Rural area
-
పల్లె ‘నాడి’ పట్టడం లేదు..
సాక్షి, హైదరాబాద్: ‘నా ఆరోగ్యం నా హక్కు’.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సరికొత్త నినాదమిది. ప్రతి వ్యక్తికి నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలు అందాలనేది డబ్ల్యూహెచ్ఓ లక్ష్యంగా నిర్దేశించి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ బాధ్యతను ప్రభుత్వాలు సమర్థవంతంగా నిర్వహించాలని, అప్పుడే ప్రజలకు మెరుగైన జీవనం అందుతుందని సూచిస్తోంది. దేశంలో ఆరోగ్య సేవలపై నివేదకను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా విడుదల చేసింది. ఆయుష్మాన్ భారత్ పేరిట పేదలకు అరోగ్య సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవల తీరు ఎంతో మెరుగుపడాల్సిన అవసరం ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేరువేరుగా చూస్తే గ్రామీణ ప్రాంతంలో సేవలు బాగా వెనుకబడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. పేదరికంతో సతమతం... గ్రామీణ భారతంలో పేదలే ఎక్కువ. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం నుంచి 47 శాతం మంది శస్త్రచికిత్సల కోసం రుణాలు తీసుకోవడం, అప్పులు చేస్తున్నారు. ఇక 20 శాతం నుంచి 28 శాతం మంది ఆర్థిక స్తోమత లేకపోవడంతో వైద్యానికే నోచుకోవడం లేదు. పట్టణ ప్రాంత జనాభాతో పోలీస్తే గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 64% మంది వయసు మీదపడకముందే మరణిస్తున్నారు. ఇక దేశ జనా భాతో పోలిస్తే 6లక్షల డాక్టర్ల కొరత ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లక్ష్యాలు బాగున్నా... ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు భారీ లక్ష్యాల్ని నిర్దేశించుకుంటున్నప్పటికీ వాటి ఆచరణ మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచ దేశాలు వైద్య సేవల కోసం చేస్తున్న సగటు ఖర్చు జీడీపీలో 5.8శాతం కాగా, భారత్ మాత్రం 1%మాత్రమే ఖర్చు చేస్తోంది. 195 దేశాల్లో వైద్య సేవలపై అధ్యయనం చేసిన డబ్ల్యూహెచ్ఓ పలు కేటగిరీల్లో దేశాలకు ర్యాంకులు ఇచ్చింది. ఆస్పత్రి ప్రసవాల్లో 125వ ర్యాంకు, శిశు మరణాల్లో 135వ ర్యాంకుతో భారత్ సరిపెట్టుకుంది. కేటాయింపులు రెట్టింపు చేయాలి వైద్య రంగానికి ప్రభుత్వాలు చేస్తున్న కేటాయింపులు రెట్టింపు చేయాలి. అవసరాలకు తగ్గట్లు కేటాయింపులు లేకపోవ డంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కొరవడతున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మెడికల్ టీచర్స్ -
ఇసుక కొరత ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణాకోసం అనుమతి ఇవ్వాలని గ్రామీణుల నుంచి ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా సమీపంలోని వాగులు, వంకల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుకను తెచ్చుకునేందుకు అనుమతిస్తారు. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గతంలోనూ వెసులుబాటు.. తెలంగాణ రాష్ట్ర ఇసుక వెలికితీత విధానం 2015 నిబంధనల ప్రకారం గతంలోనూ స్థానిక వనరుల నుంచి గ్రామాల్లో అవసరాలకు ఇసుకను తెచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అయితే విచ్చలవిడి ఇసుక వెలికితీతతో భూగర్భ జల వనరులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం స్థానిక అవసరాల కోసం ఇసుక వెలికితీత, రవాణాపై కఠినంగా వ్యవహరించడంతోపాటు ఇసుక వెలికితీత, అనుమతుల బాధ్యతను స్థానిక తహసీల్దార్లు, గ్రామపంచాయతీలకు అప్పగించింది. ఇసుక వెలికితీతకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు రెవెన్యూ, భూగర్భ జల వనరులు, పంచాయతీ విభాగాలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి అనుమతులు తప్పనిసరి చేసింది. మరోవైపు స్థానిక అవసరాలకు ఉపయోగించే ఇసుకకు కూడా డబ్బులు చెల్లించాలనే విధానాన్ని అనుసరించింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై స్థానిక అవసరాల కోసం ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బు చెల్లించకుండానే ఇసుకను తీసుకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. -
ఇంటింటా ఇన్నోవేటర్
సాక్షి, సిటీబ్యూరో: అధునాతన సాంకేతికత, వినూత్న ఆవిష్కరణలతో దేశంలోనే అత్యున్నత ఇన్నోవేటివ్ హబ్‌గా తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోంది. ఈ ఆవిష్కరణల్లో హైదరాబాద్ నగరం వేదికగానే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ఇన్నోవేటర్స్ తమవంతు కృషిని కొనసాగిస్తున్నారు. ఈ వినూత్న ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రారంభించిన ‘తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ), ఐటీఈ–సి’ శాఖలు కీలకంగా పని చేస్తున్నాయి. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించడానికి ఈ వేదికలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా 2019లో టీఎస్ఐసీ ఆధ్వర్యంలో ‘ఇంటింటా ఇన్నోవేటర్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలో ఉన్నటువంటి ఆవిష్కర్తలను వెలికితీయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న సమస్యలకు వినూత్న పరిష్కారాలు కనుగోవడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 700 పైగా ఇన్నోవేటర్స్ తమ విభిన్న ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ ఏడాది కూడా ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమం కోసం ఆవిష్కర్తల దరఖాస్తులను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆహా్వనిస్తోంది. ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ఐసీ ప్రకటించింది. ఔత్సాహికులు తమ పేరు, ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు, రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియో, నాలుగు ఫొటోలను 9100678543 నెంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు. టీఎస్ఐసీ సహకారం 2020 ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శలో భాగంగా విత్తనాలు ఉన్న పేపర్ నాప్కిన్స్ను తయారు చేశాను. ప్రతిరోజు ఇంట్లో ఉండే తడి చెత్తను కంపోస్ట్ పిట్లో పెట్టడంతో దుర్వాసన వచ్చేది. ఆ సమయంలో వచ్చిన ఈ ఆలోచనతో దీనిని తయారు చేశాను. ఈ పేపర్‌ను మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇందులో విత్తనాలు కూడా ఉండడంతో కొత్త మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని గుర్తించిన టీఎస్ఐసీ అప్పటినుంచి సహకారం అందిస్తున్నారు. –అరుణ్ జ్యోతి, గృహిణి, నల్గొండ జిల్లా అకుంర దశలోనే ప్రోత్సాహం.. 33 జిల్లాలో ఎంతో మంది ఇన్నోవేటర్స్ ఉన్నారు, వారికీ సరైన సహకారం, దిశానిర్దేశం చేయడానికి ఈ వేదిక రూపొందించబడింది. ఏ ఆవిష్కరణకైనా అకుంర దశ నుంచి ప్రోత్సహించాలి. టీఎస్ఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులు, భాగస్వాముల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆవిష్కర్తలను గుర్తిస్తూ వారి జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నాం. ప్రతీ ఒక్కరూ వినూత్నంగా ఆలోచించాలి, వారి ఆవిష్కరణలతో ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నాం. ఎంపికైనవారికి ఆగష్టు 15 స్వత్రంత దినోత్సవ సంబరాలలో తమ ఆవిష్కరణ ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. –డా. శాంతా తౌటం, తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ -
రవాణా మరింత సులభతరం.. మరిన్ని గ్రామీణ రోడ్లకు మహర్దశ
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా మరింత సులభతరం అవనుంది. పాడుబడిపోయిన పాత రోడ్లను పునర్నిర్మించి, ఆధునికంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎంజీఎస్‌వై కింద 2,684 కిలోమీటర్ల రోడ్లను ఆధునీకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మరో 916.22 కిలోమీటర్ల పొడవున రహదారులను పునర్నిర్మించనుంది. పీఎంజీఎస్‌వై ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో రూ. 1066.10 కోట్లతో 115 పాడుబడిన పాత తారు రోడ్లను పునర్నిర్మించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. ఆ రోడ్లలో 74 పెద్ద పెద్ద బ్రిడ్జిలను కూడా నిర్మిస్తారు. వీటి మొత్తం నిడివి 6918.97 మీటర్లు (అంటే దాదాపు ఏడు కిలో మీటర్లు) ఉంటుంది. వీటిలో 22 బ్రిడ్జిలు ఒక్కొక్కటి 150 మీటర్ల పొడవుకన్నా ఎక్కువ నిడివి ఉంటాయని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కేంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఎంపవర్డ్ కమిటీ మీటింగ్‌లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 1,069 కిలోమీటర్ల పొడవున 131 తారు రోడ్ల పునర్నిర్మాణానికి రాష్ట్ర అధికారులు ప్రతిపాదించారు. వీటిలో 115 రోడ్ల పునర్నిర్మాణానికి ఎంపవర్డ్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటిలో 153.01 కిలోమీటర్ల మేర రోడ్లను 5.5 మీటర్ల వెడల్పుతో కిలోమీటర్‌కు రూ.85.20 లక్షల ఖర్చుతో పునర్నిర్మిస్తారు. మిగిలిన రోడ్లను 3.75 మీటర్ల వెడల్పుతో కిలోమీటర్‌కు 58.41 లక్షలతో పునర్నిర్మిస్తారు. పీఎంజీఎస్‌వై కింద ఈ రోడ్ల ఆధునీకరణకు అయ్యే ఖర్చులో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఈ రోడ్లకు అంచనాలు ఇప్పటికే పూర్తయినందున, కేంద్రం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. పీఎంజీఎస్‌వై పథకంలోనే 2684 కి. మీటర్ల కొత్త రోడ్లు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 1.25 లక్షల కిలోమీటర్ల మేర పాత రోడ్ల పునర్నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ 2019లో పీఎంజీఎస్‌వై –3ని ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రానికి 3,285 కిలోమీటర్ల పొడవున రోడ్ల ఆధునీకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. గత నాలుగేళ్లలో అందులో 2,314 కిలోమీటర్ల రోడ్లకు ఇప్పటికే ఆమోదం తెలిపింది. వీటిలో 1804 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. దీనికి తోడు పీఎంజీఎస్‌వై, ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ (నక్సల్స్, తీవ్రవాద ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పథకం) కింద గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి పలు రోడ్లను కేంద్రం మంజూరు చేసింది. వాటికి నిధులు కూడా విడుదల చేసింది. అయినప్పటికీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పనులు పూర్తి చేయలేదు. ఇలా పెండింగ్‌లో ఉన్న 880 కిలోమీటర్ల రహదారులను కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో పూర్తి చేసింది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మొత్తం 2,684 కిలోమీటర్ల రోడ్లను నిర్మించినట్లు అధికారులు వివరించారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు పూర్తయిన పనులకు బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. -
గ్రామాల్లో కొనుగోళ్లు.. గంపెడాశలు పెట్టుకున్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు!
న్యూఢిల్లీ: కమోడిటీ ద్రవ్యోల్బణం చల్లబడడం ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగానికి అనుకూలమని కంపెనీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా గడిచిన ఐదారు త్రైమాసికాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం పడిపోగా, తిరిగి అది పుంజుకుంటుందన్న అంచనాతో ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు డాబర్, మారికో ఉన్నాయి. మార్జిన్లు మార్చి త్రైమాసికంలో పెరుగుతాయని గోద్రేజ్ కన్జన్యూమర్ ప్రొడక్ట్స్ (జీసీపీఎల్) సైతం అంచనాతో ఉంది. ‘‘మార్చి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ రంగం క్రమంగా రికవరీని చూసింది. వార్షికంగా చూస్తే అమ్మకాల పరిమాణం పెరిగింది. పట్టణాల్లో, ప్రీమియం ఉత్పత్తుల విభాగాల్లో అమ్మకాలు స్థిరంగా కొనసాగాయి. ద్రవ్యోల్బణం చల్లబడడం మొత్తం మీద వినియోగానికి, గ్రామీణ మార్కెట్లకు అనుకూలం’’అని మారికో తెలిపింది. కొబ్బరి ధరలు స్థిరంగా, సానుకూల శ్రేణిలోనే ఉండగా, వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. స్థూల మార్జిన్లు పెరుగుతాయని, వార్షికంగా చూస్తే ఆపరేటింగ్ మార్జిన్లో సహేతుకమైన వృద్ధి ఉంటుందని మారికో తెలిపింది. ఎఫ్ఎంసీజీ అమ్మకాలు పూర్తి స్థాయిలో కోలుకోకపోయినా, త్రైమాసికం వారీగా చూస్తే మార్చిలో పుంజుకున్నట్టు డాబర్ పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో అమ్మకాలు తిరిగి సానుకూల ధోరణికి చేరాయని, గ్రామీణ మార్కెట్లలోనే ఇంకా సాధారణ స్థితికి చేరుకోవాల్సి ఉందని తెలిపింది. సమీప కాలంలో వినియోగంపై ఒత్తిళ్లు నెలకొన్నప్పటికీ, ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగి రావడం, వినియోగదారుల్లో విశ్వాసం పెరగడం, ప్రభుత్వ వినియోగం పెరగడం అనే సానుకూల సంకేతాలు కనిపిస్తున్నట్టు ఎఫ్ఎంసీజీ కంపెనీలు చెబుతున్నాయి. అధిక శాతం కమోడిటీల ధరలు గరిష్ట స్థాయి నుంచి దిగి రావడంతో, స్థూల మార్జిన్లను మెరుగుపడతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఒక అంకె వృద్ధి.. డాబర్ దేశీయ, అంతర్జాతీయ వ్యాపారం 5–6 శాతం స్థాయిలో వృద్ధి ఉంటుందని అంచనా వేస్తోంది. దేశీ మార్కెట్లో వినియోగ డిమాండ్ ధోరణలు మార్చి త్రైమాసికంలో నిలకడగా ఉన్నాయని, ఎఫ్ఎంసీజీ రంగం నిలకడైన వృద్ధిని చూస్తుందని సీజీపీఎల్ చెబుతోంది. మొత్తం మీద వృద్ధి అనేది అన్ని విభాగాల్లోనూ ఉంటుందని, హోమ్‌కేర్, పర్సనల్ కేర్ ఉత్పత్తుల్లో అమ్మకాలు, ఆదాయం పరంగా రెండంకెల వృద్ధిని చూస్తామని అంచనా వేస్తోంది. భారత్ తర్వాత గోద్రేజ్ కన్జ్యూమర్‌కు ఇండోనేషియా రెండో అతిపెద్ద మార్కెట్ కాగా, కన్సాలిడేటెడ్ స్థాయిలో రెండంకెల వృద్ధిపై కంపెనీ అంచనాలతో ఉంది. ‘‘మా ఉత్పత్తుల నాణ్యతలో పురోగతి ఉంది. మార్కెటింగ్‌పై అదే పనిగా పెట్టుబడులు పెడుతుండడం వల్ల, స్థూల మార్జిన్లు కోలుకుంటాయి. దీంత ఎబిట్డాలో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాం’’అని జీసీపీఎల్ తెలిపింది. వర్షాల సీజన్ సానుకూలంగా ఉండడం రానున్న త్రైమాసికాల్లో వృద్ధికి కీలకమని పరిశ్రమ భావిస్తోంది. ‘‘బ్రాండ్లు, ఆవిష్కరణలపై బలంగా పెట్టుబడులు పెడుతున్నాం. పంపిణీని విస్తరిస్తున్నాం. తద్వారా మా మార్కెట్ వాటాను పెంచుకోవడంతోపాటు, స్థిరమైన వృద్ధిని నమోదు చేయాలనుకుంటున్నాం’’అని డాబర్ తెలిపింది. దేశీయ డిమాండ్ పరిస్థితులు సానుకూలంగా కనిపిస్తున్నట్టు బ్రోకరేజీ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ సైతం చెబుతోంది. కాకపోతే వర్షాలు, వాతావరణ మార్పులు గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ వినియోగాన్ని ఆలస్యం చేయవచ్చన్న అభిప్రాయంతో ఉంది. -
బాలికల నెత్తిన బరువు
‘నో వాటర్ ల్యాండ్’ ఇది త్వరలో రాబోతున్న డాక్యుమెంటరీ. మహారాష్ట్రలో నీళ్లు లేని ప్రాంతాలలో బాలికల జీవితం నీళ్లు మోయడంలోనే ఎలా గడిచిపోతున్నదో ఈ డాక్యుమెంటరీ తెలియచేయనుంది. యు.కెలోని స్వచ్ఛంద సంస్థ ‘వెల్స్ ఆన్ వీల్స్’ స్థాపకుడు షాజ్ మెమొన్ దీనిని నిర్మిస్తుండగా అవార్డ్ విన్నింగ్ దర్శకుడు సౌమిత్రా సింగ్ దర్శకత్వం వహించాడు. నీళ్లు బాలికల బాల్యాన్ని మన దేశంలోని చాలా చోట్లఎలా ధ్వంసం చేస్తున్నాయో ఈ డాక్యుమెంటరీ కళ్లకు కట్టనుంది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో దందిచి బరి అనే చిన్న గ్రామం ఉంది. దానికి ‘భార్యలు పారిపోయే ఊరు’ అనే పేరు ఉంది. ఆ ఊరికి కోడళ్లుగా వచ్చిన వారు రెండో రోజున, మూడో రోజున పుట్టింటికి పారిపోతారు. దానికి కారణం ఆ ఊళ్లో నీళ్లు ఉండవు. దూరం వెళ్లి తేవాలి. మిట్టలు పల్లాలు ఎక్కి దిగాలి. గంటల తరబడి నీరు ఊరే వరకు ఆగాలి. ఆ తర్వాత మోయాలి. ఇవన్నీ చేయడం కంటే భర్త లేకుండా బతకడం మేలు అని ఆ ఊరి భార్యలు పారిపోతుంటారు. ఇప్పుడైతే ఆ ఊరికి పిల్లనిచ్చేవారు లేరు. నాసిక్ జిల్లాలో నీటి సమస్య అంత తీవ్రం దీని పొరుగునే ఉన్న మరో జిల్లా థానేలో దింగన్‌మల్ అనే గ్రామం ఉంది. దీనికి ‘బహు భార్యల ఊరు’ అనే పేరు ఉంది. ఎందుకంటే అక్కడ ఒక్క మగాడు ఇద్దరు లేక ముగ్గురిని వివాహం చేసుకుంటాడు. ఒకరు వంట చేసేందుకు, ఒకరు నీళ్లు మోసేందుకు. ఎందుకంటే ఆ ఊరి నుంచి నీరు తెచ్చుకోవడానికి రోజులో ఆరు గంటలు వెచ్చించాలి. అంతసేపు నీళ్లకే పోతే వంటా గింటా జరిగే చాన్సు లేదు. అందుకని ‘నీటి భార్యలు’ ఇక్కడ ప్రతి ఇంటా ఉంటారు. పెద్ద భార్యే వెతికి ‘నీటి భార్య’ను తెస్తుంది. భర్త తనకు పోషించే శక్తి లేకపోయినా ఇద్దరిని కట్టుకోవాల్సిందే. లేకుంటే బతకడం కష్టం. పెద్దలకే ఇన్ని కష్టాలు ఉంటే మరి ఆడపిల్లల పరిస్థితి ఏమిటి? మహారాష్ట్రలో నీటి కరువు ఉన్న అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య బాధిస్తున్నది బాలికలనే. భర్త సంపాదించడానికి వెళ్లాలి కాబట్టి కొడుకులు బాగా చదువుకోవాలి కాబట్టి నీటి బాధ్యత వారికి ఉండవు. తల్లి కాని కుమార్తెగాని నీరు మోయాలి. ‘బడికి వెళ్లి చదువుకోవాలనే మా కలలు కల్లలే అవుతున్నాయి’ అని అక్కడి ఆడపిల్లలు అంటారు. స్కూళ్లలో పేర్లు నమోదు చేసుకున్నా వీరు రోజూ స్కూలుకి వెళ్లడం సాధ్యం కాదు. అరగంట దూరంలో ఉండే బావి నుంచి ఒక బిందెను మోసుకు వస్తారు. అలా నాలుగు బిందెలు తేవాలంటే రెండు గంటల సమయం గడిచిపోతుంది. ఆరు బిందెలకు మూడు గంటలు. నిత్య నరకం 7 సంవత్సరాల బాలికల నుంచి 18 సంవత్సరాల యువతుల వరకు ఈ నీటి మోతకు బానిసలుగా మార్చబడతారు. తల్లిదండ్రులకు వేరే మార్గం కూడా ఉండదు. ముఖ్యంగా వేసవిలో బాలికల కష్టాలు చెప్పనలవి కావు. ‘తల మీద మోయడం వల్ల తల దిమ్ముగా ఉంటుంది. భుజాలు నొప్పి పెడతాయి. ఛాతీలో బరువు. కాళ్లు లాగుతాయి’ అని ఇక్కడి ఆడపిల్లలు చెబుతారు. వేసవిలో ఈ ప్రాంతంలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ‘ఆ ఎండలో వెళ్లి నీళ్లు తేవాలంటే చాలాసార్లు ఆడపిల్లలు స్పృహ తప్పి పడిపోతుంటారు. హాస్పిటల్లో చేరిస్తే అదో ఖర్చు’ అని తల్లిదండ్రులు వాపోతుంటారు. ఏ సంవత్సరం తీసుకున్నా కనీసం 2000 మంది ఆడపిల్లలు మహారాష్ట్రలో నీళ్లు లేని జిల్లాల్లో స్కూళ్లకు నాగా పెడుతుంటారు. వీరి చదువు ఇలా ఒడిదుడుకుల్లో పడటం వీరి భవిష్యత్తుగా పెద్ద విఘాతంగా మారుతోంది. డాక్యుమెంటరీ అయితే తను ఒక్కడే ఈ పని చేస్తే నీటి సమస్య తీరదు. దేశంలో ఎక్కడెక్కడ నీళ్ల వల్ల ఆడపిల్లలు చదువుకు దూరం అవుతున్నారో ఆ ప్రాంతాలన్నిటినీ గుర్తించి తరుణోపాయాలు ఆలోచించాలని పిలుపునిస్తాడు షాజ్. అందుకే ‘నో వాటర్ ల్యాండ్’ అనే డాక్యుమెంటరీ నిర్మించాడు. దీనికి గతంలో నసీరుద్దీన్ షాతో షార్ట్ ఫిల్మ్ తీసి అవార్డు పొందిన సౌమిత్రా సింగ్ దర్శకత్వం వహించాడు. త్వరలో ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. l వెల్స్ ఆన్ వీల్స్ యు.కెలో డెంటల్ రంగంలో పని చేస్తున్న వ్యాపారవేత్త షాజ్ మెమెన్ మహారాష్ట్రలో బాలికల నీటి కష్టాలను తగ్గించి వారిని చదువుకు దగ్గర చేర్చాలని నిశ్చయించుకున్నాను. ‘నాకు కూతురు పుట్టాక హటాత్తుగా నాకు ఈ విషయం గుర్తుకు వచ్చింది. నా కూతురు ఉదయాన్నే లేచి నీళ్లకోసం కష్టపడాల్సిన పని లేదు. నేరుగా స్కూల్‌కి వెళ్లిపోయేంత నీటి సౌకర్యం ఇక్కడ ఉంది. కాని భారత్‌లో అలా కాదు. ఆడపిల్లలు నీటి బరువు కింద నలిగిపోతున్నాడు. వారి కోసం ‘వెల్స్ ఆన్ వీల్స్’ అనే సంస్థను స్థాపించాను’ అంటాడు షాజ్ మెమెన్. ఇతను నేల మీద దొర్లించుకుంటూ (లాక్కుంటూ) వచ్చే నీళ్ల డ్రమ్ముల సరఫరా మహారాష్ట్రలో మొదలెట్టాడు. ఒక్కో డ్రమ్ములో 45 లీటర్ల నీళ్లు పడతాయి. హై క్వాలిటీ ప్లాస్టిక్ డ్రమ్ములు కనుక (అవి 7000 కిలోమీటర్ల దూరం లాగినా పాడు కావు) వీటిని సులువుగా లాక్కుంటూ రావచ్చు. మూడు బిందెల నీళ్లు ఈ ఒక్క డ్రమ్ములో పడతాయి కనుక మూడు ట్రిప్పుల కాలం మిగిలి ఆడపిల్లలు ఇప్పుడు స్కూళ్లకు వెళుతున్నారు. నాసిక్‌లోని ఐదు ఊళ్లలో వెల్స్ ఆన్ వీల్స్ పేరుతో నీళ్ల డ్రమ్ముల సరఫరా జరిగింది. -
పల్లె వెలుగులు .. పట్నం బాట
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు పల్లెవెలుగులుగా గ్రామీణ ప్రాంతాలకు తిరిగిన బస్సులు కొన్ని సిటీ సర్వీసులుగా మారనున్నాయి. ఈ మేరకు పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం చాలా ఊళ్లకు పల్లెవెలుగు బస్సులు తిరగటం లేదు. తక్కువ ఆక్యుపెన్సీ రేషియో ఉండటం, రోడ్లు బాగాలేకపోవటం తదితర కారణాలతో కొన్ని ఊళ్లకు బస్సులను ఆపేసిన విషయం తెలిసిందే. మరోవైపు అద్దె బస్సుల సంఖ్య కూడా పెరగటంతో కొన్ని పల్లెవెలుగు బస్సులు వృథాగా ఉన్నాయి. అయితే వాటిని సిటీ బస్సులుగా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో మియాపూర్‌లోని బస్‌బాడీ వర్క్‌షాపులో పల్లెవెలుగు బస్సులను సిటీ బస్సులుగా మారుస్తున్నారు. ప్రస్తుతానికి దాదాపు 350 బస్సులను ఈ విధంగా సిద్ధం చేస్తున్నారు. నగరంలో కొరత రానుండటంతో.. హైదరాబాద్‌లో తిరుగుతున్న సిటీబస్సుల్లో చాలావరకు పాతబడిపోయాయి. మరోవైపు ఇప్పట్లో కొత్త బస్సులు కొనే వీలు లేకుండా పోయింది. ఉన్న బస్సులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్క్రాప్ (తుక్కు)పాలసీ ప్రకారం 15 ఏళ్లు పూర్తయిన బస్సుల్ని తిప్పేందుకు వీలులేదు. ఈ కారణంగా వచ్చే మార్చి నాటికి నగరంలో దాదాపు 600 బస్సులను తొలగించాల్సి ఉంది. మరోవైపు రెండేళ్ల క్రితం సమ్మె జరిగిన సమయంలో ప్రభుత్వ ఆదేశం మేరకు దాదాపు 800 బస్సులను తగ్గించారు. వాటిల్లో ఎక్కువ శాతం బస్సులను ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన సరుకు రవాణా (కార్గో) బస్సులుగా మార్చేశారు. ఇలా కొన్ని కార్గో సర్వీసులుగా మారిపోవడం, 600 బస్సుల గడువు తీరిపోనుండటంతో నగరంలో బస్సులకు తీవ్రమైన కొరత ఏర్పడనుంది. దీంతో పల్లెవెలుగు బస్సులను సిటీ సర్వీసులుగా మార్చి నగర ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. అద్దెబస్సుల రాకతో మిగులు సమ్మె సమయంలో ఆర్టీసీ కొత్తగా 1,300 అద్దె బస్సులను తీసుకుంది. వీటిల్లో ఎక్కువ బస్సులను పల్లెవెలుగు సర్వీసులుగానే చేర్చుకుంది. దీంతో చాలా డిపోల్లో సొంత పల్లెవెలుగు బస్సులు మిగిలిపోయాయి. వాటిని అప్పట్లో కార్గోకు బదిలీ చేయాలని భావించారు. కానీ కార్గో విభాగం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటంతో అన్ని బస్సులు ఇవ్వాల్సిన అవసరం లేదని తర్వాత తేల్చారు. దీంతో మిగిలిపోయిన బస్సులన్నీ డిపోల్లో వృథాగా ఉన్నాయి. అలాగే వేరే ఇతర కారణాలతో నిలిపివేసిన బస్సులు కూడా ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని ఎంపిక చేసి సిటీ బస్సులుగా మారుస్తున్నారు. సీట్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయటంతో పాటు, నిర్మాణంలో తేడా ఉన్న వాటిని పూర్తిస్థాయిలో సరిచేసి రంగులేసి కొత్త బస్సుల తరహాలో సిద్ధం చేస్తున్నారు. పూర్తయిన వాటిని డిపోలకు అప్పగిస్తున్నారు. -
గ్రామీణ ఆవిష్కరణలకు ఊతం
సాక్షి, హైదరాబాద్: పౌర సేవలు, ప్రభుత్వ పాలనలో ఆధునిక ఐటీ సాంకేతిక ఆవిష్కరణలను వినియోగించడానికి ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ఆవిష్కరణలకు కూడా ఊత మివ్వాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఆవిష్కరణల వాతావరణం పెంపొందించేందుకు ప్రభుత్వ పరంగా ఇప్పటికే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ), రీసెర్చ్, ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్), టీ వర్క్స్, టాస్క్, టీ హబ్, వీ హబ్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. క్షేత్రస్థాయి నుంచి ఆవిష్కరణల వాతావరణం సృష్టించేందుకు రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే పాఠశాల విద్యాశాఖతో కలసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆవిష్కరణలు, స్టార్టప్ సంబంధిత అంశాల్లో కృషి చేసే విద్యార్థుల కోసం కోర్సు క్రెడిట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ విద్యార్థుల్లో ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖతో కలసి టీఎస్ఐసీ తెలంగాణ ఇన్నోవేషన్ చాలెంజ్ పేరిట తాజాగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహి స్తోంది. యూనిసెఫ్, ఇంక్విలాబ్ ఫౌండేషన్ సహకారంతో 6 రోజుల పాటు జరిగే శిక్షణలో రాష్ట్రవ్యాప్తంగా 5,093 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొంటు న్నారు. తమ చుట్టూ ఉన్న సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలు కనుగొనేలా విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని టీఎస్ఐసీ వర్గాలు వెల్లడించాయి. ఇంటింటా ఇన్నోవేటర్‌తో ప్రోత్సాహం గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జిల్లాల వారీగా ఉత్తమ ఆవిష్కరణలను టీఎస్ఐసీ గుర్తిస్తోంది. ఈ ఆవిష్కరణలకు వాణిజ్య రూపాన్ని ఇచ్చేందుకు అవసరమైన సహకారాన్ని టీఎస్ఐసీ అందజేస్తుంది. ఇదిలాఉంటే ద్వితీయ శ్రేణి పట్టణాల్లో టీ హబ్ ద్వారా స్టార్టప్‌లకు ప్రోత్సాహం, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వీ హబ్ ద్వారా శిక్షణ ఇవ్వడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
పంచభూతాధికారి వాయువు
ఏ తాతగారింటికో వెళితే గ్రామీణప్రాంతంలో ఉన్న ఆ దిగుడు బావి పైకి మాత్రం ‘చక్కగా దిగెయ్యచ్చు’ అనిపించేలా కనిపిస్తుంది. అలాగే ఏ శ్రీశైలమో వెళ్తే అక్కడున్న పాతాళగంగని చూస్తే.. ‘ఇన్నేగా మెట్లు! దిగెయ్యచ్చు’ అనిపిస్తుంది. అక్కడ దిగుడుబావిలోకి దిగుతూ ఉంటేనూ, ఇక్కడి పాతాళగంగలో మెట్లని దిగుతూ ఉంటేనూ ఒక పక్క సంతోషం.. మరో పక్క ఎవరూ చేయలేని పనిని చేయగలుగుతున్నాననే అనిర్వచనీయ ఆనందం.. అనుభవపూర్వకంగా కలుగుతుంది. ఎందుకీ మాట చెప్పాల్సి వస్తోందంటే.. దిగుడుబావిలోకి దిగుతుంటే భలే సంతోషంగా ఉంటుంది. అలాగే పాతాళగంగ మెట్లను దిగుతూ గంగని సమీపించి స్నానం చేస్తే అద్భుతంగా ఉంటుందని కేవలం చెప్పడం వేరు. అదే మరి అనుభవంలో దానిని గమనిస్తే కలిగే అహ్లాదం వేరు అని చెప్పడానికే. సాయి గురించిన ఎన్నో కథలనీ.. లీలలనీ.. సంఘటనలనీ.. వినెయ్యడం, వినిపించడం, చదివేయడం, చదివించెయ్యడం కాదు చేయాల్సింది. దానిలోనికి వెళ్లి పరిశీలించగలగాలి సాయి అనుగ్రహ దృష్టిని. అప్పుడు సాయి చరిత్ర అర్థమవుతుంది మరింత హృదయ స్పర్శతో.లేని పక్షంలో ‘సాయి ఒకరికి ప్రాణాలు పోతుంటే బతికించాడు. మరొకరికి జ్వరాన్ని తగ్గించాడు. ఇంకొకరికి ప్రమాదం జరగకుండా రక్షించాడు, మరొకరికి జరిగిందాన్ని చెప్పాడు...’ అని ఈ తీరుగా అర్థమవుతూ సాయిచరిత్రలో సాయి, ఒక కథానాయకునిలాగానూ, ఆయన అన్నింటా విజయాలనే సాధించినవానిగానూ కనిపిస్తూ సాయి స్వరూపం సాయితత్త్వం తేలిపోతూ కనిపిస్తుంది. అది సరికాదు. ఈ నేపథ్యంలో సాయి.. పంచభూతాల మీదా ఆధిపత్యాన్ని కలిగిన సిద్ధునిగా అర్థం చేసుకుంటూ పృథ్వి–అప్–తేజస్సులని గురించి వివరించుకున్నాక వాయువు మీద ఎలా ఆధిపత్యాన్ని సాధించగలిగాడో, సాధించాడో ఇప్పటివరకూ ఎలా ఉదాహరణ పూర్వకమైన సంఘటనలతో తెలుసుకున్నామో అలాగే తెలుసుకుందాం! బ్రహ్మాండ /పిండాండాలు వాయువు అనగానే వీచే గాలే కదా! అనేసుకుంటారు. అది కాదు దానర్థం. వాయువు రెండు తీరుల్లో ఉంటుంది. పృథ్వి, అప్, తేజస్, వాయు, ఆకాశాలనే పంచభూతాల్లోనూ కనిపించే వాయువూ, అలాగే శరీరంలో ఉండే పృథ్వి, అప్, తేజస్, వాయు, ఆకాశాలనే పంచభూతాల్లో ఉండే వాయువూ అని రెండు తీర్లుగా ఉంటుంది. ప్రపంచంలో ఉండే వాయువు పేరు బ్రహ్మాండ వాయువు. శరీరం అంటే పిండాండం. ఈ శరీరంలో కనిపించే వాయువు పిండాండ వాయువు.పంచభూతాలనేవి బ్రహ్మాండంలోనూ పిండాండంలోనూ కూడా ఉన్నాయి. అందుకే బ్రహ్మాండాన్ని ప్ర–పంచ–ము అన్నారు. శరీరాన్ని ‘పాంచభౌతిక దేహము’ అన్నారు.బ్రహ్మాండంలో ఆ పిండాండంలో అంటే రెంటిలోనూ పంచభూతాలున్నాయి. వాటి ఉనికిని బట్టే ప్రపంచం పుట్టిందనే అర్థంలో ‘బ్రహ్మ+అండము’ అనీ శరీరం పుట్టిందనే అర్థంలో ‘పిండ+అండము’ అనీ పేరుని పెట్టారు ఋషులు.బ్రహ్మాండంలో కనిపించే పృథ్వి అంటే ఎక్కడెక్కడా ఉండే నేల. పిండాండంలో కనిపించే పృథ్వి మాంసమూ మజ్జా (ఎముకలోపల ఉండే మెత్తని పదార్థం– రక్తాన్ని ఉత్పత్తి చేసే పదార్థం) అనేవి. బ్రహ్మాండంలో కనిపించే అప్(జలం) అంటే నదులూ నదాలూ (పశ్చిమాన పుట్టి తూర్పు సముద్రంలో కలిసేవి) సముద్రాలూనూ. పిండాండంలో కనిపించే ‘అప్’(జలం) శరీరంలో ఉండే తడితనం. ఈ తడితనం ఉన్న కారణంగానే చర్మాన్ని కొద్దిగా పైకి లాగి విడవగానే మళ్లీ మామూలుగా అయిపోతోంది. అదే మరి తడితనం లేకపోతే ఆ లాగబడిన చర్మం అలాగే ఉండిపోతుంది. వేసవిలో కొందరికి వచ్చే వ్యాధి అదే. ఇక కంటిలో.. నోటిలో.. ఇలా అన్ని అవయవాల్లోనూ ఉండే తడితనమే పిండాండంలోని అప్(జలం). బ్రహ్మాండంలోని తేజస్సు– సూర్యుడు. పిండాండంలోని తేజస్సు– చల్లటి పదార్థాలని తిన్నాతాగినా, వేడిపదార్థాలని తిన్నాతాగినా కూడా ఒకే తీరుగా(98.4ౌ ఫారన్‌హీట్) ఉండే వేడిమితనం. బ్రహ్మాండంలోని వాయువు కనిపించకుండా వీస్తూ ఉండే గాలి. ఈ గాలిలో ఎన్నో భేదాలున్నాయి. అవి మనకి ప్రస్తుతానికి అప్రస్తుతమవుతుంది. ఇక పిండాండంలోని వాయువు ఒక్కటి కాదు. వాయువు 10గా విభజింపబడి కనిపిస్తుంది. ఆ పదింటిలోనూ అతి ముఖ్యమైనవి ఐదు. అవే ప్రాణ–అపాన–వ్యాన–ఉదాన–సమానమనే పేర్లతో ఉండేవి.అలాగే బ్రహ్మాండంలో కనిపించే ఆకాశమనేది ఎంత ఎత్తుకి ఎగిరినా ఉండనే ఉండదు గానీ ఉన్నట్లుగా భ్రాంతిని కలిగిస్తూ ఉంటుంది. (ఆకాశో అవకాశ శ్శూన్యమ్) నిజంగా ఆకాశమనేది లేదు. సముద్రపు ప్రతిబింబం కారణంగా నీలి రంగుతో కనిపిస్తుంది. ఇక పిండాండంలో ఉండే ఆకాశమనేది అనుభవంలో ప్రతి వ్యక్తికీ కనిపిస్తూ నిజానికి ఉండని ‘మనసు’ అనేది.ఈ వివరణనంతా ఎందుకంటే.. సాయి భూతాల్లో ఉన్న వాయువుని తన అధీనంలోనికి తీసుకున్నాడంటే కేవలం బ్రహ్మాండంలోని వాయువునే కాక, ప్రతివ్యక్తి శరీరంలోనూ ఉండే పిండాండపు 5 వాయువులనీ కూడా స్వాధీనపరుచుకున్నాడని చెప్పడానికీ.. ఉదాహరణ పూర్వకంగా వివరించడానికేను. ఆ క్రమంలో ముందు బ్రహ్మాండ వాయువుని ఎలా అదుపు చేశాడో తన అధీనంలోకి తెచ్చుకున్నాడో చూద్దాం! ఆపు నీ తీవ్రత షిర్డీ చాలా చిన్న గ్రామం. దీన్నే నాటివాళ్లు కుగ్రామం అంటూ ఉండేవారు వారి సాధారణ పరిభాషలో. ఏ చిన్న అలజడి వచ్చినా.. ఆనందం వచ్చినా.. కొత్త సంఘటన జరిగినా.. ఊరంతా ఓ కుటుంబంలానే దాదాపుగా ఉండే కారణంగా అందరికీ తెలిసిపోతూ ఉండేది. షిర్డీనే కాదు. ఇప్పటికీ కొన్ని పల్లెల్లో ఆ పద్ధతి ఉండనే ఉంది. సరే!ఓసారి షిర్డీలోని సాయి భక్తులంతా ఎప్పటిలాగానే చక్కని భజనలని చేయాలనే ఆలోచనతో సాయి మందిరానికి అంటే ద్వారకామాయికి బయలుదేరారు. కొందరు ద్వారకామాయికి చేరిపోయారు. కొందరు త్రోవలో ఉన్నారు. మరికొందరు మిగిలిన పూజాసామగ్రిని కొనేందుకు అంగడి దగ్గరా,ఇంకొందరు ఇళ్ల నుండి బయటికి వచ్చి బయలుదేరడానికి సిద్ధంగానూ ఉన్నారు.ఇంతలో మెల్లగా మేఘాలన్నీ ఎక్కడి నుండో తరుముకొచ్చినట్టు రాసాగాయి. చూస్తున్నంతలోనే మరింత నల్లగా మేఘాలన్నీ ఒకచోటికి చేరిపోయాయి. వాయువు వీచడంలో రెండు పద్ధతులుంటాయి. ఒక తీరు వాయువు ఎంతటి బలమైన మేఘాన్నైనా బలంగా వీచి చెదరగొట్టి మేఘాన్ని తునుకలు తునుకలుగా చేసి తరమికొట్టేస్తుంది. ఇంకొక తీరు వాయువు వచ్చిన మేఘాన్ని చెదిరిపోనీకుండా చేస్తూ తనలో ఉన్న చల్లనిదనాన్ని మేఘానికి తగిలేలా చేసి వర్షింపజేస్తుంది.ఇలా సాయి భక్తులంతా తలొకచోటా ఉన్న వేళ ఈ రెండు తీరుల వాయువులూ గట్టిగా వీస్తూ తన లక్షణాలతో మేఘాన్ని ఒకచోటికి చేరేలానూ మెల్లగా చినుకులు ప్రారంభమయ్యేలానూ చేశాయి. ‘పెద్దవర్షమేముండదులే!’ అని అనుకుంటూ భక్తులందరూ భజనమీది అభిలాషతో ద్వారకామాయి వైపే నడవడం మొదలెట్టారు. నిజానికి ద్వారకామాయి పెద్ద దూరంలో లేనే లేదు.ఇంతలో వాయువు మరింత వీచడం మొదలెట్టింది. చినుకులు మరింత వేగంగానూ మీద పడసాగాయి. శరీరాలకి దెబ్బ తగులుతోందా? అన్నంతబలంగా చినుకులు పడుతుంటే సాయి భక్తులంతా ఎవరికీ వీలైన ప్రదేశాల్లో అంటే... కొందరు శనీశ్వరాలయంలో, మరికొందరు శివపార్వతుల ఆలయంలో, ఇంకొందరు మారుతి మందిరంలో ఇంకా కొందరు గ్రామదేవత అయిన ఖండోబా దేవాలయంలో తాత్కాలికంగా తలదాచుకునేందుకు వెళ్లారు.ఇళ్ల నుంచి బయలుదేరి ఇవతలకి వచ్చి వెళ్లబోతున్నవారు ‘అయ్యో! వెళ్లలేమేమో!’ అనుకుంటూ మళ్లీ ఇళ్లలోకే వెళ్లిపోయి వాయువూ వర్షమూ తగ్గాక బయలుదేరవచ్చనుకుంటున్నారు. ఈ దశలో వాయువు, వర్షముతో పాటు కళ్లు బైర్లు కమ్మేంత స్థాయిలో మెరుపులు మెరవసాగాయి. మెరుపులొస్తే మేంమాత్రం రాలేమా అన్నట్లుగా ఉరుములు తీవ్రంగా చెవులు చిల్లులు పడేలా.. గుండెలు బద్దలవుతాయేమో.. అన్నంతగా ధ్వనింపసాగాయి. పిడుగులెక్కడా పడలేదు కానీ, వాయు తీవ్రత, వర్షఆధిక్యం, ఉరుములు, మెరుపులు క్రమక్రమంగా పెరగసాగాయి. ద్వారకామాయిలో ఉన్న వారికి ఖండోబా ఆలయంలో ఎవరు ఉన్నారో.. ఈ ఆలయంలో ఉన్నవారికి ఎవరు ఏ త్రోవలో చిక్కుబడిపోయారో.. ఇళ్లలో ఉన్నవారికి తమ కుటుంబసభ్యులు ఎక్కడెక్కడున్నారో.. తెలియకనే పోయింది. అంత తీవ్రమైన గాలివానని దాదాపు ఆ దశాబ్దంలో ఎవరూ ఎరగమని నలుగురు కూడిన ప్రతిచోటా అనుకోనివారు లేరు. ఎప్పటికి తెరిపి ఇస్తుందో, త్రోవ ఎలా ఉండబోతోందో, ఇళ్లకి ఎలా చేరుకోవాలో అంతా అగమ్యగోచరం కాసాగింది.ఎవరికి వారు తామున్న ఆయా దేవాలయాల్లో వాయుతీవ్రత తగ్గాలనీ, వర్షం ఆగిపోవాలనీ భజనలని చేస్తూ ఉండిపోయారు. నేటికాలంలో లాగా నాడు వీధి దీపాల్లేని కారణంగా షిర్డీ మొత్తం చీకటితో నిండిపోయి అక్కడొక గ్రామం ఉందనే విషయం అర్థం కాకుండా పోయింది. ఏ అడవిలోనో ఉన్న భయం అందరికీ కలిగింది. ఈ దశలో కొందరు చొరవ తీసుకుని మనందరికీ రక్షకుడు,తోడునీడా ఆ సాయి మాత్రమే కదా! దృఢవిశ్వాసంతో అంతటి వర్షంలోనూ సాయి వద్దకి వెళ్లారు అందరి తరపునా ప్రార్థించడానికి.బట్టలు తడిసి వర్షంతో నీరు కారుతూ ఉన్న భక్తులందరూ ఒక్కొక్క మేఘంలా అనిపిస్తున్నారు. అందరూ సాయి పాదాల మీద ఒకరి వెంట ఒకరు చొప్పున పడుతూ.. ‘‘బాబా! పెళ్లాం బిడ్డలు.. గొడ్డు గోద.. పూరిపాకలు, వంటకట్టెలు, కొద్దిపాటి నగానట్రా.. అంతా ఏమైపోతుందోననే భయం ఆవరించేసింది మా అందరినీ. నువ్వే దిక్కు’’ అంటూ దీనాతిదీనంగా ప్రార్థించసాగారు.బాబా ఒక్కసారి అందరినీ అలా వ్యక్తివ్యక్తిని పరిశీలించి చూసి బయటి కొచ్చాడు. చేతిలోని సటకాని తీసుకుని... ‘వాయూ! ఆగు! ఆగు! ఆపు నీ తీవ్రతని! తగ్గించు! మందగించు! నెమ్మదించు!!’ అన్నాడు సార్ద్ర నయనాలతో ఆ భక్తులందరినీ ఓ పక్క చూస్తూ.ఏదో ఓ తండ్రి తన బిడ్డడితో ఓ మాటని అంటే ఆ బిడ్డ తన తండ్రి చెప్పిన మాటని వినినట్లుగా.. ‘వెంటనే వాయువు తన తీవ్రతని తగ్గించడం మొదలైంది. ఆ వెంటనే వర్షం ఆగుతున్నట్టుగా ఆ చూసేవారందరికీ తెలిసింది. దాదాపు 10 నిమిషాల సమయంలో మొత్తం వాయువూ వర్షమూ కూడా ఆగిపోయాయి.భక్తులందరికీ ఆశ్చర్యమయింది. సాయి గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూసి నట్టయింది వాళ్లకి. అందరూ కృతజ్ఞతాపూర్వకంగా సాయికి సాష్టాంగపడి ఆయనని చూసి మళ్లీ వాయువూ వర్షమూ ఉరుములూ మెరుపులూ రానే రావని చెప్పినట్లుగా కనిపిస్తున్న సాయి కళ్లని దర్శించి మెల్లగా ఎవరిళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. ఆశ్చర్యకరమైన అంశమేమంటే సాయి అలా ‘నెమ్మదించు!’ అనగానే ఆకాశం కొద్దిసేపట్లో నిర్మలమయింది. నక్షత్రాలూ చంద్రుడూ కూడా కొద్ది సమయంలోనే కనిపించారు. ఆకాశం ప్రశాంతంగా కనిపించసాగింది. కృతజ్ఞత అందరూ దాదాపుగా ద్వారకామాయిని విడిచి ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. అంతలా పెద్దగా భజన వినవచ్చింది. ‘ఏమిటా?’ అని ఆశ్చర్యపడుతూ చూస్తే సాయి అనుగ్రహం లభించి షిర్డీ వాసులందరికీ క్షేమం కలిగిందనీ, ఆందోళన తొలిగిందనీ హృదయపూర్వకంగా సాయి సమక్షంలో భజనని ప్రారంభించారు.ఎవరైనా గమనించాల్సిన అంశం ఇదే. సాధారణంగా కష్టం ఏదైనా వచ్చినప్పుడూ పరిస్థితి అగమ్యగోచరం అనిపించినప్పుడూ వెంటనే మొక్కుకోవడమనే పనిని చేస్తూ ఉంటాం. పని జరిగిన వెంటనే దర్శనానికి వస్తామనో లేక ఫలానిదాన్ని సమర్పించుకుంటామనో మొక్కేస్తాం. మొక్కుకునేప్పుడు ‘వెంటనే’ అనకుండా ఉండలేం. అనేస్తాం. తీరా పని పూర్తి అయ్యాక ‘ఫలాని పని ఉంది– ఫలానిది అడ్డొచ్చింది’ అంటూ మొక్కు తీర్చడాన్ని వాయిదా వేస్తూ వెడతాం. ప్రతి వాయిదాకీ ఓ గట్టి కారణాన్ని చెప్తాం. చూపిస్తాం. మరి అదే వాయిదాని దేవుడు కూడా వేయదలిచి – నీ పనిని ఫలాని రోజు వరకు తీర్చడం కుదరదంటున్నాడా? వెంటనే తీర్చేస్తున్నాడు కదా! ఆ కోరిన కోరికగాని సమంజసమైనదయ్యుంటే!మనకి సత్యనారాయణ వ్రతకథలో ఆ వైశ్యుని కథ మొక్కుని వాయిదా వేసే విధానంతో సాగలేదూ? ఎప్పుడైతే ఆ వైశ్యుడు మొక్కుకుని తీరా పని పూర్తయ్యాక తీర్చలేదో, తీర్చడం కాదు సరికదా అప్పుడు తీరుస్తా– ఇప్పుడు తీరుస్తానంటూ వాయిదా వేస్తూ ఉండేసరికి భగవంతుడు తనని శక్తిహీనునిగానూ అసమర్థునిగానూ లెక్కిస్తున్నాడనే నెపంతో ఓ పరీక్షని పెట్టి ఆ వైశ్యకుటుంబం వంకతో మన కందరికీ మొక్కుని ఎలా ఎప్పుడు తీర్చుకోవాలో తెలియజేసాడు.అదే పద్ధతిలో సాయిని శరణుకోరాక వాయుప్రకోపం వర్షం వీటి కారణంగా ఆందోళనా తగ్గేసరికి వెంటనే సాయి దగ్గరుండే భక్తులు దైవానికి కృతజ్ఞతలని ఘటిస్తూ భజన చేయసాగారు.అలాగని ఇళ్లకి వెళ్లిపోయినవారిని కృతఘ్నులుగా లెక్కించకూడదు. వాళ్లంతా గృహిణులైన కారణంగా బాధ్యతనీ కర్తవ్యాన్నీ విస్మరించరానివారు కాబట్టి వెళ్లారని భావించాలి తప్ప, సాయి విషయంలో శ్రద్ధాభక్తులు లేనివారూ లేదా మన పని మనకి ముఖ్యమనుకుంటూ ఇళ్లకి వెళ్లినవారు గానూ భావించకూడదు. భక్తుల ప్రశ్న ఇది సాయి చరిత్రలో కన్పడదు గానీ సాయి గురించి రాయబడిన ఓవీల్లో (మరాఠీ భాషలో ఓ ఛందస్సు శార్దూలం మత్తేభం వంటి పద్యాల్లో కనిపించే విధానం) మాత్రం కనిపిస్తోంది. ఏమని?సాయిభక్తులు కొందరు సాయిని ప్రశ్నిస్తూ... ‘దేవా! వాయువూ వర్షమూ అంత తీవ్ర స్థాయికి చేరేంతవరకూ నువ్వెందుకు ఊరుకున్నావు? పైగా పంచభూతాలనీ నీ అధీనంలో ఉంచుకున్నావు కాబట్టి ఆ వాయువూ వర్షమూ అనేవి ఎందుకని నీకు జడిసి అంతటి తీవ్రస్థితికి రాకుండా ఎందుకుండలేదు?’ అని.సాయి నిదానంగా సమాధానమిచ్చాడు. ప్రపంచమంటే మనం మాత్రమే కాదు. మనకి ధాన్యాన్నిచ్చే రైతూ, మనకి ధాన్యం లభించేందుకు కావల్సిన భూమి, మన పొలాన్ని దున్నే ఎద్దూ, ఆ ఎద్దుకి తల్లి అయిన ఆవూ, ఇంతేకాక ఏదో ఓ విధంగా మనకి సహాయపడే 84 లక్షల జీవరాసులు ఏం ఉన్నాయో వాటికి వర్షం అవసరమయ్యుండిఉంటుంది. అంత శాతం వర్షం వారి కానందం కాబట్టి వర్షించాడు దైవం. ఆయన సర్వసముడు. వాళ్లకి ఈ వర్షం ఎంతో ఆనందాన్ని కల్గించి ఉండి ఉంటుంది. మనకది అసౌకర్యం అనిపించవచ్చు.ఎక్కువ మందికి ప్రయోజనకరమనిపించే దేన్నైనా దైవం చేస్తాడు. ఆ సందర్భంలో కొందరికి తాత్కాలిక బాధ తప్పదు మరి’ అని. ఎంతగొప్ప తాత్త్విక దృష్టి సాయిది!పంచభూతాల్లో వాయువు మీద అధికారాన్ని బ్రహ్మాండపరంగా చూపిన సాయి, పంచభూతాల్లో వాయువు మీద అధికారాన్ని పిండాండపరంగా ఎలా చూపించాడో తెలుసుకుందాం! అంటే వ్యక్తుల ప్రాణవాయువుల్ని ఎలా పోబోతుంటే ఆధిపత్యాన్ని చూపించి ప్రాణాలు నిలిచేలా చేసాడో గమనిద్దాం! సశేషం! -
నెక్కొండలోని తండాకి తప్పని తంటాలు..
సాక్షి, చెన్నారావుపేట: హైటెక్ యుగంలా రోజు రోజుకూ పల్లెటూళ్లు సైతం పట్టణాల వసతులతో అభివృద్ధి చెందుతున్నాయి. కానీ నెక్కొండకు కూత వేటు దూరంలో ఉన్న ఆ తండా మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఎన్నికల వేళ అభివృద్ధి చేస్తామని వచ్చిన ప్రజాప్రతినిధులు ఎన్నికల అనంతరం అటు వైపుగా కూడా చూడకపోవడంతో ఆ తండా అభివృద్ధికి నోచుకోలేదు. ఆస్పత్రికి వెళ్లాలన్నా, విద్యార్థులు చదువుకు పోవాలన్నా.. ఎరువులు, పురుగుల మందలు, కిరాణం సమాను తెచ్చుకోవాలన్నా వారి కష్టాలు అంతా ఇంతా కాదు. మా ఓట్లు వారికి కావాలే కానీ మా బాగోగులు వారికి పట్టడం లేదని తండా ప్రజలు ఆరోపిస్తున్నారు. వివరాలు.. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని సూరుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మంగల్ తండాలో 52 ఇండ్లు ఉన్నాయి. సుమారుగా 200 పైగా జనాభా ఉంది. మహిళా ఓటర్లు 43 మంది, పురుషులు 36 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఐదు సంవత్సరాల కొకసారి ఎన్నికల సమయంలో నాయకులు వచ్చి ఓట్లు వేస్తే తండాలో మౌళిక వసతులు కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. ఓట్లు వేసుకున్నాక మళ్లీ కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరపల్లికి వెళ్లి రేషన్, తెచ్చుకోవాలన్న, గ్రామ పంచాయతీ పనుల కోసం వెళ్లాలన్నా ట్యూబ్‌ల సహాయంతో వాగు దాటుతున్నామని చెప్పారు. వ్యవసాయ పనులకు వెళ్లాలన్న వాగు దాటాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు లేవు.. సోలర్ వాటర్ ట్యాంకు కొన్ని పనిచేసి మరమ్మతులకు గురైంది. దానిని బాగు చేసే వారు లేరు. 30 కి.మీ తిరిగి రావాల్సిందే.. పిల్లలతో వాగు దాటలేని పరిస్థితి.. వాగు ఉధృతిగా ఉన్నప్పుడు రేషన్ సరుకులు, ఇతర పనులకు కోసం నెక్కొండ మీదుగా 30 కిలోమీటర్లు తిరిగి సూరుపల్లికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోడ్డు కూడా గుంతలతో ప్రమాదకరంగా ఉంది. బైక్, సైకిళ్లు, కాలినడకన మాత్రమే తండాకు పోవా ల్సి ఉంటుంది. నాలుగు చక్రాల వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. చదువుకోవడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యాలకు గురైనప్పుడు పరిస్థితి కష్టతరంగా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఏది ఏమైన నెక్కొండ పట్టణానికి ఆమడ దూరంలో ఉండి కూ డా అభివృద్ధి చెందలేదంటే ప్రజాప్రతినిధులు, అ ధికారుల పనితీరు ఎలా ఉందో అర్ధం అవుతుంది. ఒకే తండా రెండు గ్రామ పంచాయతీలు.. తండాలో 52 ఇండ్లు ఉన్నాయి. అందులో రోడ్డుకు ఓ వైపు సుమారుగా 40 వరకు ఇండ్లు సూరుపల్లి గ్రామ పంచాయతీలో ఉంటే మరో వైపు 12 ఇండ్లు మడిపల్లి గ్రామ పంచాయతీకి వెళ్లింది. ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి నెలకొంది. రోడ్డు బాగాలేదు.. కంట్రోల్ బియ్యం తెచ్చుకోవాలంటే సూరుపల్లికి పోవాలి. ఓటు వేయాలన్నా సూరుపల్లికి పోవాలి. జ్వరం వస్తే నెక్కొం డకు పోవాలి. కానీ రోడ్డు బాగాలేదు. ఆటోలు రావు. ఎవరికైనా బండి ఉంటే తీసుకెళ్తారు.. లేదంటే నడిచి వెళ్తాం. ఇప్పటికైనా పట్టించుకోని మాకు రోడ్డు వేయాలి.– బానోతు లక్ష్మీ, మంగల్ తండా వాసి వాగుపై వంతెన కట్టాలి.. మాకు సూరుపల్లి గ్రామ పంచాయతీ ఉంది. అక్కడికి పోవాలంటే వాగును ట్యూబ్‌లతో దాటుతున్నాం. ఇబ్బందిగా ఉంది. తండాలో కొన్ని ఇండ్లు మడిపెల్లిలో కలిపారు. అన్ని మడిపెల్లిలో కలపాలి. లేదంటే వాగుపై వంతెన నిర్మించాలి. తండాలో అన్నీ ఇబ్బందులే. ఎవరూ పట్టించుకోరు. ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారో వారికే ఓటు వేస్తాం. – గుగులోతు కున్నా, తండా వాసి -
జిల్లాలో ‘మావో’ల కదలికల కలకలం
సాక్షి, భూపాలపల్లి: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లాలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. మొన్నటి వరకు కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, నకిలీ మందుపాతరలు అలజడి సృష్టించాయి. తాజాగా అధికార పార్టీ నాయకులే లక్ష్యంగా యాక్షన్ టీం జిల్లాలో ప్రవేశించిందన్న సమాచారంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. టీంలోని సభ్యులకు సంబంధించిన ఫొటోలతో పోస్టర్లు ముద్రించి ఊరూరా అతికిస్తున్నారు. ప్రత్యేక బలగాలతో సోదాలు, కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అడవులను జల్లెడ పడుతున్నారు. పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. జిల్లాలో మావోయిస్టు కొరియర్లు.. సానుభూతిపరుల కదలికలు ఎక్కువయ్యాయి. వాజేడు, వెంకటాపురం, పలిమెల, మహదేవపూర్, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాలు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉండడంతో మావోలు తెలంగాణ ప్రాంతంలోకి రాకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరంతరం నిఘా ఉండేలా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన, వాజేడు, ఏటూరునాగారం మధ్య ఉన్న ముల్లకట్ట వంతెన వద్ద, వెంకటాపూర్, మంగపేట మండలాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా తాడ్వాయి, పస్రా అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల యాక్షన్ టీం కదలికలు ఉన్నాయని తెలియడంతో పోలీసు బలగాలతో అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల బాంబు స్క్వాడ్ ఏటూరునాగారం నుంచి మంగపేట వెళ్లే రహదారిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో భద్రతా చర్యలు చేపట్టడానికి ఎనిమిది కంపెనీల ప్రత్యేక బలగాలు జిల్లాకు చేరుకున్నాయి. సరిహద్దు జిల్లాలపై నజర్? ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్, బీజాపూర్, దంతెవాడ, సుకుమా, కాంకేర్, నారాయణపూర్ జిల్లాలోని 18 నియోజకవర్గాలకు మొదటి విడత ఎన్నికలు ఈనెల 12న ముగిశాయి. ఈ ప్రాంతాలన్నీ నక్సల్స్ ప్రాబల్యం ఉన్నవే కావడంతో అడపాదడపా ఘటనలు మినహా అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే తెలంగాణలో ఎన్నికలకు కొంత సమయం ఉండడంతో ఉనికిని చాటుకోవడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రాణహిత, గోదావరి సరిహద్దున మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాలు ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాకు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, మహారాష్ట్రలోని గడ్చిరోలితో సరిహద్దు ఉంది. కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాచలం జిల్లాలకు మావోల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తయ్యారు. జిల్లా పరిధిలోని నియోజకవర్గాల అన్నింటిలో పొలింగ్ ను సాయంత్రం నాలుగు గంటల వరకే నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పొరుగు జిల్లాల అధికారులతో సమన్వయం జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులు సరిహద్దు జిల్లాల అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన భద్రత చర్యలు చేపడుతున్నారు. మావోల వ్యూహాలను ముందుగానే పసిగట్టి ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఎటువంటి ఘటనలకు తావివ్వకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఊరూరా.. యాక్షన్ టీం పోస్టర్లు ఏటూరునాగారం: కొరియర్ల సహాయంతో మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల వివరాలు తెలుసుకున్న పోలీసులు వారికి సంబంధించిన పోస్టర్లను ముద్రించి విడుదల చేశారు. వారి ఆచూకీ చెప్పిన వారికి రూ.5 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటిస్తూ ఏజెన్సీలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో పోలీసులు పోస్టర్లను అంటించారు. అందులోని వ్యక్తులకు సహకరించినా.. ఆశ్రయం కల్పించినా చట్టరీత్యా నేరమని, ఆయా వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ, సీఐ, ఎస్సైల ఫోన్ నంబర్లను వాటిలో ప్రచురించారు. చాలా రోజుల తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల ఫొటోలతో కూడిన పోస్టుర్లు అంటించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎం జరుగుతుందోనని వణికిపోతున్నారు. -
బుక్కాపురంలో మహిళా బ్యాంక్
వెల్దుర్తి రూరల్ : మండల పరిధిలోని బుక్కాపురంలో గురువారం మహిళా బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్) గౌరవ సలహాదారురాలు విజయభారతి, గ్రామాన్ని దత్తత తీసుకున్న ఢిల్లీ ఇంటర్ గ్లోబ్ ఫౌండేషన్ నిర్వాహకులు రోహిణీ, నీలాంజన్లు పొదుపు మహిళలకు ప్రత్యేక కార్యాలయం, అందులో కుట్టుశిక్షణా కేంద్రం, కంప్యూటర్ సెంటర్‌ను ప్రారంభించారు. పొదుపు మహిళల డిపాజిట్లతో(20మంది ఒకొక్కరు రూ.5,200లు) మహిళాబ్యాంకును ఏర్పాటు చేశారు. గ్రామంలో వర్మీ కంపోస్ట్ యూనిట్లను ప్రారంభించారు. అనంతరం గ్రామ సచివాలయ ఆవరణలో స్వయం సహాయక మహిళా సంఘాలతో సమావేశమయ్యారు. ఎంపీడీఓ అబ్దుల్ వహీద్, ఉపాధి ఏపీడీ పద్మావతి, ఏపీఓ లక్ష్మన్న, ఆర్‌డబ్లూ్యఎస్ ఏఈ ప్రవీష, సర్పంచ్ రాజమ్మ పాల్గొన్నారు. -
2020 నాటికి నెట్ విప్లవం!
♦ 73 కోట్లకు చేరనున్న నెటిజన్లు ♦ నెట్ వ్యాప్తితో ఈ కామర్స్ జోరు ♦ ‘నాస్కామ్-అకమయి’ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: నెట్ వినియోగం దేశీయంగా పరుగులు పెడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం నెట్ వినియోగం పెరుగుతుండడంతో 2020 నాటికి నెటిజన్ల సంఖ్య రెట్టింపు కంటే అధికమై 73 కోట్లకు చేరుతుందని నాస్కామ్ అంచనా వేసింది. 2015 చివరి నాటికి దేశంలో నెట్ యూజర్లు 35 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. భారత్‌లో ఇంటర్నెట్ భవితవ్యం పేరుతో నాస్కామ్, అకమయి టెక్నాలజీస్ కలసి ఈ మేరకు ఓ నివేదిక రూపొందించాయి. ఇంటర్నెట్ వినియోగదారుల పరంగా చైనా తర్వాతి స్థానంలో ఉన్న దేశీయ మార్కెట్... వృద్ధి చెందుతుందని నివేదిక స్పష్టం చేసింది. నివేదికలోని అంశాలు ⇔ ఇంటర్నెట్ వ్యాప్తి ఆన్లైన్ షాపింగ్ వృద్ధికి ఇంధనంలా పనిచేస్తుంది. 2015-16 నాటికి దేశీయ ఈ కామర్స్ మార్కెట్ 17 బిలియన్ డాలర్లు ఉండగా... 2020 నాటికి 34 బిలియన్ డాలర్లకు చేరుతుంది. ⇔ 2020 నాటికి స్మార్ట్ఫోన్ల సంఖ్య 70 కోట్లకు విస్తరిస్తుంది. దీంతో ఆన్లైన్ షాపింగ్‌కు స్మార్ట్‌ఫోన్ ప్రాధాన్య వస్తువుగా మారుతుంది. మొత్తం ఆన్లైన్ షాపింగ్‌లో 70 శాతం స్మార్ట్ఫోన్ల వాటానే. వర్క్ వీసాలపై ట్రంప్ వ్యాఖ్యలు సరికాదు... వర్క్ వీసాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు వినిపిస్తున్న వ్యాఖ్యలపై నాస్కామ్ సీరియస్‌గా స్పందించింది. అమెరికా చర్యలు పూర్తి వివక్షాపూరితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భారతీయులు ఎక్కువగా పొందే హెచ్1బీ వీసాలకు కనీస వేతన పరిమితి పెంచాలంటూ తాజాగా చేసి న ప్రతిపాదన నేపథ్యంలో నాస్కామ్ స్పందిస్తూ... ‘‘ప్రతి దాన్నీ వాక్చాతుర్యం కోణంలో కాకుండా ఆచరణాత్మకంగానూ చూడాలి. వీసాల అంశంలో ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. అవి వివక్షాపూరితమే కాదు, ఐటీ రంగానికి నష్టాన్ని కలిగించేవి కూడా. వీటి ఫలితంగా పరిశ్రమకు వ్యయం పెరిగి పోయింది’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ చెప్పారు. కాగా దేశీయ ఐటీ పరిశ్రమ ఎగుమతు లు 2016-17 ఆర్థిక సంవత్సరంలో 10-12% వృద్ధి ఉంటుందన్న అంచనాలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు నాస్కామ్ పేర్కొంది. -
8 శాతం వృద్ధి సాధ్యమే: జైట్లీ
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్, మెరుగైన వర్షపాతం తదితర సానుకూల అంశాలతో వచ్చే ఆర్థిక సంవత్సరం 8 శాతం వృద్ధి సాధించగలమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. కీలక సంస్కరణల అమలును విపక్షాలు అడ్డుకోకూడదని, ఆయా బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందేలా సహకరించాలని ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో సూచించారు. పెరిగిన జీడీపీ... ఇపుడు తగ్గింది!: గణాంకాలు సవరించిన ప్రభుత్వం ప్రభుత్వం శుక్రవారం గత రెండు ఆర్థిక సంవత్సరాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేట్లను స్వల్పంగా తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) వృద్ధి రేటును 7.3 శాతం నుంచి 7.2 శాతానికి కుదించింది. 2013-2014 వృద్ధి రేటును 6.9 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గించింది. వ్యవసాయం, పరిశ్రమల ఉత్పత్తులకు సంబంధించి తాజాగా అందిన సమగ్ర సవరిత సమాచారం ప్రాతిపతికన ఈ రేట్లు కుదిస్తున్నట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) పేర్కొంది. జీడీపీ విలువను 2013-14లో 98.39 లక్షల కోట్లుగా పేర్కొనగా... 2014-15లో ఈ విలువ రూ.105.52 లక్షల కోట్లుగా వివరించింది. -
149 మూతబడులే..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పాఠశాలల హేతుబద్ధీకరణ చేపట్టాలంటే 2013లో బదిలీ పొంది స్థానం మారని వారిని తప్పనిసరిగా వారి ఒరిజినల్ పోస్టుకు పంపాల్సి ఉంది. గత 2013లో బదిలీ అయినప్పటికీ స్థానం మారని వారు దాదాపు 300 మంది టీచర్లు ఉన్నారు. ప్రస్తుతం పాఠశాలల హేతుబద్ధీకరణ, బదిలీలు చేపట్టడంతో వారిని సొంత స్థానాలకు పంపుతామని స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే వారంతా సొంత స్థానాలకు వెళితే 24 మండలాల్లోని 149 పాఠశాలల్లో టీచర్లు ఉండరు. వారి స్థానంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుంటే విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడనుంది. ఆందోళనలో పల్లె బడులు హేతుబద్ధీకరణ ప్రక్రియ పల్లెబడులకు ఆందోళనకరంగా మారింది. విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడంతో ఇక్కడున్న ఉపాధ్యాయ పోస్టులు పట్టణ ప్రాంతాలకు తరలిపోతున్నాయి. దీంతో పల్లెబడుల్లోని పోస్టులు తగ్గుతుండగా.. సింగిల్ టీచర్లున్న పాఠశాలలు సర్కారు నిర్ణయంతో ఏకంగా మూతబడుతున్నాయి. తాజా బదిలీలతో మరికొందరు టీచర్లు పట్టణ ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో టీచర్లులేని పాఠశాలల సంఖ్య గ్రామీణ ప్రాంతంలో భారీగా పెరగనుంది. -
నవోదయ.. ఇదేం మాయో!
మధిర: గ్రామీణప్రాంతంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన అదునాతన విద్యనందించాలనే లక్ష్యంతో జాతీయస్థాయిలో జవహర్ నవోదయ విద్యాలయాలను స్థాపించారు. జిల్లాలో పాలేరు, భద్రాచలంలో ఈ విద్యాలయాలు ఉన్నాయి. పాలేరులో మైదానప్రాంత విద్యార్థులు విద్యనభ్యసిస్తారు. దీనికి 28 మండలాల విద్యార్థులు ప్రవేశపరీక్ష రాస్తారు. ఎంపికైనవారు 6వ తరగతితో ప్రవేశానికి అర్హులవుతారు. భద్రాచలం విద్యాలయంలో ఏజెన్సీప్రాంత విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 5వ తరగతి చదువుకునే విద్యార్థుల్లో అర్హులు ఈ ప్రవేశపరీక్షకు హాజరవుతారు. ఎంపికైన విద్యార్థులు నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతినుంచి ఇంటర్మీడి యెట్ వరకు సెంట్రల్ సిలబస్‌తో ఉచిత విద్యను అభ్యసిస్తారు. ఈ క్రమంలో శనివారం నవోదయ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది జిల్లాలో 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రవేశపరీక్షకు 4,909మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పలు అనుమానాలు ఈ ప్రవేశపరీక్షల్లో కొన్ని సెంటర్ల నుంచి పరీక్షరాసిన విద్యార్థులకు ఎక్కువసీట్లు లభిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సెంటర్లనుంచి పరీక్ష రాసిన విద్యార్థులకు మాత్రమే అధిక సీట్లు సాధించి, మరికొన్ని సెంటర్లలో పరీక్ష రాసిన విద్యార్థులకు ఒక్కసీటుకూడా రాకపోవడంలలో ఆంతర్యమేమిటని పలువవురు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం, కల్లూరు, ఇల్లెందు సెంటర్ల పరిధిలో ప్రవేశపరీక్ష రాసిన విద్యార్థులు ఎక్కువమంది ఎంపిక కావడంతోపాటు వరుస నెంబర్లు కలిగిన విద్యార్థులు సీట్లు సాధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుస మాయాజాలం..! 2012-13 సంవత్సరంలో 12 సెంటర్లలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. కల్లూరు, పెనుబల్లి మండలాలకుగాను కల్లూరులోని ఏపీఎస్ డ బ్ల్ల్యూఆర్ఎస్ పరీక్ష కేంద్రం నుంచి 274 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 10మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇల్లెందు, కామేపల్లి మండలాలకు ఇల్లెందులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పరీక్ష కేంద్రంలో 320 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 16 మంది అర్హత సాధించారు. ఖమ్మం అర్బన్ మండలం నుంచి ఖమ్మంలోని న్యూవిజన్ కాన్సెప్ట్ స్కూల్లో పరీక్షకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ 340 మంది పరీక్షలు రాయగా 11మంది అర్హత సాధించారు. ఈ మూడు పరీక్ష కేంద్రాల పరిధిలో 37 మంది విద్యార్థులు అర్హత సాధించారు. జవహర్ నవోదయ విద్యాలయంలో మొత్తం సీట్లు 80 ఉండగా మిగిలిన 9 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాసిన విద్యార్థుల్లో జిల్లాలోని మిగిలిన అన్ని మండలాల నుంచి 43 మంది ఎంపికయ్యారు. 2014-15 విద్యాసంవత్సరానికి ఫిబ్రవరి 8న పరీక్ష నిర్వహించారు. 28 మండలాల నుంచి 4,123 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకోగా 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కల్లూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో రాసిన విద్యార్థుల్లో 9 మంది, ఖమ్మం న్యూ విజన్ హైస్కూల్, రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం 13 మంది విద్యార్థులు ప్రవేశపరీక్షల్లో ర్యాంకు సాధించారు. కూసుమంచిలోని జెవీఆర్ కళాశాలలో పరీక్ష కేంద్రం నుంచి అత్యధికంగా 14 మంది విద్యార్థులు అర్హత సాధించారు. కోచింగ్ సెంటర్ల ప్రభావమేనా..? మూడు సంవత్సరాలుగా జరుగుతున్న జవహర్ నవోదయ ప్రవేశపరీక్షల్లో అత్యధికంగా కల్లూరు, ఇల్లెందు, ఖమ్మం సెంటర్ల నుంచి విద్యార్థులు ఎంపికవుతున్నట్లుగా తెలుస్తోంది. వారిలోనూ వరుస నెంబర్లు కలిగిన విద్యార్థులు ఎంపికవడం, కల్లూరు, ఇల్లెందు, ఖమ్మంలోని కొన్ని కోచింగ్ సెంటర్ల వారి పాత్రపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉండే ఇన్విజిలేటర్లను నియమించుకోవడం, కొంతమందికి ముడుపులు చెల్లించుకుంటూ అవకతవకలకు పాల్పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కోచింగ్ సెంటర్ల పాత్ర ఉంది గత ఏడాది మా అబ్బాయి పరీక్షలు రాశాడు. 5వ తరగతిలో ఎప్పుడూ 90 శాతం మార్కులు తగ్గలేదు. కానీ నవోదయలో సీటు రాలేదు. కొన్ని సెంటర్లలో వరుస నంబర్ల విద్యార్థులు ఎంపికయ్యారు. ఇది ఎలా సాధ్యమవుతోంది. కేవలం నాలుగైదు కోచింగ్ సెంటర్ల నుంచే 80 శాతం సీట్లకు పైగా సీట్లు వస్తుండటం అనుమానం కలిగిస్తోంది. -పీట్ల ఎల్లయ్య, మడుపల్లి, మధిర మండలం రిజర్వేషన్లకు అనుగుణంగా ఎంపిక జవహర్ నవోదయ ప్రవేశపరీక్షల్లో రిజర్వేషన్లకు అనుగుణంగా ఎంపికైన విద్యార్థులే సీట్లు పొందుతారు. ఢిల్లీ స్థాయిలో జరిగే ఈ పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగవు. పరీక్షపత్రాలు కూడా ఢిల్లీ నుంచి వస్తాయి. కోచింగ్ సెంటర్లు, పరీక్షల నిర్వహణకు ఎటువంటి సంబంధం లేదు. - వి.వెంకటేశ్వర్లు, నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్, పాలేరు -
‘ఆహార భద్రత’పై అయోమయం!
⇒ జనవరి నుంచే అమలుకానున్న పథకం ⇒ ఇంకా పూర్తికాని దరఖాస్తుల పరిశీలన ⇒ తేలని లబ్ధిదారుల సంఖ్య ⇒ సర్వేలో తలమునకలైన యంత్రాంగం ⇒ ముందుగా గ్రామీణంలో అమలుకు యోచన సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఆహార భద్రత దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జిల్లా యంత్రాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పరిశీలనకు నిర్దేశించిన గడువు ముగిసినప్పటికీ కేవలం 78శాతం మాత్రమే పురోగతి ఉండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆహార భద్రత పథకానికి 13.67లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో గ్రామీణ మండలాలు, మున్సిపాలిటీల నుంచి 6,72,767 దరఖాస్తులు రాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి 6,94,605 దరఖాస్తులు వచ్చా యి. అయితే వీటిలో శనివారం నాటికి 10.66 లక్షల దరఖాస్తులనే పరిశీలించిన అధికారులు దాదాపు ఏడు లక్షల దరఖాస్తులను అర్హులుగా తేల్చారు. ముగిసిన గడువు.. జనవరి నుంచి ఆహార భద్రత పథకాన్ని అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలో డిసెంబర్ 15వ తేదీ నాటికి దరఖాస్తులు పరిశీలించి అర్హతను నిర్ధారించాలని, లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా ఆహార భద్రత కార్డులు అందజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ జిల్లాలో ఇప్పటివరకు కేవలం 78శాతం మాత్రమే దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. గ్రామీణ ప్రాంతంలో దరఖాస్తుల పరిశీలన దాదాపు పూర్తికాగా, పట్టణ ప్రాంతంలో మాత్రం ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. సిబ్బంది కొరతతో తొలుత పరిశీలన ప్రక్రి య నత్తనడకన సాగినప్పటికీ.. గ్రామీణ ప్రాంతానికి ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి డెప్యూట్ చేయడంతో ప్రస్తుతం పరిశీలన కొంత వేగం పుం జుకుంది. కానీ సర్కారు నిర్దేశించిన గడువు ముగి యడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. గ్రామీణ ప్రాంతంతో మొదలుపెడితే.. ఫిబ్రవరి నుంచి బడ్జెట్ సమావేశాలుండడంతో జనవరి నుంచే పథకాన్ని కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జిల్లాలో పరిశీలన ప్రక్రియ పూర్తికానందున.. ముందుగా గ్రామీణ ప్రాంతంలో పథకాన్ని అమలు చేసి.. తర్వాత పట్టణ ప్రాంతంలో పథకం అమలును విస్తరించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 25వ తేదీ నాటికి కీ రిజిస్టర్ సాధారణంగా రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల వివరాలను కీ రిజిస్టర్లో పొందుపర్చిన అనంతరం ఆ మేరకు రేషన్ కోటా విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ అంతా 20వ తేదీలోపు పూర్తవుతుంది. కానీ ఈ సారి ఆహారభద్రత పథకం అమలు నేపథ్యంలో కీ రిజిస్టర్ల తయారీని 25వ తేదీకి పొడిగించారు. ఒకట్రెండు రోజుల్లో జిల్లాలోని పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించిన తర్వాత.. అక్కడినుంచి వచ్చే స్పందన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. -
నేనూ ‘గ్రామీణ’ విద్యార్థినే..
తాండూరు రూరల్: గ్రామీణ ప్రాంతంలో చదివానని, ప్రభుత్వ పాఠశాలల సమస్యలు తనకు తెలుసని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ అన్నారు. తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్వీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ‘విద్యాహక్కు చట్టం అమలు - ఎస్ఎంసీ చైర్మన్ పాత్రపై’ నిర్వహించిన సదస్సులో ఆయన మట్లాడుతూ కర్నాకట సరిహద్దు ప్రాంతంలో ఉన్న తాండూరు, బషీరాబాద్, బంట్వారం మండలాల పాఠశాలలపై ప్రత్యేక దృష్టిసారిస్తానని చెప్పారు. ఇక్కడి పాఠశాలలో వసతులు లేవని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానన్నారు. జిల్లాలో 334 పాఠశాల్లో ఒకే ఉపాధ్యాయుడితో పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. గ్రామాల్లో పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతి రోజు పాఠశాలలకు పంపించాలన్నారు. ఎస్ఎంసీ చైర్మన్లు పాఠశాల్లో ప్రతి రెండు నెలలకోసారి ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. మధ్యహ్న భోజనం తనిఖీ చేయాల్సిన బాధ్యత ఎస్ఎంసీలపైనే ఉందన్నారు. పిల్లల భవిష్యత్‌ను మీరే తీర్చిదీద్దాలన్నారు. పాఠశాలలు అభివృద్ధి కావాలంటే గ్రామాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను వారానికి రెండుసార్లు ఎస్ఎంసీ చైర్మన్లు తనిఖీ చే సి, పరిస్థితులను స్థానిక ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం ఉన్నత పాఠశాల విద్యార్ధికి ఒక రోజు రూ.6 ఖర్చు చేస్తోందని, ప్రాథమిక పాఠశాల విద్యార్ధికి రూ.4 ఖర్చు చేస్తోందని చెప్పారు. త్వరలో ఆర్వీఎం నుంచి నిధులు.. జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు త్వరలో ఆర్వీఎం నుంచి నిధులు విడుదలవుతాయని డీఈఓ రమేష్ చెప్పారు. ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల్లో నిధులు లేవని చెప్పారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కింద ఉన్నత పాఠశాల్లో రూ.50 వేలు మౌలిక సదుపాయాల కోసం ఉన్నాయన్నారు. వెనుకబడిన ప్రాంతాల పాఠశాలలను అభివృద్ధి చేస్తానన్నారు. ఉపాధ్యాయుల్లో మార్పు వచ్చింది.. జిల్లాలో ప్రస్తుతం ఉపాధ్యాయుల తీరు మారిందని డీఈఓ చెప్పారు. ఉపాధ్యాయుల స్వభావం మరాలన్నారు. 70 శాతం ఉపాధ్యాయుల్లో మార్పు వస్తోందన్నారు. మిగతా 30 శాతం మంది విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, వారిని మొదట సముదాయిస్తామని, ఆ తర్వాత నోటీసులు ఇస్తామని, వినకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఈఓకు సమస్యలు విన్నవించిన ఎస్ఎంసీ చైర్మన్లు.. విద్యాహక్కు చట్టం అమలు కార్యక్రమానికి వచ్చిన డీఈఓ రమేష్‌కు తాండూరు, బషీరాబాద్ మండలాల నుంచి వచ్చిన ఎస్ఎంసీ చైర్మన్లు పలు సమస్యలు విన్నవించారు. బషీరాబాద్ మండలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయుల తీరులో మార్పు తేవాలన్నారు. విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, అదనపు తరగ తి గదుల కొరత ఉందని విన్నవించారు. టాయిలెట్స్ లేకపోవడంతో విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంవీఎఫ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, బాలల హక్కుల పరిరక్షణ జిల్లా కన్వీనర్ సుదర్శన్, రిటైర్డ్ టీచర్స్ ఫోరం కన్వీననర్ జానార్దన్, ఎంఈఓ శివకుమార్‌తోపాటు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సర్వేకు ‘సై’
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ‘సమగ్ర కుటుంబ సర్వే’పై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంతో పాటు మున్సిపాలిటీల పరిధిలో మాత్రమే జిల్లా యంత్రాంగం సర్వేకు ఉపక్రమించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లా ప్రాంతంలో సర్వే ప్రక్రియ అంతా జీహెచ్ఎంసీ అధికారులే చేయనున్నట్లు యంత్రాంగం తేల్చిచెప్పింది. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాలంటే గరిష్టంగా 60 వేల మంది సిబ్బంది అవసరం. కానీ జిల్లాలో కేవలం 26 వేల సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో ఆందోళన చెందిన జిల్లా యంత్రాంగం.. సర్కారుకు పరిస్థితిని వివరించింది. దీంతో గ్రామీణ ప్రాంతంలో సర్వే చేపట్టాలని ఆదేశించడంతో ఊపిరి పీల్చుకున్న జిల్లా అధికారులు సర్వే ఏర్పాట్లకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా పరిషత్‌లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గృహాలు 7.38 లక్షలు జిల్లాలో 15.13 లక్షల గృహాలున్నాయి. వీటిలో గ్రామీణ పరిధితో పాటు ఐదు మున్సిపాలిటీల పరిధిలో 7.38 లక్షల గృహాలున్నాయి. తాజాగా గ్రామీణ ప్రాంతంలో సర్వే చేపట్టనున్న నేపథ్యంలో 7.38 లక్షల గృహాల్లో సర్వే నిర్వహించి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకు 25వేల మంది సిబ్బందిని ఎన్యుమరేటర్లుగా నియమించారు. గురువారం మండల స్థాయి అధికారులకు అవగాహన నిర్వహించిన యంత్రాంగం.. ఒకట్రెండురోజుల్లో సర్వే సిబ్బంది అందరికీ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది. గ్రామీణ పరిధిని 379 రూట్లుగా విభజించి సర్వే చేయనున్నారు. అందరూ సహకరించాలి: కలెక్టర్ సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియకు ప్రజలంతా సహకరించాలని, దేశంలో ఇంత పెద్ద సర్వే చేయడం ఇదే ప్రథమమని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్కారు. 19వ తేదీ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించి మార్కింగ్ చేస్తామని, ఆరోజు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించినందున తప్పకుండా ఇంటి యజమానులు, కుటుంబ సభ్యులు అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర, ఆరోగ్య కారణాల వల్ల సభ్యులు అందుబాటులో లేకుంటే.. అందుకు సంబంధించి యజమాని ధ్రువీకరణ సమర్పిస్తే సభ్యుడి వివరాలు నమోదు చేసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒక ఎన్యుమరేటర్ 30 కుటుంబాలను సర్వే చేస్తారని, ఈమేరకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని కలిపి 25వేల మంది ఉద్యోగులను సర్వేలో భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు సిబ్బందికి ఈనెల 11 నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ సర్వే ఆధారంగానే అమలు చేస్తామని, ఎన్యుమరేటర్‌కు కుటుంబ సభ్యులంతా ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా, రేషన్ కార్డులు తదితర వివరాలన్నీ సమర్పించాల్సి ఉంటుందన్నారు. -
జనం నెత్తినగ్యాస్‘బండ’
డెలివరీ పేరుతో అక్రమ వసూలు మొక్కుబడి జీతాలతో అక్రమాలకు ఆజ్యం పోస్తున్న కంపెనీలు లబోదిబోమంటున్న వినియోగదారులు నెలకు సగటున రూ.12 లక్షలు మింగేస్తున్న తీరు గుడివాడ, న్యూస్‌లైన్ : గుడివాడ పట్టణంలో నాలుగు గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటికి గుడివాడ పట్టణం, గుడివాడ రూరల్ మండలంతో పాటు, పెదపారుపూడి, నందివాడ, ముదినేపల్లి, ఉయ్యూరు మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. వీటి ద్వారా 70 వేల కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు దాదాపు రెండువేల గ్యాస్ సిలిండర్ల సరఫరా జరుగుతుందని అధికారులు అంటున్నారు. గ్యాస్ ధర ప్రస్తుతం రూ.1213 కాగా గుడివాడ పట్టణంలో డెలివరీ చేసినందుకు రూ.20 నుంచి రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతం అయితే రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ పేరుతో నెలకు దాదాపు రూ.12 లక్షలకు పైగా వినియోగదారుల నెత్తినఅక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు ఇవీ.. గ్యాస్ ఏజెన్సీలకు కంపెనీ నుంచి ఒక్కో సిలిండర్‌కు రూ.50 వరకు కమీషన్‌గా వస్తుంది. గ్యాస్ ఏజెన్సీ ఉన్న గుడివాడ పట్టణంలో డెలివరీకి ఎటువంటి చార్జీలూ వసూలు చేయకూడదు. గుడివాడ దాటి ఇతర గ్రామాల్లో సరఫరా చేసినందుకు ఒక్కో సిలిండర్‌కు రూ.10 మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. కానీ గుడివాడ పట్టణంలో ప్రస్తుతం గ్యాస్ ధరను బట్టి రూ.20 నుంచి రూ.25 వరకు వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్కో సిలిండర్‌కు రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇవన్నీ గ్యాస్ సిలెండర్ సరఫరా చేసే రిక్షా, ఆటో డ్రైవర్ తీసుకుంటాడు. డెలివరీ బాయిస్‌కు ఇచ్చే జీతం రూ.500లే.. ఈ విషయమై ‘సాక్షి’ పరిశీలన జరుపగా సిలిండర్ల సరఫరా కోసం గ్యాస్ ఏజెన్సీ ఉద్యోగులుగా పెట్టుకుంటుంది. వీరికి నిబంధనల ప్రకారం జీతం ఇవ్వాల్సి ఉంది. ఏజెన్సీకి గ్యాస్ కంపెనీ ఇచ్చే కమీషన్లోనే వీరికి జీతాలు ఇవ్వాల్సి ఉంది. అయితే గ్యాస్ సరఫరా చేసే వారికి ఆయా గ్యాస్ ఏజెన్సీలు ఇచ్చే జీతం చూస్తే ఆశ్చర్యం వ్యక్తం చేయక మానరు. ఏలూరు రోడ్డులో ఉన్న ఒక ఏజెన్సీ డెలివరీ బాయిస్‌కు నెలకు రూ.500 ఇస్తుండగా మరో ఏజెన్సీ రూ.700 ఇస్తుంది. వీరందరినీ వినియోగ దారుల వద్ద అక్రమ వసూళ్లుచేసి బతకమని చెప్పేందుకు ఇది ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పటికే గ్యాస్ ధరలు భరించలేని వినియోగ దారులు ఈ అక్రమ వసూళ్లు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై గుడివాడ పౌర సరఫరాల డిప్యూటీ తహశీల్దార్ గంధం డేవిడ్‌రాజును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్యాస్ డెలివరీ బాయ్ చేయాల్సింది ఇదీ... గ్యాస్ సిలిండర్ ఇంటి వద్దకు తీసుకొచ్చే డెలివరీ బాయ్ దానితో పాటు కంపెనీ బిల్లును ఇవ్వాల్సి ఉంది. ఏజెన్సీ ఉన్న ప్రాంతం నుంచి 12 కిలోమీటర్ల లోపు డెలివరీ ఇచ్చే గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి సర్వీసు చార్జీ తీసుకోరాదు. గ్యాస్ సిలిండర్ వినియోగదారుడికి ఇచ్చేముందు దాని బరువు (తూకం) చూపించి ఇవ్వాలి. కానీ గ్యాస్ సిలిండర్లను తూకం వేసేందుకు డెలివరీ బాయిస్ వద్ద బరువు తూచే యంత్రాలు ఉండవు. గ్యాస్ సిలిండరును వినియోగదారు ఇంట్లో రెగ్యులేటర్‌కు బిగించి పొయ్యి వెలిగించి చూపించాలి. కానీ ఎక్కడా ఇటువంటి సేవలు ఇచ్చిన దాఖలాలు లేవు. అయినప్పటికీ వినియోగదారుల వద్ద డెలివరీ చార్జీల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా అదనపు వసూలు చేస్తున్నారు. -
పల్లె పండుగ
శ్రీకాకుళం కల్చరల్, న్యూస్‌లైన్:గతంలో పల్లెలకే పరిమితమైన సంక్రాం తి పండుగ ఇప్పుడు పట్టణమొచ్చింది. గ్రామీణ ప్రాంతాల సంప్రదాయాలనే పట్టణ ప్రజలూ కొనసాగిస్తున్నారు. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నలఫీట్లు పట్టణ ప్రజలను అలరిస్తు న్నాయి. భోగి పండుగలో పాల్గొనేందుకు యువత ఉత్సాహం చూపుతున్నారు. పట్టణాల్లో పల్ల్లె పండుగ వాతావరణం ఉట్టి పడుతోంది. పిండివంటలు, ముత్యాల ముగ్గుల్లో మహిళలు బిజీ అయ్యూరు. హిందూ సంస్కృతి సంప్రదాయూలను కొనసాగి స్తున్నారు. చదువు, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారితో పట్టణాలు కళకళలాడుతున్నారుు. పట్టణంలోని పలు కూడళ్లలో పిచ్చాపాటి మాటలు, ఆత్మీయ పలకరింపులు, కష్టసుఖాలు చెప్పుకుంటూ కాలంతెలియకుండా గడిపేస్తున్నారు. బంతిపూల పూల తోరణాలతో ఇళ్లవాకిళ్లను అలంకరిస్తున్నారు. మరోపక్క చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. కార్పొరేట్ కళాశాలలు, స్కూళ్లలో అన్ని పండుగలను సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తున్నారు. భోగీ మంటల్లో ఉత్సాహంగా... సంక్రాంతి పండగ భోగితో ప్రారంభమవుతుంది. ఈ పండుగను పట్టణ ప్రాంతాల్లోని పలు కూడళ్ల వద్ద ఆర్భాటంగా నిర్వహిస్తారు. యువకులు భోగి మంటలు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మంటలోల రాగికాని, ఆవుపేడతో చేసిన పిడకలు వేసి ఇంటిల్లిపాదీ స్నానం చేయడం ఆనవారుుతీ. ఇంట్లో చిన్నారులు ఉంటే వారిని కూర్చోబెట్టి రేగుపళ్లు, చిల్లరనాణేలను కలిపి తలమీద పోసి పెద్దలు ఆశీర్వదిస్తారు. ముత్తరుుదవులను ఇంటికి పిలిచి పసుపు ముఖానికి రాసి పేరంటాలుగా కొలుస్తారు. ముగ్గులు వేయడంలో యవతుల బిజీ సంప్రదాయ ముగ్గులు వేయడంలో యువతులు పోటీ పడుతున్నారు. ఇళ్ల ముంగిట వివిధ రంగులతో ముగ్గులు వేసి ఆక ర్షిస్తున్నారు. ముగ్గులో కనిపించే పద్మం మహాలక్ష్మికి ప్రతీక. శుభానికి సంకేతం స్వస్తిక్. దీనిని వినాయకుని రూపంగా భావిస్తారు. సూర్య భగవానునికి గుర్తుగా రథం ఆకారంలో ముగ్గు వేస్తున్నారు. పలు చోట్ల నిర్వహించే ముగ్గుల పోటీల్లో కూడా యువతులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. హరిదాసు బొమ్మలు వేయడం, కుండతో పొంగలి ప్రసాదం, చెరకు వంటి బొమ్మలు వేసి మన సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా రంగవల్లికలను దిద్దుతున్నారు. యువతులు మన సంప్రదాయాలకు గుర్తుగా లంగావాణీ లు ధరించి జడగంటలు, తల పై పాపిడిపిందె, జడలో చామంతి పువ్వతో తెలు గింటి ఆడపచులా ముస్తాబులకు ప్రాధాన్యమిస్తున్నారు. రెడీ మేడ్ పిండివంటలు పల్లెల్లో ప్రతి ఇంటిలోనూ పిండివంటల ఘమఘమలు ఊరించినట్టే పట్టణాల్లో రెడీ మేడ్ పిండివంటలు ఊరిస్తున్నాయి. అరిసెలు, పొంగడాలు తయూరు చేస్తూ స్వీట్లను దుకాణాల్లో కొనుగోలుచేసి పిల్లలకు పంచి పెడుతున్నారు. బొమ్మల కొలువులు భోగిరోజు జరిగే మరో ఉత్సవం బొమ్మల కొలువు. సంక్రాంతి, దసరా తదితర పండగల సమయంలో చిన్నపిల్లలను ఆకర్షించేందుకు బొమ్మల కొలువులు నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవునా సేకరించిన బొమ్మలను జాగ్రత్తగా భద్రపరిచి దసరా, సంక్రాంతి సమయాలలో బొమ్మల కొలువులు పెడుతున్నారు.