సాక్షి, రంగారెడ్డి జిల్లా : ‘సమగ్ర కుటుంబ సర్వే’పై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంతో పాటు మున్సిపాలిటీల పరిధిలో మాత్రమే జిల్లా యంత్రాంగం సర్వేకు ఉపక్రమించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లా ప్రాంతంలో సర్వే ప్రక్రియ అంతా జీహెచ్‌ఎంసీ అధికారులే చేయనున్నట్లు యంత్రాంగం తేల్చిచెప్పింది. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాలంటే గరిష్టంగా 60 వేల మంది సిబ్బంది అవసరం.
కానీ జిల్లాలో కేవలం 26 వేల సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో ఆందోళన చెందిన జిల్లా యంత్రాంగం.. సర్కారుకు పరిస్థితిని వివరించింది. దీంతో గ్రామీణ ప్రాంతంలో సర్వే చేపట్టాలని ఆదేశించడంతో ఊపిరి పీల్చుకున్న జిల్లా అధికారులు సర్వే ఏర్పాట్లకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా పరిషత్‌లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
గృహాలు 7.38 లక్షలు
జిల్లాలో 15.13 లక్షల గృహాలున్నాయి. వీటిలో గ్రామీణ పరిధితో పాటు ఐదు మున్సిపాలిటీల పరిధిలో 7.38 లక్షల గృహాలున్నాయి. తాజాగా గ్రామీణ ప్రాంతంలో సర్వే చేపట్టనున్న నేపథ్యంలో 7.38 లక్షల గృహాల్లో సర్వే నిర్వహించి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకు 25వేల మంది సిబ్బందిని ఎన్యుమరేటర్లుగా నియమించారు. గురువారం మండల స్థాయి అధికారులకు అవగాహన నిర్వహించిన యంత్రాంగం.. ఒకట్రెండురోజుల్లో సర్వే సిబ్బంది అందరికీ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది. గ్రామీణ పరిధిని 379 రూట్లుగా విభజించి సర్వే చేయనున్నారు.
అందరూ సహకరించాలి: కలెక్టర్
సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియకు ప్రజలంతా సహకరించాలని, దేశంలో ఇంత పెద్ద సర్వే చేయడం ఇదే ప్రథమమని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్కారు. 19వ తేదీ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించి మార్కింగ్ చేస్తామని, ఆరోజు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించినందున తప్పకుండా ఇంటి యజమానులు, కుటుంబ సభ్యులు అందుబాటులో ఉండాలన్నారు.
అత్యవసర, ఆరోగ్య కారణాల వల్ల సభ్యులు అందుబాటులో లేకుంటే.. అందుకు సంబంధించి యజమాని ధ్రువీకరణ సమర్పిస్తే సభ్యుడి వివరాలు నమోదు చేసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒక ఎన్యుమరేటర్ 30 కుటుంబాలను సర్వే చేస్తారని, ఈమేరకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని కలిపి 25వేల మంది ఉద్యోగులను సర్వేలో భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు సిబ్బందికి ఈనెల 11 నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ సర్వే ఆధారంగానే అమలు చేస్తామని, ఎన్యుమరేటర్‌కు కుటుంబ సభ్యులంతా ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా, రేషన్ కార్డులు తదితర వివరాలన్నీ సమర్పించాల్సి ఉంటుందన్నారు.
సర్వేకు ‘సై’
Published Fri, Aug 8 2014 12:36 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement