పది శాతం బదిలీలూ చేసుకోవద్దా?
‘విచక్షణ’ బదిలీలపై కడియం శ్రీహరి
ఉపాధ్యాయ సంఘాలపై అసహనం!
మాకు ఆ మాత్రం అధికారం లేదా.. అంటూ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది ఉపాధ్యాయులను కోరుకున్న చోటుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంఘాల నేతలు సోమవారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా, ఆయన అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ విచక్షణ అధికారంతో బదిలీలు చేస్తున్నారని ఓ నేత పేర్కొనగా, ‘ఆ మాత్రం బదిలీలు చేయొద్దా? 1.20 లక్షల మంది టీచర్లలో 10 శాతం బదిలీలు కూడా చేసుకోవద్దా? ఆ మాత్రం అధికారం మాకు లేదా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు మారుమాట్లాడకుండా బయటికి వచ్చినట్లు తెలిసింది. కాగా, మరో 100 వరకు ప్రభుత్వ విచక్షణాధికార బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిసింది. అవి సోమవారం విద్యాశాఖకు చేరినట్లు సమాచారం.
మీ ఇష్టం ఉన్నట్లు మార్గదర్శకాలు ఉండాలంటే ఎలా?
ఇక కౌన్సెలింగ్ ద్వారా చేపట్టనున్న ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాల్లో ఉండాల్సిన అంశాల విషయంలో సోమవారం వివిధ ఉపాధ్యాయ సంఘాలు కడియం శ్రీహరిని సచివాలయంలో కలిశాయి. ఈ సందర్భంగా రెండు ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రిని కలిసి, వారు ఇచ్చిన విజ్ఞప్తులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘తప్పనిసరి బదిలీకి పరిగణనలోకి తీసుకునే సర్వీసును కొన్ని సంఘాలు ఐదేళ్లు ఉండాలని, ఇంకొన్ని సంఘాలు 8 ఏళ్లు ఉండాలని చెబుతున్నాయి. ఒక్కో సంఘం ఒక్కో రకంగా మాట్లాడితే ఎలా? ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.’ అని అన్నట్లు సమాచారం.
సెక్రటేరియట్ బదిలీలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు
సచివాలయం కేంద్రంగా ప్రభుత్వం చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలను వ్యతిరేకిస్తూ ఈనెల 16న సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు ప్రదర్శనలు నిర్వహించాలని టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్, డీటీఎఫ్ రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయి.