
తెగువే మగువకు రక్షణ
సిటీ బస్సులు... కాలేజీ సెంటర్లు... ఎంఎంటీఎస్‌లు... ఏరియా ఏదైనా ఈవ్ టీజింగ్ మాత్రం కామనయిపోయింది. అమ్మాయిలను వేధించి ఆనందించే ఆకతాయిలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. చట్టాలు... వ్యవస్థలు... ఎన్ని ఉన్నా రోజూ ఎక్కడో అక్కడ ఈవ్ టీజర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. మరి దీనికి ఫుల్‌స్టాప్ పెట్టేదెవరు..? అమ్మాయిలను రక్షించేదెవరు? ఇవే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్నలు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూసే కంటే.. మనల్ని మనం రక్షించుకొనే ప్రయత్నం చేస్తే వీటి నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చని చూపారు హర్యానా సిస్టర్స్. బస్సులో వెంటాడిన ఈవ్ టీజర్లను బెల్టు తీసి భరతం పట్టిన వీరిలా అందరూ తెగువ చూపాలంటున్నారు మాదాపూర్ శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్థినులు. వారి చర్చే ఈ వారం ‘క్యాంపస్ కబుర్లు’...
మానస: హర్యానాలో జరిగిన బస్సు సంఘటన వీడియో చూసి హ్యాపీగా ఫీలయ్యా. ఒక్క క్షణం ఇది నిజమేనా అనిపించింది. నిజంగా భారతి, పూజ ప్రతి ఒక్క భారతీయ మహిళకు ఆదర్శం.
స్నేహ: యా మానస.. ఆ సీన్ చూడగానే నేను బస్సులో ఎదుర్కొన్న సంఘటనలన్నీ కళ్ల ముందు తిరిగాయి. ఓసారి బస్సులో కాలేజీకి వస్తుంటే... మా ఫాదర్ ఏజ్ ఉంటుంది అతనికి. పక్కనే నిలబడ్డాడు. కావాలని నా చేతిని టచ్ చేస్తున్నాడు. రెండు మూడుసార్లు చూసి ‘ఏం కావాలి?’ అంటూ అరిచాను. బస్ బాగా రష్‌గా ఉందంటూ చెప్పాడు.
నిశ్చల: బస్సుల్లో ఇవి కామనయిపోయాయి. అయితే ఎంతమంది అమ్మాయిలు ఎదురుతిరుగుతున్నారనేది ప్రశ్న. ఈ మధ్యనే మా ఫ్రెండ్ బస్‌లో వెళుతుంటే ఓ యాభై ఏళ్ల వ్యక్తి తనను బాగా ఇబ్బంది పెట్టాడు. నలుగురిలో అతన్ని ఎదిరిస్తే తనెక్కడ అల్లరి అవుతుందోననే భయంతో బస్సు దిగేసింది.
టీనా: ఇట్స్ టూ బ్యాడ్. కనీసం ఆమె అతన్ని కొట్టక్కర్లేదు... గట్టిగా నాలుగు మాటలంటే... చుట్టుపక్కలవారికి భయపడైనా దూరంగా జరిగేవాడు కదా!
నిశ్చల: నో... టీనా ఇలాంటి సందర్భాల్లో అమ్మాయినే తప్పుపట్టేవారున్నారు.
హరిణి: యస్... ఆ అమ్మాయి కాస్త మోడ్రన్ డ్రెస్ వేసుకుందనుకో... సపోర్ట్ చేయకపోగా కామెంట్ చేసేవారూ ఉన్నారు.
టీనా: అఫ్‌కోర్‌స.. కాలం మారింది. బస్సులో ఆకతాయిలతో పాటు మనలాంటి పిల్లలున్న అమ్మానాన్నలు కూడా ఉంటున్నారు కదా.. వారు తప్పకుండా సపోర్ట్ చేస్తారు.
హరిణి: హర్యానా బస్సు ఇన్సిడెంట్‌లో అక్కాచెల్లెళ్లు తమకు ఇబ్బంది అనిపించగానే... చుట్టుపక్కలవారు ఏమనుకుంటారని ఆలోచించలేదు. బెల్టు తీసి బుద్ధి చెప్పడానికి సిద్ధపడ్డారు. మనమైనా అలాగే ఆలోచించాలి.
సౌందర్య: ఎగ్జాట్లీ... నాకూ ఇలాంటి అనుభవం ఒకటుంది. అయితే ఇక్కడ టీజ్ చేసింది బస్ కండక్టరే. టికెట్లు తీసుకున్న తర్వాత కూడా కావాలని వెనక్కి, ముందుకీ ఓ పదిపదిహేను సార్లు మమ్మల్ని తోసుకుంటూ తిరుగుతున్నాడు. ఇక లాభం లేదని... నా దగ్గరికి రాగానే వాడి కాలుని నా హైహీల్స్‌తో గట్టిగా తొక్కా. దెబ్బకు కిక్కురుమనకుండా వెనక్కి వెళ్లిపోయాడు.
అనూష: ఒక్క బస్సు సంఘటనలే కాదు... మిగతా చోట్లా ఆడవాళ్లను వేధిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో కూడా తెలిగా వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి.
స్నిగ్ధ: యస్... మనం ఆ పని చేయాలే గానీ సొసైటీ తప్పనిసరిగా పాజిటివ్‌గా రెస్పాన్స్ అవుతుంది.
టీనా: ఇక్కడ సొసైటీ ఎవరు స్నిగ్ధ? మనం ఇంకా ఎవరో వస్తారని, ఏదో చేస్తారనే లోకంలోనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ భారతి, పూజ సంఘటన చూడు. ఎపిసోడ్ మొత్తంలో ఆ అక్కాచెల్లెళ్ల రియాక్షన్ మాత్రమే ఉంది. బస్సు నిండా పదుల సంఖ్యలో ఆడవాళ్లు, మగవాళ్లు ఉన్నారు. వారెవరూ స్పందించలేదు.
అస్మిత: వాళ్లిద్దరూ టీజర్లని చితకబాదింది చుట్టూ ఉన్నవారిని చూసి కాదు... వారిలో ఉన్న ధైర్యం, అందుబాటులో ఉన్న బెల్టుని చూసుకుని. అంటే ఆత్మరక్షణే ఈ సమస్యకు పరిష్కారం.
గుణపాఠం
భారతి, పూజని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించాలనుకున్న నిర్ణయం చాలా గొప్పది. పాఠాలు వేరు, గుణపాఠాలు వేరు. ఈ రోజు వారు మగవారి వంచనకు గురవుతున్న మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఎలాంటి సందర్భంలోనూ మగవారి వేధింపులను భరించాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న ఏ చిన్న వస్తువునైనా ఆయుధంగా మలచుకుని
ఎదురుతిరగాలి.
- అజిత సురభి,
డెరైక్టర్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్
భువనేశ్వరి
ఫొటోలు: రాజేష్‌రెడ్డి