
75 శాతం ఉత్తీర్ణత రాలేదని ప్రభుత్వం వేధింపులు!
సాక్షి, అమరావతి: ఇంటర్మిడియెట్ ఫలితాల్లో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించని మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, టీచర్లకు వేధింపులు మొదలయ్యాయి. మొత్తం 55 ఏపీ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లతోపాటు వాటిలో పనిచేస్తున్న టీచర్లకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేగింది. రాష్ట్రంలో 164 ఏపీ మోడల్ స్కూళ్లు ఉండగా, 163 స్కూళ్లల్లో ఇంటర్మిడియెట్ ఉంది.
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 75 శాతం కాగా, 55 మోడల్ సూళ్లలో దానికన్నా తక్కువగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ‘ప్రిన్సిపాళ్లు, సబ్జెక్ట్ టీచర్లకు విద్యా సమీక్ష సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేసినా 55 పాఠశాలలు 75 శాతం కంటే తక్కువగా ఉత్తీర్ణత శాతం సాధించడం ఏమిటి? దీనిపై మూడు రోజుల్లో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలి. అలాగే, తదుపరి తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలి..’ అని సోమవారం ఉన్నతాధికారులు ఆయా స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, టీచర్లకు నోటీసులు పంపించారు.
సప్లిమెంటరీ పరీక్షల్లో ఫలితాలు మెరుగుపరిచేందుకు ఏపీ మోడల్ సూళ్లలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఈ విధుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలోనే వివరణ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేయడంపై ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
భయాందోళనలకు గురిచేయొద్దు: ఏపీటీఎఫ్ అమరావతి
సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను భయాందోళనలకు గురి చేయవద్దని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ విద్యాశాఖను కోరారు. ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండటానికి గల కారణాలను విశ్లేషి చాలని ఆయన సూచించారు.