బోసిపోయిన పల్లె బడి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఉపాధ్యాయుల బదిలీలు, పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియ సర్కారు బడులను సంకటంలో పడేసింది. స్కూళ్ల రేషనలైజేషన్ ప్రక్రియతో గ్రామీణ ప్రాంతాల్లోని టీచర్ పోస్టులు కాస్త పట్టణ ప్రాంతాలకు తరలిపోయాయి. అదేవిధంగా బదిలీల కౌన్సెలింగ్‌లో మెజార్టీ టీచర్లు పట్టణ ప్రాంత పాఠశాలల్లోనే పనిచేసేందుకు మొగ్గు చూపడంతో పల్లెబడులన్నీ ఉపాధ్యాయులు లేకుండా ఖాళీ అయ్యాయి. తాజా బదిలీలు, హేతుబద్ధీకరణ ప్రక్రియతో జిల్లా వ్యాప్తంగా 520 పాఠశాలల్లో సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది.
ప్రాథమికం.. గందరగోళం..
ఇటీవల విద్యాశాఖ నిర్వహించిన టీచర్ల బదిలీల ప్రక్రియలో 2,271 మందికి స్థానచలనం కలిగింది. ఇందులో 1,067 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులున్నారు. వీరంతా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న వారే. గతవారం జరిగిన బదిలీల కౌన్సెలింగ్‌లో స్థానచలనం పొందిన ఎస్‌జీటీల్లో ఏకంగా 395 మంది టీచర్లు పట్టణ ప్రాంత పాఠశాలలనే ఎంచుకున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో ఈ మేరకు ఖాళీలు ఏర్పడ్డాయి. గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో రేషనలైజేషన్ ప్రక్రియలో అక్కడి పోస్టులను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంత పాఠశాలలకు తరలించారు. వీటితోపాటు ఇప్పటికే 435 ఎస్జీటీ పోస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ తేల్చింది. మొత్తంగా 830 ఉపాధ్యాయ ఖాళీలు పల్లెబడులను అతలాకుతలం చేయనున్నాయి.
ప్రత్యామ్నాయమే దిక్కు..
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగియడంతో ఆయా టీచర్లు కొత్త పాఠశాలల్లో విధులకు హాజరవుతున్నాయి. ఇప్పటికే జీహెచ్‌ఎం, స్కూల్‌అసిస్టెంట్, భాషాపండితులు, పీఈటీలు, పీడీలు కొత్త పాఠశాలలకు రిలీవయ్యారు. ఎస్జీటీలు మాత్రం ఇంకా రిలీవ్ కావాల్సి ఉంది. అయితే బదిలీ అయిన ఎస్‌జీటీలను ఇప్పటికిప్పుడు రిలీవ్ చేస్తే గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో బోధన పడకేయనుంది. ముఖ్యంగా బంట్వారం, బషీరాబాద్, ధారూరు. గండేడ్, కుల్కచర్ల, మహేశ్వరం, మంచాల, మర్పల్లి, మోమీన్‌పేట్, మొయినాబాద్, నవాబ్‌పేట్, పెద్దేముల్, పూడూరు, శామీర్‌పేట్, మేడ్చల్, యాచారం, యాలాల మండలాల్లో ఖాళీలు అధికంగా ఉన్నాయి. ఒకవైపు విద్యావలంటీర్లు లేకపోగా.. కొత్త నియామకాలు సైతం ఇప్పట్లో చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన పల్లె బడుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సి ఉంది.