Teachers Transfers
-
టీచర్ల బదిలీలు ఆపేయాలని నేనే విజ్ఞప్తి చేశా: బొత్స
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల బదిలీల అంశంలో తనపై వస్తున్న ఆరోపణలను మరోసారి ఖండించారు మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. కొత్త ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ఆ బదిలీలను నిలిపివేయాలని అధికారులకు తానే విజ్ఞప్తి చేశానని స్పష్టత ఇచ్చారాయన.టీచర్ల బదిలీ అంశంపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవన్న ఆయన.. శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘ఉపాధ్యాయుల బదిలీలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు అవాస్తవం. నాపై వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ ప్రచురితమైన వార్తల్లో నిజం లేదు. ఇదంతా అభూత కల్పనలతో నా వ్యక్తిత్వ హననానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు... ఎన్నికలకు ముందు నుంచీ కూడా ఇవే ఆరోపణలతో అనేక సార్లు వార్తలు ప్రచురించారు. అప్పుడు కూడా నేను ఖండించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. కొంత మంది ఉపాధ్యాయులు తమ ఆరోగ్య, కుటుంబ ఇతరత్రా ఇబ్బందులు, వివిధ వ్యక్తిగత సమస్యల రీత్యా బదిలీలు కోరుకుంటూ ఆర్జీ పెట్టుకోవడం జరిగింది. వాటిని పూర్తి పారదర్శకంగా పరిశీలించి క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న తరువాతనే అప్పట్లో నిర్ణయం తీసుకున్నాం.అయితే.. ఫలితాలు వెలువడిన వెంటనే ఈ బదిలీలు నిలిపేయాల్సిందిగా సంబంధిత అధికారులను నేనే స్వయంగా కోరాను. కొత్త ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలపై తమకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు. బదిలీల కోసం అర్జీచేసుకున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిగణలోకి తీసుకుంటారా? లేదా? అనేది కొత్త ప్రభుత్వం ఇష్టం.అంతేగానీ.. బదిలీలకోసం లంచాలు తీసుకున్నారంటూ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అలాంటి తప్పుడు పనులు చేయాల్సిన అగత్యం, అవసరం రెండూ మాకు లేవు.. అని బొత్స స్పష్టం చేశారు. -
తెలంగాణ: టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మంగళవారం ఝలక్ ఇచ్చింది. ఉపాధ్యాయుల బదిలీలపై నెలపాటు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బదిలీల నిబంధనలపై నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ పిటిషన్ వేయగా.. హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే.. టీచర్ల బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్లు వాదించారు. ప్రభుత్వ ఉద్యోగ దంపతులు, గుర్తింపు యూనియన్ నేతలకు అదనపు పాయింట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మార్చి 14 వరకు బదిలీలపై స్టే విధించిన హైకోర్టు.. కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
Telangana: టీచర్ల బదిలీలకు మళ్లీ బ్రేక్ .. బదిలీ జాబితా నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: కోర్టు తీర్పుతో టీచర్ల బదిలీ ప్రక్రియకు మళ్ళీ బ్రేక్ పడింది. సగం వరకూ వచ్చిన షెడ్యూల్‌ను మధ్యలోనే నిలిపివేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం విడుదల చేయాల్సిన సీనియారిటీ జాబితాను తక్షణమే నిలిపివేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన సోమవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ►317 జీవో ద్వారా కొత్త జిల్లాలకు వెళ్ళిన టీచర్లకు బదిలీ అవకాశం లేకుండా, రెండేళ్ళ కనీస సర్వీసు నిబంధన పెడుతూ విద్యాశాఖ ఇటీవల జీవో ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సోమవారం రాత్రి 11 గంటల వరకూ చర్చలు జరిపారు. విషయాన్ని ప్రభుత్వానికి చేరవేయడంతో బదిలీ ప్రక్రియ నిలిపివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ అధికారులకు చెప్పినట్టు తెలిసింది. దీంతో మంగళవారం విడుదల చేయాల్సిన బదిలీ జాబితాను నిలిపివేయాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు సమాచారం. కోర్టు తీర్పు తుది కాపీ ఇంకా అందలేదని, మంగళవారం కాపీ వచ్చిన తర్వాత తీర్పుపై అప్పీలుకు వెళ్ళడమా? తీర్పును అమలు చేయడమా? అనేది ఆలోచిస్తామని పాఠశాల విద్య ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఏడాదికి బదిలీలు లేనట్టే! కోర్టు తీర్పు ప్రకారం కొత్త జిల్లాలకు వెళ్ళిన టీచర్లకు బదిలీ అవకాశం ఇవ్వడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదని అధికారులు అంటున్నారు. బదిలీ అవకాశం లేని టీచర్లు దాదాపు 25 వేల మంది ఉంటారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా వెళ్ళాలంటే మళ్ళీ కొత్తగా షెడ్యూల్ ఇవ్వాల్సి ఉంటుంది. బదిలీ ప్రక్రియకు అనుసరించే సాఫ్ట్వేర్ మొత్తం మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. 317 జీవో ప్రకారం వెళ్ళిన టీచర్ల ఉమ్మడి జిల్లాలోని సీనియారిటీ మళ్ళీ లెక్కగట్టాలి. ఈ ప్రక్రియకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. ►బదిలీల ప్రక్రియ గత నెల 28న మొదలైంది. దాదాపు 59 వేల మంది టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీళ్ళలో ఎవరైనా కోర్టుకు వెళ్ళినా సమస్య మళ్ళీ జటిలమయ్యే అవకాశం కల్పిస్తోంది. అలా కాకుండా అంతా సవ్యంగా సాగినా... రెండు నెలలు పడుతుంది. ఈ లోగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వీలుంది. ఈ సమయంలో బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి బదిలీల వ్యవహారం ఈ ఏడాది ఉండకపోవచ్చనే వాదన విన్పిస్తోంది. -
టీచర్ల బదిలీల గడువు పొడిగించే చాన్స్!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ పద్ధతిలో లోపాలు.. అప్‌గ్రేడ్ కాని ఆప్షన్లు.. కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు.. ఇలా ఉపాధ్యాయుల బదిలీల్లో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా దరఖాస్తు చేసుకునే గడువును పెంచాలని రాష్ట్ర విద్యాశాఖ యోచిస్తోంది. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉంది. గడువు పొడిగింపు విషయాన్ని సోమవారం అధికారికంగా వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది. టీచర్ల బదిలీలు, పదోన్నతికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసింది. ఈ నెల 28 నుంచి టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ గడువు సోమవారం ముగుస్తుంది. ఇప్పటికి 27 వేలమంది.. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వరకూ 27,668 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నట్టు పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన వెల్లడించారు. ఒకే స్కూల్లో 8 ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్లను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. 5 ఏళ్లు ఒకేచోట పనిచేస్తున్నవాళ్లు బదిలీ సీనియారిటీలో ఉంటారు. ఇలా మొత్తం 70 వేలమంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే, గడువు సమీపిస్తున్నప్పటికీ సగంమంది కూడా దరఖాస్తు చేసుకోలేకపోవడం గమనార్హం. గతంలో ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌నే ఇప్పుడూ వాడుతున్నారని, దీనిని అప్‌గ్రేడ్ చేయలేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీనివల్ల కొన్ని ఆప్షన్లు కన్పించడంలేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఆర్ఏ కేటగిరీలు గతంలో నాలుగు ఉండగా, ఇప్పుడు మూడింటికి కుదించారు. కానీ, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయలేదు. స్పౌజ్ 8 ఏళ్లుగా బదిలీ అవకాశాన్ని వాడుకున్నారా? అనే ఆప్షన్లో వాడుకోలేదనే ఆప్షన్‌కు టిక్ పెడితే దరఖాస్తును తీసుకోవడం లేదని పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. మారుమూల గ్రామాల్లో తొలిరోజు ఆన్లైన్ విధానం పనిచేయలేదనే ఫిర్యాదులొచ్చాయి. దరఖాస్తు గుడువు ఒకరోజు మాత్రమే ఉండటంతో మిగిలిన 40 వేలమంది ఒకేసారి దరఖాస్తు చేస్తే సర్వర్ స్తంభించే అవకాశముందని విద్యాశాఖలోని సాంకేతిక వర్గాలు అంటున్నాయి. ఎస్జీటీల సంగతేంటి? స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 615 మంది స్పౌజ్‌లు వారి ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించినా సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్టీటీ) విషయంలో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ఖాళీలున్నా తమకు ఎందుకు న్యాయం చేయడంలేదని వారు జిల్లాల్లో ఆందోళనలు చేస్తున్నారు. వాస్తవానికి అన్ని జిల్లాల్లోనూ పోస్టులున్నాయి. సంగారెడ్డి జిల్లాల్లో కేవలం ముగ్గురు స్పౌజ్‌లే బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ 242 పోస్టులున్నా అనుమతించలేదు. ఖమ్మంలో 341 పోస్టులుంటే 41 మంది స్పౌజ్‌లే దరఖాస్తు చేశారు. అన్ని జిల్లాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఖాళీలున్నా ఎందుకు బదిలీచేయడం లేదని స్పౌజ్ ఫోరం నేతలు ప్రశ్నిస్తున్నారు. గడువు పెంచాల్సిందే... సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా అనేకమంది టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి 1 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. టీచర్ల దరఖాస్తులు డీఈవోలకు సమర్పించేందుకు మూడు రోజుల గడువిచ్చారు. కాకపోతే ఈ సమయాన్ని తగ్గించి, టీచర్లు ఆన్లైన్ దరఖాస్తులు పెట్టుకునే గడువు పెంచాలి. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఆన్లైన్లోనే టీచర్ల బదిలీలు
తాండూరు: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతు లన్నీ ఆన్లైన్ ద్వారానే జరుగుతాయని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తన పుట్టిల్లయిన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కోటబాస్పల్లిలో ఎల్లమ్మ దేవత ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పదోన్నతులు, బదిలీల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలను సబిత ఖండించారు. ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, అవగాహన రాహిత్యంతోనే ఆ విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. బదిలీలు, పదోన్నతులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతాయన్నారు. ఈసారి కూడా తాను మహేశ్వరం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. -
టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల.. లీక్‌పై డైరెక్టర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ సోమవారం అనధికారికంగా బయటకొచ్చింది. అందుబాటులోకి వచ్చిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27 నుంచి మొదలయ్యే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మార్చి 4వ తేదీతో ముగియనుంది. షెడ్యూల్ ఇలా... ♦జనవరి 27న అన్ని కేటగిరీల్లో ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్లైన్లో ప్రకటిస్తారు. ♦28 నుంచి 30 వరకు బదిలీ దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారు ♦జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 లోపు.. దరఖాస్తుల హార్డ్ కాపీలను హైసూ్కల్ ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈఓలకు, మండల పరిషత్ పీఎస్, యూపీఎస్ ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈఓకు సమర్పించాలి ♦ఫిబ్రవరి 3–6 తేదీల మధ్య దరఖాస్తుల హార్డ్ కాపీలను ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు డీఈఓ కార్యాలయంలో సమరి్పంచడం, పరిశీలన.. ఆన్లైన్లో ఆమోదం. ♦7న డీఈఓ/ఆర్జేడీ వెబ్సైట్లలో బదిలీ పాయింట్లతో ప్రొవిజనల్ సీనియారిటీ, పదోన్నతుల సీనియారిటీ జాబితాలు ప్రకటిస్తారు. ♦8 నుంచి 10 వరకు మూడురోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన, పరిష్కారం జరుగుతుంది. ♦11, 12 తేదీల్లో తుది సీనియారిటీ జాబితాల ప్రకటన, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు. ♦13న మల్టీ జోనల్ స్థాయిలో ప్రధానోపాధ్యాయులు వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునఃపరిశీలన చేసుకోవచ్చు. ♦14న ఆర్జేడీలు ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు విడుదల. ♦15న బదిలీల అనంతరం మిగిలిన ఖాళీల ప్రకటన. ►16, 17, 18 తేదీల్లో అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పదోన్నతుల కౌన్సెలింగ్ జరుగుతుంది. ►19, 20 తేదీల్లో సబ్జెక్ట్ వారీగా స్కూల్ అసిస్టెంట్స్ ఖాళీల ప్రకటన, బదిలీ ఆప్షన్స్ నమోదు. ►21న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలనకు అవకాశం. ►22, 23 తేదీల్లో డీఈఓలచే స్కూల్ అసిస్టెంట్స్ బదిలీ ఉత్తర్వులు విడుదల. ►24న స్కూల్ అసిస్టెంట్ల బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల ప్రకటన. ►25, 26, 27 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు (కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు) మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు. ►ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన పోస్టుల ఖాళీల ప్రకటన, వెబ్ ఆప్షన్ల నమోదు. ∙3న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలన. ►4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల. ►5 నుండి 19 వరకు డీఈఓలు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీళ్లు, అభ్యంతరాలను ఆర్జేడీకి, ఆర్జేడీ ఉత్తర్వులపై అప్పీళ్లు/అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు పంపవచ్చు. డైరెక్టర్ ఆగ్రహం: టీచర్ల బదిలీల షెడ్యూల్ బయటకు రావడంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన డీఈవోల సమావేశంలో విద్యా శాఖ బదిలీల షెడ్యూల్‌పై చర్చించారు. సమావేశం జరుగు తుండగానే షెడ్యూల్ లీకయ్యింది. ఈ నేపథ్యంలో డీఈవోల ఫోన్లు స్వా«దీనం చేసుకుని పరిశీలించినట్లు తెలిసింది. -
TS: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ రిలీజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపింది. ► ఈ నెల 28వ తేదీ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ► మార్చి4వ తేదీ నాటికి ప్రక్రియ పూర్తి చేయనుంది సర్కార్. ► మార్చి 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం ఇస్తారు. ► టీచర్ల నుంచి దరఖాస్తులు అందిచిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
Telangana: టీచర్లకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఈ నెల 27 నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది. 37 రోజుల్లో దీన్ని పూర్తి చేయనున్నారు. వీలైనంత త్వరగా అధికారిక షెడ్యూల్ విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ మేర కు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. శుక్రవారం సాయంత్రం మంత్రి సబిత విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. కాగా కొన్ని మార్పుచేర్పులతో శని వా రం షెడ్యూల్‌ను విడుదల చేస్తామని అధికారులు తెలిపాయి. దీనికి గతంలో బదిలీలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేయాల్సి ఉంది. కలెక్టర్ కన్వీనర్‌గా.. టీచర్ల బదిలీలు, పదోన్నతులపై కొన్ని రోజులుగా అధికారవర్గాలు తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉపాధ్యాయ సంఘాలతో ఉన్నతాధికారులు విస్తృతంగా చర్చలు జరిపారు. గతానికి భిన్నంగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ కన్వీనర్‌గా, జిల్లా పరిషత్ చైర్మన్, సీఈవో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచనలో ఉన్నారు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో ముఖ్య భూమిక పోషించేవారు. దీనివల్ల అనేక సమస్యలు వచ్చాయని, ఐఏఎస్‌లకు బాధ్యత అప్పగిస్తే ఎలాంటి తలనొప్పులు ఉండవని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రమోషన్లకు అర్హుల జాబితా సిద్ధం ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా, ఎస్ఏల నుంచి హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు అర్హత గల వారి జాబితాను శుక్రవారం అధికారులు సిద్ధం చేశారు. జిల్లాల వారీగా వీటిని కలెక్టర్ల పరిశీలనకు పంపుతున్నట్టు ఓ అధికారి తెలిపారు. మార్గదర్శకాలపై ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కోర్టు వివాదాలున్న కారణంగా భాషా పండితుల విషయంలో బదిలీలు, పదోన్నతులు చేపట్టే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. కాగా షెడ్యూల్ విడుదల రోజునే ఉపాధ్యాయ ఖాళీలను ప్రకటించే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. -
టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ పదోన్నతులకూ ఓకే
