మియాపూర్ బస్‌బాడీ వర్క్‌షాపులో సిటీబస్సుగా హంగులు దిద్దుకుంటున్న పల్లెవెలుగు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు పల్లెవెలుగులుగా గ్రామీణ ప్రాంతాలకు తిరిగిన బస్సులు కొన్ని సిటీ సర్వీసులుగా మారనున్నాయి. ఈ మేరకు పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం చాలా ఊళ్లకు పల్లెవెలుగు బస్సులు తిరగటం లేదు. తక్కువ ఆక్యుపెన్సీ రేషియో ఉండటం, రోడ్లు బాగాలేకపోవటం తదితర కారణాలతో కొన్ని ఊళ్లకు బస్సులను ఆపేసిన విషయం తెలిసిందే.
మరోవైపు అద్దె బస్సుల సంఖ్య కూడా పెరగటంతో కొన్ని పల్లెవెలుగు బస్సులు వృథాగా ఉన్నాయి. అయితే వాటిని సిటీ బస్సులుగా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో మియాపూర్‌లోని బస్‌బాడీ వర్క్‌షాపులో పల్లెవెలుగు బస్సులను సిటీ బస్సులుగా మారుస్తున్నారు. ప్రస్తుతానికి దాదాపు 350 బస్సులను ఈ విధంగా సిద్ధం చేస్తున్నారు.
నగరంలో కొరత రానుండటంతో..
హైదరాబాద్‌లో తిరుగుతున్న సిటీబస్సుల్లో చాలావరకు పాతబడిపోయాయి. మరోవైపు ఇప్పట్లో కొత్త బస్సులు కొనే వీలు లేకుండా పోయింది. ఉన్న బస్సులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్క్రాప్ (తుక్కు)పాలసీ ప్రకారం 15 ఏళ్లు పూర్తయిన బస్సుల్ని తిప్పేందుకు వీలులేదు. ఈ కారణంగా వచ్చే మార్చి నాటికి నగరంలో దాదాపు 600 బస్సులను తొలగించాల్సి ఉంది.
మరోవైపు రెండేళ్ల క్రితం సమ్మె జరిగిన సమయంలో ప్రభుత్వ ఆదేశం మేరకు దాదాపు 800 బస్సులను తగ్గించారు. వాటిల్లో ఎక్కువ శాతం బస్సులను ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన సరుకు రవాణా (కార్గో) బస్సులుగా మార్చేశారు. ఇలా కొన్ని కార్గో సర్వీసులుగా మారిపోవడం, 600 బస్సుల గడువు తీరిపోనుండటంతో నగరంలో బస్సులకు తీవ్రమైన కొరత ఏర్పడనుంది. దీంతో పల్లెవెలుగు బస్సులను సిటీ సర్వీసులుగా మార్చి నగర ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ సంస్థ యాజమాన్యం నిర్ణయించింది.
అద్దెబస్సుల రాకతో మిగులు
సమ్మె సమయంలో ఆర్టీసీ కొత్తగా 1,300 అద్దె బస్సులను తీసుకుంది. వీటిల్లో ఎక్కువ బస్సులను పల్లెవెలుగు సర్వీసులుగానే చేర్చుకుంది. దీంతో చాలా డిపోల్లో సొంత పల్లెవెలుగు బస్సులు మిగిలిపోయాయి. వాటిని అప్పట్లో కార్గోకు బదిలీ చేయాలని భావించారు. కానీ కార్గో విభాగం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటంతో అన్ని బస్సులు ఇవ్వాల్సిన అవసరం లేదని తర్వాత తేల్చారు. దీంతో మిగిలిపోయిన బస్సులన్నీ డిపోల్లో వృథాగా ఉన్నాయి.
అలాగే వేరే ఇతర కారణాలతో నిలిపివేసిన బస్సులు కూడా ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని ఎంపిక చేసి సిటీ బస్సులుగా మారుస్తున్నారు. సీట్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయటంతో పాటు, నిర్మాణంలో తేడా ఉన్న వాటిని పూర్తిస్థాయిలో సరిచేసి రంగులేసి కొత్త బస్సుల తరహాలో సిద్ధం చేస్తున్నారు. పూర్తయిన వాటిని డిపోలకు అప్పగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment