
అయ్యవార్లలో పాయింట్ల గోల
- నమోదు కాని పాయింట్లు!
- ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదంటున్న అధికారులు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ బదిలీల్లో వివిధ పాయింట్ల నమోదు ఆందోళన కలిగిస్తోంది. బదిలీల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటున్నా...నేటికీ కొందరు టీచర్లకు పాయింట్లు రావడం లేదు. దీంతో వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బదిలీలకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులకు వివిధ పాయింట్లపై సందేహాలు వెంటాడుతున్నాయి. ఒకే స్కూల్‌లో పని చేస్తున్న టీచర్లకు పాయింట్ల నమోదులో తేడాలు వస్తున్నాయి. రీజనరేట్ కావాల్సిన పాయింట్లు కూడా కావడంలేదు. సమస్య పరిష్కరించాల్సిన అధికారులు..తమ పరి«ధిలో లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సిందేంటూ సమాధానం చెప్తున్నారు.
ఆప్షన్లు అప్‌లోడ్ కాక ఆందోళన :
ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇనిస్టిట్యూషన్ పాయింట్లు మాత్రమే వస్తున్నాయి. వాస్తవానికి వీరికి వ్యక్తిగత సీసీఈ పాయింట్లు నమోదైతే నాలుగు పాయింట్లు వస్తాయి. అదే ఇనిస్టిట్యూషన్ పాయింట్లు రెండే వస్తాయి. దీనిపై విద్యాశాఖ కమిషనర్ స్పష్టత ఇస్తూ ఎక్కువ పాయింట్లు వచ్చే ఆప్షన్‌ను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. కానీ ఆన్‌లైన్లో అప్‌లోడ్ కావడం లేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. ఫలితంగా రెండు పాయింట్లు కోల్పోవాల్సి వస్తోంది. కొందరు ప్రధానోపాధ్యాయులు ఎండీఎం అటెండెన్స్‌ను యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో పంపితే, మరికొందరు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపారు.
అయితే యాప్ ద్వారా పంపిన పాఠశాలలకు మాత్రమే ఎండీఎం పాయింట్లు వస్తున్నాయి. ఎస్‌ఎంఎస్ ద్వారా అటెండెన్స్ వివరాలు పంపిన స్కూళ్లకు ఎండీఎం పాయింట్లు నమోదు కావడం లేదు. సీసీఈ, స్లాస్, త్రీఆర్స్ పరీక్షలకు సంబంధించి ఫలితాలు చాలా మండలాల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో జిల్లా సగటు తీసుకొని పాయింట్లు వేయాలని కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా ఈ పాయింట్లు నమోదు కాలేదు. సర్దుబాటు కారణంగా ఇతర స్కూళ్లలో సబ్జెక్టులు బోధించిన టీచర్లు, ఎఫ్‌ఏసీగా పని చేసిన హెచ్‌ఎంలకు బోధన పాయింట్లు నమోదు కాలేదు.