సాక్షి, హైదరాబాద్: పదోన్నతులు, బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మంగళ, బుధవారాల్లో ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆశిస్తున్నారు. విధి విధానాలు ఎలా ఉంటాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని మంత్రులు హరీష్‌రావు, సబిత ఇంద్రారెడ్డి ఆదివారం ఆయా సంఘాల నేతలతో సమాలోచనలు జరిపారు. అనంతరం బదిలీలు, పదోన్నతులకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారని, త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని సబిత తెలిపారు. కస్తూరీ బా గాంధీ బాలికల విద్యాలయంలో కూడా ఇది అమలవుతుందని ఆమె చెప్పారు. సంక్రాంతి కానుకగా ఈ శుభవార్త చెబుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. టెన్త్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించడం... ఇతర తరగతుల పరీక్షలు త్వరలో జరుగుతున్న కారణంగా ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ప్రకటించినా, ఏప్రిల్ తర్వాతే వీటిని అమలు చేస్తామని తెలిపారు. అయితే ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను ఫిబ్రవరి రెండో వారం కల్లా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ప్రమోషన్లు ఎంతమందికి? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 1.05 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. వీటిల్లో 18 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం 12 వేల పోస్టులే ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో తెలిపింది. 317 జీవో అమలు తర్వాత దీనిపై స్పష్టమైన లెక్కలు తీయాల్సి ఉంది. ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7111 ఖాళీలున్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ)లకు పదోన్నతులు కల్పించడం ద్వారా 70 శాతం ఖాళీలు భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. ఈ క్రమంలో 5 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్స్‌గా పదోన్నతి లభిస్తుంది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులు 2084 ఖాళీలున్నాయి. వీటిని ఎస్జీటీల ద్వారా భర్తీ చేస్తారు. ఉన్నత పాఠశాలల్లో 1948 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటిని ప్రస్తుతం ఉన్న స్కూల్ అసిస్టెంట్స్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 9 వేల మందికిపై ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లభిస్తాయి. కోర్టు వివాదాల తర్వాతే ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోల భర్తీ మండల విద్యాశాఖాధికారులు, డిప్యూటీ జిల్లా విద్యాశాఖాధికారులు, భాషా పండితుల అప్‌గ్రేడ్ వ్యవహారం చేపట్టేందుకు ప్రభుత్వం సాహసించడం లేదు. రాష్ట్రంలో 443 ఎంఈవో పోస్టులున్నాయి. కానీ ఇప్పుడు పనిచేస్తున్న ఎంఈవోలు 21 మంది మాత్రమే. డిప్యూటీ డీఈవో పోస్టులు 78 ఉంటే 18 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఎంఈవో పోస్టులను నేరుగా ఎంపికైన ప్రభుత్వ హెచ్ఎంల ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల పాఠశాలలకూ ఈ అవకాశం ఇవ్వాలని మరికొన్ని సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం వివాదం కోర్టు పరిధిలో ఉంది. భాషా పండితుల విషయం కూడా న్యాయస్థానంలో ఉంది. ఈ కారణంగా కోర్టు వివాదం ముగిసిన తర్వాతే ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎన్నికల కోసమేనా? హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మార్చిలో ఈ ఎన్నిక జరిగే వీలుంది. మరోవైపు సాధారణ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే 317 జీవో కారణంగా ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 2015లో ప్రమో షన్లు, బదిలీలు చేపట్టారు. 2017లో మరోసారి బదిలీలు మాత్రమే జరిగాయి. అప్పట్నుంచి బది లీలు, పదోన్నతులు లేవు. ఈ ప్రభావం ఎమ్మెల్సీ, సాధారణ ఎన్నికలపై ఉంటుందని ప్రభుత్వం సందేహిస్తోందని, అందుకే హడావుడిగా ఉపాధ్యా యవర్గాలను ఆకర్షించేందుకు ప్రకటన చేశారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. 317 జీవో కారణంగా జరిగిన బదిలీల్లో 13 జిల్లాల్లో స్పౌజ్ కేసులను పరిష్కరించలేదని, ఇప్పుడు బదిలీలు ఎలా చేపడతారని మరికొంతమంది అంటున్నారు. ఖాళీలన్నీ భర్తీ చేయాలి బదిలీలు, పదోన్నతులు ఇవ్వాలనే నిర్ణయం మంచిదే. దీంతో పాటు స్కూళ్ళలో అన్ని స్థాయి ల్లో ఖాళీలు భర్తీ చేయాలి.. అప్పుడే విద్యా వ్యవస్థలో మార్పు సాధ్యం. ఎంఈవో, డిప్యూటీ డీఈవో వంటి పర్యవేక్షక పోస్టులను విస్మరించకూడదు. – పి రాజభాను చంద్ర ప్రకాశ్, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు మంచి నిర్ణయం ఉపాధ్యాయ సంఘాలకు ఈ తరహా తీపి కబురు ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే నిర్ణయం సమర్థనీయం. – బీరెల్లి కమలాకర్, పింగిలి శ్రీపాల్ రెడ్డి (పీఆర్టీయూటీఎస్ నేతలు) -
ఉపాధ్యాయులు, ఉద్యోగుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సోమవారం రోజు తన కార్యాలయంలో పరస్పర బదిలీలకు సంబంధించి సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. పరస్పర బదిలీలకు సంబంధించి ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 2,558 మంది ఉద్యోగుల, ఉపాధ్యాయులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు. -
టీచర్ల పరస్పర బదిలీలకు మోక్షం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కోర్టు తీర్పునకు లోబడి ఉంటామని ఒప్పంద పత్రం సమర్పించిన 1,260 మంది టీచర్ల పరస్పర బదిలీలపై ఈ నెల 20వ తేదీ.. సోమవారం నాటికి ఉత్తర్వులిచ్చే వీలుంది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను శుక్రవారం క్లియర్ చేసి, విద్యాశాఖకు పంపుతామని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి.శేషాద్రి తెలిపారని యూటీఎఫ్ నేతలు చావా రవి, లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ, జీఏడీ నుంచి ఫైల్ అందిన తర్వాత విద్యాశాఖ అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారని, సోమవారం బదిలీల ఉత్తర్వులు వెలువడతాయని శేషాద్రి స్పష్టం చేశారని వెల్లడించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం గత ఏడాది 317 జీవోను అమలు చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల స్థానికతను ధ్రువీకరిస్తూ, కొంతమందిని కొత్త జిల్లాలకు పంపింది. అయితే, పరస్పర బదిలీలకు అనుమతించాలని ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిడి చేశాయి. అందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో 2,598 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పరస్పర బదిలీలు కోరుకునే వారి పాత సర్వీసును కొనసాగించబోమని, కొత్తగా చేరినప్పటి నుంచే సర్వీసు వర్తింపజేస్తామని ప్రభుత్వం మార్గ దర్శకాలు వెలువరించింది. దీంతో పరస్పర బదిలీ లపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ క్రమంలో కోర్టు ఏ తీర్పు ఇచ్చినా కట్టుబడి ఉంటామని అంగీ కార పత్రం ఇచ్చిన వారిని బదిలీ చేసేందుకు విద్యాశాఖ సమ్మతించింది. దీంతో 1,260 మంది ఒప్పంద పత్రాలు సమర్పించారు. వీరిని బదిలీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పదోన్నతుల మాటేంటి? బదిలీలు, పదోన్నతులను ఏక కాలంలో పూర్తి చేస్తామని గత కొన్ని నెలలుగా ప్రభుత్వం చెబుతోంది. కానీ పదోన్నతుల ప్రక్రియపై ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం వెలువరించలేదు. కాగా, ఈ నెలాఖరుకు పదోన్నతుల ప్రక్రియ చేపడతామని ఉపాధ్యాయ సంఘాలకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇటీవల తెలిపారు. ఉపాధ్యాయులకు 2015లో ప్రమోషన్లు ఇచ్చారు. అప్పటినుంచి తదుపరి పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారంలోనూ న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి. త్వరలో వివాదం పరిష్కరించి, ప్రమోషన్లు ఇస్తామని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పడే ఖాళీలను కొత్తవారితో భర్తీ చేసే వీలుందని చెబుతున్నారు. -
నెలాఖరులోగా టీచర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరులోగా ప్రభుత్వ, పంచాయతీరాజ్, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలవుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమకు తెలిపినట్లు పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డితో కలిసి సంఘం నేతలు సోమవారం మంత్రిని కలిసి, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు కూడా చేపడతామని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. వారం రోజుల్లో సీనియారిటీ జాబితా రూపొందించేలా డీఈవోలకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి తెలిపారన్నారు. పరస్పర బదిలీలకు సంబంధించిన ఒప్పందపత్రం సమర్పించిన వారికి వెంటనే ఉత్తర్వులివ్వాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కోరగా, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. జీఏడీ ఆమోదం లభించిన తర్వాత ఆర్థిక శాఖ ఆమోదంతో ఒకట్రెండు రోజుల్లో అవసరమైన ఉత్తర్వులు అందనున్నాయని తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ బదిలీల షెడ్యూల్డ్ ఈ వారంలో వెలువడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
టీచర్ల బదిలీలకు చిక్కులెన్నో!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియకు అనేక చిక్కుముళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం భావించినట్టు జూన్‌లో బదిలీలు జరగకపోవ చ్చనే ఆందోళన ఉపాధ్యాయవర్గాల్లో కన్పిస్తోంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బదిలీలను పూర్తిచేయాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి కొంతకాలంగా పెద్దఎత్తున డిమాండ్ వస్తోంది. కొత్త జిల్లాల వ్యవస్థ కూడా అందుబాటులోకి రావడం, మన ఊరు–మనబడి, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రవేశపెట్టాలని భావించిన ప్రభుత్వం ఈసారి పకడ్బందీగా బదిలీలు, పదోన్నతులూ చేపట్టాలని భావించింది. అయితే, న్యాయపరమైన చిక్కులు, వివిధ సంఘాల అభ్యంతరాలను ఈ నెలరోజుల వ్యవధిలో పరిష్కరించడం కష్టమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎక్కడి సమస్యలు అక్కడే... కొత్త జిల్లా ఏర్పాటు, స్థానికతకు ప్రాధాన్యమిస్తూ ఇటీవల 317 జీవో తెచ్చారు. ఈ నేపథ్యంలో సీనియారిటీ చూడలేదని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లను పట్టించుకోలేదని, భార్యాభర్తల కేసులు సరిగా పరిగణనలోనికి తీసుకోలేదనే వాదనలు తెరమీదకొచ్చాయి. జీవో అమలు ప్రక్రియ ముగించినా టీచర్ల నుంచి వచ్చే అప్పీళ్లను పరిశీలించి పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ 6 వేలకుపైగా అప్పీళ్లు పాఠశాల విద్యాశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. స్పౌజ్ కేసులు 4 వేల వరకూ ఉన్నాయి. మొత్తం 3 వేల కేసులు న్యాయబద్ధంగా లేవని కొట్టిపారేసిన విద్యాశాఖ 500 అప్పీళ్లను మాత్రమే పరిష్కరించింది. మిగతావాటిపై అనేక దఫాలు సమీక్షలు జరిపినా కొలిక్కిరాలేదు. బదిలీలకు ముందే తమ సమస్యలు పరిష్కరించాలని పలువురు ఉపాధ్యాయులు విద్యాశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆందోళన తప్పదు: జంగయ్య, యూటీఎఫ్ నేత బదిలీలకు మార్గాన్ని సుగమం చేయడంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదు. ఇప్పుడున్న సమస్యలను పరిష్కరించకుండా సాధారణ బదిలీలు చేపట్టడం అసాధ్యం. పరిష్కరించగల చొరవ ప్రభుత్వమే తీసుకోవాలి. తాత్సారం చేస్తే బలమైన ఉద్యమానికి యూటీఎఫ్ సిద్ధమవుతుంది. పరస్పర బదిలీలూ అంతే.. 317 జీవో అమలు నేపథ్యంలో ఇతర జిల్లాలకు వెళ్లిన, దీర్ఘకాలంగా వేరే జిల్లాలకు వెళ్లాలనుకునేవారి కోసం ప్రభుత్వం పరస్పర బదిలీలకు అవకాశం కల్పించింది. దీంతో దాదాపు 4 వేల మంది పరస్పర బదిలీలు కోరుకున్నారు. కొత్త జిల్లాలకు వెళ్లినవారు పరస్పర బదిలీ కోరుకుంటే సర్వీసును పరిగణనలోనికి తీసుకోబోమని తొలుత మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తం కావడంతో గైడ్‌లైన్స్‌ను సవరించి సర్వీసును పరిగణనలోనికి తీసుకునేందుకు అంగీకరించింది. అయితే, దీనిపై కొంతమంది కోర్టును ఆశ్రయించారు. కోర్టు దీనిని పరిష్కరించకుండా, పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వకుండా సాధారణ బదిలీలు చేపట్టడం కుదిరేపని కాదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. మరోవైపు పదోన్నతుల విషయంలోనూ జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు, ప్రభుత్వ టీచర్ల మధ్య వివాదం కొనసాగుతోంది. ఎంఈవో, డీఈ వో పోస్టులు నిబంధనల ప్రకారం తమకే దక్కాలని ప్రభుత్వ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. కాదంటే కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. ఈ సమస్యలన్నీ ఉపాధ్యాయ బదిలీలకు చిక్కుముడులుగా మారాయి. -
జూన్‌లోనే టీచర్ల బదిలీలు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టినా.. ఇంకా మార్గదర్శకాలపై తర్జనభర్జన కొనసాగుతోంది. బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియను ఏప్రిల్ చివరి వారం చేపట్టి, మే రెండో వారానికి ముగించాలని తొలుత భావించారు. కానీ ఈ సమయంలో బదిలీలు చేపట్టడం అసాధ్యమని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ మారి.. ఇంటర్ పరీక్షలపై ప్రభావం పడటం, దీనితో టెన్త్ పరీక్షల తేదీల్లో మార్పు అనివార్యమవడమే కారణం. తాజా షెడ్యూల్ ప్రకారం.. మేలో టెన్త్ పరీక్షలు మొదలై ఆ నెల చివరివరకు కొనసాగుతాయి. ఆ తర్వాత మూల్యాంకన ప్రక్రియ జరుగుతుంది. అప్పటివరకు సాధారణ బదిలీలు చేపట్టడం కష్టమని అధికారులే చెప్తున్నారు. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెడుతున్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ చేపట్టాల్సి ఉంది. ఆ లెక్క తేలితే తప్ప, టీచర్ల బదిలీల ప్రక్రియ ముందుకెళ్లే పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు. మరోవైపు పదోన్నతులపై వస్తున్న డిమాండ్లను పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదికూడా బదిలీలపై ప్రభావం చూపే అవకాశముంది. మార్గదర్శకాలే కీలకం ఉపాధ్యాయుల సాధారణ బదిలీలను ఇంతకుముందు 2018 జూలైలో చేపట్టారు. తర్వాత అడపాదడపా విచక్షణ బదిలీలు మినహా పూర్తిస్థాయి ప్రక్రియ నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో చాలా మంది బదిలీల కోసం నిరీక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇదివరకు మాదిరిగా కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, 317 జీవో ఆధారంగా ఇటీవల జిల్లాలు మారిన టీచర్లు వంటి అంశాలు బదిలీల ప్రక్రియకు సవాల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలో మార్గదర్శకాలు ఇవ్వడం కష్టంగా ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మొత్తం సర్వీసును ప్రామాణికంగా తీసుకోవాలా? ప్రస్తుత స్థానంలో పనిచేసిన సర్వీసు పాయింట్ల ప్రకారం మార్గదర్శకాలు ఇవ్వాలా? అందరి సర్వీసును కొత్తగా పరిగణించాలా? అనే అంశాలపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీనికితోడు ఇటీవల కొత్త జిల్లాలకు వెళ్లిన వారు అదే జిల్లాలో వేరొక బడికి వెళ్లేందుకూ ప్రయత్నిస్తుండటం, పరస్పర బదిలీలు చేసుకున్నవారి సర్వీసును పరిగణనలోకి తీసుకోకపోవడం వంటివి కూడా మార్గదర్శకాల రూపకల్పనలో కీలకంగా మారుతాయని అధికారవర్గాలు అంటున్నాయి. హడావుడి బదిలీలు వద్దంటున్న టీచర్లు జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుందని, ఇలాంటి సమయంలో బదిలీలు చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోందని.. హడావుడిగా ముందుకెళ్తే కొత్త సమస్యలు వస్తాయని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బదిలీలు చేపట్టాలని నిర్ణయించినప్పుడు టెన్త్ పరీక్షలను ఏప్రిల్‌లోనే మొదలు పెడితే బాగుంటుందని యూటీఎఫ్ నేత చావ రవి అభిప్రాయపడ్డారు. అప్పుడు టీచర్లు కూడా ఆలోచించి అవసరమైన నిర్ణయం తీసుకునే వీలు ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌పై ఆందోళన గతంలో మాదిరిగా ప్రత్యక్ష కౌన్సెలింగ్ కాకుండా, ఈసారి ఆన్లైన్ ద్వారానే బదిలీల ప్రక్రియ చేపట్టాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ తరహా విధానం 317 జీవో అమలు సందర్భంగా అనేక అనుమానాలకు తావిచ్చిందని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్ష కౌన్సెలింగ్ చేపట్టాలని కోరుతున్నారు. అయితే ఈ అంశంపై వారంలో స్పష్టత వచ్చే వీలుందని ఓ అధికారి తెలిపారు. -
టీచర్లకు పదోన్నతుల వెల్లువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు త్వరలోనే భారీ ఎత్తున పదోన్నతులు లభించనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన నోట్‌ను పాఠశాల విద్యాశాఖ మంగళవారం అన్ని జిల్లా, డివిజన్, మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలు, కార్యక్రమాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు మొత్తంగా పాఠశాల వ్యవస్థకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరనుందని ఆ నోట్లో పేర్కొంది. పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు ఇలా.. ► 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేయడం వల్ల వచ్చే జూన్‌లోగా 30 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు వస్తాయి. ► రాష్ట్రంలో కొత్తగా 833 జూనియర్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. తద్వారా పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్ స్థాయి పదోన్నతులు లభించనున్నాయి. ప్రస్తుతం 41 మండలాల్లో మహిళా కళాశాలలు ఉన్నాయి. 202 మండలాల్లో అసలు కళాశాలలే లేవు. ఈ మండలాల్లో ఒక కో ఎడ్యుకేషన్, ఒక బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అంటే.. ఈ 202 మండలాల్లో కొత్తగా 404 జూనియర్ కాలేజీలు రానున్నాయి. మరో 429 మండలాల్లో ఒక్కో బాలికల కళాశాల ఏర్పాటు కానుంది. మొత్తంగా 833 కొత్త కళాశాలలు రానున్నాయి. ► మండల విద్యా శాఖ అధికారులు (ఎంఈవోలు) ఇక నుంచి పూర్తి స్థాయిలో విద్యా శాఖ బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా సెల్ఫ్ డ్రాయింగ్ అధికారాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం దీనిపై విధాన నిర్ణయం తీసుకుంది. మండల వనరుల కేంద్రంగా ఉన్న కార్యాలయాన్ని ఇక నుంచి మండల విద్యాశాఖ కార్యాలయంగా మార్చనున్నారు. ఎంఈవోలు దశాబ్దాలుగా ఈ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యాలయంలో అవసరమైన సిబ్బందిని కూడా ప్రభుత్వం నియమించనుంది. ► మండల స్థాయిలో ఇద్దరు ఎంఈవోలను నియమిస్తారు. డివిజన్, జిల్లా స్థాయిలోనూ పోస్టులు పెరగనున్నాయని నోట్లో విద్యా శాఖ పేర్కొంది. -
ఇద్దరి ప్రాణం తీసిన టీచర్ల బదిలీ.. ఒకరు గుండెపోటుతో, మరొకరు ఉరేసుకుని
మరిపెడ రూరల్/ మోర్తాడ్(బాల్కొండ): జీవో 317 నేపథ్యంలో బదిలీకిగురైన ఇద్దరు మహిళా టీచర్లు తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకరు గుండెపోటు వల్ల మరణిస్తే, మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆదివారం ఒకే రోజు జరిగిన ఈ సంఘటనలు ఉపాధ్యాయవర్గాల్లో ఆందోళన రేకెత్తించాయి. వివరాలిలా ఉన్నాయి.. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నల్లకుంట గ్రామానికి చెందిన పుల్యాల శ్రీమతి (మాధవి)(40) మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పూసలతండా ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా ఉద్యోగం చేస్తున్నారు. హన్మకొండలో నివాసముంటూ విధులకు హాజరవుతున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆమెను ములుగు జిల్లా ఏటురునాగారం మండలం రొయ్యూరు యూపీఎస్ పాఠశాలకు కేటాయించారు. అయితే బదిలీపై వెళ్లడం ఇష్టంలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ఆమెకు ఆదివారం హన్మకొండలోని ఇంటి వద్ద గుండెనొప్పిరావడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలున్నారు. వేరే జోన్‌కు బదిలీ చేశారని.. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం పల్లికొండకు చెందిన సరస్వతి (32)కి అదే మండలం బాబాపూర్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. భర్త గల్ఫ్‌కు వెళ్లగా, సరస్వతి బాబాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)గా పని చేస్తున్నారు. ఉద్యోగుల బదిలీల్లో భాగంగా సరస్వతి రాజన్న సిరిసిల్ల జోన్ పరిధిలోకి బదిలీ అయ్యారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండా పాఠశాలకు ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు. అయితే సొంత జిల్లా నుంచి పక్క జిల్లాకు బదిలీ కావడంతో సరస్వతి తీవ్ర మానసిక ఒత్తిడి గురైనట్లు తెలిసింది. పొరుగు జిల్లాలో పని చేయడం ఇష్టం లేక ఆమె.. ఆదివారం ఇంట్లో ఉరేసుకున్నారు. బదిలీ కారణంగా తనకు అన్యాయం జరిగిందనే మనో వేదనతో సరస్వతి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, సహచరులు చెబుతున్నారు. -
మాకు టీచర్లు కావాలి..
ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల... మూసివేసే దశ నుంచి ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టే స్థాయికి ఎదిగింది. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమ పాఠశాలగా రాష్ట్రస్థాయి గుర్తింపు పొందింది. అలాంటి పాఠశాలలో బదిలీల ప్రక్రియలో ఒక్కరే ఉపాధ్యాయుడు మిగిలారు. తమ భవిష్యత్‌ను కాపాడాలంటూ విద్యార్థులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు లేఖలు రాశారు. అసలు సమస్య ఇదీ.. 2015–16లో 8 మంది ఎస్జీటీ, ఒక టీపీటీ పోస్టుతో ఆంగ్ల మాధ్యమంలో 7వ తరగతి వరకు పునఃప్రారంభమైన ఈ పాఠశాల.. తరువాత పదవ తరగతి వరకు అప్గ్రేడైంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు కాకుండానే అప్‌గ్రేడ్ కావడంతో సమస్యలు మొదలయ్యాయి. విద్యాకమిటీ సొంత డబ్బులతో కొందరు ప్రైవేట్ టీచర్లను ఏర్పాటుచేసుకుంది. మరోపక్క ఏడవ తరగతి వరకే బోధించాల్సిన ఎస్జీటీలు, ఉన్నత పాఠశాలలో ఆంగ్లమాధ్యమంలో బోధించడం కష్టమైనప్పటికి, పాఠశాల అప్‌గ్రేడ్ అవుతున్న విధంగా వారూ అప్‌గ్రేడ్ అయ్యారు. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు పెద్ద తరగతులకు, ప్రాథమిక పాఠశాలకు ప్రైవేట్ ఉపాధ్యాయులతో బోధన కొనసాగించారు. ఉన్నతాధికారులు సాంకేతిక కారణాలతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మాత్రం మంజూరు చేయట్లేదు. ఈ క్రమంలో ఇటీవల చేపట్టిన బదిలీలతో పాఠశాలలోని 8 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఒకే ఉపాధ్యాయుడు మిగిలారు. దీంతో పాఠశాలలో ప్రస్తుతం ఉన్న 8 ఎస్జీటీ పోస్టులకు అదనంగా 7 స్కూల్ అసిస్టెంట్, ఒక పీజీ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లతో పాటు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దేవసేనకు 468 మంది విద్యార్థులు కార్డులు రాసి గురువారం పోస్టుచేశారు. -
76 వేలమంది టీచర్ల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీ ఉత్తర్వుల జారీ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈనెల 17 వరకు ఆన్లైన్లో విభాగాల వారీగా బదిలీ ఉత్తర్వులు జారీచేస్తారు. బుధవారం 1,400 మంది ఎల్ఎఫ్ఎల్ (లో ఫిమేల్ లిటరసీ) హెచ్ఎంలకు బదిలీ ఉత్తర్వులను వెబ్సైట్ నుంచి జారీచేశారు. రాష్ట్రంలో మొత్తం 76 వేలమంది టీచర్లకు బదిలీలు జరుగుతున్నాయి. బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం, నోటిఫికేషన్ విడుదల చాలారోజుల ముందే మొదలైనా.. అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ పూర్తికావడానికి తీవ్ర జాప్యం జరిగింది. ఎదురైన అనేక సమస్యల్ని పరిష్కరిస్తూ పాఠశాల విద్యాశాఖ ఒక్కో దశను దాటుకుంటూ వచ్చింది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఈ బదిలీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒకే స్కూలులో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న టీచర్లను, అయిదేళ్లుగా చేస్తున్న ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తున్నారు. బదిలీకి దరఖాస్తు చేయడానికి రెండేళ్ల కనిష్ఠ సర్వీసు పెట్టారు. ఇలా అన్నీ కలిపి.. మొత్తం 76 వేలమంది ఈ బదిలీ ప్రక్రియలోకి చేరారు. వివిధ ప్రాతిపదికల ఆధారంగా వారికి కేటాయించే పాయింట్లను బట్టి ఈ బదిలీ చేస్తున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలు, వితంతు ఉపాధ్యాయినులు.. ఇలా కొన్ని కేటగిరీల టీచర్లకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. వారికి వచ్చిన పాయింట్ల ఆధారంగా వారు ప్రాధాన్యక్రమంలో ఇచ్చిన పాఠశాలల వెబ్ ఆప్షన్లను అనుసరించి బదిలీ చేస్తున్నారు. బదిలీ ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకుని తాము పనిచేస్తున్న స్కూలు నుంచి రిలీవ్ అయి తమకు కేటాయించిన కొత్త స్కూలులో జాయిన్ అవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు. బదిలీ అయిన టీచర్ల రిలీవ్, జాయిన్ ప్రక్రియను రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈవోలు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. సంక్రాంతి సెలవుల అనంతరం ఈనెల 18 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. -
పనితీరే ప్రామాణికం
సాక్షి, హైదరాబాద్: దేశ భవిష్యత్తును నిర్మించేది గురువులే. పునాదులు బలంగా ఉంటేనే జాతి పురోగమిస్తుంది. అందుకే నూతన జాతీయ విద్యా విధానంలో కేంద్రం బోధనను మెరుగుపర్చడంపై ప్రత్యేకదృష్టి పెట్టింది. సమూల మార్పులు రావాలని, విద్యాబోధనలో యాంత్రిక, మూస విధానాలు పోవాలని సంకల్పించింది. టీచర్ల పనితీరును నిరంతరం మదింపు చేయాలని, సామర్థ్యం ఆధారంగానే పదోన్నతులు, వేతనాల పెంపు ఉండాలని నిర్ణయించింది. ఇందులో భాగం గా పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు పనితీరు సూచికలు (పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) అమల్లోకి రానున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో ఉపాధ్యాయుల బోధన తీరు ఎలా ఉంది? అర్థమయ్యేలా చెబుతున్నారా? అనే అంశాల ఆధారంగా టీచర్ల పనితీరును అంచనా వేయనున్నారు. అంతేకాదు విద్యార్థులు ఏం నేర్చుకున్నారన్న దాన్ని పరీక్షించేందుకు లెర్నింగ్ ఇండికేటర్స్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా 2021– 22 నుంచి వీటిని ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఇకపై టీచర్ల పనితీరు ఆధారంగానే పదోన్నతులు, వేతనాల పెంపు విధానం అమలు చేసేలా రాష్ట్రాలు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేసింది. ఇప్పుడున్న నిబంధనలను కూడా అందుకు అనుగుణంగా మార్పు చేయాలని కోరింది. అంతకంటే ముందు టీచర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని, ప్రతి టీచర్, ప్రిన్సిపాల్‌కు కచ్చితంగా 50 గంటల కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం (సీపీడీ) ఉండేలా చూడాలంది. రాష్ట్రాల్లోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), జిల్లా విద్యా శిక్షణ సంస్థల (డైట్) ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇటీవల నూతన జాతీయ విద్యా విధానంపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ఆదేశాలను జారీ చేసింది. బదిలీల్లోనూ ప్రాధాన్యం టీచర్లు కనబర్చే ప్రతిభ,, జవాబుదారీతనం ఆధారంగా పదోన్నతులు, బదిలీల్లో ప్రాధాన్యం కల్పించాలని పేర్కొంది. టీచర్స్ కెరీర్ ప్రోగ్రాంను రాష్ట్రాలు రూపొందించుకోవాలని, ఇందుకోసం ఇప్పటివరకు ఉన్న నిబంధనలు, మార్గదర్శకాలను మార్పు చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రధానోపాధ్యాయులకు పాఠశాల నిర్వహణ, నాయకత్వంలో సర్టిఫికెట్ కోర్సును ప్రవేశపెట్టాలని భావిస్తోంది. సీనియారిటీ ఆధారంగా కాకుండా సర్టిఫికెట్ కోర్సు చేసిన వారిని ప్రధానోపాధ్యాయుడిగా నియమిస్తేనే బాగుంటుందని యోచిస్తోంది. కొత్తగా టీచర్లుగా నియమితులైన వారు పాఠశాలల్లో విధుల్లో చేరడానికంటే ముందే ఉపాధ్యాయ విద్యాసంస్థల్లో వారికి ఆరు నెలల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వనుంది. మరోవైపు ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ► తరగతి గదిలో పాఠ్యాంశాల బోధనకు ముందు టీచర్లు ఏం చేయాలి. ఏం చేస్తున్నారు? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ► పిల్లల పురోగతి తెలుసుకొని తగిన చర్యలు చేపట్టేందుకు ఆన్లైన్ మానిటరింగ్ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. దానిద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి తక్షణ చర్యలు చేపడతారు. ► టీచర్లకు సబ్జెక్టుపై, బోధనలోని స్టెప్స్‌పై (ఏ పాఠ్యాంశం తర్వాత ఏది చెప్పాలనేది) శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. ► ప్రతినెలా సబ్జెక్టుల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వృత్తిపరమైన నైఫుణ్యాల అభివృద్ధికి కృషి చేస్తారు. బోధన యాంత్రికం పాఠశాలల్లో విద్యాబోధనలో అనేక లోపాలు ఉన్నాయి. ఈ విషయం గతంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ... రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నిర్వహించిన సర్వేలోనే తేలింది. బోధన సరిగ్గా జరగడం లేదన్న నిర్ణయానికి వచ్చింది. ఉపాధ్యాయులు యాంత్రికంగా పనిచేస్తున్నారని, పాఠ్యపుస్తకాల్లోని ముందుమాట కూడా సరిగ్గా చదవకుండానే పాత పద్ధతిలో బోధిస్తున్నారని తేల్చింది. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా ఉపాధ్యాయులు పుస్తకాల్లోని ముందుమాట చదివి బోధన చేపట్టాల్సి ఉంటుంది. కాని వాటిని చదివి అర్థం చేసుకొని పాఠాలు బోధిస్తున్న వారు కేవలం 20 శాతం మంది మాత్రమే ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ అంచనాకు వచ్చింది. మిగిలిన వారు మొక్కుబడిగా బోధన కొనసాగిస్తున్నారని తేల్చింది. -
ఏపీలో టీచర్ల బదిలీలకు ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్ ద్వారా టీచర్ల బదిలీలు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. వెబ్‌కౌన్సిల్ ఆప్షన్ల ఆధారంగా బదిలీల ప్రక్రియ జరుగనుంది. టీచర్ల బదిలీల ఉత్తర్వుల పట్ల పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల ఉపాధ్యాయులు గత మూడేళ్లుగా బదిలీల కోసం నిరీక్షిస్తున్నారు. (చదవండి: మా నాన్న మృతిపై రాజకీయాలు చేస్తావా?) -
ఏపీ: ఉపాధ్యాయులకు శుభవార్త
-
ఏపీ: ఉపాధ్యాయులకు శుభవార్త
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం తెలిపారు. ఈమేరకు సంబంధిత ఫైలుపై శనివారం ఆయన సంతకం చేశారు. రెండు మూడు రోజుల్లో బదిలీల అంశంపై ఉత్తర్వులు వెలువడనున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 29-2-2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు అని తెలిసింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలు కార్యక్రమం చేపట్టనున్నారు. కాగా, టీచర్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మూడేళ్లుగా ఎదురు చూస్తున్న బదిలీల అంశంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్ రామ్ రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: టీడీపీ ధనిక వర్గాల పార్టీ: ఎమ్మెల్యే వాసుపల్లి) -
టీచర్ల బదిలీలపై విద్యాశాఖ కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి విద్యాశాఖ ప్రభుత్వ ఆమోదానికి దస్త్రం (ఫైలు)ను పంపింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బదిలీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా ఈ బదిలీలు చేపట్టనున్నారు. టీచర్లకు స్కూళ్ల ఎంపిక ఆప్షన్ల నమోదు నుంచి బదిలీ ఉత్తర్వులు జారీ వరకు పూర్తి ప్రక్రియలను ఆన్లైన్లోనే నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇక బదిలీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అనేక అంశాలపై నిర్ణయాలు చేపట్టాల్సి ఉన్నందున ముందుగా అందుకు సంబంధించిన కసరత్తును అధికారులు చేపట్టారు. ఖాళీల వివరాలతో పాటు ఇతర అంశాలను సేకరించి సిద్ధం చేసుకోవాలని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి మండలస్థాయి నుంచి వివరాల సేకరణ ప్రక్రియను చేపట్టారు. ►హేతుబద్ధీకరణ, తప్పనిసరి బదిలీ, పదోన్నతి, రాజీనామా, పదవీవిరమణలతో అయ్యే ఖాళీల జాబితాలను పంపించాలని విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు సూచించింది. ►అనధికారిక సెలవు, గైర్హాజరులో ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను ఖాళీలుగా చూపించాలని పేర్కొంది. సస్పెన్షన్‌లో ఉన్న వారి ఖాళీలను పరిగణనలోకి తీసుకోరాదని వివరించింది. ►మరోవైపు ఆయా జిల్లాల విద్యాధికారులు ఇందుకు అనుగుణంగా వివరాల సేకరణ చేపట్టారు. యుడైస్ కోడ్ ప్రామాణికంగా పాఠశాలల్లోని ఖాళీలల వివరాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆయా ఖాళీల సమాచారానికి కోడ్ జాగ్రత్తగా నమోదు చేయాలి. హెచ్ఆర్ఏను అనుసరించి నాలుగు కేటగిరీలుగా స్కూళ్లను చూపించాలి. ప్రభుత్వ, ఎంపీపీ, జెడ్పీ స్కూళ్ల వివరాలు మాత్రమే నమోదు చేయాలి. ►సెప్టెంబర్ 1 నాటికి ఉండే ఖాళీల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలి. ►భాషా పండితుల (లాంగ్వేజ్ పండిట్) పోస్టులు స్కూల్ అసిస్టెంటు (లాంగ్వేజెస్)గా అప్‌గ్రేడ్ అయినందున వాటిని ఎల్పీగా పేర్కొనకూడదు. ►2015 నవంబర్ 18వ తేదీకన్నా ముందు తేదీల నుంచి ప్రస్తుత పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, టీచర్ల వివరాలు సమర్పించాలి. ►1970 సెప్టెంబర్ 1 తరువాత పుట్టిన పురుష ఉపాధ్యాయులు బాలికల హైస్కూళ్లలో పనిచేస్తుంటే వారి వివరాలు ఇవ్వాలి. -
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్
-
టీచర్ల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పారదర్శకంగా ఆన్లైన్ పద్ధతిలో బదిలీలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. పదో తరగతి పరీక్షల అనంతరం బదిలీలు చేపట్టాలని సీఎం జగన్ సూచించారు. బుధవారం తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని, గిరిజన ప్రాంతాల్లో కూడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. -
‘ఆపద్ధర్మం’లో అడ్డదారి బదిలీలు
సాక్షి, హైదరాబాద్ : ఆపద్ధర్మ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలను తీసుకునే అధికారం లేనప్పటికీ అడ్డదారి బదిలీలకు విద్యాశాఖ తెరలేపింది. ఒకవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, మరోవైపు టీచర్ల బదిలీలపై నిషేధం ఉండగా పైరవీలకు తలొగ్గింది. నాలుగేళ్ల తర్వాత ఈ ఏడాది జూన్‌లో సాధారణ బదిలీలు జరిగాయి. దాదాపు 74 వేల మంది టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోగా 46 వేల మందికి స్థానచలనం కలిగింది. ఇందులో దాదాపు వంద మంది టీచర్లు తమ బదిలీల్లో తప్పులు దొర్లినట్లు పేర్కొంటూ విద్యాశాఖకు అప్పీళ్లు చేసుకున్నారు. వీటిని పక్షంరోజుల్లో పరిశీలించి పరిష్కరించాల్సి ఉండగా మూడు నెలలు కావస్తున్నా పట్టించుకోకపోగా దొడ్డిదారి బదిలీలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నలుగురు టీచర్లకు వరుసగా బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేయడం విద్యాశాఖ వర్గాల్లో దుమారం రేపుతోంది. వీరిలో ముగ్గురు టీచర్లకు అంతర్ జిల్లా బదిలీలు కాగా, మరో టీచర్‌కు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో స్థానచలనం కలిగింది. ఒక టీచర్‌ను మాత్రం ఏకంగా జిల్లా పరిషత్ యాజమాన్యం నుంచి ప్రభుత్వ యాజమాన్యానికి బదిలీ చేయడం గమనార్హం. మరో 22 మంది టీచర్లకు ప్రత్యేక బదిలీలు కలిగించేందుకు విద్యాశాఖలో పైరవీలు వేగవంతమయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు... వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఎల్.హెచ్.దుర్గాభవాని(స్కూల్ అసిస్టెంట్–ఇంగ్లిష్)ని రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ 24న ప్రొసీడింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య సెప్టెంబర్ 11న మెమో జారీ చేశారు. కరీంనగర్ జిల్లా ముగ్దూంపూర్ పాఠశాలలో ఎస్జీటీ పులి కవితను రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ హరిజనవాడ పాఠశాలకు బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ 22న ప్రొసీడింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మోమోను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదే నెల 11వ తేదీన జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం బోడజానంపేట్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న వి.జీవనజ్యోతి రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం బొమ్మనగండి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ 12న ప్రొసీడింగ్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మోమోను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదే నెల 11వ తేదీన జారీ చేశారు. సిద్దిపేట్ జిల్లా నంగునూరు మండలం రాజ్గోపాల్పేట్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పీవీ సునిత(స్కూల్ అసిస్టెంట్–ఇంగ్లిష్)ను హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ చేస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సెప్టెంబర్ 6న మెమో జారీ చేశారు. స్థానిక సంస్థల యాజమాన్యానికి చెందిన టీచర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలకు బదిలీ కావడం గమనార్హం. పైరవీలకు తలొగ్గి ఆపద్ధర్మ ప్రభుత్వంలో జరిగిన బదిలీల వెనుక కొందరు కీలక వ్యక్తులు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. సిద్దిపేట్ జిల్లా నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయిన టీచర్ బదిలీ విషయంలో విద్యాశాఖ అధికారులపై సీఎం ఓఎస్డీ ఒత్తిడి చేసినట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయిన టీచర్ విష యంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సిఫారసు ఆధారంగా బదిలీ చేస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. వికారాబాద్ జిల్లా నుంచి రంగారెడ్డికి బదిలీపై వచ్చిన టీచర్ విషయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సిఫారసు ఆధారంగా బదిలీ చేసినట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం. అంతర్జిల్లా బదిలీ విషయంలో భారీగా లావాదేవీలు జరిగినట్లు విద్యాశాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక కేటగిరీల బదిలీలు కావడంతో పెద్దమొత్తంలోనే ముడుపులు చెల్లించినట్లు ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆరోపిస్తున్నాయి. జూన్‌లో సాధారణ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చే రెండ్రోజుల ముందు కూడా ఇదే తరహాలో వంద మంది టీచర్లకు దొడ్డిదారిలో బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. -
1800 పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేరా?
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి ఉపాధ్యాయుల బదిలీల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1800 పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేని పరిస్థితుల వల్ల ఆ బడులు మూతపడటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇది నిజమేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేసిన హైకోర్టు, ఆ పాఠశాలల్లోని విద్యార్థుల భవిష్యత్తు ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘కేరళ రాష్ట్రంలో ఎమ్మెల్యేల పిల్లలతో సహా ప్రజా ప్రతినిధుల పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తుంటారు. ఈ విషయంలో అక్కడ తల్లిదండ్రుల సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక్కడ (తెలంగాణ) లో ఆ పరిస్థితి లేకపోవడం బాధాకరం. ఇక్కడ కూడా స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకుని పరిస్థితిలో మార్పు తీసుకురావాలి.’అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని, ప్రమాణాలు పెంచే దిశగా చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ ఎం.వీ.ఫౌండేషన్ కన్వీనర్ ఆర్.వెంకట్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది అర్జున్‌కుమార్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సీజే కేరళలలో ప్రజా ప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. -
బిందాస్ ట్రాన్స్ఫర్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం...అధికారుల నిర్లక్ష్యం వెరసి ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చేశాయి. కొత్త నోటిఫికేషన్లు జారీ చేయకపోవడం...ఖాళీలు భర్తీ చేయకపోవడానికి తోడు తీరా విద్యాసంవత్సరం ప్రారంభమైన తర్వాత టీచర్ల బదిలీల ప్రక్రియ చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ స్కూల్లో ఏ ఏ మీడియంలో బోధన జరుగుతోంది? ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు? ప్రస్తుతం ఎంతమంది టీచర్లు పని చేస్తున్నారు? ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి? ఎవరెవరు బదిలీపై వెళ్లనున్నారు?.. వంటి అంశాలపై కనీస కసరత్తు చేయకుండానే బదిలీల పక్రియ చేపట్టడంతో పలు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు బాధ్యతను మరచి...తమబాగోగులే ముఖ్యమని భావించారు. ఒత్తిడికి దూరంగా...సొంత ఇంటికి దగ్గరగా ఉన్న పాఠశాలలకు బదిలీ అయ్యారు. ఫలితంగా హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ పరిధిలోని రాజ్‌భవన్ పాఠశాల సహా కుల్సుంపుర, బంజారాహిల్స్‌లోని ఎంబీటీనగర్ స్కూలు, జీహెచ్ఎస్ నాంపల్లి(బోరబండ), అమీర్పే ట్–1, జీహెచ్ఎస్ చౌరా(ఉర్దూ మీడియం), సీతాఫల్మండి, జీహెచ్ఎస్ ఎల్లారెడ్డిగూడ, జీహెచ్ఎస్ ఎర్రమంజిల్, జీహెచ్ఎస్ షేక్‌పేట, హిమాంపూర్, మాసాబ్ ట్యాంక్(రెడ్‌క్రాస్), అంబర్పేట్ సహా పలు ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యాపకుల కొరత ఏర్పడింది. గతంతో బదిలీల సమయంలో మొత్తం ఖాళీల్లో 50 శాతం ఖాళీలను మాత్రమే చూపించేవారు. ఈ సారి ఇందుకు విరుద్ధంగా వందశాతం ఖాళీలు చూపించడం వల్ల అప్పటి వరకు ఆయా పాఠశాలల్లో పని చేస్తున్న వారంతా బిందాస్‌గా తమకు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఒత్తిడి తక్కువగా ఉన్న స్కూళ్లకే జై... నిజానికి ఏ ఉపాధ్యాయుడైనా మంచి గుర్తింపు పొంది, మౌలిక సదుపాయాలు ఉండి, రాకపోకలకు అనుగుణంగా, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో పని చేయడానికి ఇష్టపడుతుంటారు. కొంత మంది అలాంటి స్కూల్లో పని చేసే అవకాశం దక్కడం గర్వంగా కూడా ఫీలవుతారు. కానీ హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు తీరు ఇందుకు భిన్నంగా ఉంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై గవర్నర్ సహా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు దృష్టిసారించారు. మంచి ఫలితాలు రాబట్టేందుకు వీటిపై నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. కొంత మంది ఉపాధ్యాయులకు ఇది ఏమాత్రం నచ్చలేదు. ఉన్నతా ధికారుల పర్యవేక్షణలో పనిచేయడం ఇష్టంలేని ఉపాధ్యాయులు..ఇంటికి సమీపంలో...ఏ ఒత్తిడి లేని పాఠశాలలో పని చేయడమే నయమని భావించి ఆ మేరకు బదిలీపై వెళ్లిపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు మంచి మార్కులతో ఉత్తమ పాఠశాలలుగా గుర్తింపు పొందిన విద్యాలయాలు సైతం ప్రస్తుతం పాఠాలు బోధించేందుకు అధ్యాపకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాలతో విద్యార్థులు సహా వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. ఈ ఏడాది కూడా విద్యావాలంటీర్లే దిక్కు... హైదరాబాద్జిల్లా పరిధిలో 689 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా, వీటిలో 12 పాఠశాలలు ఒకరిద్దరు ఉపాధ్యాయులతో నెట్టుకొస్తుంటే, అదే రంగారెడ్డి జిల్లాలో 1298 పాఠశాలలు ఉండగా, వీటిలో ఏకంగా 63 పాఠశాలల్లో అసలు ప్రభుత్వ ఉపాధ్యాయులే లేరు. బదిలీలకు ముందు 104 పాఠశాలల్లో ఒక్క రెగ్యులర్ ఉపాధ్యాయుడు కూడా లేడంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఫలితంగా ఆయా పాఠశాలల్లోని ఖాళీలను గతంలో మాదిరే ఈ ఏడాది కూడా విద్యావాలంటీర్లతో భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ 698 మంది విద్యావాలంటీర్ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారులు (1286 మంది విద్యావాలంటీర్లు) నేడో రేపో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఆశ్చర్యకరమైన అంశమేమంటే వికారాబాద్ జిల్లా నుంచి భారీగా మేడ్చల్ జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో ఇక్కడ పెద్దగా ఖాళీలు లేవు. కేవలం 153 మంది విద్యావాలంటీర్లు అవసరం ఉన్నట్లు గుర్తించింది. -
‘ఆశ్రమ’ టీచర్ల బదిలీ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల బదిలీలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఉపాధ్యాయులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఈ టీచర్లకూ వర్తింపజేశారు. బదిలీలకు సంబంధించి ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆశ్రమ పాఠశాలల్లోని టీచర్ల బదిలీలు సైతం ఆన్లైన్ పద్ధతిలో వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా చేపట్టనుంది. బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సిలింగ్లో వస్తున్న సందేహాలను నివృ త్తి చేయాలని టీఎస్పీఆర్టీయూ పే ర్కొంది. ట్రాన్స్ఫర్ షెడ్యూల్లో అప్లికేషన్‌కు జూన్ 12 వరకు అవకాశం ఇవ్వాలని కోరింది. ఆన్లైన్లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని సరి చేసి బదిలీ దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరింది. -
అడ్డదారిలో టీచర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్ : విద్యాశాఖలో అడ్డదారి బదిలీలకు తెరలేచింది. సాధారణ బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో ఏకంగా వందలాది మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ఈ మేరకు విద్యాశాఖ గుట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగులకు సాధారణ బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. బదిలీ మార్గదర్శకాల రూపకల్పనలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఈ తరుణంలో అక్రమ బదిలీల ప్రక్రియ విద్యాశాఖలో కలకలం సృష్టిస్తోంది. బుధవారం రాత్రి దాదాపు 100 మంది టీచర్లను బదిలీ చేస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరో 150 మంది టీచర్ల బదిలీలకు సంబంధించి ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో అత్యధికులు అంతర్ జిల్లా (ఇతర జిల్లాలకు) బదిలీలు పొందగా.. మరికొందరు జిల్లా పరిధి (విత్ ఇన్ డిస్ట్రిక్ట్)లో బదిలీ అయ్యారు. పలుకుబడికే పట్టం టీచర్ల బదిలీలకు భారీ మంత్రాంగమే నడిచింది. ప్రముఖుల అండదండలున్న టీచర్లకే స్థానచలనం కలిగింది. ఒక్కో టీచర్ బదిలీకి భారీ మొత్తంలో నగదు చేతులు మారినట్లు తెలిసింది. సాధారణ బదిలీలు జరిగితే పట్టణ ప్రాంత పోస్టులు భర్తీ అవుతాయని భావించిన కొందరు రాజకీయ నేతలు.. అధికారులతో చేతులు కలిపి దొడ్డిదారి బదిలీలకు తెరతీశారు. అందులో భాగంగా ప్రత్యేక ఉత్తర్వులతో పట్టణ ప్రాంతాల్లో పాగా వేయాలని భావించి రంగంలోకి దిగారు. మొత్తంగా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో టీచర్ల బదిలీ వ్యవహారం సాఫీగా జరిగింది. వాస్తవానికి ఒకట్రెండు రోజుల్లో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది. బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రత్యేక బదిలీలు చేపట్టొద్దని సంఘాలు స్పష్టం చేశాయి. మంత్రి సైతం అంగీకరించారు. కానీ సమావేశం ముగిసిన గంటల వ్యవధిలోనే అడ్డగోలుగా బదిలీ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. 30 శాతం హెచ్ఆర్ఏ కోసం.. తాజాగా బదిలీ పొందిన వారంతా పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకే ట్రాన్స్ఫర్ అయ్యారు. పట్టణ ప్రాంతాల బదిలీకి ప్రధాన కారణం 30 శాతం హెచ్ఆర్ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) రావడమే. అంతేకాకుండా రాజధాని నగరంలో నివసించే వెసులుబాటు ఉంటుందని భావించిన టీచర్లు భారీ మొత్తంలో నజరానాలు ఇచ్చుకుని మరీ దొడ్డిదారిలో బదిలీలు పొందారు. బుధవారం రాత్రి వచ్చిన బదిలీ ఉత్తర్వుల్లో సగానికిపైగా టీచర్లు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకే వచ్చారు. ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయా టీచర్లు కొత్త పాఠశాలల్లో జాయిన్ అయ్యేందుకు పరుగులు పెట్టారు. ఉదయం పదిన్నర గంటల సమయంలోనే డీఈవో కార్యాలయాలకు వచ్చి రిపోర్టు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 32, మేడ్చల్‌లో 19, కరీంనగర్లో 12 బదిలీలు జరిగాయి. మిగతా బదిలీలు నల్లగొండ, మెదక్, వరంగల్ జిల్లాల్లో జరిగినట్టు తెలిసింది. స్థానికులకు అన్యాయమే! ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీల వ్యవహారంతో స్థానిక నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరగనుంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నిరుద్యోగులు ఎక్కువగా నష్టపోనున్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే స్థానిక, స్థానికేతర ఉపాధ్యాయుల నిష్పత్తి పరిమితికి మించి ఉంది. సాధారణంగా 20 శాతం ఉండాల్సిన స్థానికేతర నిష్పత్తి.. 40 శాతాన్ని మించింది. తాజాగా మరిన్ని అంతర్ జిల్లా బదిలీలు కావడంతో జిల్లాలో ఉన్న ఖాళీలు తగ్గిపోనున్నాయి. దీంతో నియామకాల సమయంలో స్థానిక అభ్యర్థులకు అవకాశాలు తగ్గిపోనున్నాయి. మండిపడ్డ సంఘాలు.. రేపు డైరెక్టరేట్ ముట్టడి అడ్డదారి బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. ఎస్టీయూ, యూటీఎఫ్, టీటీఎఫ్, టీపీటీఎఫ్, టీపీఆర్టీయూ సంఘాల నేతలు వీటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడిచి ప్రభుత్వమే ఇలా అడ్డదారిలో బదిలీలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం కార్యాలయం కేంద్రంగా పైరవీ బదిలీలు జరగడం దారుణమన్నారు. ఈ బదిలీల రద్దుకు ఆందోళన చేస్తామని ప్రకటించారు. జాక్టో, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించాలని నిర్ణయించాయి. -
ప్రస్తుతానికి బదిలీలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు మార్గం సుగమమైంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే బదిలీలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో జరిగిన బదిలీల ఉత్తర్వుల్లోని నిబంధనల ఆధారంగా.. స్వల్ప సవరణలతో తాజా బదిలీల ప్రక్రియ చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. టీచర్ల బదిలీలు, పదోన్నతుల అంశంపై బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యా శాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. బదిలీల కంటే ముందే పదోన్నతులు ఇవ్వాలని ఈ భేటీలో ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అయితే పదోన్నతుల అంశం సర్వీసు నిబంధనలతో ముడిపడి ఉందని, అది తేలనిదే పదోన్నతులివ్వడం కష్టమని, దీనిపై కోర్టు కేసులు కూడా ఉన్న నేపథ్యంలో పదోన్నతుల కౌన్సెలింగ్ వీలుకాదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. అనంతరం బదిలీల అంశంపై చర్చించారు. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 12, 86లలోని నిబంధనల్లో స్వల్ప మార్పులు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరగా.. అధికారులు సానుకూలంగా స్పందించారు. టీచర్లకు ఎనిమిదేళ్లు.. : ఉపాధ్యాయుల తప్పనిసరి బదిలీ సమయాన్ని కూడా సమావేశంలో నిర్ధారించారు. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులను బదిలీ చేయాలని నిర్ణయించారు. అదే స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీల)కు మాత్రం ఎనిమిదేళ్ల పరిమితి నిర్ధారించారు. పాత జిల్లాల ప్రకారమే బదిలీలు చేపడుతున్నందున ఒక్కో జిల్లాకు అదనపు డైరెక్టర్ స్థాయి అధికారిని పరిశీలకుడిగా నియమించాలని.. యాజమాన్యాల వారీగా బదిలీలు నిర్వహించాలని.. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. ఇక ఏకీకృత సర్వీసు నిబంధనలకు సంబంధించి ప్రత్యేక న్యాయవాదిని నియమించాలని ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాయి. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లలో ఏకాభిప్రాయం వచ్చిన వాటికి పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. మిగతా అంశాలపై అంతర్గత సమావేశం నిర్వహించి చర్చిస్తామని స్పష్టం చేసింది. బదిలీలకు సంబంధించి సంఘాలు చేసిన సూచనలతో ప్రతిపాదనలు రూపొందించి.. ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో బదిలీల మార్గదర్శకాలు వెలువడనున్నట్లు సమాచారం. -
మే 5 నుండి ఉద్యోగుల బదిలీలు
-
అయ్యవార్లలో పాయింట్ల గోల
- నమోదు కాని పాయింట్లు! - ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదంటున్న అధికారులు అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ బదిలీల్లో వివిధ పాయింట్ల నమోదు ఆందోళన కలిగిస్తోంది. బదిలీల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటున్నా...నేటికీ కొందరు టీచర్లకు పాయింట్లు రావడం లేదు. దీంతో వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బదిలీలకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులకు వివిధ పాయింట్లపై సందేహాలు వెంటాడుతున్నాయి. ఒకే స్కూల్లో పని చేస్తున్న టీచర్లకు పాయింట్ల నమోదులో తేడాలు వస్తున్నాయి. రీజనరేట్ కావాల్సిన పాయింట్లు కూడా కావడంలేదు. సమస్య పరిష్కరించాల్సిన అధికారులు..తమ పరి«ధిలో లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సిందేంటూ సమాధానం చెప్తున్నారు. ఆప్షన్లు అప్లోడ్ కాక ఆందోళన : ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇనిస్టిట్యూషన్ పాయింట్లు మాత్రమే వస్తున్నాయి. వాస్తవానికి వీరికి వ్యక్తిగత సీసీఈ పాయింట్లు నమోదైతే నాలుగు పాయింట్లు వస్తాయి. అదే ఇనిస్టిట్యూషన్ పాయింట్లు రెండే వస్తాయి. దీనిపై విద్యాశాఖ కమిషనర్ స్పష్టత ఇస్తూ ఎక్కువ పాయింట్లు వచ్చే ఆప్షన్‌ను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. కానీ ఆన్లైన్లో అప్లోడ్ కావడం లేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. ఫలితంగా రెండు పాయింట్లు కోల్పోవాల్సి వస్తోంది. కొందరు ప్రధానోపాధ్యాయులు ఎండీఎం అటెండెన్స్‌ను యాప్ ద్వారా ఆన్లైన్లో పంపితే, మరికొందరు ఎస్ఎంఎస్ ద్వారా పంపారు. అయితే యాప్ ద్వారా పంపిన పాఠశాలలకు మాత్రమే ఎండీఎం పాయింట్లు వస్తున్నాయి. ఎస్ఎంఎస్ ద్వారా అటెండెన్స్ వివరాలు పంపిన స్కూళ్లకు ఎండీఎం పాయింట్లు నమోదు కావడం లేదు. సీసీఈ, స్లాస్, త్రీఆర్స్ పరీక్షలకు సంబంధించి ఫలితాలు చాలా మండలాల్లో ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో జిల్లా సగటు తీసుకొని పాయింట్లు వేయాలని కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా ఈ పాయింట్లు నమోదు కాలేదు. సర్దుబాటు కారణంగా ఇతర స్కూళ్లలో సబ్జెక్టులు బోధించిన టీచర్లు, ఎఫ్ఏసీగా పని చేసిన హెచ్ఎంలకు బోధన పాయింట్లు నమోదు కాలేదు. -
అటకెక్కనున్న చదువు!
– 9 నుంచి బదిలీల ప్రక్రియ – పాయింట్లు పదనిసల్లో ఉపాధ్యాయులు – 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం – విద్యార్థుల ప్రవేశాలు గాలికి అనంతపురం ఎడ్యుకేషన్ : సార్....బదిలీలు ఉన్నాయి కదా? మీకెన్ని ప్రతిభ ఆధారిత పాయింట్లు వచ్చాయి. నాకేందుకు ఇంత తక్కువ పాయింట్లు వస్తున్నాయి. పెరిగే మార్గం లేదా? ఈ పాయింట్లతో ఫలానా ప్లేస్ వస్తుందా? రాదా? ఇదీ సగటున ఇద్దరు ఉపాధ్యాయులు కలిస్తే జరుగుతున్న చర్చ. బదిలీల నేపథ్యంలో ఇక్కడ ఉంటామో...ఉండమో...ఎక్కడికి పోతామో? మంచి స్థానం దక్కుతుందా? లేదా? అంతదూరం ఎలా వెళ్లాలి? కుటుంబం మారుద్దామంటే పిల్లల చదువులకు ఆటంకం కల్గుతుందేమో? ఇలా అంచనాలు వేసుకునే పనిలో టీచర్లు నిమగ్నమయ్యారు. జిల్లాలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు బదిలీ జ్వరం పట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో వేసవి సెలవుల్లో బదిలీల ప్రక్రియను చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎన్నిమార్లు మొర పెట్టుకున్నా లాభం లేకపోయింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వేసవి సెలవుల నుంచి అదిగోఇదిగో అంటూ ఊరిస్తూ ఎట్టకేలకు ఇటీవల టీచర్ల బదిలీలకు షెడ్యూలు విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే 9 నుంచే బదిలీల ప్రక్రియ ప్రారంభమై జూలై ఒకటిదాకా సాగనుంది. ఈ 20 రోజులూ పిల్లల చదువు అటకెక్కనుంది. విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం పాఠశాలలు పునఃప్రారంభంలో నిర్వహించే విద్యార్థుల అడ్మిషన్లపై బదిలీల ప్రభావం పడనుంది. 1, 6, 8 తరగతుల్లో ప్రవేశాలు ఎక్కువగా ఉంటాయి. 12న పాఠశాలలు తెరవాల్సి ఉంది. అదే రోజు టీచర్లు బదిలీలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి వీరు పాఠశాలలకు వెళ్తారా?..లేక ఆన్లైన్ వద్దకు పరుగులు తీస్తారా? 55 జీఓ ఏం చెబుతోందంటే.. టీచర్లు బదిలీలు కాని, శిక్షణలు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యా సంవత్సరం మధ్యలో చేపట్టరాదు. వేసవి సెలవుల్లోనే ఈ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు (జీఓ నం.55 ) విడుదల చేసింది. ఎప్పుడు పడితే అప్పుడు బదిలీలు చేపడుతున్నందున విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఉంది. దరఖాస్తు గడువు పెంచాలి ఈ నెల 11 వరకు ఆర్‌ఎంఎస్‌ఏ, ఎస్ఎస్ఏ శిక్షణలు ఉంటాయి. 12న స్కూళ్లు పున ప్రారంభమవుతాయి. ఈ పరిస్థితుల్లో 9–12 తేదీల్లో దరఖాస్తు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. 15 వరకు దరఖాస్తు గడువు పెంచాలి. వేసవి సెలవుల్లో పెట్టకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. -
ఏ ప్రతిభ ఆధారంగా బదిలీలు చేస్తున్నారు
► ప్రభుత్వానికి ఎస్టీయూ సూటిప్రశ్న కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ విడుదల చేయకుండా రాజకీయ బదిలీలు చేపడుతున్న ప్రభుత్వం ఏ ప్రతిభ ఆధారంగా చేస్తున్నారో వెల్ల్లడించాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉద్దండం జయరామయ్య డియాండ్ చేశారు. నగరంలోని ఎస్టీయూభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రతిభ ఆధారిత బదిలీలు తప్పనిసరి అని చెబు తూనే మరోవైపు ప్రభుత్వం అవలం బిస్తున్న వైఖరి దేనికి సంకేతం అని ప్రశ్నించారు. పట్టణ ప్రాంతాల్లో పరస్పర బదిలీల ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. బదిలీల షెడ్యూల్‌ను ప్రకటించపోతే త్వరలో ఎస్టీయూ తరఫు న ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు రఘునాథ రెడ్డి, ఇలియాస్‌బాషా మాట్లాడుతూ ఆరియర్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
25లోగా టీచర్ల బదిలీ కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకు బదిలీ కేటాయింపు వివరాలను ఈ నెల 25 లోగా ఎస్ఎమ్ఎస్ ద్వారా పంపే అవకాశం ఉందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎం. కమలాకరరావు, ప్రధాన కార్యదర్శి భైరి అప్పారావులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీలలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగియడంతో నూతన పాఠశాల వివరాలను వెల్లడించనున్నారు. అయితే టీచర్లు వెంటనే తమ ప్రస్తుత స్కూల్ నుంచి కొత్త పాఠశాలకు బదిలీ అయితే జీతభత్యాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులు నాయుడు, బచ్చల పుల్లయ్యలతో కలసి పాఠశాల విద్యాశాఖ కమిషనర్, డెరైక్టర్ పి. సంధ్యారాణికి పరిస్థితిని వివరించామన్నారు. దీంతో టీచర్లను ప్రస్తుత స్థానం నుంచి ఈ నెల 31న రిలీవ్ చేసి వచ్చే నెల 1వ తేదిన నూతన పాఠశాలలో చేరేందుకు అంగీకరించినట్లు తెలిపారు. -
బది‘లీలల’పైబది‘లీలల’పై భారీగా అభ్యంతరాలు!
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో ప్రాధాన్యం ఉన్న సీనియార్టీ జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది. పనితీరుకు పాయింట్లు వేస్తుండడంతో చాలా మంది పైరవీలతో పాయింట్లు పొందుతున్నారని, దీని వల్ల సహజంగా ఉన్న సీనియార్టీకి అన్యాయం జరుగుతోందని ఉపాధ్యాయులు ఆందోళనచెందుతున్నారు. బుధవారం రాత్రి విడుదల చేసి ప్రొవిజినల్ సీనియార్టీపై ఉపాధ్యాయుల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిశీలిస్తే ఈ విషయం అర్ధమవుతోంది. ఒక్క సీనియార్టీపైనే కాకుండా సెలవుల వినియోగం, స్పౌజ్కోటా పాయింట్లు ఇలా మిగతావాటిపై కూడా కుప్పలుతెప్పలుగా అభ్యంతరాలు డీఈఓ కార్యాలయానికి చేరుతున్నాయి. బదిలీకోసం 4,201 మంది దరఖాస్తు చేసుకోగా గురువారం సాయంత్రానికి 250కి పైగా ఫిర్యాదులు ఆన్లైన్లో జిల్లా విద్యాశాఖకు అందాయి. అభ్యంతరాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో శుక్రవారం కూడా స్వీకరించే అవకాశం ఉందని సమాచారం. బదిలీల్లో తమకు అదనంగా పాయింట్లు వస్తాయని కొందరు, తమకు ఫలానా అంశాల్లో పాయింట్లను తగ్గించారని మరికొందరు, తమ సహచర ఉపాధ్యాయులు పాయింట్ల కోసం అడ్డదారులు తొక్కారని ఇంకొందరు ఫిర్యాదులు చేశారు. ఓపెన్‌కాని దరఖాస్తులు జిల్లా విద్యాశాఖాధికారికి అందిన ఉపాధ్యాయుల దరఖాస్తులను డీఈఓ పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ధ్రువీకరిస్తేనే ఈ ఉపాధ్యాయులు బదిలీ కోసం వెబ్ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే గురువారం కొన్ని మండలాల్లోని ఉపాధ్యాయుల దరఖాస్తులు డీఈఓ లాగిన్‌లో ఓపెన్ కాలేదు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఐదు మండలాలలో ఎదురైన ఈ సమస్య మధ్యాహ్నానికి పరిష్కారమైంది. సమయాభావం వల్ల బొబ్బిలి డివిజన్ పరిధిలోని శివార్లలో ఉన్న మండలాల నుంచి ఉపాధ్యాయులు అభ్యంతరాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. పాయింట్లలో అయోమయం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పాయింట్ల కేటాయింపులో అయోమయం కొనసాగుతోంది. ధికంగా 10 పాయింట్లు వచ్చే స్పౌజ్ కోటా టీచర్ల విషయంలో ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయి. ఇవి 75 వరకు ఉన్నాయి. భార్యాభర్తలిద్దురూ ఎనిమిదేళ్ల సర్వీసులో ఈ కోటాను ఉపయోగించుకుంటే ప్రస్తుత బదిలీలో ఈ పాయింట్లు వర్తించవనే నిబంధన ఉంది. ఈ కోటాను గతంలో వినియోగించుకున్నప్పటికీ కొందరు దరఖాస్తు చేసినట్టు పలువురు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అదే విధంగా ఉపాధ్యాయుల సర్వీసు పాయింట్లకు 75 శాతం, వ్యక్తిగత పనితీరుకు పాయింట్లకు 25 శాతం వెయిటేజీ ఇస్తున్నట్లు ప్రకటించారు. సర్వీసుకు, వ్యక్తిగత పనితీరుకు కేటాయించిన పాయింట్లు కలగలిపి ప్రొఫార్మాలో కనిపిస్తుండడంతో ఉపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారు. ఈ పాయింట్ల విషయంలో విద్యాశాఖ స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులు పాయింట్ల కోసం పక్కదార్లు తొక్కుతున్నారని సహచరులే వాపోతున్నారు. దొడ్డిదారిన మార్కులు కొట్టేసి తప్పుడు ధ్రువీకరణలతో దరఖాస్తు చేసుకుంటున్న ఉదంతాలపై ఫిర్యాదు చేస్తున్నారు. ఈ పరిణామం ఉపాధ్యాయల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. అర్జీలను నిశితంగా పరిశీలించి ఆమోదించాల్సిన ఎంఈఓలు ప్రలోభాలకు పాల్పడటం, వారి అండతో ఉపాధ్యాయులు తప్పుడు ద్రువీకరణ సమర్పిస్తున్నట్లు ఆరోపణులు వస్తున్నాయి. మహిళా ఉపాధ్యాయులు సిక్ లీవ్(సీఎల్)లు వినియోగించుకుంటే 88 శాతం మాత్రమే హాజరు శాతం వస్తోంది. అయితే దరఖాస్తుల్లో సీఎల్‌కు బదులుగా ప్రసవ సెలవులను వినియోగించుకున్నట్టు మార్చి 90 నుంచి 95 శాతం హాజరు చూపించారని ఫిర్యాదులు అందాయి. హాజరు పట్టికలను పరిశీలించడంలో మండల కమిటీ పక్షపాతం చూపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ‘విరాళాల’కు వక్రభాష్యం జిల్లాలో దాతల నుంచి విరాళాలు సేకరించిన ఉపాధ్యాయునికి పాయింట్లు వస్తాయి. విజయనగరం డివిజన్ పరిధిలో కొందరు ఉపాధ్యాయులు దీనికి వక్రభాష్యం చెబుతూ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని సమాచారం. రెండు పాఠశాలలకు చెందిన పూర్వ విద్యార్థులు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలను తాము సేకరించిన ఖాతాల్లో రాసుకొని కొందరు టీచర్లు పాయింట్ల పొందారు. ఇలాంటివి బొబ్బిలి డివిజన్లో కూడా ఉన్నాయని ఉపాధ్యాయ వర్గాలు చెపుతున్నాయి. పొంతన లేని సమాచారం నిజానికి ఉపాధ్యాయులు ఇచ్చిన దరఖాస్తులను, అన్ని ఆధారాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ఎంఈఓలు స్కాన్ చేసి డీఈఓకు పంపాలి. జిల్లాలోని అన్ని మండలాలకు ఇన్చార్జ్ ఎంఈఓలే ఉన్నారు. ఎంఈఓ కార్యాలయాల్లో స్కానర్లు లేకపోవడంతో ఈ పనిని బయట నెట్ సెంటర్ల వద్ద చేయిస్తున్నారు. దీంతో దరఖాస్తుదారుల సంఖ్యకు విద్యాశాఖ వెబ్సైట్లో కనిపించే సంఖ్యకు పొంతన కుదరటం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
రోజుకో ఉత్తర్వుతో గందరగోళం
శ్రీకాకుళం : ఉపాధ్యాయుల బదిలీలు, పాఠశాలల రేషనలైజేషన్‌కు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖాధికారులు రోజుకోరకమైన నిబంధనలు విధిస్తూ, నిబంధనలను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. గురు, శుక్ర, శని వారాల్లో బదిలీలకు సంబంధించి దరఖాస్తు గడువు కాగా పలువురు ఉపాధ్యాయులు కొన్ని వివరాలు తెలియక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. గురువారం నాటికి రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయి వివరాలను ప్రకటించాల్సి ఉంది. జిల్లా విద్యాశాఖ ఆదర్శ పాఠశాలలు, విలీనమైన పాఠశాలల సంఖ్యను మాత్రమే గురువారం సాయంత్రం నాటికి ప్రకటించగలిగింది. జిల్లాల్లో 197 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు, వీటిలో 177 పాఠశాలలను మూసివేసి సమీపంలోని ఆదర్శ పాఠశాలల్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం నాటికి ఏయే పాఠశాలలు విలీనమవుతున్నాయి, ఎక్కడెక్కడ ఆదర్శ పాఠశాలలు నెలకొల్పుతున్నారు, రేషనలైజేషన్‌లో ఉన్న ఉపాధ్యాయులెవరు? కొత్తగా మంజూరవుతున్న ఎస్జీటీ, ఎల్ఎఫ్ఎల్ పోస్టులు ఎక్కడెక్కడ, ఏయే పాఠశాలలో ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ వివరాలను ప్రకటించకపోవడం వల్ల ఉపాధ్యాయులు గురువారం బదిలీ దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఒకవేళ చేసుకున్నా రేషనలైజేషన్ జరిగినట్లు పొందుపరచకపోవడం వల్ల 10 పాయింట్లు కోల్పోవాల్సి వస్తోందని, దీని వల్ల తాము అనుకూలమైన పాఠశాలలను పొందలేకపోవచ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నాటికైనా జిల్లా విద్యాశాఖాధికారులు వివరాలను వెల్లడిస్తారా, లేదా అన్నది స్పష్టంకావట్లేదు. అప్పటికి కూడా ప్రకటించకుంటే ఎందరో ఉపాధ్యాయులు మరింత నష్టపోతారు. ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు రేషనలైజేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
ఏపీలో టీచర్ల బదిలీల షెడ్యూలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీలకు పచ్చజెండా ఊగింది. ఈ మేరకు టీచర్ల బదిలీల షెడ్యూలును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ బదిలీలు జరుగుతాయని ఆయన తెలిపారు. పాఠశాలల హేతుబద్ధీకరణ పూర్తయిందని, 2,998 స్కూళ్లను విలీనం చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సెప్టెంబర్ 6 నుంచి టీచర్ల బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 19న సీనియారిటీ జాబితాలను ప్రకటిస్తామని, 24 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లను స్వీకరిస్తామని గంటా శ్రీనివాసరావు చెప్పారు. -
టీచర్ల బదిలీల తకరారు
ఏలూరు సిటీ : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియపై స్పష్టత కొరవడింది. వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని నూతనంగా అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తుండగా...ఈ విధానంతో టీచర్లు తమ స్వేచ్ఛను కోల్పోతారని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. బదిలీల కౌన్సెలింగ్‌కు ఇంకా సరైన విధి విధానాలు ఖరారు కాలేదని విద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. బదిలీల ప్రక్రియ ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల రేషనలైజేషన్ పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటికే ఆదర్శ ప్రాథమిక పాఠశాలల పేరుతో కొన్ని ప్రైమరీ స్కూళ్లను మూసివేసేందుకు అధికారులు నివేదికలు సమర్పించారు. ఇవన్నీ పూర్తి చేసేందుకు విద్యాధికారులు కసరత్తు చేస్తున్నారు. క్రమబద్ధీకరణ పేరుతో జిల్లాలో రెండు దశల్లో 189 ప్రాథమిక పాఠశాలలకు, మునిసిపల్ యాజమాన్యంలో 16 స్కూళ్లకు తాళాలు పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో పాఠశాలల మూసివేతపై ప్రజల నుంచి అభ్యంతరాలు రావటంతో ఈసారికి వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు మంచిదేనని అయితే స్కూళ్లను మూసివేయకుండా కేరళ తరహాలో అన్ని స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేయాలనే డిమాండ్ వినవస్తోంది. వెబ్ కౌన్సెలింగ్ వద్దంటున్న టీచర్లు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పాత విధానానికి బదులు కొత్తగా ఎంసెట్ తరహాలో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 7న డెమో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రాథమిక విద్య ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు మాత్రం వెబ్ కౌన్సెలింగ్ వద్దంటున్నారు. ఒక్కో టీచర్ 99 ఆప్షన్లను పెట్టుకోవచ్చని, ఇంటి నుంచో, నెట్ సెంటర్ల నుంచో సులువుగా చేయవచ్చని విద్యాధికారులు చెబుతున్నారు. కానీ పాత విధానంలో అయితే ఖాళీలను చూసుకుంటూ తమ అవకాశం వచ్చినప్పుడు బదిలీ స్థానాన్ని ఎంపిక చేసుకోవచ్చని ఉపాధ్యాయులు అంటున్నారు. పైగా భార్యాభర్త, ప్రత్యేక కేటగిరీల్లో ఇబ్బందులు వస్తాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు నాలుగువేల మంది ఉపాధ్యాయులు బదిలీ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది. క్రమబద్ధీకరణతో పిల్లలకు కష్టాలే తొలుత ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ పూర్తి చేసి అనంతరం బదిలీలు చేపడతారు. దీనిలో భాగంగానే 20లోపు పిల్లలున్న పాఠశాలలు, అసలు పిల్లలు లేని స్కూళ్లను మూసివేసి అక్కడి ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేస్తారు. ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేస్తుండటంతో మిగులు టీచర్లను క్రమబద్ధీకరిస్తే గానీ పూర్తిస్థాయిలో ఖాళీలు ప్రకటించే అవకాశం లేదు. జిల్లాలో మొదటి దశలో 364 స్కూళ్లను గుర్తించగా 281ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేశారు. వాటిలో 83 స్కూల్స్ విలీనం అవుతున్నాయి. రెండో దశలో 198 స్కూళ్లను గుర్తిస్తే 92 ఆదర్శ పాఠశాలలుగా ఏర్పాటు అవుతాయి. వీటిలో 106 పాఠశాలలు విలీనం అవుతున్నాయి. మొత్తానికి 189 పాఠశాలలు మూసివేసేందుకు రంగం సిద్ధమైంది. ఇక మునిసిపల్ యాజమాన్యంలో 46 పాఠశాలలు గుర్తించగా 30 ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేస్తుండగా వీటిలో 16 స్కూళ్లు విలీనం అవుతున్నాయి. ఒకేసారి పిల్లలు లేని స్కూళ్లను మూసివేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో దశల వారీగా తాళాలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. -
ఇలాగైతే పాఠాలెలా..
ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి కాని రేషనలైజేషన్ ఏకోపాధ్యాయ పాఠశాలల పరిస్థితి ఏంటి? విద్యాహక్కు చట్టానికి తూట్లు విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ఎప్పుడు చిన్నచూపు చూస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ విద్యాప్రమాణాలను దిగజారుస్తోంది. ఏటా పాఠశాలల్లో రేషనలైజేషన్ ప్రకియ మొదలుకొని, ఉపాధ్యాయుల బదిలీలతో సహా అలసత్వం చూపిస్తోంది. విద్యాశాఖపై ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో పాఠశాలల పరిస్థితి చూస్తే ప్రభుత్వ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. విశాఖ ఎడ్యుకేషన్ : ఏటా బడుల్లో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయ హేతుబద్ధీకరణ ప్రక్రియ కూడా జరుగుతుంది. ప్రభుత్వ ఆలసత్వం వల్ల ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. దాంతోపాటు బదిలీ ప్రక్రియను కూడా పూర్తి చేయలేదు. బదిలీలు రేషనలైజేషన్‌తో ముడిపడి ఉండటంతో ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి వస్తున్నా ఈ బదిలీ ప్రక్రియని పూర్తి చేయడంలో కాలయాపన చేస్తుంది. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వేసవి సెలవులు ముగిసేనాటికి ఉపాధ్యాయ బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి సక్రమంగా పాఠశాలలు జరిగేలా చూస్తామన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తయినప్పటికీ ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ, రేషనలైజేషన్‌లో జాప్యం చేస్తునే ఉంది. దీనివలన హేతుబద్ధీకరణ కోసం ఉపాధ్యాయులు వేచి చూడాల్సి వస్తుంది. బదిలీ అయినా పాత స్థానాల్లోనే: జిల్లాలో 1385 ప్రాథమిక పాఠశాలలు, 2 ప్రాథమికోన్నత పాఠశాలలు ఏకోపాధ్యాయునితో నడుస్తున్నాయి. వీటిలో కొన్ని చోట్ల విద్యార్ధులు నిష్పత్తి కంటే ఎక్కువగా ఉండగా, మరికొన్ని చోట్ల తక్కువగా విద్యార్ధులు ఉన్నారు. ప్రభుత్వం నిష్పత్తి తక్కువగా ఉన్న పాఠశాలలను రేషనలైజేషన్‌లో భాగంగా సమీప పాఠశాలలో విలీనం చేసి ఆదర్శపాఠశాలల సంఖ్యను పెంచాలని ఆలోచిస్తుంది. ఈ ప్రక్రియ కూడా పూర్తి కాకపోవడంతో ఏ పాఠశాలలు పోతాయో, ఏవి ఉంటాయో తెలియని పరిస్థితి విద్యార్ధులది. అదే పరిస్థితి ఉపాధ్యాయుల్లో కూడా కనిపిస్తుంది. హేతుబద్ధీకరణ పేరుతో ఎక్కడికి పంపిస్తారో తెలియని పరిస్థితి. దీనివలన వారు కూడా బోధనపై దృష్టిపెట్టలేకపోతున్నారు. విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలు సబ్జెక్టులకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం వలన చదువుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకే టీచర్ అన్ని తరగతులకు బోధించాలంటే తలకు మించిన భారం. వీలైనంత వేగంగా రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సిలబస్ పరంగా నష్టపోయేది విద్యార్ధులే. 2013లో బదిలీ అయిన వారు చాలా మంది పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. వీరు పనిచేస్తున్న పాఠశాలలన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలే. ఆ పాఠశాలలకు ఎవరూ రాకపోవడంతో ఉపాధ్యాయులందరూ పాత స్థానాల్లోనే కొనసాగాల్సి వస్తుంది. బదిలీ ప్రక్రియ పూర్తి చేసిన కూడా పాత స్థానాల్లో కొనసాగుతున్న వీరు కూడా తమ బదిలీ స్థానాలకు వెళ్లడానికి ఎదురు చేస్తున్నారు. హేతుబద్ధీకరణ పూర్తయితే కాని తమ స్థానాలకు వెళ్లలేని పరిస్థితి. విద్యాహక్కు చట్టమేమంటోంది విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి హేతుబద్దీకరణ ప్రక్రియ విద్యాశాఖ పూర్తి చేసి అన్ని పాఠశాలల్లో విద్యార్ధుల నిష్పత్తి అనుసరించి ఉపాధ్యాయులను నియామకం చేయాలి.ఎక్కువ మంది విద్యార్ధులు ఉన్న పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయ నియామకాలు చేసి ఖాళీ పోస్టులను గుర్తించి డీఎస్సీ అభ్యర్ధులను పూర్తి నింపడం కాని లేదా.ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి బదిలీ ప్రక్రియలో నియామకం చేయాలి. -
ఇరకాటంలో విద్యాశాఖ?
సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లా విద్యాశాఖ ఇరకాటంలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయుల బదిలీలలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో విద్యాశాఖ ఉన్నత అధికారులు విచారణ చేపట్టారు. అ వివాదం ముగియకుండానే మరో వివాదం తెరపైకివచ్చింది. ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి సిరిబాబు ఒంటికి నిప్పంటించుకున్నారు. దీంతో విద్యార్థి సంఘలతో పాటు బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. డీఈవో తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ క్రమంలో పాఠశాలల యాజమాన్యాలు స్పదించకపోవడంతో ఆగ్రహానికిలోనైన సిరిబాబు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటీపై పోసికొని నిప్పు అంటించుకున్నాడు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తత దారి తీసింది. ఇందుకు జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రధానకారణమని నాయకులు ఆరోపించారు. పలుమార్లు ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఫీజుల నియంత్రణ బాధ్యత ఎవరిది? ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను నియంత్రించాల్సిన బాధ్యత ఎవరిపై ఉందో కూడా విద్యాశాఖ అధికారులు తేల్చలేకపోతున్నారు. ఫీజులను నియంత్రించాల్సిన బాధ్యత అధికారులదే అంటుంటే.. అధికారులు మాత్రం తల్లిదండ్రులదే అంటూ దాటవేస్తున్నారు. విద్యా హక్కు చట్టం.. ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణలో విద్యాశాఖ అధికారులతో పాటు తల్లిదండ్రుల బాధ్యత ఉందని స్పష్టం చేస్తోంది. ఇందుకు ఫీజుల నిర్ణయం తీసుకునేందుకు గాను పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై వారి సమక్షంలోనే ఫీజులను నిర్ణయించాలి. కాని ఏ ఒక్క పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించిన పాపాన పోలేదు. కాని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సిండికేట్‌గా మారి ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. నేటి నుంచి విద్యాసంస్థల బంద్‌కు పిలుపు.. శ్రీ చైతన్య స్కూల్ గుర్తింపును రద్దుతోపాటు, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి శనివారం వరకు విద్యాసంస్థల బంద్‌ను నిర్వహిస్తున్నట్టు బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు బీరయ్య యాదవ్ తెలిపారు. శనివారం పట్టణంలోని చైతన్య స్కూల్ ఎదుట ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిరిబాబు ఆత్మహత్యాయత్నానికి కారణమైన ప్రైవేట్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బంద్‌కు అన్ని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతునివ్వాలని బీసిసంఘం నాయకులు కోరారు. -
కౌన్సెలింగ్‌లో గందరగోళం
జీవో 3పై రగిలిన వివాదం రెండు వర్గాలుగా ఉపాధ్యాయులు వేర్వేరుగా ఆందోళనలు టవరెక్కిన ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కౌన్సెలింగ్ తాత్కాలిక వాయిదా ఉట్నూర్ : ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కౌన్సెలింగ్‌లో జీవో నంబర్ 3 వివాదం రాజుకుంది. దీంతో ఉపాధ్యాయులంతా రెండు వర్గాలుగా విడిపోయారు. చివరికి శుక్రవారం జరగాల్సిన పీజీ హెచ్ఎంల పదోన్నతుల కౌన్సెలింగ్‌ను ఐటీడీఏ పీవో కర్ణన్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా వాయిదా వేశారు. వివరాలివి.. ప్రభుత్వం ఆదేశాలతో ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు పీజీ హెచ్ఎంల బదిలీలు నిర్వహించగా.. రెండో రోజు శుక్రవారం స్కూల్ అసిస్టెంట్లకు పీజీ హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించేందుకు కౌన్సెలింగ్ చేపట్టింది. అయితే.. కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనక యాదవ్రావ్ 342 ఆర్టికల్ జీవో 3 ప్రకారం 1950కి ముందు నుంచి ఉన్న షెడ్యూల్ తెగలకు చెందిన వారికే పదోన్నతులు కల్పించాలని డి మాండ్ చేస్తూ మండలంలోని లక్కారం గ్రామం లో సెల్ టవర్ ఎక్కాడు. దీంతో ఐటీడీఏ ఏపీవో జనరల్ నాగోరావ్, డీడీటీడబ్ల్యూ సావిత్రి, ఆర్డీవో ఐలయ్య అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ ఉద్యోగ, ఉపాధ్యాయ, ఇతర సంఘాల నాయకులు మాట్లాడుతూ.. 342 ఆర్టీకల్ ప్రకారం పదోన్నతులు కల్పించాలని, 1976లో ఎస్టీల్లో చేర్చిన వర్గాలకు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 1976లో కొన్ని వర్గాలను ఎస్టీల్లో చేర్చినా.. కేంద్ర ప్రభుత్వం దానికి చట్టబద్ధత కల్పించలేదని ఆరోపించారు. జిల్లాలో 2000 సంవత్సరం నుంచి వారికే 92 శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయని, తమకు 8 శాతం మాత్రమే దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డీడీటీడబ్ల్యూ సావిత్రి స్పందిస్తూ.. ప్రభుత్వం నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని కలెక్టర్, ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐటీడీఏ పీవో ఆదేశాలతో కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా వాయితా వేస్తున్నట్లు ప్రకటించారు. కౌన్సెలింగ్ వాయిదా వేయడం తగదు.. ఇదిలా ఉంటే.. ఉపాధ్యాయ పదోన్నతి కౌన్సెలింగ్‌ను అధికారులు తాత్కాలికంగా వాయిదా వేయడం తగదని కౌన్సెలింగ్‌కు హాజరైన ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. కేబీ ప్రాంగణంలో ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధం లేని వారు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తే అధికారులు కౌన్సెలింగ్ వాయిదా వేయడం సరికాదన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చామని, అధికారులు వెంటనే కౌన్సెలింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. 1976లో ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చిన వర్గాలన్నింటికీ గిరిజన చట్టాలన్నీ వర్తిస్తాయని చెప్పారు. సాయంత్రం వరకు ఆందోళన చేసిన వారు చివరికి విరమించి వెళ్లిపోయారు. -
బోసిపోయిన పల్లె బడి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఉపాధ్యాయుల బదిలీలు, పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియ సర్కారు బడులను సంకటంలో పడేసింది. స్కూళ్ల రేషనలైజేషన్ ప్రక్రియతో గ్రామీణ ప్రాంతాల్లోని టీచర్ పోస్టులు కాస్త పట్టణ ప్రాంతాలకు తరలిపోయాయి. అదేవిధంగా బదిలీల కౌన్సెలింగ్‌లో మెజార్టీ టీచర్లు పట్టణ ప్రాంత పాఠశాలల్లోనే పనిచేసేందుకు మొగ్గు చూపడంతో పల్లెబడులన్నీ ఉపాధ్యాయులు లేకుండా ఖాళీ అయ్యాయి. తాజా బదిలీలు, హేతుబద్ధీకరణ ప్రక్రియతో జిల్లా వ్యాప్తంగా 520 పాఠశాలల్లో సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రాథమికం.. గందరగోళం.. ఇటీవల విద్యాశాఖ నిర్వహించిన టీచర్ల బదిలీల ప్రక్రియలో 2,271 మందికి స్థానచలనం కలిగింది. ఇందులో 1,067 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులున్నారు. వీరంతా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న వారే. గతవారం జరిగిన బదిలీల కౌన్సెలింగ్‌లో స్థానచలనం పొందిన ఎస్జీటీల్లో ఏకంగా 395 మంది టీచర్లు పట్టణ ప్రాంత పాఠశాలలనే ఎంచుకున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో ఈ మేరకు ఖాళీలు ఏర్పడ్డాయి. గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో రేషనలైజేషన్ ప్రక్రియలో అక్కడి పోస్టులను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంత పాఠశాలలకు తరలించారు. వీటితోపాటు ఇప్పటికే 435 ఎస్జీటీ పోస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ తేల్చింది. మొత్తంగా 830 ఉపాధ్యాయ ఖాళీలు పల్లెబడులను అతలాకుతలం చేయనున్నాయి. ప్రత్యామ్నాయమే దిక్కు.. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగియడంతో ఆయా టీచర్లు కొత్త పాఠశాలల్లో విధులకు హాజరవుతున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎం, స్కూల్‌అసిస్టెంట్, భాషాపండితులు, పీఈటీలు, పీడీలు కొత్త పాఠశాలలకు రిలీవయ్యారు. ఎస్జీటీలు మాత్రం ఇంకా రిలీవ్ కావాల్సి ఉంది. అయితే బదిలీ అయిన ఎస్జీటీలను ఇప్పటికిప్పుడు రిలీవ్ చేస్తే గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో బోధన పడకేయనుంది. ముఖ్యంగా బంట్వారం, బషీరాబాద్, ధారూరు. గండేడ్, కుల్కచర్ల, మహేశ్వరం, మంచాల, మర్పల్లి, మోమీన్‌పేట్, మొయినాబాద్, నవాబ్‌పేట్, పెద్దేముల్, పూడూరు, శామీర్‌పేట్, మేడ్చల్, యాచారం, యాలాల మండలాల్లో ఖాళీలు అధికంగా ఉన్నాయి. ఒకవైపు విద్యావలంటీర్లు లేకపోగా.. కొత్త నియామకాలు సైతం ఇప్పట్లో చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన పల్లె బడుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సి ఉంది. -
చీటింగ్!
సాక్షి టాస్క్‌ఫోర్స్ : జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. కౌన్సెలింగ్‌కు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఎప్పుడు ఏ బదిలీలు రద్దవుతాయో.. ఏ పోస్టు బ్లాక్ అవుతుందో తెలియని దుస్థితి నెలకొంది. పైగా పారదర్శకంగా జరగడంలేదన్న ఆరోపణలూ ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం.. మొదటి రోజు ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నిర్వహించారు. ఇక ఆ రోజు నుంచి అస్తవ్యస్తంగానే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా కొంతమంది హెచ్ఎంలు సబ్జెక్ట్ టీచర్లు ఉన్నప్పటికీ పదో తరగతి ఉత్తీర్ణత శాతాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ అదనపు పాయింట్లు పొందారన్న ఆరోపణలున్నాయి. మరునాడు జరిగిన హెచ్ఎంల ప్రమోషన్ల ప్రక్రియలో సైతం ఆప్షన్ ఇచ్చిన తరువాత కూడా ఉపాధ్యాయలు తిరిగి తమ స్థానాలు మార్చుకున్నారనే విమర్శలున్నాయి. అనంతరం స్కూల్ అసిస్టెంట్ల బదిలీల్లో బయోలజీ టీచర్లకు ఉంటాయని ప్రకటించారు. తీరా అక్కడికి వెళ్లాక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల బదిలీలంటూ వారిని వెనక్కి పంపారు. కావాల్సిన వారికి పెద్దపీట.. బదిలీల జాబితాల్లో కొన్ని ఖాళీ ప్రదేశాలను మొదట్లో చూపకుండా కొంతమంది టీచర్లకు ప్రయోజనం కలిగేలా మధ్యలో ప్రవేశ పెట్టారన్న ఆరోపణాలున్నాయి. ఈ క్రమంలో సోషల్ స్టడీస్, స్కూల్ అసిస్టెంట్ల విభాగంలో నంగునూరు మండలం అంక్షాపూర్ పాఠశాల పేరును మధ్యలో ఇరికించారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. కొన్ని ఖాళీలను మొదట చూపించినప్పటికీ తీరా బదిలీ సమయంలో తీసివేశారని తెలుస్తోంది. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో 704 మంది విద్యార్థులు ఉండగా అక్కడ 3 సోషల్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఒకే టీచర్ పనిచేస్తున్నారు. కాని ఖాళీగా ఉన్న రెండు పోస్టులు ప్రమోషన్లలో చూపలేదు. దీంతో ఒకే టీచర్ సక్సెస్ స్కూల్‌గా ఉన్న ఆ ఉన్నత పాఠశాలలో 704 మందికి ఎలా బోధించాలో తెలియని పరిస్థితి. బుధవారం రాత్రి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల ప్రమోషన్లో సైతం మొదట చూపని ఖాళీలను తరువాత చూపారని ఉపాధ్యాయులు అంటున్నారు. అదే విధంగా నర్సాపూర్ ప్రాంతంలో పనిచేసే ఒక ఉపాధ్యాయ సంఘం నాయకుణ్ణి కౌన్సెలింగ్ అనంతరం 30 శాతం హెచ్ఆర్ఏ ఉన్న పటాన్చెరు ప్రాంతానికి బదిలీ చేశారని ఉపాధ్యాయులు ఆరోపించారు. అర్హతలు లేకున్నా పదోన్నతులు కొంతమందికి విద్యాపరమైన అర్హత లేనప్పటికీ ఎల్ఎఫ్ఎల్ ప్రమోషన్ల జాబితాలో వారి పేర్లను చేర్చారని తెలుస్తోంది. ఏరోజు కూడా కౌన్సెలింగ్ సమయానుకూలంగా జరగలేదు. జరుగుతున్న అవకతవకల వల్ల ఉపాధ్యాయులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితి నెలకొంది. కౌన్సెలింగ్ హాల్లో కరెంట్ పోతే జనరేటర్ సౌకర్యం లేక మహిళా టీచర్లు చిమ్మ చీకట్లోనే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టాయిలెట్ సౌకర్యం లేక నానా అవస్థలు పడ్డారు. మూడు, నాలుగు చోట్ల కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంతో ఎప్పుడు, ఎక్కడ ఏ కేటగిరి ఉపాధ్యాయులకు బదిలీలు జరుగుతున్నాయో తెలియక పలువురు ఆందోళనకు లోనయ్యారు. 2013లో బదిలీ అయి ఈనెల 19న రిలీవ్ అయిన ఉపాధ్యాయులను తిరిగి వెనక్కి రమ్మన్న ఉత్తర్వులు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. ముందుచూపులేక అప్పట్లో వారిని రిలీవ్ చేసి ఇప్పుడు వెనక్కి రమ్మంటున్న అధికారులపై ఉపాధ్యాయులు మండి పడుతున్నారు. బదిలీలవుతున్నా.. ఉత్తర్వులేవి? ఇంత వరకు వివిధ కేటగిరీల ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు పూర్తయినప్పటికీ ఒక్క పీజీ హెచ్ఎం బదిలీల్లో తప్ప ఇతరులెవరికీ ఉత్తర్వులు అందలేదు. కొంతమంది ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న హెచ్ఎంలు.. బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయినప్పటికీ వారు పాత స్థలాల్లో ఎంఈఓ బాధ్యతకూడా నిర్వహిస్తున్నారు. దీంతో అటు బదిలీ అయిన పాఠశాలలో.. ఇటు ఎంఈఓ స్థానంలో రెండు పడవలపై ప్రయాణంలా విధులు నిర్వహిస్తున్నారు. బదిలీ అయిన ఇతర కేటగిరీ ఉపాధ్యాయులు ఉత్తర్వులు అందుకోలేక అటు సొంత పాఠశాలలో పాఠాలు బోధించలేక.. ఇటు కొత్త పాఠశాలకు వెళ్లే అవకాశం లేక ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల చదువులు చతికిల పడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. -
వారు.. వీరయ్యారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రాథమిక సీనియారిటీ జాబితా వెల్లడైంది. ఆదివారం ఉదయం ఈ జాబితాను అధికారులు జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో ప్రవేశపెట్టారు. వాస్తవానికి సీనియారిటీ లిస్టు శనివారమే ప్రకటించాల్సి ఉండగా.. అధికారుల్లో నెలకొన్న గందరగోళంతో జాబితా తయారీలో జాప్యం జరిగింది. ఆదివారం జాబితా ప్రకటించినప్పటికీ.. ఆ వివరాల్లో భారీగా తప్పులుదొర్లాయి. ఉపాధ్యాయులకిచ్చే సర్వీసు పాయింట్లు, స్పౌజ్, అంతర్జిల్లా బదిలీలపై వచ్చిన టీచర్ల సర్వీసు పరిగణనలో అధికారులు లెక్కకు మించి పాయింట్లు కేటాయించారు. దీంతో సీనియర్లు.. జూనియర్లుగా మారి జాబితాలో కిందివరుసకు పడిపోయారు. లెక్కలు తారుమారు.. సీనియారిటీ జాబితాల్లో టీచర్ల పాయింట్లు తారుమారయ్యాయి. నిబంధనల ప్రకారం ఉద్యోగంలో చేరిన ప్రతి టీచర్‌కు సర్వీసు పాయింట్ల కింద నెలకు 0.041 పాయింట్లు కేటాయించాలి. ఈ గణాంకాల ఆధారంగా సీనియారిటీ జాబితాల్లో పాయింట్లు ఇవ్వాలి. కానీ కొందరు టీచర్లకు సర్వీసు పాయింట్ల కేటగిరీలో ఏకంగా 20 పాయింట్లు దాటిపోయాయి. ఇన్ని పాయింట్లు రావాలంటే సదరు టీచరుకు 40 సంవత్సరాల సర్వీసు ఉండాలి. కానీ జూనియర్ టీచర్లకు ఇదే తరహాలో అడ్డగోలుగా పాయింట్లు కేటాయించారు. ఫలితంగా వారంతా పైవరుసలో ఉండిపోగా.. సీనియర్ టీచర్లు కింది వరుసకి చేరారు. మరోవైపు అంతర్జిల్లా బదిలీపై జిల్లాకు వచ్చిన టీచర్లకు కూడా పాయింట్ల కేటాయింపు ఇష్టానుసారంగా చేర్చారు. అంతర్జిల్లా బదిలీపై వచ్చే టీచరు సర్వీసును జిల్లాలో చేరినప్పటి తేదీనుంచి పరిగణించాలి. అలాకాకుండా మొదటగా పోస్టింగ్ తీసుకున్న తేదీని పరిగణనలోకి తీసుకోవడంతో స్థానిక టీచర్లు జాబితాలో చివర్లోకెళ్లారు. భార్యాభర్తలిరువురు ఉద్యోగస్తులైతే వారిద్దరు ఒకేచోట పనిచేసేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. ఇందుకు ఒకరికి స్పౌజ్ పాయింట్లు కేటాయిస్తుంది. ఒకరికి కాకుండా ఇద్దరికీ స్పౌజ్ పాయింట్లు ఇవ్వడంతో ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. ఒకరికి బదులు ఇద్దరూ జాబితాలో ముందువరుసకు చేరడంతో సీనియర్ టీచర్లు నష్టపోవాల్సివస్తోంది. మరోవైపు ఎనిమిదేళ్లలో ఒకేసారి స్పౌజ్పాయింట్లు వాడుకోవాల్సి ఉండగా.. రెండుసార్లు వినియోగించుకునేలా దరఖాస్తు చేసుకున్నారు. ఇలా పలు విషయాల్లో తప్పులు దొర్లడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రాథమిక జాబితా అయినప్పటికీ.. అధికారులు నిర్లక్ష్యం కారణంగానే పొరపాట్లు జరిగాయని ఆరోపిస్తున్నాయి. కాగా.. సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలుంటే సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కూకట్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు తగిన ఆధారాలతో రావాల్సిందిగా విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
టీచర్ల బదిలీలకు 30 వరకు దరఖాస్తులు
సవరణలతో షెడ్యూల్ విడుదల సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, హేతుబద్ధీకరణ, పదోన్నతులకు దరఖాస్తుల గడువును పాఠశాల విద్యాశాఖ ఈ నెల 30 వరకు పొడిగించింది. ఈ మేరకు శనివారం సవరణ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఉప విద్యాశాఖాధికారికి సమర్పించవచ్చు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ అనంతరం ఈనెల 29లోగా యాజమాన్యాలు, కేటగిరీలు, సబ్జెక్టులు, మాధ్యమాల వారీగా ఖాళీల వివరాలను ఉప విద్యాశాఖాధికారి కార్యాలయంలో, జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. జూలై 1, 2 తేదీల్లో దరఖాస్తు ఫారాల(హార్డ్ కాపీలు)ను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో స్వీకరిస్తారు. బదిలీల కోసం ప్రొవిజనల్ సీనియారిటీ, ఎన్టైటిల్మెంట్ పాయింట్లు, పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితా, హేతుబద్ధీకరణ ద్వారా గుర్తించిన మిగులు టీచర్ల వివరాల జాబితాలను జూలై 3న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో, వెబ్సైట్లో పెడతారు. బదిలీలు, ప్రమోషన్ల సీనియారిటీ జాబితాల్లో అభ్యంతరాలను జూలై 4న తగిన ఆధారాలతో డీఈవో కార్యాలయంలో సమర్పించవ చ్చు. 6న తుది సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు. 7న జెడ్పీ స్కూళ్ల హెచ్ఎంలకు జిల్లా స్థాయిలో, ప్రభుత్వ పాఠశాలల పరిధిలో పనిచేసే హెచ్ఎంలకు జోనల్ స్థాయిలో బదిలీలు ఉంటాయి. అన్ని సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు, అన్ని మాధ్యమాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల బదిలీలు జూలై 9 నుంచి 11 వరకు జరుగుతాయి. ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు జూలై 12న, ఎస్జీటీల బదిలీలు 13 నుంచి 16 వరకు జరగనున్నాయి. -
ఇంకెన్ని రోజులు?
నిజామాబాద్ అర్బన్ : ఉపాధ్యాయుల బదిలీ లు, పోస్టుల బదలాయింపు పక్రియలో నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. సవరణ మార్గదర్శకాల కోసం ఇటు ఉపాధ్యయులు, అటు విద్యాశాఖ ఎదురుచూస్తోంది. ఏడు రోజులు దాటినా బది లీల పక్రియ ముందుకు సాగకపోవటం, ఉన్నతాధికారుల ఆదేశాలు రాకపోవటంతో నిబంధనలు ఎలా ఉంటాయి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలా వద్దా అన్నది సందిగ్ధంగా మారింది. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. బదిలీకి అర్హులైనవారు దా దాపు సగం మంది దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనలలో ఉంటాయేమోననియని మరి కొంతమంది ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి రెండున్నర వేల మంది ఉపాధ్యాయులు బదిలీలకు అర్హులుగా ఉ న్నారు. వీరు ప్రస్తుతం ఆయోమయం పరిస్థితి ఎదుర్కుంటున్నారు. ఇటు ఖాళీల జాబితాను రూపొం దించటంలోనూ విద్యాశాఖ చిక్కులు ఎదుర్కొంటో ంది. రేషైనలైజేషన్ ప్రక్రియ ఉండటంతో ఉండటం తో ఎలా చేయాలన్నది ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో ఉపాధ్యయులు కూడా పాఠశాలలకు సక్రమంగా వెళ్లటం లేదు. 2013 బదిలీ టీచర్ల అయోమయం 2013లో 187 మంది టీచర్లకు బదిలీలు జరిగాయి. వీరు నేటి వరకు రిలీవ్ కాలేదు. మొదట జీఓ 11 ప్రకారం వీరిని ముందుగా రిలీవ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ, నేటి వరకు అది అమలు కాలేదు. ప్రస్తుతం వీరు దరఖాస్తు చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. 2013లో బదిలీ అయిన స్థానం నేటికీ ఖాళీగా ఉంటే, ప్ర స్తుతం వీరిని రిలీవ్ చేసి అదే స్థానం కేటాయిం చాల్సి ఉంటుంది. అలా కాక రేషైనలైజేషన్ ప్రకారం చేస్తే వీరికి అయిదు పాయింట్లు కేటాయించి బదిలీలో కౌన్సెలింగ్ ద్వారా నియమిస్తారు. దీనితో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. రేషైనలైజేషన్లో టీచర్లకు 10 పాయింట్లు కేటాయించి ముందుగానే బదిలీ చేస్తున్నారు. అనంతరం 2013 టీచర్లను బదిలీ చేస్తే, వారికి స్థానాలు దక్కకుండా పోయే అవకాశాలున్నాయి. షెడ్యూలులో మార్పులు ఇలా ఈ నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది ఈ నెల 29న కేటగిరీవారిగా ఖాళీల జాబితాను ప్రకటిస్తారు జూలై 1, 2 తేదీలలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తుల హార్డు హర్డు కాపీల స్వీకరణ, పరిశీలన, పాయింట్ల కేటాయింపు జూలై 3న బదిలీకి అర్హులైన టీచర్ల జాబితా ప్రకటన. పాయింట్ల కేటాయింపుతో పదోన్నతులు, రేషనలైజేషన్ జాబితా జూలై 4, 5 తేదీలలో సీనియార్టీ జాబితా ప్రకారం అప్పీళ్ల స్వీకరణ జూలై 6న బదిలీలు, పదోన్నతులు సీనియార్టీ తుది జాబిత విడుదల జూలై 7న ప్రధానోపాధ్యాయుల బదిలీలు జూలై 8న స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు జూలై 9, 10, 11 తేదీలలో స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు జూలై 12న ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు జూలై 13 నుంచి 16 వరకు ఎస్జీటీలకు బదిలీలు ఉంటాయి. తక్షణమే మార్గదర్శకాలను విడుదల చేయాలి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం తక్షణమే మార్గదర్శకాలను విడుదల చేయాలి. టీచర్లు రోజుల తరబడి ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ ప్రకటించినప్పటికీ, విధి విధానాలు అందుబాటులో లేకపోవటం ఆందోళన కలిగి స్తోంది. తొందరగా ఈ నిరీక్షణకు తెర వేయూలి. - లక్ష్మారెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు -
టీచర్ల బదిలీల ఉత్తర్వులకు సవరణ!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీల ఉత్తర్వులకు సవరణ లు చేయాలని ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు పీఆర్టీయూ వెల్లడిం చింది. మంగళవారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హేతుబద్ధీకరణ, బదిలీల నిబంధనల్లో మార్పులపై అధికారులతో చర్చిం చారు. ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 30 లోపు విద్యార్థులుంటే ఒక టీచర్ ను ఇవ్వాలన్న నిబంధనను మార్చాలని నిర్ణయించారు. 1 నుంచి 19 విద్యార్థులున్న స్కూళ్లకు ఒక టీచర్‌ను, 20 నుంచి 60 మంది వరకున్న స్కూళ్లకు ఇద్దరు టీచర్లను ఇవ్వాలని నిర్ణయించారు. పదో తరగతిలో 25 శాతం కంటే తక్కువ ఫలితాలు వచ్చిన స్కూళ్లకు చెందిన టీచర్లు, ప్రధానోపాధ్యాయులను బదిలీ చేయాలనే నిబంధనను మార్పు చేయాలన్న డిమాండ్‌పైనా సానుకూలత వ్యక్తం చేశారని, ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడుతాయని పీఆర్టీయూ తెలిపింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు బదిలీలు చేసేలా ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు, మైదాన ప్రాంతాల నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్టీయూ నేతలు రాజిరెడ్డి, భుజంగరావు కోరారు. సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు, పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పది శాతం బదిలీలూ చేసుకోవద్దా?
‘విచక్షణ’ బదిలీలపై కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాలపై అసహనం! మాకు ఆ మాత్రం అధికారం లేదా.. అంటూ మండిపాటు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది ఉపాధ్యాయులను కోరుకున్న చోటుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంఘాల నేతలు సోమవారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా, ఆయన అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ విచక్షణ అధికారంతో బదిలీలు చేస్తున్నారని ఓ నేత పేర్కొనగా, ‘ఆ మాత్రం బదిలీలు చేయొద్దా? 1.20 లక్షల మంది టీచర్లలో 10 శాతం బదిలీలు కూడా చేసుకోవద్దా? ఆ మాత్రం అధికారం మాకు లేదా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు మారుమాట్లాడకుండా బయటికి వచ్చినట్లు తెలిసింది. కాగా, మరో 100 వరకు ప్రభుత్వ విచక్షణాధికార బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిసింది. అవి సోమవారం విద్యాశాఖకు చేరినట్లు సమాచారం. మీ ఇష్టం ఉన్నట్లు మార్గదర్శకాలు ఉండాలంటే ఎలా? ఇక కౌన్సెలింగ్ ద్వారా చేపట్టనున్న ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాల్లో ఉండాల్సిన అంశాల విషయంలో సోమవారం వివిధ ఉపాధ్యాయ సంఘాలు కడియం శ్రీహరిని సచివాలయంలో కలిశాయి. ఈ సందర్భంగా రెండు ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రిని కలిసి, వారు ఇచ్చిన విజ్ఞప్తులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘తప్పనిసరి బదిలీకి పరిగణనలోకి తీసుకునే సర్వీసును కొన్ని సంఘాలు ఐదేళ్లు ఉండాలని, ఇంకొన్ని సంఘాలు 8 ఏళ్లు ఉండాలని చెబుతున్నాయి. ఒక్కో సంఘం ఒక్కో రకంగా మాట్లాడితే ఎలా? ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.’ అని అన్నట్లు సమాచారం. సెక్రటేరియట్ బదిలీలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు సచివాలయం కేంద్రంగా ప్రభుత్వం చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలను వ్యతిరేకిస్తూ ఈనెల 16న సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు ప్రదర్శనలు నిర్వహించాలని టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్, డీటీఎఫ్ రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయి. -
ఉపాధ్యాయ బదిలీలకు సీఎం ఓకే!
సాక్షి, హైదరాబాద్: టీచర్ల బదిలీలకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. బుధవారం ఆయన సంబంధిత ఫైల్‌పై సంతకం చేసినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో టీచర్ల హేతుబద్ధీకరణ, పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ కానున్నాయి. అయితే 14 నుంచే బదిలీల ప్రక్రియను ప్రారంభించేలా షెడ్యూల్ రూపొందించినా.. అందులో కొన్ని మార్పులు చేయనున్నట్లు సమాచారం. మార్గదర్శకాల్లో స్పష్టత: టీచర్ల బదిలీకి ఎంత కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న విషయంలో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఒకే పాఠశాలలో ఐదేళ్లుగా పనిచేస్తున్నవారికి ‘తప్పనిసరి’ బదిలీ అమలు చేస్తే... 40 వేల మంది టీచర్లను బదిలీ చేయాల్సి వస్తుంది!. దీని వల్ల అనేక సమస్యలు ఏర్పడుతాయి. అయితే సాధారణ బదిలీల నిబంధనల ప్రకారం.. బదిలీకి 5 ఏళ్లను పరిగణనలోకి తీసుకుంటే 20 శాతానికి మించి బదిలీ చేయడానికి వీల్లేదు. దీనిని వర్తింపజేస్తే చాలా తక్కువ మంది బదిలీ అవుతారు. ఇక ఒకే పాఠశాలలో 8 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి తప్పనిసరి బదిలీని అమలుచేస్తే... దాదాపు 10 వేల మంది టీచర్లు బదిలీ అవుతారు. అందుకే ప్రభుత్వం ఈ నిబంధన వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
బదిలీ కోసం ఉపాధ్యాయుల ఎదురుచూపు
కౌన్సెలింగ్ పూర్తయి ఏడాది.. స్థానచలనానికి నోచుకోని ఉపాధ్యాయులు రిలీవర్ రాలేదనే నెపంతో నిలిపివేత బదిలీ కోసం 166 మంది ఎదురుచూపు ప్రభుత్వ నిబంధనల మేరకే అంటున్న విద్యాశాఖ అధికారులు ఖమ్మం: పనిచేస్తున్న పాఠశాల నుంచి బదిలీ అయింది, కొత్త స్కూల్‌కు వెళ్లొచ్చు అని సుదూర ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయులు.. ఇద్దరం ఒకేచోట కలిసి పనిచేయొచ్చని సంతోషించిన ఉపాధ్యాయ దంపతులు.. ఇలా ఎంతోమంది ఆశలపై విద్యాశాఖాధికారులు నీళ్లు చల్లారు. ఉత్తర్వులు తీసుకుని సంవత్సరం కావస్తున్నా రిలీవర్ రాలేదనే నెపంతో బదిలీలు నిలిపివేస్తున్నారు. దీంతో తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా నిరీక్షిస్తున్న 166 మంది... ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో అంగీకరించిన జిల్లా విద్యాశాఖ అధికారులు 2013 మే 13,14,15 తేదీల్లో ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని రకాల కేటగిరీలకు చెందిన 4,919 మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో 1376 మందికి స్థానచలనం కలిగింది. వీరిలో పీజీహెచ్ఎంలు 28, ఎస్ఏ తెలుగు 11, ఎస్ఏ హిందీ 11, ఎస్ఏ ఇంగ్లీష్ 8, ఎస్ఏ పీడీ -1, ఎస్ఏ మ్యాథ్స్ 73, ఎస్ఏ ఫిజిక్స్ 35, బయలాజికల్ సైన్స్ 60, సోషల్ స్టడీస్ 98, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం 82, ఏజన్సీ ప్రాంత ఎస్జీటీలు 523, మైదాన ప్రాంత ఎస్జీటీలు 416, లాంగ్వేజీ పండిట్(తెలుగు) 14, లాంగ్వేజీ పండిట్ (హిందీ) 4, పీఈటీ 4, డ్రాఫ్ట్ ఉపాధ్యాయులు 3, మ్యూజిక్ టీచర్ ఒకరు ఉన్నారు. అయితే ఇందులో 166 మంది ఇప్పటివరకు తాము పాఠశాలల నుంచి రిలీవ్ కాలేదు. ఇందులో 69 మంది ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న వారు, 71 మంది టీచర్ లెస్ స్కూల్లో పనిచేస్తున్నవారు, మిగిలిన 26 మంది సబ్జెక్టు టీచర్లు ఉన్నారు. వీరు అక్కడి నుంచి బయటకు రావాలంటే ఆ పాఠశాలకు మరో ఉపాధ్యాయుడు వెళ్లాలి. ఆయా పాఠశాలలకు మరో ఉపాధ్యాయుడిని పంపించక పోవడంతో బదిలీ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో పలువురు చైన్ విధానంలా ఉన్నారని, ఒకరు రిలీవ్ అయితే వారి స్థానంలో మరొకరు, అక్కడికి మరొకరు వచ్చే అవకాశం ఉందని, దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రిలీవ్ చేస్తారా.. కొత్తగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారా.. ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ జరిగి 18 నెలలు గడుస్తున్నా 166 మందిని పాత పాఠశాలల్లోనే ఉంచారు. అయితే ఈ సమయంలో ఇతర ఉపాధ్యాయులు పలువురు ఉద్యోగ విరమణ పొందడం, పదోన్నతులతో వేరే చోటుకు బదిలీ కావడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలా ఏర్పడిన ఖాళీలనైనా తమతో భర్తీ చేయాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే రిలీవ్ చేయలేదు రవీంద్రనాధ్‌రెడ్డి, డీఈవో ఏకోపాధ్యాయుడు, టీచర్ లెస్ పాఠశాలల్లో పనిచేసేవారు, హైస్కూళ్లలో పనిచేసే సబ్జెక్టు టీచర్లను రిలీవ్ చేయాలంటే ఆయన స్థానంలో మరొకరు రావాలి. ఇది ఉన్నతాధికారుల ఆదేశం. అందుకోసమే రిలీవ్ చేయలేదు. ప్రభుత్వం ఆదేశాలు ఏవిధంగా వస్తే వాటిని పాటిస్తాం. మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహించాలా, గతంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌ను అమలు చేయాలా అనేది ప్రభుత్వ నిర్ణయం. -
ఏకీకృత సర్వీసు రూల్స్‌పై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ త్వరలో ఖరారు కానున్నాయి. దీనిపై విద్యాశాఖ నియమించిన అధికారుల కమిటీ మూడు రోజులుగా సమావేశమై చర్చిస్తోంది. శుక్రవారం ఏకీకృత సర్వీసు రూల్స్‌లో ఏయే అంశాలుండాలన్న విషయమై చాలాసేపు చర్చించింది. మున్ముందు న్యాయపర సమస్యలు రాకుం డా ఉండాలంటే పంచాయతీరాజ్ టీచర్ల (మండల పరిషత్, జిల్లా పరిషత్) కేడర్‌ను స్టేట్ లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేయడమే ప్రధానమన్న అంశంపై చర్చించారు. ప్రతిపాదనలు పూర్తయిన వెంటనే నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. -
హేతుబద్ధీకరణ ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఉన్న చోటికే టీచర్లను పంపించాలన్న హేతుబద్దీకరణ వ్యవహారం రెండు నెలలుగా ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. దీంతో అనేక పాఠశాలల్లో బోధన కుంటుపడుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల కొరత తీవ్రంగా ఉండగా, తెలంగాణలో దాదాపు వేయి స్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ఇక మరో 1,592 స్కూళ్లలో సబ్జెక్టుటీచర్ల కొరత వల్ల గత ఏడాది బదిలీ అయిన టీచర్లను కొత్తస్థానాల్లోకి పంపించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే డీఎస్సీ నిర్వహించినా టీచర్లను ఆయా స్కూళ్లకు పంపించడానికి ఐదారు నెలల సమయం పడుతుంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల్లేని స్కూళ్లలోని టీచర్లను విద్యార్థులు ఉన్నచోటకు పంపించే హేతుబద్దీరణకు ఇంకా మోక్షం లభించలేదు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విద్యార్థులుంటే టీచర్లు లేరు.. టీచర్లు ఉంటే విద్యార్థుల్లేరు. 350 స్కూళ్లలో విద్యార్థుల్లేకపోయినా టీచర్లు ఉన్నారు. 180 స్కూళ్లలో పదిమందిలోపే పిల్లలున్నా నలుగురేసి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక పిల్లలు ఉండీ.. టీచర్లు ఉన్న చోట సరైన బోధన అందడం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న పరిస్థితి ఇది. విద్యాశాఖ చేసిన అధ్యయనంలో తేలిన నిజాలివి. ఒకటి నుంచి పదో తరగతి వరకున్న పాఠ్యపుస్తకాలను విద్యాశాఖ మార్పు చే సింది. కాని వాటి బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వలేదు. గత రెండేళ్లలో ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా శిక్షణ కోసం రూ. 10 కోట్లు వచ్చినా.. శిక్షణ ఇవ్వకపోవడంతో అవి వెనక్కివెళ్లాయి. ఇందుకు విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణం. టీచర్లకు హాండ్బుక్స్కూడా ఇవ్వలేదు. అలాంటపుడు ఎలా బోధించాలని టీచర్లు వాపోతున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధవిద్యను అమలు చేయాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి ఈ పరిస్థితులు ప్రధాన ఆటంకంగా తయారయ్యాయి. ఇదీ స్కూళ్ల స్థితి... వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం గురిజాల పాఠశాలలో 254 మంది విద్యార్థులుంటే ప్రభుత్వ నియమించిన టీచర్లు ఇద్దరే. 180 పాఠశాలల్లో పిల్లలు పది మంది లోపే ఉన్నారు. కాని వాటిల్లో ఒక్కో స్కూల్లో నలుగురు చొప్పున టీచర్లు ఉన్నారు. 350 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేరు. వాటిల్లో ఒక్కరు చొప్పున టీచర్లు ఉన్నారు. టీచర్లు ఉండీ 25 మంది లోపే విద్యార్థులు ఉన్న స్కూళ్లు 300 వరకు ఉన్నాయి. విద్యార్థులు ఎక్కువగా ఉన్నా ఒక్క టీచర్‌తోనే కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలు 3,8,95. ప్రాథమికోన్నత పాఠశాలలు 22. సబె ్జక్టు టీచర్ల కొరత ఉన్న స్కూళ్లు 2 వేలకు పైనే. ఇక గత ఏడాది బదిలీ అయినా సబ్జెక్టు టీచర్ల కొరతతో పాత స్థానాల్లోనే కొనసాగిస్తున్న స్కూళ్లు 1,077. వారిని బదిలీ అయిన స్థానానికి పంపితే టీచరే లేకుండా పోయే స్కూళ్లు 717 ఉంటాయి. -
బదిలీ అయిన టీచర్లు త్వరలో రిలీవ్
సాక్షి, హైదరాబాద్: బదిలీ అయినా పాత స్థానాల్లోనే పనిచేస్తున్న టీచర్లను రిలీవ్ చేసే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. మంత్రి జగదీష్‌రెడ్డి శుక్రవారం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే టీచర్లు అవసరానికి మించి ఉన్నారని, అంతా సర్దుబాటు అయ్యాక డీఎస్సీ గురించి ఆలోచిస్తామన్నారు. తెలంగాణలోని వివిధ వర్సిటీలకు వీసీలనునియమించేందుకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చే స్తామని చెప్పారు. కాగా థాయ్‌లాండ్ ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యాసంస్థకు చెందిన బృందం శుక్రవారం సచివాలయంలో మంత్రి జగదీష్‌రెడ్డితో భేటీ అయింది. ఐదేళ్ల సమీకృత మాస్టర్ డిగ్రీ కోర్సుపై జేఎన్టీయూహెచ్తో ఈ విద్యాసంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.