సచివాలయంలో అధికారులు, ఉపాధ్యాయ సంఘ నేతలతో చర్చిస్తున్న కడియం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు మార్గం సుగమమైంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే బదిలీలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో జరిగిన బదిలీల ఉత్తర్వుల్లోని నిబంధనల ఆధారంగా.. స్వల్ప సవరణలతో తాజా బదిలీల ప్రక్రియ చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. టీచర్ల బదిలీలు, పదోన్నతుల అంశంపై బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యా శాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. బదిలీల కంటే ముందే పదోన్నతులు ఇవ్వాలని ఈ భేటీలో ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
అయితే పదోన్నతుల అంశం సర్వీసు నిబంధనలతో ముడిపడి ఉందని, అది తేలనిదే పదోన్నతులివ్వడం కష్టమని, దీనిపై కోర్టు కేసులు కూడా ఉన్న నేపథ్యంలో పదోన్నతుల కౌన్సెలింగ్ వీలుకాదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. అనంతరం బదిలీల అంశంపై చర్చించారు. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 12, 86లలోని నిబంధనల్లో స్వల్ప మార్పులు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరగా.. అధికారులు సానుకూలంగా స్పందించారు.
టీచర్లకు ఎనిమిదేళ్లు.. : ఉపాధ్యాయుల తప్పనిసరి బదిలీ సమయాన్ని కూడా సమావేశంలో నిర్ధారించారు. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులను బదిలీ చేయాలని నిర్ణయించారు. అదే స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీల)కు మాత్రం ఎనిమిదేళ్ల పరిమితి నిర్ధారించారు. పాత జిల్లాల ప్రకారమే బదిలీలు చేపడుతున్నందున ఒక్కో జిల్లాకు అదనపు డైరెక్టర్ స్థాయి అధికారిని పరిశీలకుడిగా నియమించాలని.. యాజమాన్యాల వారీగా బదిలీలు నిర్వహించాలని.. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.
ఇక ఏకీకృత సర్వీసు నిబంధనలకు సంబంధించి ప్రత్యేక న్యాయవాదిని నియమించాలని ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాయి. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లలో ఏకాభిప్రాయం వచ్చిన వాటికి పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. మిగతా అంశాలపై అంతర్గత సమావేశం నిర్వహించి చర్చిస్తామని స్పష్టం చేసింది. బదిలీలకు సంబంధించి సంఘాలు చేసిన సూచనలతో ప్రతిపాదనలు రూపొందించి.. ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో బదిలీల మార్గదర్శకాలు వెలువడనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment