149 మూతబడులే..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పాఠశాలల హేతుబద్ధీకరణ చేపట్టాలంటే 2013లో బదిలీ పొంది స్థానం మారని వారిని తప్పనిసరిగా వారి ఒరిజినల్ పోస్టుకు పంపాల్సి ఉంది. గత 2013లో బదిలీ అయినప్పటికీ స్థానం మారని వారు దాదాపు 300 మంది టీచర్లు ఉన్నారు. ప్రస్తుతం పాఠశాలల హేతుబద్ధీకరణ, బదిలీలు చేపట్టడంతో వారిని సొంత స్థానాలకు పంపుతామని స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే వారంతా సొంత స్థానాలకు వెళితే 24 మండలాల్లోని 149 పాఠశాలల్లో టీచర్లు ఉండరు.
వారి స్థానంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుంటే విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడనుంది.
ఆందోళనలో పల్లె బడులు
హేతుబద్ధీకరణ ప్రక్రియ పల్లెబడులకు ఆందోళనకరంగా మారింది. విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడంతో ఇక్కడున్న ఉపాధ్యాయ పోస్టులు పట్టణ ప్రాంతాలకు తరలిపోతున్నాయి. దీంతో పల్లెబడుల్లోని పోస్టులు తగ్గుతుండగా.. సింగిల్ టీచర్లున్న పాఠశాలలు సర్కారు నిర్ణయంతో ఏకంగా మూతబడుతున్నాయి. తాజా బదిలీలతో మరికొందరు టీచర్లు పట్టణ ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో టీచర్లులేని పాఠశాలల సంఖ్య గ్రామీణ ప్రాంతంలో భారీగా పెరగనుంది.