సాక్షి, జనగామ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంత చూసే వరకు నిద్రపోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం పప్పులు కాంగ్రెస్‌లో ఉడకడం లేదు.. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.
తాజాగా స్టేషన్ ఘనపూర్‌లో రైతు దీక్షలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజయ్య మాట్లాడుతూ..‘నా నోటికాడి బుక్కను గుంజుకొని తిన్న వ్యక్తి కడియం శ్రీహరి. ఆయన అంత చూసే వరకు నిద్రపోను. నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం లేదు. ఉన్నది అవకాశవాదం మాత్రమే ఉంది. పార్టీ మారిన పది మంది కుక్కిన పేనులా ఉంటే.. కడియం మాత్రం కుమ్మరి పురుగుల తిరుగుతున్నాడు. కడియం పప్పులు కాంగ్రెస్ పార్టీలో ఉడకవు.
పాత రోజులు మర్చిపో.. అక్రమ కేసులు పెడితే సహించేది లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది. మంత్రులు ఎవరికి వారే దుకాణాలు తెరుచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి సైతం వసూళ్లు కొనసాగిస్తున్నారు. క్యాబినెట్ మొత్తం తోడుదొంగలే ఉన్నారు. తెలంగాణను దోచుకుంటున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా.. స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు సీటు విషయంలో వీరి మధ్య గట్టి పోటీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్‌పై పోటీ చేసిన కడియం విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కడియం బీఆర్‌ఎస్ పార్టీని వీడి హస్తం గూటికి చేర్చారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకుడు రాజయ్య.. కడియంను టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment