లండన్: ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల లక్షలాది మంది ఉపాధిని కోల్పోయి రోడ్డున పడతారనే విషయం తెల్సిందే. దేశ ఆర్థిక వ్యవస్థ, అనుసరిస్తోన్న విధానాలనుబట్టి ఈ భారం నేరుగా ప్రభుత్వంపై పడుతుందా లేదా ప్రజలే నేరుగా ఆ బాధను అనుభవించి ఉండాల్సి ఉంటుందా? అన్న అంశం ఆధారపడి ఉంటుంది. బ్రిటన్ ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తోన్నందున ఆ భారం ప్రభుత్వంపైనే నేరుగా పడుతుందని చెప్పవచ్చు. బ్రిటన్‌లో మార్చి నెల వరకు నిరుద్యోగ భృతిని తీసుకుంటున్న వారి సంఖ్య 8,65,500 మంది ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 21 లక్షలకు చేరుకుందని ‘రిసొల్యూషన్ ఫౌండేషన్’ తెలిపింది.
మార్చి నెల చివరి నాటికి పని గంటలు బాగా తగ్గిపోయినప్పటికీ కార్మికులెవరూ ఉపాధి అవకాశాలు కోల్పోలేదని, ఏప్రిల్ నెల వచ్చేసరికి హోటళ్లలో పనిచేసేవారు, భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటస్టిక్స్ (ఓఎన్‌ఎస్)’ డిప్యూటీ నేషనల్ స్టాటిస్టిసియన్ ఫర్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ జొనాథన్ ఆథో చెప్పారు. మార్చి నుంచి ఇప్పటి వరకు మూడు నెలల కాలంలో 50 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆయన తెలిపారు. ‘రెసొల్యూషన్ ఫౌండేషన్’ అనే మేథావుల సంఘం అంచనాల ప్రకారం మాత్రం బ్రిటన్‌లో కరోనా లాక్‌డౌన్ కారణంగా దాదాపు 11 లక్షల మంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారారు. మరికొన్ని లక్షల మంది ప్రజలు తమ జీతాల్లో కోతను ఎదుర్కొంటున్నారని ఆ సంస్థ తెలియజేసింది. ఉద్యోగం కోల్పోవడం, జీతాల్లో కోత అనే రెండు అంశాలు ఎక్కువగా పిన్న వయస్కులు, పెద్ద వయస్కుల ఉద్యోగులపై ప్రధానంగా ప్రభావం చూపుతోందని ఆ సంఘం తెలిపింది. (మహా నగరాలే కరోనా కేంద్రాలు)
Comments
Please login to add a commentAdd a comment