Rationalization of schools
-
వచ్చే నెలలో టీచర్ల హేతుబద్ధీకరణ!
కసరత్తు చేస్తున్న విద్యాశాఖ - రేపటికల్లా పూర్తి స్థాయిలో లెక్కలు - 10 మందిలోపు విద్యార్థులున్న1,231 స్కూళ్ల మూత? సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే హేతుబద్ధీకరించాల్సిన పాఠశాలలు, ఉపాధ్యాయుల లెక్కలను విద్యాశాఖ సేకరించింది. ఏయే జిల్లాల్లో ఎన్ని స్కూళ్లను సమీప పాఠశాలల్లో విలీనం (మూసివేత) చేయాలి, ఎంత మంది టీచర్లను విద్యార్థులున్న స్కూళ్లకు పంపాలి అనే అంశాలపై అవగాహనకు వచ్చింది. వాటిని ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా 10 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆయా పాఠశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి లెక్కలు సరి చూస్తున్నారు. అలాగే ఇతర పాఠశాలల్లో పరిస్థితులపైనా సమగ్ర నివేదికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనకు ముందు వేసిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 20 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలు 3,998 ఉండగా 10 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లు 1,231 ఉన్నాయి. ప్రస్తుతం వాటిని మూసివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మంగళవారంలోగా హేతుబద్ధీకరణ లెక్కలు తేల్చాలని అధికారులను విద్యాశాఖ ఇప్పటికే ఆదేశించింది. ఈ మేరకు జిల్లాల్లో డీఈవోలు చేపట్టిన పనులన్నీ పూర్తి కావచ్చాయి. ప్రభుత్వం ఆమోదించగానే హేతుబద్ధీకరణను అమలు చేయనున్నారు. మూసేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పినా... రాష్ట్రంలో పాఠశాలలను మూసివేయబోమని విద్యాశాఖ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కానీ ప్రస్తుతం 10 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలల నిర్వహణ సాధ్యం కాదని భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలనే విషయమై దృష్టి పెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో విద్యార్థి మాత్రమే ఉన్న స్కూళ్లు 13 ఉండగా, ఇద్దరేసి విద్యార్థులు ఉన్న స్కూళ్లు 50, ముగ్గురు చొప్పున విద్యార్థులు ఉన్న పాఠశాలలు 66, ఐదుగురు చొప్పున విద్యార్థులు ఉన్న స్కూళ్లు 135, మిగతా పాఠశాలల్లో ఐదుగురు నుంచి 10 మందిలోపు విద్యార్థులు ఉన్నట్లు తేల్చింది. అయితే ఆ పాఠశాలలను కొనసాగించడం కష్టమైనప్పటికీ వాటన్నింటినీ ఇతర పాఠశాలల్లో విలీనం చేయడం సరికాదకాదన్న భావనను కొంత మంది ఉన్నతాధికారులే వ్యక్తం చేస్తున్నారు. చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం కష్టమని, వాగులు, కొండ ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉంటాయని, అక్కడ పది మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను విలీనం చేయడం ద్వారా అక్కడి విద్యార్థులకు విద్యావకాశాలు దూరమవుతాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి పాఠశాలలు ఎన్ని ఉన్నాయన్న అంశంపై పరిశీలన జరుపుతున్నారు. మరోవైపు 405 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా లేకపోగా, ఈసారి ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడంతో దాదాపు 275 పాఠశాలల్లో విద్యార్థులు చేరారు. అయితే అందులోనూ 10 మందిలోపే విద్యార్థులు చేరిన పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటు మిగితా పది మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను వీలైనన్ని విలీనం చేయాలన్న ఆలోచనలు చేస్తోంది. అవసరమైతే వాటిల్లోని విద్యార్థులను ఇతర పాఠశాలలకు పంపించేందుకు రవాణా సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. దీనిపై ప్రభుత్వంతో చర్చించాక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
