మంకమ్మతోట, న్యూస్‌లైన్ : నగర ప్రజలకు ఇంకా మెరుగైన రవాణా సేవలు అందనున్నాయి. జిల్లా కేంద్రంలో సిటీ బస్సుల కోసం డిపో ఏర్పాటుకు ఇప్పటికే అనుమతి ఇవ్వగా ఇందుకు రూ.25.5 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరాల్లో మెరుగైన ప్రజారవాణా వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 13 నగరాలకు సిటీ బస్సుల సౌకర్యం కల్పించింది.
ఇందులో భాగంగా 75 బస్సులు మంజూరు చేసింది. రాష్ట్రం నుంచి వరంగల్, నెల్లూరు, కర్నూలు, నిజామాబాద్, నంద్యాల, కరీంనగర్, రామగుండం, ఒంగోలు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయనగరంలలో సిటీ బస్సులు ఏర్పాటు చేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ మొత్తం 12 ప్రతిపాదనలు పంపించగా ఒక్క కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాత్రమే సిటీ బస్సుల ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రం ఆమోదం తెలిపింది. డిపో ఏర్పాటుకు అనుమతితోపాటు అవసరమైన నిధులు శుక్రవారం మంజూరు చేసింది.
డిపో ఎక్కడ?
సిటీ డిపో ఏర్పాటుకు స్థలం ఎంపిక చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని ఆర్టీసీ బస్‌స్టేషన్, వన్, టూ డిపో, ఆర్టీసీ జోనల్ ఆస్పత్రి, జోనల్ వర్క్‌షాప్‌ల్లో సంస్థ స్థలాలు ఉన్నాయి. సిటీ బస్ డిపో నగరానికి దూరంగా ఉండకుండా ప్రస్తుతం బస్సులను శుభ్రం చేయడానికి ఏర్పాటు చేసిన వాషింగ్ పాయింట్, టూ వీలర్ పార్కింగ్ స్థలాల్లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది.
ముందస్తుగా సిటీ బస్సుల నిర్వహణ, రూట్లు, బస్‌పాయింట్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నవంబర్‌లో 12 బస్సులు ఏర్పాటు చేశారు. ప్రజలు సిటీ బస్సులో ప్రయాణించేందుకు ఆసక్తి కనబర్చుతుండడంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు డిపో ఏర్పాటు చేస్తున్నారు. డిపో ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్‌కు కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. సిటీ బస్సుల సౌకర్యం కల్పించాలని కోరుతూ యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ కలిసి చేసిన విజ్ఞప్తిని పరిశీలించి సంబంధిత మంత్రికి ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు.
త్వరలో శంకుస్థాపన
సిటీ బస్ డిపో పనుల శంకుస్థాపనను కేంద్ర సహాయమంత్రి సర్వే సత్యనారాయణ చేతులమీదుగా చేపట్టనున్నట్లు ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. డిపో ఏర్పాటుకు స్థల సేకరణ ప్రయత్నాల్లో అధికారులున్నారని పేర్కొన్నారు. ఈ నెల 15, 16 లేదా 22 తేదీల్లో కేంద్ర మంత్రి పర్యటన ఉంటుందని స్పష్టం చేశారు.
సిటీలో డిపో
Published Sat, Feb 8 2014 4:05 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement