ఇన్ఫోసిస్‌లో 20,000 నియామకాలు! | Infosys Announced Plans To Hire Over 20,000 Freshers In The Financial Year 2026, See More Details Inside | Sakshi
Sakshi News home page

Infosys Hirings: ఇన్ఫోసిస్‌లో 20,000 నియామకాలు!

Published Thu, Feb 20 2025 8:25 AM | Last Updated on Thu, Feb 20 2025 9:55 AM

Infosys announced plans to hire over 20,000 freshers in the financial year 2026

ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌(Infosys) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికకు అనుగుణంగా సాగుతున్నట్టు వెల్లడించింది. కొత్తగా చేరిన వారికి ఉత్తమ కార్పొరేట్‌ శిక్షణ ఇవ్వనున్నట్టు చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ షాజీ మాథ్యూ తెలిపారు.

ఇదిలాఉండగా, 300 మంద్రి ఫ్రెషర్లను తొలగించినట్టు కంపెనీ ఇటీవల వెల్లడించింది. ‘మైసూరు క్యాంపస్‌లో వీరికి ప్రాథమిక శిక్షణ పూర్తి అయింది. అంతర్గతంగా నిర్వహించిన మదింపు ప్రక్రియలో మెరుగైన పనితీరు కనబర్చలేదు. మూడు విడతలుగా అవకాశం ఇచ్చాం. అయినా ఉత్తీర్ణులు కాలేదు. దీంతో ఉద్వాసన పలకాల్సి వచ్చింది’ అని ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఉద్యోగులను ఎటువంటి ఒత్తిడికి గురి చేయలేదని మాథ్యూ వివరించారు. మదింపు ప్రక్రియలో పనితీరు కనబర్చని ఫ్రెషర్ల తొలగింపు సాధారణమే. అయితే గతంలో ఇది 10 శాతానికి లోబడి ఉండేది. ఈ నెలలో ఇది ఏకంగా 30–40 శాతం ఉన్నట్టు సమాచారం. ఇదే వివాదానికి కేంద్ర బిందువైంది.  

ఇదీ చదవండి: భారత్‌పై అమెరికా సుంకాల ప్రభావం ఎంతంటే..

అక్రమంగా, అనైతికంగా..

ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ (నైట్స్‌) వాదన మరోలా ఉంది. మైసూరు శిక్షణ కేంద్రం నుంచి 700 మందికిపైగా ఫ్రెషర్లను ఇన్ఫోసిస్‌ తొలగించిందని ఆరోపిస్తోంది. అక్రమంగా, అనైతికంగా ఉద్యోగులను తొలగించారంటూ కార్మిక శాఖకు సైతం నైట్స్‌ ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో టెర్మినేషన్‌కు గురైన వారంతా 2022 హైరింగ్‌ బ్యాచ్‌కు చెందినవారు. రెండేళ్ల నిరీక్షణ తర్వాత 2024 సెప్టెంబర్‌లో జాబ్స్‌ అందుకున్నారు. ఇన్ఫోసిస్‌ 2024లో అమలు చేసిన పరీక్షా విధానం కఠినంగా ఉంది. సిలబస్‌ ఎక్కువగా ఉండడం, శిక్షణ సమయం తక్కువ కావడంతో ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయిందని నైట్స్‌ చెబుతోంది. స్వచ్ఛందంగా మానేస్తున్నట్టు ఉద్యోగులతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని, బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బందితో బెదిరింపులకు దిగారని కార్మిక శాఖకు ఇచ్చిన ఫిర్యాదులో నైట్స్‌ వెల్లడించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement