
తొలగింపునకు గురైన టీచర్లకు మమత హామీ
కోల్‌కతా: సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో అర్హులైన అభ్యర్థులకు బాసటగా నిలుస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. తుదిశ్వాస వరకు పోరాటం సాగిస్తానని, జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు, సిబ్బందితో సోమవారం నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటైన సమావేశంలో సీఎం మమత ఉద్వేగంతో మాట్లాడారు.
తొలగింపు ఆదేశాలు ఇప్పటి వరకు అందనందున, ఎప్పటిమాదిరిగానే స్కూళ్లకు వెళ్లి తమ విధులను స్వచ్చందంగా కొనసాగించాలని వారిని కోరారు. 2016లో నియమించిన 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది ఎంపికలో తీవ్ర అవకతవకలు జరిగాయని గుర్తించిన కలకత్తా హైకోర్టు వారందరినీ తొలగించాలంటూ 2024లో తీర్పు వెలువరించడం..దానిని తాజాగా సుప్రీంకోర్టు సమర్థించడం తెల్సిందే. సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా పరిశీలించాక అర్హులైన అభ్యర్థుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైతే రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు.
ఒక వేళ తీర్పు మనకు అనుకూలమని తేలితే రెండు నెలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడతామని ప్రకటించారు. అర్హులెవరూ ఉద్యోగాలు కోల్పోరాదని ఆమె పేర్కొన్నారు. ఉన్న ఫళంగా ఉద్యోగులను తొలగిస్తే బడులు సాగేదెలా? ఉద్యోగాలు కల్పించలేని వారికి వారిని తొలగించే అధికారం కూడా ఉండరాదని వ్యాఖ్యానించారు. అయితే, అత్యున్నత న్యాయస్థానం తీర్పును తాము గౌరవిస్తామంటూ ఆమె.. తప్పులను సవరించే సమయాన్ని కూడా ప్రభుత్వానికి ఇవ్వలేదని పేర్కొన్నారు. సీనియర్ లాయర్లు అభిషేక్ సింఘ్వి, కపిల్ సిబాల్, రాకేశ్ ద్వివేది, కల్యాణ్ బెనర్జీ, ప్రశాంత్ భూషణ్‌లతో కూడిన బృందం ఉద్యోగాలు కోల్పోయిన వారి తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తారని ప్రకటించారు.