బోసిపోయిన పల్లె బడి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఉపాధ్యాయుల బదిలీలు, పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియ సర్కారు బడులను సంకటంలో పడేసింది. స్కూళ్ల రేషనలైజేషన్ ప్రక్రియతో గ్రామీణ ప్రాంతాల్లోని టీచర్ పోస్టులు కాస్త పట్టణ ప్రాంతాలకు తరలిపోయాయి. అదేవిధంగా బదిలీల కౌన్సెలింగ్‌లో మెజార్టీ టీచర్లు పట్టణ ప్రాంత పాఠశాలల్లోనే పనిచేసేందుకు మొగ్గు చూపడంతో పల్లెబడులన్నీ ఉపాధ్యాయులు లేకుండా ఖాళీ అయ్యాయి. తాజా బదిలీలు, హేతుబద్ధీకరణ ప్రక్రియతో జిల్లా వ్యాప్తంగా 520 పాఠశాలల్లో సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రాథమికం.. గందరగోళం.. ఇటీవల విద్యాశాఖ నిర్వహించిన టీచర్ల బదిలీల ప్రక్రియలో 2,271 మందికి స్థానచలనం కలిగింది. ఇందులో 1,067 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులున్నారు. వీరంతా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న వారే. గతవారం జరిగిన బదిలీల కౌన్సెలింగ్‌లో స్థానచలనం పొందిన ఎస్జీటీల్లో ఏకంగా 395 మంది టీచర్లు పట్టణ ప్రాంత పాఠశాలలనే ఎంచుకున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో ఈ మేరకు ఖాళీలు ఏర్పడ్డాయి. గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో రేషనలైజేషన్ ప్రక్రియలో అక్కడి పోస్టులను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంత పాఠశాలలకు తరలించారు. వీటితోపాటు ఇప్పటికే 435 ఎస్జీటీ పోస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ తేల్చింది. మొత్తంగా 830 ఉపాధ్యాయ ఖాళీలు పల్లెబడులను అతలాకుతలం చేయనున్నాయి. ప్రత్యామ్నాయమే దిక్కు.. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగియడంతో ఆయా టీచర్లు కొత్త పాఠశాలల్లో విధులకు హాజరవుతున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎం, స్కూల్‌అసిస్టెంట్, భాషాపండితులు, పీఈటీలు, పీడీలు కొత్త పాఠశాలలకు రిలీవయ్యారు. ఎస్జీటీలు మాత్రం ఇంకా రిలీవ్ కావాల్సి ఉంది. అయితే బదిలీ అయిన ఎస్జీటీలను ఇప్పటికిప్పుడు రిలీవ్ చేస్తే గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో బోధన పడకేయనుంది. ముఖ్యంగా బంట్వారం, బషీరాబాద్, ధారూరు. గండేడ్, కుల్కచర్ల, మహేశ్వరం, మంచాల, మర్పల్లి, మోమీన్‌పేట్, మొయినాబాద్, నవాబ్‌పేట్, పెద్దేముల్, పూడూరు, శామీర్‌పేట్, మేడ్చల్, యాచారం, యాలాల మండలాల్లో ఖాళీలు అధికంగా ఉన్నాయి. ఒకవైపు విద్యావలంటీర్లు లేకపోగా.. కొత్త నియామకాలు సైతం ఇప్పట్లో చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన పల్లె బడుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సి ఉంది. -
149 మూతబడులే..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పాఠశాలల హేతుబద్ధీకరణ చేపట్టాలంటే 2013లో బదిలీ పొంది స్థానం మారని వారిని తప్పనిసరిగా వారి ఒరిజినల్ పోస్టుకు పంపాల్సి ఉంది. గత 2013లో బదిలీ అయినప్పటికీ స్థానం మారని వారు దాదాపు 300 మంది టీచర్లు ఉన్నారు. ప్రస్తుతం పాఠశాలల హేతుబద్ధీకరణ, బదిలీలు చేపట్టడంతో వారిని సొంత స్థానాలకు పంపుతామని స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే వారంతా సొంత స్థానాలకు వెళితే 24 మండలాల్లోని 149 పాఠశాలల్లో టీచర్లు ఉండరు. వారి స్థానంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుంటే విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడనుంది. ఆందోళనలో పల్లె బడులు హేతుబద్ధీకరణ ప్రక్రియ పల్లెబడులకు ఆందోళనకరంగా మారింది. విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడంతో ఇక్కడున్న ఉపాధ్యాయ పోస్టులు పట్టణ ప్రాంతాలకు తరలిపోతున్నాయి. దీంతో పల్లెబడుల్లోని పోస్టులు తగ్గుతుండగా.. సింగిల్ టీచర్లున్న పాఠశాలలు సర్కారు నిర్ణయంతో ఏకంగా మూతబడుతున్నాయి. తాజా బదిలీలతో మరికొందరు టీచర్లు పట్టణ ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో టీచర్లులేని పాఠశాలల సంఖ్య గ్రామీణ ప్రాంతంలో భారీగా పెరగనుంది.