job losses
-
ఉద్యోగుల కడుపు కొట్టేందుకు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్!
Flipkart layoffs: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వందలాది మంది ఉద్యోగుల కడుపు కొట్టేందుకు సిద్ధమైంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. వ్యయ నియంత్రణ వ్యూహంలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ పనితీరు ఆధారంగా 5-7 శాతం వర్క్‌ఫోర్స్ తగ్గించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ తొలగింపులు మార్చి-ఏప్రిల్ 2024 నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఒక సంవత్సరంపాటు నియామకాలను సైతం ఈ ఈ-కామర్స్ దిగ్గజం నిలిపేసింది. ఫ్లిప్‌కార్ట్ గత రెండేళ్లుగా పనితీరు ఆధారంగా ఏటా ఉద్యోగాలను తొలగిస్తూ వస్తోంది. 1500 మందిపై ప్రభావం మింత్రా మినహా కంపెనీ ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య 22,000గా ఉంది. ప్రస్తుతం చేపట్టనున్న తొలగింపులు 1100-1500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపనున్నాయి. కాగా కంపెనీ పునర్నిర్మాణం, 2024కు సంబంధించిన రోడ్‌మ్యాప్ వచ్చే నెలలో జరిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో ఖరారవుతాయని నివేదిక సూచిస్తోంది. ఇదే బాటాలో పేటీఎం, అమెజాన్, మీషో వంటి ఇతర సంస్థలు కూడా ఇటీవల వ్యయ నియంత్రణ, పునర్నిర్మాణ చర్యలు చేపట్టాయి. అదానీ గ్రూప్‌నకు 20 శాతం వాటా ఉన్న క్లియర్‌ట్రిప్‌తో సహకారాన్ని కూడా ఫ్లిప్‌కార్ట్ పరిశీలిస్తోంది. ఎయిర్‌లైన్ బుకింగ్‌లపై దృష్టి సారించే క్లియర్‌ట్రిప్‌నకు సంబంధించిన హోటల్ వ్యాపారంలో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడి పెట్టే అవకావం ఉంది. వాల్‌మార్ట్, ఇతర సంస్థల నుంచి సమీకరిస్తున్న 1 బిలియన్ డాలర్ల నిధులు ఫ్లిప్‌కార్ట్ వ్యూహాత్మక ప్రణాళికలకు మద్దతు ఇస్తాయని అంచనా వేస్తున్నారు. -
భారత్‌కు దిగ్గజ కంపెనీ గుడ్‌బై, పరిహారంపై రాని స్పష్టత
న్యూఢిల్లీ: అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ..భారత్‌లో కార్యకలాపాలు నిలిపివేస్తున్న నేపథ్యంలో తమ పరిహారంపై స్పష్టతనివ్వాలని దేశీ ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ డిమాండ్ చేసింది. ఫోర్డ్ ఇండియా ఎండీ అనురాగ్ మెహ్రోత్రాకు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ ఈ మేరకు లేఖ రాశారు. ఫోర్డ్ ప్లాంట్ల మూసివేత ప్రకటనతో కొనుగోలుదారులంతా బుకింగ్‌లను రద్దు చేసుకుంటున్నారని, దీంతో డీలర్లు భారీగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. వీరిలో చాలా మంది డీలర్‌షిప్‌లు తీసుకుని అయిదేళ్లు కూడా కాలేదని, కనీసం బ్రేక్ ఈవెన్ స్థాయి కూడా అందుకోలేదని గులాటీ తెలిపారు. పరిహారానికి సంబంధించి ఫోర్డ్ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసి ఉంటుంది కాబట్టి దాన్ని తమకు తెలియజేస్తే డీలర్లకు వివరించడానికి వీలవుతుందని, ఈ ప్రక్రియ సామరస్యంగా ముగిసేందుకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. డీలర్లకు పంపిన నాన్–డిస్క్లోజర్ అగ్రిమెంట్ (ఎన్డీఏ)లోనూ పలు వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయని, వాటిని సవరించాలని.. తగు రీతిలో స్పష్టతనివ్వాలని గులాటీ కోరారు. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా భారత్‌లోని రెండు ప్లాంట్లలోనూ వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని, ఇకపై కేవలం దిగుమతి చేసుకున్న వాహనాలే విక్రయిస్తామని ఫోర్డ్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో 4,000 మంది పైచిలుకు ఫోర్డ్ ఉద్యోగులపైనా, దాదాపు 300 పైగా అవుట్‌లెట్స్‌ను నిర్వహించే 150 మంది డీలర్లపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. కంపెనీ గత పదేళ్ల కాలంలో భారత మార్కెట్లో సుమారు 2 బిలియన్ డాలర్ల నిర్వహణ నష్టాలు చవిచూసింది. చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో దిగ్గజ కంపెనీ..! -
విషాదం: పది రోజుల వ్యవధిలోనే భార్య, కూతురు ఆత్మహత్య
చంఢీగఢ్: దేశంలో కరోనా మహమ్మారి ప్రజలను ఆర్థికంగా కొలుకోలేని దెబ్బతీసింది. దీని ఉధృతి కారణంగా ఇప్పటికే చాలా మంది తమ ఉపాధిని కోల్పోవడమే కాకుండా అనేక కుటుంబాలు రోడ్డున పడిన సంగతి తెలిసిందే. అయితే, కొవిడ్ కారణంగా తమ ఉద్యోగాలను కోల్పోవడం వలన ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాగా, తాజాగా మరో కుటుంబం తమ ఉద్యోగాలను కోల్పోవడం వలన ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం హర్యానాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌లో హరిశెట్టి, భార్య వీణలతో కలిసి నివసించేవాడు. వీరిద్దరు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలు చేస్తుండేవారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు యశికా యంబీఎ చదువు తుండగా, మరొకూతురు లా చదువుతుంది. ఈ క్రమంలో కరోనా కారణంగా ఈ దంపతులు గతేడాది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. గత కొంత కాలంగా వీరు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వీరు దాచి ఉంచిన సొమ్ము అంతా అయిపోయింది. వీరు ఇంటి అద్దె, బిల్లులు, ఈయంఐలు కూడా చెల్లించలేని స్థితికి చేరుకున్నారు. దీంతో, హరిశెట్టి తీవ్రంగా కుంగిపోయాడు. కాగా, ఇతను గత జులై 6వ తేదిన ఒక హోటల్లో విషాన్ని తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, భర్త మృతిని తట్టుకోలేని భార్య వీణ, కూతురు యశికా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో వీరు కూడా కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఇంట్లో విషాన్ని తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజులుగా వీరి ఇంట్లో నుంచి ఎవరు బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, పోలీసులు వీరి ఇంటిలో ప్రవేశించి చూడగా అప్పటికే వీణ, యశికాలు కిందపడిఉన్నారు. వీరి పక్కన విషపు మాత్రలు ఉండటాన్ని గమనించారు. వీరి మృతదేహలను పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కరోనా: రోడ్డున పడ్డ 11 లక్షల మంది
లండన్: ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల లక్షలాది మంది ఉపాధిని కోల్పోయి రోడ్డున పడతారనే విషయం తెల్సిందే. దేశ ఆర్థిక వ్యవస్థ, అనుసరిస్తోన్న విధానాలనుబట్టి ఈ భారం నేరుగా ప్రభుత్వంపై పడుతుందా లేదా ప్రజలే నేరుగా ఆ బాధను అనుభవించి ఉండాల్సి ఉంటుందా? అన్న అంశం ఆధారపడి ఉంటుంది. బ్రిటన్ ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తోన్నందున ఆ భారం ప్రభుత్వంపైనే నేరుగా పడుతుందని చెప్పవచ్చు. బ్రిటన్‌లో మార్చి నెల వరకు నిరుద్యోగ భృతిని తీసుకుంటున్న వారి సంఖ్య 8,65,500 మంది ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 21 లక్షలకు చేరుకుందని ‘రిసొల్యూషన్ ఫౌండేషన్’ తెలిపింది. మార్చి నెల చివరి నాటికి పని గంటలు బాగా తగ్గిపోయినప్పటికీ కార్మికులెవరూ ఉపాధి అవకాశాలు కోల్పోలేదని, ఏప్రిల్ నెల వచ్చేసరికి హోటళ్లలో పనిచేసేవారు, భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటస్టిక్స్ (ఓఎన్ఎస్)’ డిప్యూటీ నేషనల్ స్టాటిస్టిసియన్ ఫర్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ జొనాథన్ ఆథో చెప్పారు. మార్చి నుంచి ఇప్పటి వరకు మూడు నెలల కాలంలో 50 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆయన తెలిపారు. ‘రెసొల్యూషన్ ఫౌండేషన్’ అనే మేథావుల సంఘం అంచనాల ప్రకారం మాత్రం బ్రిటన్‌లో కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు 11 లక్షల మంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారారు. మరికొన్ని లక్షల మంది ప్రజలు తమ జీతాల్లో కోతను ఎదుర్కొంటున్నారని ఆ సంస్థ తెలియజేసింది. ఉద్యోగం కోల్పోవడం, జీతాల్లో కోత అనే రెండు అంశాలు ఎక్కువగా పిన్న వయస్కులు, పెద్ద వయస్కుల ఉద్యోగులపై ప్రధానంగా ప్రభావం చూపుతోందని ఆ సంఘం తెలిపింది. (మహా నగరాలే కరోనా కేంద్రాలు) -
డేంజర్ బెల్: రోబోలతో కూలనున్న కొలువులు
లండన్ : రోబోలతో సామాజిక అశాంతి తప్పదని.ఇవి గుంపగుత్తగా ఉద్యోగాలను కొల్లగొడతాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ చీఫ్ ఎకనమిస్ట్ ఆండీ హెల్దానే హెచ్చరించారు. మనిషి ఆలోచించి చేసే పనులను సైతం యంత్రాలు అవలీలగా చేసే రోజులను నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రపంచం ముందుంచనుందని ఆండీ స్పష్టం చేశారు. విక్టోరియా రోజులకు మించి ఈ మార్పులు మానవ జాతి పెను విధ్వంసానికి దారితీస్తాయని హెచ్చరించారు. అకౌంటెన్సీ సహా పలు రంగాలు రోబోల ధాటికి ఉద్యోగాలను పెద్ద సంఖ్యలో కోల్పోతాయని చెప్పారు. ఆటోమేషన్ రాకతో గల్లంతయ్యే ఉద్యోగాలను కాపాడుకోవడానికి అభ్యర్థులు అత్యున్నత నైపుణ్యాలను సంతరించుకోవడమే ప్రత్యామ్నాయమన్నారు. దీర్ఘకాలం ఉద్యోగాలను కోల్పోయే క్రమంలో బతుకుతెరువు కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి సామాజిక అశాంతికీ దారితీయవచ్చని హెచ్చరించారు. తొలి మూడు పారిశ్రామిక విప్లవాలు అధికంగా శ్రమతో కూడుకున్న పనులనే యంత్రాలు చేపట్టగా, నాలుగో పారిశ్రామిక విప్లవం ఈ మూడింటికీ భిన్నమైనదన్నారు. ఆధునిక యంత్రాలు మనుషులు ఆలోచించి చేసే పనులనే కాకుండా, నైపుణ్యంతో కూడిన పనులనూ చేస్తాయని చెప్పుకొచ్చారు. మరోవైపు రానున్న రెండు దశాబ్ధాల్లో నూతన సాంకేతిక మార్పులతో బ్రిటన్‌లో 70 లక్షల ఉద్యోగాలు మటుమాయం అవుతాయని అకౌంటెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొన్న సంగతి తెలిసిందే. రిటైల్, రవాణా, తయారీ పరిశ్రమల్లో ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఈ నివేదిక అంచనా వేసింది. ఇతర రంగాలు సైతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటాయని నివేదిక స్పష్టం చేసింది. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా ఇంటెలిజెంట్ కంప్యూటర్స్ అన్నిరంగాల్లోనూ ఉద్యోగాలు కుదేలవుతాయని పేర్కొంది. -
రోబోలు జాబ్‌లు మింగేయకుండా..
సాక్షి,న్యూఢిల్లీ: రోబోలు, ఆటోమేషన్ ఉద్యోగాలను కొల్లగొట్టేస్తున్న క్రమంలో మానవ వనరులను కాపాడుకునేలా నూతన పారిశ్రామిక విధానాన్ని వెల్లడించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. 1991 పారిశ్రామిక విధానం, యూపీఎ సర్కార్ 2011లో ప్రకటించిన మ్యాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ స్ధానంలో నూతన పారిశ్రామిక విధానాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో ప్రకటిస్తామని వాణిజ్యం, పరిశ్రమల మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. దీనికి సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని చెప్పారు. దశాబ్ధాల కిందటి పారిశ్రామిక విధానాన్ని కాలానుగుణంగా ప్రక్షాళన చేయడంతో పాటు విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగి సంస్కరణల వేగం పెంచేందుకు నూతన విధానానికి రూపకల్పన చేస్తున్నట్టు ఈ ఏడాది ఆగస్ట్‌లో పారిశ్రామిక విధానం, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ చర్చా పత్రాన్ని జారీ చేసింది. భవిష్యత్‌కు సన్నద్ధంగా ఉండే పారిశ్రామిక విధానం అవసరమని పేర్కొంది. ఆటోమేషన్ దెబ్బతో ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి..మరోవైపు వృద్ధి మందగమనంతో తగ్గుతున్న ఉపాథి అవకాశాల వంటి సవాళ్ల నేపథ్యంలో మెరుగైన పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. -
భారత్‌లో ఊడుతున్న ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ప్రపంచంలో మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా బలపడుతున్నామంటూ చెప్పుకుంటున్న భారత్‌లో విదేశీ ఎగుమతులు పడిపోతూ ఉద్యోగావకాశాల వృద్ధి రేటు కూడా ఆందోళనకర స్థాయికి దిగజారిపోతోంది. వరుసగా 2015, 2016 సంవత్సరాలో ఉద్యోగాల వృద్ధిరేటు గణనీయంగా పడిపోయింది. 2015 సంవత్సరం మొదటి, రెండవ త్రైమాసికంలో ఈ రేటు మరీ దారుణంగా పడిపోయింది. 2009, 2011, 2013 సంవత్సరాల్లో వృద్ధి రేటు గణనీయంగా పెరగ్గా, 2015 సంవత్సరంలో ఏడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం ఆందోళనకరమైన అంశమని ఆసోచామ్ వ్యాఖ్యానించింది. వృద్ధి రేటు పడిపోయిన కారణంగా 2015 సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశంలో 70 వేల ఉద్యోగాలు పడిపోయాయి. జౌళి రంగంలోనే ఉద్యోగాలు ఎక్కువగా ఊడిపోవడం గమనార్హం. ఈ రంగాన్ని నమ్ముకొని నాలుగున్నర లక్షల వ్యాపార సంస్థలు పనిచేస్తున్నాయి. దేశంలో ఉద్యోగాలను ఎక్కువగా సృష్టించే మొత్తం 14 రంగాల్లో 8 రంగాల్లో ఎగుమతులు పడిపోయి, కార్మికుల ఉద్యోగాలు పోయాయి. ఎగుమతులు పెరిగి, కార్మికుల అవసరం పెరిగితేగానీ మళ్లీ ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి 2014లో వచ్చినప్పుడు దేశంలో ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఏడాదికి కోటికిపైగా ఉద్యోగాలు సృష్టిస్తామని ప్రజలకు భరోసా కూడా ఇచ్చారు. అయితే ట్రెండ్ విరుద్ధంగా కొనసాగుతోంది. కొత్త ఉద్యోగాలు లేకపోయినా ఫర్వాలేదుగానీ, ఉన్న ఉద్యోగాలు ఊడకపోతే చాలు అన్నట్టుగా కార్మికులు మొరపెట్టుకుంటున్నారు.