టాప్ వద్ద ఆగేవని, దీంతో విద్యార్థులకు ఎంతో సౌకర్యాంగా ఉండేదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అనంతరం క్యాంపస్ నుంచి సిటీ బస్సుల రాకపోకలను నిలిపివేసిన్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు. -
సిటీ బస్సుల్లో ‘సేఫ్’ జర్నీ!
సాక్షి, సిటీబ్యూరో : బస్సుల రాకపోకలపై ప్రయాణికులకు ఇక నుంచి ప్రత్యక్ష సమాచారం లభించనుంది. నగరంలోని ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోక లపై ‘హైలైట్స్’ మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రయాణికులకు ప్రత్యక్ష సమాచారం అందజేస్తున్న తరహాలోనే బస్సుల రాకపోకలపైన ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేసేందుకు ‘సేఫ్’ (సొసైటీ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ ఎన్విరాన్మెంట్) అనే సంస్థతో ఆర్టీసీ తాజాగా ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ రోడ్లపై నడిచే బస్సుల కదలికలను ఎప్పటికప్పుడు నమోదు (వెహికల్ ట్రాకింగ్) చేయడంతో పాటు, బస్సుల రాకపోకలపైన ప్రయాణికులకు ప్రత్యక్ష సమాచారాన్ని అందజేస్తుంది. ఇందుకోసం అన్ని చోట్ల ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. మొదట ఏసీ బస్షెల్టర్లతో ప్రారంభించి ఆ తరువాత క్రమంగా నగరంలోని అన్ని బస్టాపులకు ఈ ప్రత్యక్ష సమాచార బోర్డులను విస్తరిస్తారు. అలాగే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో సేఫ్ యాప్ ద్వారా కూడా బస్సుల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీంతో ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే తాను ఎక్కాల్సిన బస్సు ఇంకా ఎంత దూరంలో ఉన్నది, ఏ సమయానికి తాను ఉన్న చోటుకు వస్తుందనే వివరాలు ప్రయాణికుడికి తెలిసిపోతాయి. అలాగే సేఫ్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లభించే డేటాను ‘టీ–సవారీ’లో అప్డేట్ చేస్తారు. దీంతో ప్రయాణికులకు ఈ యాప్ ద్వారా ఓలా, ఊబర్ తదితర వాహనాలతో పాటు బస్సుల వివరాలు కూడా లభిస్తా యి. మెట్రో రైల్వేస్టేషన్లకు అందుబాటులో ఉన్న బస్సుల వివరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే గ్రేటర్ ఆర్టీసీలో 1200 బస్సులకు వీటీపీఐఎస్ (వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) టెక్నాలజీనీ అమలు చేస్తున్నారు. కానీ ఇది మొక్కుబడిగానే అమలవుతోంది. ప్ర యాణికులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు లభించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వెహికల్ ట్రాకింగ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను అమలు చేసేందుకు సేఫ్ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. మొదట నగరంలోని అన్ని ఏసీ, మెట్రో లగ్జరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులకు సేఫ్ వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేసి ఆ వివరాలను ప్రయాణికుల మొబైల్ ఫోన్‌కు, బస్టాపుల్లోని ఎల్ఈడీ బోర్డులకు అనుసంధానం చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 3650 బస్సులకు ఈ టెక్నాలజీని అమలు చేసిన అనంతరం తెలంగాణలోని 10,093 బస్సులకు దీనిని విస్తరిస్తారు. హైలైట్స్ తరహాలో సమాచారం.. గ్రేటర్లో బస్షెల్టర్ల ఆధునీకరణకు అనుగుణంగా బస్సుల సమాచారం అందుబాటులో లేకపోవడం పెద్ద లోపంగా ఉంది. నగరంలోని 26 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు, సికింద్రాబాద్; నాంపల్లి, కాచిగూడ, మల్కాజిగిరి తదితర ప్రధాన స్టేషన్ల ద్వారా ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాకపోకలు సాగించే 121 ఎంఎంటీఎస్ సర్వీసుల ప్రత్యక్ష సమాచారాన్ని తెలియజేసేందుకు ‘హైలైట్స్’ దోహదం చేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తాము ఎదురు చూస్తున్న రైల్వేస్టేషన్‌కు ఎంఎంటీఎస్ ఎంత దూరంలో ఉన్నదీ ప్రత్యక్షంగా తెలిసిపోతుంది. సరిగ్గా ఇలాంటి పరిజ్ఞానం ద్వారానే బస్సుల రాకపోకలను ప్రయాణికులకు అప్డేట్ చేస్తారు. బస్టాపులను జియో ఫెన్సింగ్ చేస్తారు. ప్రధాన కార్యాలయంలోని సర్వర్ రూమ్ నుంచి ఈ మొత్తం వ్యవస్థను నియంత్రిస్తారు. మొదట నగరంలో అమలు చేసిన తరువాత హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–విజయవాడ, మెట్టుపల్లి–కరీంనగర్, హైదరాబాద్–వరంగల్ వంటి ప్రధాన రూట్లకు విస్తరిస్తారు. టి–సవారీతో అనుసంధానం... మరోవైపు ఈ సమాచారాన్ని టి–సవారీతో అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికుడికి ఒకే సమ యంలో అన్ని రకాల ప్రజారవాణా వాహనాల సమాచారం అందుబాటులోకి వస్తుంది. తద్వారా వాటిలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకొని బయలుదేరవచ్చు. ఉదాహరణకు మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వరకు మెట్రో రైల్లో వచ్చిన వ్యక్తికి తాను ట్రైన్ దిగే సమయానికి అమీర్‌పేట్‌లో బస్సు, ఓలా, ఊబెర్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బైక్స్ వంటి వాటిలో ఏది అందుబాటులో ఉంటే అందులో బయలుదేరవచ్చు. సేఫ్ సంస్థ నుంచి ఆర్టీసీకి లభించే ఈ సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా ఉచితం. ఇందుకు ప్రతిగా వ్యాపార ప్రకటనలపైన ఆ సంస్థ ఆదాయాన్ని ఆర్జించనుంది. ఒకటి, రెండు నెలల్లో ఈ సరికొత్త సాంకేతిక వ్యవస్థ ఆచరణలోకి రావచ్చునని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
‘చిల్లర సమస్య నుంచి కండక్టర్లకు ఊరట’
సాక్షి, హైదరాబాద్: రాజధానితోపాటు వరంగల్ సిటీ బస్సుల్లో టికెట్ ధరలను రూ.5, 10, 15, 20, 25, 30కు మారుస్తూ హేతుబద్ధీకరించటంతో చిల్లర సమస్య నుంచి కండక్టర్లకు ఊరట లభిస్తుందని ఆర్టీసీ ఎన్ఎంయూ వెల్లడించింది. సోమవారం నుంచి దీన్ని అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు సంఘం నేతలు నాగేశ్వరరావు, నరేందర్, మౌలానా, కమాల్‌రెడ్డి పేర్కొన్నారు. డిస్కంలకు ఉన్న రూ.12 వేల కోట్ల రుణాన్ని భరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీకి ఉన్న రూ.2,500 కోట్ల రుణాన్ని కూడా భరించాలని కోరారు. -
చిల్లర సమస్యకు చెక్
హన్మకొండ: బస్సుల్లో చిల్లర సమస్యకు ఆర్టీసీ పరిష్కారం చూపింది. ఈ మేరకు చార్జీలను సర్దుబాటు చేసింది. దీంతో కొన్ని స్టేజీలకు స్వ ల్పంగా చార్జీలు పెరుగగా, మరికొన్ని స్టేజీలకు చార్జీలు తగ్గాయి. చిల్లర ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది మధ్యన ఘర్షణలకు దారితీస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీ యాజ మాన్యం చిల్లర సమస్యలను పరిష్కరించాలని తీసుకున్న నిర్ణయం మేరకు చార్జీల్లో మార్పులు చేశాయి. వరంగల్ మహానగరంలోని వరంగల్, హన్మకొండ, కాజీపేట మధ్యన ఆర్టీసీ లోకల్ బస్సులు సేవలు అందిస్తున్నాయి. సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సులు నగర ప్రయాణికులకు రవాణా సేవలు అందిస్తున్నాయి. చిల్లర సమస్య తొలగించేందుకు ఈ బస్సుల చార్జీలు సర్దుబాటు చేశారు. సర్దుబాటు చేసిన చార్జీలు ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ తోట సూర్యకిరణ్ తెలిపారు. -
సైకిళ్ల నగరంలో షి'కారు'
సిటీ ఆఫ్ బైస్కిల్స్.. అంటే సైకిళ్ల నగరమని అర్థం.. ఎటు చూసినా సైకిళ్లే కనిపించడంతో ఒకప్పుడు మన భాగ్యనగరాన్ని అలా పిలిచేవారు.. మరి ఇప్పుడో...? రవాణా రంగ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది! రోడ్డెక్కి ఆటో కోసం, సిటీ బస్సు కోసం పడిగాపులు కాయాల్సిన పనిలేదు. ఆటోవాలాల ఆగడాలను భరించాల్సిన అవసరం లేదు. బెంబేలెత్తించే మీటర్ ట్యాంపరింగ్‌లు లేవు. అక్కడక్కడా ఒకట్రెండు ఘటనలు మినహా పూర్తిగా భద్రతతో కూడిన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అదీ ఆటోరిక్షా కంటే చౌకగా!! మొబైల్లో బుక్ చేస్తే క్యాబ్‌లు క్షణాల్లో ఇంటి ముందు వాలిపోతున్నాయి. సినిమాకు వెళ్లాలన్నా, షికారుకెళ్లాలన్నా, ఆసుపత్రికెళ్లాలన్నా, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలకు ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పుడు సొంత వాహనాన్ని తలపించే క్యాబ్ ఉంది. ఉబెర్, ఓలా వంటి అంతర్జాతీయ సంస్థలతోపాటు మేరు, డాట్, గ్రీన్‌క్యాబ్స్, రేడియో క్యాబ్స్, షీ క్యాబ్స్ వంటి స్థానిక క్యాబ్ సంస్థలు ప్రయాణికులకు రవాణా సదుపాయం అందజేస్తున్నాయి. నగరంలో మారుతున్న రవాణా రంగ ముఖచిత్రంపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్.. – సాక్షి, హైదరాబాద్ నాటికి నేటికి ఎంత తేడా..? గుర్రపు బగ్గీలు, టాంగాలు, జట్కాలు మాత్రమే రవాణా సాధనాలుగా ఉన్న రోజుల్లో సైకిల్ దూసుకొచ్చింది. అదీ కొందరు సంపన్నుల వద్దే కనిపించేది. కాలక్రమంలో నగరపు రహదారులను సైకిళ్లు ముంచెత్తాయి. వాహనప్రియుల అభిరుచికి అనుగుణంగా రకరకాల మోడళ్లలో సైకిళ్లను రూపొందించి వినియోగంలోకి తెచ్చారు. 1930 నుంచి మొదలైన సైకిల్ ప్రస్థానం నాలుగైదు దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా సాగింది. సంపన్నులతో మొదలై నిరుపేదల వరకు సైకిల్‌ను వాడేవారు. అలా ఇంటింటికీ సైకిల్ వచ్చేసింది. దీనికి సమాంతరంగా సైకిల్ రిక్షాలు పరుగులు తీశాయి. 1980 నాటికి హైదరాబాద్‌లో సైకిల్ రిక్షాయే అతి ముఖ్యమైన రవాణా సాధనమైంది. నిజాం కాలం నుంచే సిటీ బస్సులు అందుబాటులో ఉన్నా పరిమితమైన రూట్లలోనే తిరిగేవి. 80వ దశాబ్దం నాటికి సిటీ బస్సుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినా చిన్నచిన్న బస్తీలు, ఇరుకు గల్లీల్లోంచి గణగణ గంట మోగించుకొంటూ సైకిల్ రిక్షా దూసుకుపోయింది. ‘రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్...రిక్షావాలా జిందాబాద్.. మూడు చక్రములు గిరగిరా తిరిగితే మోటారు కారు బలాదూర్...’ అంటూ సైకిల్ రిక్షా హైదరాబాద్‌ను ఏలిన రోజులవి! ఎనభైల నాటికి సుమారు లక్ష వరకు సైకిల్ రిక్షాలు ఉండేవని అంచనా. అంతకు రెట్టింపు సంఖ్యలోనే సైకిళ్లు ఉండేవి. ఎనభయ్యో దశాబ్దం హైదరాబాద్ వాహనరంగాన్ని ఓ కుదుపు కుదిపింది. జట్కాలు, టాంగాలు, సైకిల్ రిక్షాల కంటే వేగంగా గమ్యాన్ని చేర్చే ఆటోరిక్షాలు వచ్చాయి. 1990 నాటికి సిటీ బస్సుతో పాటు ఆటోరిక్షాలు ప్రజా రవాణా రంగంలో అగ్రభాగంలో నిలిచాయి. సహజంగానే మొదట్లో ఉన్నత వర్గాలే వీటిని వినియోగించినా క్రమంగా ప్రతి ఒక్కరు ఆటోను వినియోగించే స్థాయికి వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. పోటెత్తిన వ్యక్తిగత వాహనాలు నగరం విస్తరిస్తున్నట్లుగానే అందుకు అనుగుణంగా వాహనాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. రవాణా శాఖ లెక్కల ప్రకారం 1970లో వ్యక్తిగత వాహనాలు కేవలం 9789. ప్రజా రవాణా వాహనాలు 5083 మాత్రమే ఉండేవి. 1980 నాటికి వ్యక్తిగత వాహనాల సంఖ్య 27,819కు, ప్రజా రవాణా వాహనాల సంఖ్య 10,437కు చేరింది. 1990లో సుమారు 2.22 లక్షల వాహనాలు నమోదయ్యాయి. ఆ తర్వాత వాహనాల వినియోగంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. సైకిళ్లు, సైకిల్ రిక్షాలు, ఆటోలు తదితర వాహనాల కంటే బైక్‌ల సంఖ్య భారీగా పెరిగింది. ఇదే సమయంలో కార్ల వినియోగం ఎక్కువైంది. ఈ అభివృద్ధి మరింత వేగంగా కొనసాగింది. 2012 నాటికి అన్ని రకాల వాహనాలు కలిపి 36.72 లక్షలకు చేరాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 50 లక్షలకు చేరింది. అంటే సుమారు కోటి జనాభా ఉన్న నగరంలో అరకోటి వాహనాలు ఉన్నాయన్నమాట! ప్రతి మనిషికీ ఓ బైక్ అన్నట్టుగా వాహన రంగం విస్తరించింది. మధ్య తరగతి, వేతన జీవుల ఆదాయానికి అనుగుణంగా కార్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 35 లక్షలకు పైగా ద్విచక్రవాహనాలు ఉంటే 10 లక్షలకు పైగా కార్లున్నాయి. మిగతావి రవాణా రంగానికి చెందినవి. క్యాబ్ వైపే మొగ్గు ఎందుకు? - సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీకి వెళ్లేందుకు ఆటోరిక్షాలో కనీస చార్జీ రూ.20. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.11 చొప్పున కనీసం రూ.500 వరకు చార్జీ అవుతుంది. కానీ అంతే దూరానికి క్యాబ్‌లు రూ.300 నుంచి రూ.350 వరకే లభిస్తున్నాయి. - పైగా నేరుగా ఇంటి నుంచే బయలుదేరి గమ్యానికి చేరుకొనే సదుపాయం ఉండడంతో ప్రతి ఒక్కరు క్యాబ్ వైపు మొగ్గుతున్నారు. - మూడేళ్ల క్రితం వరకు నగరంలో సుమారు 1.3 లక్షల ఆటోరిక్షాల్లో ప్రతి రోజు 15 లక్షల మంది పయనించగా ఇప్పుడు ఆ సంఖ్య 8 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉంది. - నగరంలో 3,550 సిటీ బస్సుల్లో రోజుకు 33 లక్షల మంది తిరుగుతున్నట్లు అంచనా. కానీ క్యాబ్‌లు, ఇతర ప్రైవేట్ వాహనాల పోటీ కారణంగా ఈ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఒకప్పుడు 72 శాతం ఉన్న సిటీ బస్సు ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు ఏకంగా 65 శాతానికి పడిపోయింది. - నగరంలో ప్రతిరోజు 121 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో రోజుకు 1.4 లక్షల మంది పయనిస్తున్నారు. ట్రైన్ దిగిన ప్రయాణికులు తిరిగి క్యాబ్‌లను వినియోగిస్తుండటం గమనార్హం. క్షణాల్లో బుకింగ్‌లు.. నిమిషాల్లో పరుగులు.. శరవేగంగా దూసుకొచ్చిన క్యాబ్ సర్వీసులతో ఆటోరిక్షాలు, సిటీ బస్సుల గ్రాఫ్ క్రమంగా పడిపోయింది. గ్రేటర్లో సుమారు 2 లక్షల క్యాబ్‌లు ప్రతిరోజు 20 లక్షల మందికి పైగా రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఒక్క శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికే ప్రతిరోజు సుమారు 10 వేల క్యాబ్‌లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉబెర్, ఓలా మొబైల్ యాప్‌ల నుంచి రోజూ సుమారు 15 లక్షల మంది తమ గమ్యస్థానాలను బుక్ చేసుకుంటున్నట్లు అంచనా. మరో 5 లక్షల మంది మిగతా క్యాబ్‌లను వినియోగిస్తున్నారు. ఇందులో ఇండికా, ఆల్టో వంటి చిన్న కార్ల నుంచి ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్ వంటి లగ్జరీ వాహనాల వరకు అందుబాటులో ఉన్నాయి. ఓలా సంస్థ మరో అడుగు ముందుకేసి ఆటోరిక్షా సర్వీసులను కూడా అందజేస్తోంది. మరోవైపు మోటో పేరుతో ఉబెర్ బైక్‌లు అందుబాటులోకి వచ్చాయి. హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కారణంగా ఇబ్బందులకు గురయ్యే ఐటీ ఉద్యోగులు, ఇతర వర్గాలు క్షణాల్లో కార్యాలయాలకు చేరుకొనేందుకు ఉబెర్ బైక్‌లను వినియోగిస్తున్నారు. ఓలా క్యాబ్‌లలో కేవలం రూ.36ల కనీస చార్జీలతో మొదలై ఒక కిలోమీటర్‌కు రూ.6 చొప్పున రవాణా సదుపాయం అందజేసే మైక్రో, మినీ వాహనాల నుంచి రూ.80ల కనీస చార్జీలతో సేవలందజేసే ప్రైమ్ వాహనాలున్నాయి. ఉబెర్ పూల్, ఉబెర్ ఎక్స్, ఉబెర్ గో, కేటగిరీలలో ప్రయాణికులకు రవాణా సదుపాయాలు అందుతున్నాయి. ట్యాక్సీ గిరాకీ దెబ్బతిన్నది ఇరవై ఏళ్ల నుంచి ట్యాక్సీ నడుపుతున్నా. క్యాబ్ పోటీకి తట్టుకోలేకపోతు న్నారు. క్యా బ్లు వచ్చిన తర్వాత గిరాకీ మొత్తం పడిపోయింది. క్యాబ్ తరహాలో మేం ఎక్కడికంటే అక్కడకు వెళ్ల లేం. చార్జీలు కూడా ట్యాక్సీలో ఎక్కువగానే ఉంటాయి. సికింద్రా బాద్ నుంచి బేగంపేట్‌కు వెళ్లాలంటే ట్యాక్సీ చార్జీ రూ.300 వరకు ఉంటుం ది. అదే క్యాబ్‌లో అయితే చాలా తక్కువ. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రాత్రింబవళ్లు కష్టపడ్డా పెట్రోల్, డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదు. – సయ్యద్ అఫ్సర్, ట్యాక్సీ డ్రైవర్ ఆటో ఎక్కడమే మరిచాను ఒకప్పుడు ఆటో ఎక్కువగా వినియోగించే వాణ్ని. రెండేళ్ల నుంచి పూర్తిగా మానేశాను. నాలుగైదు కిలోమీటర్లయినా సరే క్యాబ్లే ఎంతో సౌకర్యంగా ఉన్నాయి. ఎక్కడికంటే అక్కడికి వస్తారు. బేరమాడాల్సిన పనిలేదు. పైగా ఆటో కంటే తక్కువ చార్జీ. ఏసీ సదుపాయం ఉంటుంది. అనుకున్న చోటుకు అనుకున్న సమయానికి చేరుకోవచ్చు. ఒక ప్రయాణికుడికి ఇంతకంటే ఏం కావాలి? – హరీష్, ప్రైవేట్ ఉద్యోగి ట్రైన్ దిగగానే క్యాబ్ రెడీగా ఉంది కొద్దిక్షణాల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దిగు తామనగా క్యాబ్ బుక్ చేసుకున్నాం. స్టేషన్ బయటకు వచ్చే వరకు క్యాబ్ రెడీగా ఉంది. ఎలాంటి బేరసారాలు లేవు. డ్రైవ ర్ ఫొటో, బండి నంబర్, ఫోన్ నంబర్, సికింద్రాబాద్ నుంచి మల్కాజిగిరి వరకు అయ్యే రూ.135 చార్జీ వివరాలు అన్నీ ముందే ఫోన్లో నమోదయ్యాయి. నిశ్చిం తంగా బయలుదేరాం. క్యాబ్ సదుపాయం చాలా బాగుంది. – కుమారి మిగతా వాటి కన్నా క్యాబే బెటర్ బస్సు కోసం, ఆటో కోసం ఎదురు చూసే రోజులు పోయాయి. ప్రయాణానికి క్యాబ్ ఒక నిర్వచనంగా మారింది. మహిళలకు భద్రతాపరమైన కొన్ని ఇబ్బందులు ఉన్నమాట నిజమే కానీ, మిగతా ట్రాన్స్పోర్ట్ కంటే ఇది బెటర్ కదా. – రవి, శరణ్య దంపతులు మాకు కష్టంగానే ఉంది ఆటోలకు గిరాకీ లేదు. గతంలో రోజుకు రూ.1,200 వస్తే ఇప్పుడు రూ.800 కూడా రావడం లేదు. చాలా కష్టంగా ఉంది. ఆటో కిరాయి రూ.300, ఎల్పీజీ ఖర్చు రూ.250 మినహాయిస్తే ఒక రోజుకు రూ.200 కూడా గిట్టుబాటు కావడం లేదు. క్యాబ్‌ల వల్ల పోటీ బాగా పెరిగింది. – మహ్మద్ అబ్దుల్లా, ఆటో డ్రైవర్ ఆదాయం అంతంతే ఓలా, ఉబెర్, క్యాబ్‌ల వల్ల ప్రయాణికులకు బాగానే ఉన్నా ఈ రంగంలో పెరిగిన పోటీ కారణంగా ఆదాయం బాగా పడిపోయింది. రోజుకు 18 గంటలు కష్టపడితే తప్ప రూ.1000 లభించడంలేదు. గతంలో వారానికి రూ.1,500 ప్రోత్సాహకంగా ఇచ్చేవారు. ఇప్పుడు పూర్తిగా తగ్గించారు. కమీషన్లు, ట్యాక్స్‌లు చెల్లిస్తే మాకు దక్కేది కూడా తక్కువే. – బాబర్, క్యాబ్ డ్రైవర్