హైదరాబాద్‌–వరంగల్‌ మధ్య ఎలక్ట్రిక్‌ బస్సులు | Electric buses between Hyderabad and Warangal | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌–వరంగల్‌ మధ్య ఎలక్ట్రిక్‌ బస్సులు

Published Mon, Oct 21 2024 3:34 AM | Last Updated on Mon, Oct 21 2024 3:34 AM

Electric buses between Hyderabad and Warangal

రాష్ట్రంలో రెండో పెద్ద నగరానికి 82 బ్యాటరీ బస్సుల కేటాయింపు 

త్వరలో విడతల వారీగా ప్రారంభం 

వరంగల్‌ నుంచి కరీంనగర్, నిజామాబాద్‌లకూ సర్వీసులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరంగా విస్తరిస్తున్న వరంగల్‌కు భారీగా ఎలక్ట్రిక్‌ బస్సులను కేటాయించారు. త్వరలో ఇవి రాకపోకలు సాగించనుండగా, దశలవారీగా మొత్తం 82 ఎలక్ట్రిక్‌ బస్సులను వరంగల్‌–హైదరాబాద్‌ మధ్య నడపనున్నారు. ఇందులో ఎలక్ట్రిక్‌ సూపర్‌ లగ్జరీ (18), డీలక్స్‌ (14), సెమీ డీలక్స్‌ (21), ఎక్స్‌ప్రెస్‌ (29) కేటగిరీ బస్సులున్నాయి. 

ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు పద్ధతిలో ఈ బస్సులను నిర్వహిస్తుంది. తెలంగాణలో తొలిసారి ఒలెక్ట్రా కంపెనీ బ్యాటరీ బస్సులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ రెండు పర్యాయాలు బస్సులను సరఫరా చేసి నిర్వహిస్తోంది. మూడో ప్రయత్నంలో ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ టెండర్‌ దక్కించుకుంది. 

ఇటీవలే కొన్ని బస్సులను కరీంనగర్, నిజామాబాద్‌ నుంచి ప్రారంభించింది. కానీ రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత జనాభా, విస్తీర్ణం పరంగా పెద్ద పట్టణమైన వరంగల్‌కు ఎక్కువ బస్సులు కేటాయించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు 82 బస్సులు కేటాయించారు. వీటిని వరంగల్‌–2 డిపో ఆధ్వర్యంలో నడుపుతారు.  

సింహభాగం బస్సులు హైదరాబాద్‌కే.. 
హైదరాబాద్‌–వరంగల్‌ మధ్య బస్సులు ఎక్కువగా ఉంటాయి. నిత్యం రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంటుండటంతో ఎక్కువ సర్వీసులు తిప్పుతారు. ఈ నేపథ్యంలోనే రెండు ప్రాంతాల మధ్య అదనంగా కొత్త బస్సులను తిప్పాలని సంస్థ నిర్ణయించింది. జేబీఎం సరఫరా చేసేవరకు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ఎలక్ట్రిక్‌ బస్సులు తిప్పుతున్నారు. 

కాగా తొలిసారి హైదరాబాద్‌ వెలుపల (హైదరాబాద్‌–విజయవాడ కాకుండా) ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించారు. ఇక వరంగల్‌కు సరఫరా చేసే ఎలక్ట్రిక్‌ బస్సుల్లో మూడొంతులు హైదరాబాద్‌ రూట్‌లోనే తిప్పనున్నారు. వరంగల్‌–2 డిపోలో సిద్ధం చేసిన సెంటర్‌లో బ్యాటరీ చార్జ్‌ చేసి పంపిన తర్వాత, తిరుగు ప్రయాణం కోసం మళ్లీ చార్జ్‌ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో చార్జింగ్‌ పాయింట్లు ఉన్నందున హైదరాబాద్‌కే ఎక్కువ బస్సులు తిప్పనున్నారు. 

కరీంనగర్, నిజామాబాద్‌ల్లో ఇప్పటికే చార్జింగ్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయి. దీంతో కొన్ని బస్సులను వరంగల్‌ నుంచి ఆ రెండు నగరాలకు కూడా నడపాలని నిర్ణయించారు. హైదరాబాద్‌కు ఎక్కువ ఎలక్ట్రిక్‌ బస్సులు తిప్పనున్నందున.. ప్రస్తుతం హైదరాబాద్‌–వరంగల్‌ మధ్య నడుస్తున్న డీజిల్‌ బస్సుల్లో కొన్నింటిని తప్పించి వరంగల్‌ నుంచి ఇతర ప్రాంతాల మధ్య నడపనున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement