సిటీ బస్సుల్లో ‘సేఫ్‌’ జర్నీ! | Safe Journey In City Buses | Sakshi
Sakshi News home page

సిటీ బస్సుల్లో ‘సేఫ్‌’ జర్నీ!

Published Mon, Aug 6 2018 8:28 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Safe Journey In City Buses - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సిటీబ్యూరో : బస్సుల రాకపోకలపై ప్రయాణికులకు ఇక నుంచి ప్రత్యక్ష సమాచారం లభించనుంది. నగరంలోని ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోక లపై ‘హైలైట్స్‌’ మొబైల్‌ అప్లికేషన్‌  ద్వారా ప్రయాణికులకు ప్రత్యక్ష సమాచారం అందజేస్తున్న తరహాలోనే బస్సుల రాకపోకలపైన ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేసేందుకు ‘సేఫ్‌’ (సొసైటీ ఫర్‌ యాక్సిడెంట్‌ ఫ్రీ ఎన్విరాన్‌మెంట్‌) అనే సంస్థతో ఆర్టీసీ తాజాగా ఒప్పందం చేసుకుంది.

ఈ సంస్థ రోడ్లపై నడిచే బస్సుల కదలికలను ఎప్పటికప్పుడు నమోదు (వెహికల్‌ ట్రాకింగ్‌) చేయడంతో పాటు, బస్సుల రాకపోకలపైన ప్రయాణికులకు ప్రత్యక్ష  సమాచారాన్ని అందజేస్తుంది. ఇందుకోసం అన్ని చోట్ల ఎల్‌ఈడీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. మొదట ఏసీ బస్‌షెల్టర్‌లతో  ప్రారంభించి ఆ తరువాత క్రమంగా నగరంలోని అన్ని బస్టాపులకు ఈ ప్రత్యక్ష సమాచార బోర్డులను విస్తరిస్తారు.

అలాగే ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్‌లలో సేఫ్‌ యాప్‌ ద్వారా కూడా బస్సుల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీంతో ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే తాను ఎక్కాల్సిన బస్సు ఇంకా ఎంత దూరంలో ఉన్నది, ఏ సమయానికి తాను ఉన్న చోటుకు వస్తుందనే వివరాలు ప్రయాణికుడికి తెలిసిపోతాయి. అలాగే  సేఫ్‌ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లభించే డేటాను ‘టీ–సవారీ’లో అప్‌డేట్‌ చేస్తారు.

దీంతో  ప్రయాణికులకు ఈ యాప్‌ ద్వారా ఓలా, ఊబర్‌ తదితర వాహనాలతో పాటు  బస్సుల వివరాలు కూడా లభిస్తా యి. మెట్రో రైల్వేస్టేషన్‌లకు అందుబాటులో ఉన్న బస్సుల వివరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే గ్రేటర్‌ ఆర్టీసీలో 1200 బస్సులకు  వీటీపీఐఎస్‌ (వెహికల్‌ ట్రాకింగ్‌ అండ్‌ ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌) టెక్నాలజీనీ అమలు చేస్తున్నారు. కానీ ఇది మొక్కుబడిగానే అమలవుతోంది.

ప్ర యాణికులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు లభించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వెహికల్‌ ట్రాకింగ్, ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ వ్యవస్థను అమలు చేసేందుకు  సేఫ్‌  సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. మొదట నగరంలోని అన్ని ఏసీ, మెట్రో లగ్జరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులకు సేఫ్‌ వెహికల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను అమలు చేసి ఆ వివరాలను  ప్రయాణికుల మొబైల్‌ ఫోన్‌కు, బస్టాపుల్లోని ఎల్‌ఈడీ బోర్డులకు అనుసంధానం చేస్తారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 3650 బస్సులకు ఈ టెక్నాలజీని అమలు చేసిన అనంతరం  తెలంగాణలోని 10,093 బస్సులకు దీనిని విస్తరిస్తారు. 

హైలైట్స్‌ తరహాలో సమాచారం..

గ్రేటర్‌లో బస్‌షెల్టర్‌ల ఆధునీకరణకు అనుగుణంగా బస్సుల సమాచారం అందుబాటులో లేకపోవడం పెద్ద లోపంగా ఉంది. నగరంలోని 26 ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌లు, సికింద్రాబాద్‌; నాంపల్లి, కాచిగూడ, మల్కాజిగిరి తదితర ప్రధాన స్టేషన్‌ల ద్వారా  ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాకపోకలు సాగించే 121 ఎంఎంటీఎస్‌ సర్వీసుల ప్రత్యక్ష సమాచారాన్ని తెలియజేసేందుకు ‘హైలైట్స్‌’ దోహదం చేస్తుంది.

ఈ యాప్‌  ద్వారా ప్రయాణికులు తాము ఎదురు చూస్తున్న రైల్వేస్టేషన్‌కు ఎంఎంటీఎస్‌ ఎంత దూరంలో ఉన్నదీ ప్రత్యక్షంగా తెలిసిపోతుంది. సరిగ్గా ఇలాంటి పరిజ్ఞానం ద్వారానే బస్సుల రాకపోకలను ప్రయాణికులకు అప్‌డేట్‌ చేస్తారు. బస్టాపులను జియో ఫెన్సింగ్‌ చేస్తారు. ప్రధాన కార్యాలయంలోని సర్వర్‌ రూమ్‌ నుంచి ఈ మొత్తం వ్యవస్థను నియంత్రిస్తారు. మొదట నగరంలో అమలు చేసిన తరువాత హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–విజయవాడ, మెట్టుపల్లి–కరీంనగర్, హైదరాబాద్‌–వరంగల్‌ వంటి ప్రధాన రూట్లకు విస్తరిస్తారు.  

టి–సవారీతో అనుసంధానం... 

మరోవైపు ఈ సమాచారాన్ని టి–సవారీతో అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికుడికి ఒకే సమ యంలో అన్ని రకాల ప్రజారవాణా వాహనాల సమాచారం అందుబాటులోకి వస్తుంది. తద్వారా వాటిలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకొని బయలుదేరవచ్చు. ఉదాహరణకు మియాపూర్‌ నుంచి అమీర్‌పేట్‌ వరకు మెట్రో రైల్లో వచ్చిన వ్యక్తికి తాను ట్రైన్‌ దిగే సమయానికి అమీర్‌పేట్‌లో బస్సు, ఓలా, ఊబెర్, ఎలక్ట్రిక్‌ వెహికల్స్, బైక్స్‌ వంటి వాటిలో ఏది అందుబాటులో ఉంటే అందులో బయలుదేరవచ్చు.

సేఫ్‌ సంస్థ నుంచి ఆర్టీసీకి లభించే ఈ సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా ఉచితం. ఇందుకు ప్రతిగా వ్యాపార ప్రకటనలపైన ఆ సంస్థ ఆదాయాన్ని ఆర్జించనుంది. ఒకటి, రెండు నెలల్లో ఈ సరికొత్త సాంకేతిక వ్యవస్థ ఆచరణలోకి రావచ్చునని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement