సిటీ డిపోలన్నీ ప్రైవేటుకే.. | Removal Of Diesel Buses In Hyderabad To Cut Pollution, Will Be Replaced By Electric Buses | Sakshi
Sakshi News home page

సిటీ డిపోలన్నీ ప్రైవేటుకే..

Dec 11 2024 4:56 AM | Updated on Dec 11 2024 9:29 AM

Removal of diesel buses in Hyderabad

హైదరాబాద్‌లో డీజిల్‌ బస్సుల తొలగింపు

వాటి స్థానంలోజీసీసీ విధానంలో ఎలక్ట్రిక్‌ బస్సులు.. ప్రైవేటు సంస్థలకునగరంలోని బస్‌ డిపోలు 

ఈ బస్సుల్లో కండక్టర్లు తప్ప అంతాప్రైవేటువారే.. దీంతో డీజిల్‌ బస్సులతోపాటే సిటీ బయటకు ఆర్టీసీ సిబ్బంది 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆర్టీసీ డీజిల్‌ బస్సులను నగరం వెలుపలికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించటం ఆ సంస్థ ఉద్యోగులకు ప్రాణ సంకటంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 

డీజిల్‌ బస్సుల స్థానంలో ప్రైవేటు సంస్థలకు చెందిన ఎలక్ట్రిక్‌ బస్సులను తిప్పాలని భావిస్తున్నారు. ఈ బస్సుల్లో కండక్టర్‌ తప్ప ఇతర సిబ్బంది అంతా సదరు సంస్థవారే ఉంటారు. దీంతో ఇప్పుడు నగరంలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బంది డీజిల్‌ బస్సులతోపాటే నగరం బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు.  
సిటీ బయటకు 80 శాతం సిబ్బంది! 
ప్రస్తుతం నగరంలో 2,500 సిటీ బస్సులు తిరుగుతున్నా యి. విమానాశ్రయం సర్వీసులు, సిటీ సర్వీసులుగా తిరుగుతున్న కొన్ని నాన్‌ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు మినహా అన్నీ డీజిల్‌ బస్సులే. ఇటీవలే ఎలక్ట్రిక్‌ పాలసీలో మార్పులు తెచి్చన రాష్ట్ర ప్రభుత్వం.. నగరంలో డీజిల్‌ బస్సులను తిప్పొద్దని నిర్ణయించింది. వీటిని ఔటర్‌ రింగురోడ్డు అవ తలికి తరలించి, నగరంలో ఎలక్ట్రిక్‌ బస్సులనే తిప్పాలని నిర్ణయించింది. 

ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్న పీఎం ఈ–డ్రైవ్‌ పథకం కింద ఆర్టీసీ దరఖాస్తు చేసింది. ఆ పథకం కింద దేశవ్యాప్తంగా 9 నగరాలకు 14 వేల ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేయనున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అందులో 2,800 బస్సులు తమకు అందజేయాలని టీజీఆర్టీసీ కోరింది. ఈ పథకానికి సంబంధించి ఈ నెలలో లేదా వచ్చే నెలలో కేంద్రం టెండర్లు పిలవనుంది. టెండర్లు దక్కించుకునే సంస్థలు గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు (జీసీసీ) పద్థతిలో ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీలో అద్దెకు తిప్పుతాయి. 

ఈ బస్సుల నిర్వహణ బాధ్యత ఆయా సంస్థలదే. ఒక్క కండక్టర్‌ సర్వీసును మాత్రమే ఆర్టీసీ పర్యవేక్షిస్తుంది. డ్రైవర్, మెకానిక్, సెక్యూరిటీ వంటి బాధ్యతలను బస్సుల యజమానులే చూసుకొంటారు. దీంతో నగరంలోని ప్రస్తుత ఆర్టీసీ డిపోలన్నీ ప్రైవేటు బస్సులు నిలిపేందుకు కేటాయిస్తారు. రెండేళ్లలో దశలవారీగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తారు. డిపోలపై అజమాయిషీ మాత్రం ఆర్టీసీదే ఉండనుంది. 

అంటే, డిపో మేనేజర్, సహాయ మేనేజర్, కండక్టర్లకు టికెట్‌ యంత్రాలు అందివ్వటం, టికెట్ల ద్వారా వచ్చే నగదును లెక్కించి బ్యాంకుల్లో జమ చేయటం వంటి బాధ్యతలు చూసే కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఆర్టీసీలో ఉంటారు. డ్రైవర్లు, మెకానిక్‌–శ్రామిక్‌లు, సెక్యూరిటీ సిబ్బందిని రాష్ట్రంలోని ఇతర డిపోలకు పంపాల్సి ఉంటుంది. దీంతో నగరంలోని 80 శాతం మంది ఆర్టీసీ సిబ్బంది ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఉద్యోగాల భర్తీ కూడా ఉండదని చెబుతున్నారు. 
 
ఇది ప్రైవేటీకరణే:కార్మిక సంఘాలు
ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించి వాటి సిబ్బంది ఆధ్వర్యంలో బస్సులను తిప్పటమంటే అంతమేర ఆర్టీసీని ప్రైవేటీకరించినట్టేనని ఆర్టీసీలోని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని సహించేది లేదని, ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి. మరో వైపు జీసీసీ పద్ధతిలో బస్సుల నిర్వహణ చేపట్టినంత మాత్రాన దాన్ని ప్రైవేటీకరించినట్టు అనటం సరికాద ని ఉన్నతాధికారులు పేర్కొంటున్నా రు. 

డిపోల్లోని స్థలాలను మాత్రమే ఆయా సంస్థలు బస్సులు నిలుపుకోవటం, చార్జింగ్‌ చేయటం, నిర్వహణ పనులకు వినియోగించుకుంటాయని చెబుతున్నారు. డిపోల అజమాయిషీ పూర్తిగా ఆర్టీసీ ఆధీనంలోనే ఉంటుందని అంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement