భారత్‌లో ఊడుతున్న ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ప్రపంచంలో మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా బలపడుతున్నామంటూ చెప్పుకుంటున్న భారత్‌లో విదేశీ ఎగుమతులు పడిపోతూ ఉద్యోగావకాశాల వృద్ధి రేటు కూడా ఆందోళనకర స్థాయికి దిగజారిపోతోంది. వరుసగా 2015, 2016 సంవత్సరాలో ఉద్యోగాల వృద్ధిరేటు గణనీయంగా పడిపోయింది. 2015 సంవత్సరం మొదటి, రెండవ త్రైమాసికంలో ఈ రేటు మరీ దారుణంగా పడిపోయింది. 2009, 2011, 2013 సంవత్సరాల్లో వృద్ధి రేటు గణనీయంగా పెరగ్గా, 2015 సంవత్సరంలో ఏడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం ఆందోళనకరమైన అంశమని ఆసోచామ్ వ్యాఖ్యానించింది.
వృద్ధి రేటు పడిపోయిన కారణంగా 2015 సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశంలో 70 వేల ఉద్యోగాలు పడిపోయాయి. జౌళి రంగంలోనే ఉద్యోగాలు ఎక్కువగా ఊడిపోవడం గమనార్హం. ఈ రంగాన్ని నమ్ముకొని నాలుగున్నర లక్షల వ్యాపార సంస్థలు పనిచేస్తున్నాయి. దేశంలో ఉద్యోగాలను ఎక్కువగా సృష్టించే మొత్తం 14 రంగాల్లో 8 రంగాల్లో ఎగుమతులు పడిపోయి, కార్మికుల ఉద్యోగాలు పోయాయి. ఎగుమతులు పెరిగి, కార్మికుల అవసరం పెరిగితేగానీ మళ్లీ ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు.
కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి 2014లో వచ్చినప్పుడు దేశంలో ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఏడాదికి కోటికిపైగా ఉద్యోగాలు సృష్టిస్తామని ప్రజలకు భరోసా కూడా ఇచ్చారు. అయితే ట్రెండ్ విరుద్ధంగా కొనసాగుతోంది. కొత్త ఉద్యోగాలు లేకపోయినా ఫర్వాలేదుగానీ, ఉన్న ఉద్యోగాలు ఊడకపోతే చాలు అన్నట్టుగా కార్మికులు మొరపెట్టుకుంటున్నారు.